Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర
ఈ లోపులో శర్మ ఏదో పనున్నట్టు బయటకు వెళ్ళాడు. మూడో మనిషి వుండడం ఇష్టంలేక ఆయన అలా వెళ్ళిపోయాడని గ్రహించి, రవితేజ మనసులోనే 'థాంక్స్' చెప్పుకున్నాడు.
ఇంకేమీ అతడు దాచదల్చుకోలేదు.
ప్రియంవద పరిచయం అవటం దగ్గిర్నుంచి, ఆమెతో కలిసి తను హోటల్ లో గడపటం వరకు వివరంగా అంతా చెప్పాడు. వింటూన్న రంగనాథం మొహంలో భావాలు మారసాగాయి. "....మైగాడ్! చాలా కథ వుందే" అన్నాడు.
రవితేజ సమాధానం చెప్పలేదు.
"మీరే హోటల్లో దిగారు? ఏ పేరుమీద?"
రవితేజ హోటల్ పేరు చెప్పి, "నా పేరు వ్రాయలేదు. చంద్రప్రియ అని వ్రాశాను" అన్నాడు.
"మీరు ఆ హోటల్ లో రెండ్రోజులు వున్నట్టు ఎవరైనా గుర్తుపడతారా?"
"వెయిటర్స్ క్కూడా కనిపించకుండా రహస్యంగా వున్నాము".
"అవును పరాయి స్త్రీతో అంటే తప్పదు. అందులోనూ మీరు పాపులర్ వ్యక్తి కదా! ఇప్పుడు అదే మీకు వ్యతిరేకమయింది. మీ భార్య మరణించిన సమయానికి మీరు ఈ ఊళ్ళోనే వున్నారు. పైగా దొంగ పేరుతో వున్నారు. మీ డైరెక్టర్లకి మాత్రం ముంబాయి నుంచి చేస్తున్నట్టు ఫోన్ చేశారు. మీరు ముంబాయిలో వున్నట్టు అభిప్రాయం కలగజేశారు. మీ ప్రత్యర్ధులు చాలా తెలివితేటలతో- అక్కడ ముంబాయిలో మీ పేరుమీద రూమ్ తీసుకుని మీరే ఇక్కడికి వచ్చి హత్యచేసి వెళ్ళిపోయినట్టు రంగం సృష్టించారు. మింగలేని కక్కలేని పరిస్థితి. మీరు ఆ రాత్రంతా తనతోనే వున్నట్టు సాక్ష్యం చెప్పే ఏకైక వ్యక్తి ప్రియంవద ఇకలేదు. రవితేజా! మీరు మెడలోతు వూబిలో కూరుకుపోయారు".
"నాకా విషయం తెలుసు" క్లుప్తంగా అన్నాడు రవితేజ.
ఇక్కడ ఈ సంభాషణ జరుగుతూన్న సమయానికి అక్కడ రాజశేఖర్ తన గదిలో విసుగ్గా పచార్లు చేస్తున్నాడు. రవితేజ ఆ గెస్ట్ హోస్ లోనే నిశ్చయంగా అప్పటివరకు వున్నాడని అతడికి అనిపిస్తుంది. దొరికాడు అనుకున్నవాడు ఆఖరి నిమిషంలో తప్పించుకున్నాడు. శర్మకారు అక్కడికి వచ్చిందని పక్కవాళ్ళు చెప్పారు.
అంతలో అతడికో ఆలోచన వచ్చింది. మరుక్షణమే దాన్ని ఆచరణలో పెట్టాడు.
ఆ రోజునుంచీ శర్మ ఫోన్ ట్రాప్ లో పెట్టబడింది. ఎక్కడున్నా రవితేజా, శర్మ ఒకర్నొకరు కాంటాక్టు చేసుకుంటారని అతడికి తెలుసు.
శర్మ టెలిఫోన్ ని ట్రాప్ లో పెట్టాక, శర్మమీద ఇద్దరు మనుష్యుల్ని నిఘా వుంచాక, ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ ఓపిగ్గా వేచి వుండటానికి నిశ్చయించుకున్నాడు. అతడికి పోలీస్ ట్రెయినింగ్ లో చెప్పారు- "ఎక్కడో ఒకచోట ఒక తప్పు చేసినవాడు మరొక తప్పు చేయకపోడు. చుట్టూ వలపన్ని వేచి వుంటే దొరక్కపోడు" అని.
హంతకుడు చాలా తెలివితేటల్తో ఈ హత్యచేశాడని అతడు గుర్తించాడు. ముంబాయినుంచి వచ్చే విమానం ఆలస్యమవకపోయి వుంటే అతడు అసలు బయట పడేవాడు కాదు.
రెండు రోజులవరకూ ఆచూకీ దొరకలేదు. శర్మకి వచ్చే ఫోన్ లన్నీ ట్రాప్ చేయబడుతున్నాయి. వాటిలో రవితేజ ఫోన్ లేదు. బహుశా శర్మకే అనుమానంవచ్చి తనింటికి ఫోన్ చేయవద్దని రవితేజకి చెప్పాడేమో అన్న అనుమానం కూడా అతడికి రాకపోలేదు.
మరో రోజు గడిచింది. రాజశేఖర్ అసహనం పెరగసాగింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ వుండగా ఆ రోజు ఒక వూహించని సంఘటన జరిగింది.
శర్మకి వచ్చే ఫోన్ సంభాషణలన్నీ ఎప్పటికప్పుడు టేప్స్ ద్వారా అతడికి అందజేయబడుతున్నాయి. ఒక సంభాషణ దగ్గిర, ఆశ్చర్యంతో అతడు పొంగిపోయాడు. మాట్లాడుతున్నది రవితేజే! కానీ శర్మతో కాదు.
మిస్ విజయవాడతో...
అతడు తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు.....రవితేజ మాట్లాడుతున్నది శర్మ భార్యతో.
శర్మ భార్యే మిస్ విజయవాడ. రవితేజకి ఉత్తరం వ్రాసింది ఆమె!
రవితేజకీ, ఆమెకీ ఎప్పటినుంచో పరిచయం వుందన్నమాట!!
అతడికి మరొక క్లూ దొరికింది.
అతడు టేప్ ని మరింత ఆసక్తితో వినసాగాడు.
"నేను- రవితేజని.... ఆగండి ఫోన్ పెట్టెయ్యకండి...." అంటూ ఆ సంభాషణ మొదలైంది.
30
ఇది జరగటానికి సరిగ్గా నాలుగు రోజుల ముందర-
"నేనూ మొత్తం కేసు వివరాలన్నీ పరిశీలించాను" అన్నాడు రంగనాధం ఫైల్ మూస్తూ. రవితేజ అతడివైపు ఆత్రంగా చూస్తున్నాడు. పక్కనే శర్మ కూర్చుని వున్నాడు. తనకి రెండు రోజులు టైమ్ ఇమ్మని, తను అన్నీ చూసి ఏం చెయ్యాలో చెపుతాననీ రంగనాధం కోరాడు. శర్మ రవిని ఇంకో ప్రదేశంలో దాచాడు. ముందుచూపుతో రవిని తనింటికి ఫోన్ చెయ్యవద్దని కోరాడు. రంగనాధం చెప్పిన టైమ్ అయ్యాక రవిని తీసుకుని అతడి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి మాధవి మరణించి పదిరోజులు గడిచాయి. పేపర్లిక ఈ విషయం వ్రాయటం మానేశాయి. జనం కూడా మర్చిపోతున్నారు...
"మనం రెండు విధాలుగా వాదించవచ్చు. ఈ కేసుని" అంటూ కొనసాగించాడు రంగనాధం. విదేశాల్నుంచి రాగానే ముంబాయిలో దిగాననీ, మాధవి మరణంతో ఏ సంబంధమూ లేదని మనం అనొచ్చు. కానీ అలా అయితే రెండ్రోజులపాటు ముంబాయిలో ఏం చేశారన్న ప్రశ్న వస్తుంది సీ-రాక్ హోటల్ రిసెప్షనిస్టు చంద్రికా ప్రియదర్శిని మనకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది. పైగా మీ డైరెక్టర్లే ఇక్కన్నుంచి ఫోన్ చేసినప్పుడు మీరు ఆ రాత్రి గదిలో లేరన్న విషయం రూఢి అయింది. పోలీసులకి ఆ విషయం కూడా తెలుసు. ఆ రాత్రంతా ముంబాయిలో తనతోబాటు వున్నట్టు మరెవరైనా సాక్ష్యం ఇవ్వవలసి వుంటుంది. ఏ బ్రోతల్ కైనా డబ్బిచ్చి సాక్ష్యానికి కురుర్చుకోవచ్చుగానీ రేపు-క్రాస్-ఎగ్జామినేషన్ లో ఆమె నిజం చెప్పేస్తే కష్టం-"
రవితేజ లాయర్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ సాక్ష్యాలని 'కుదుర్చుకోవడం' అతడికి తెలియని రంగం!
"అలా వద్దు. మనం జరిగింది జరిగినట్టు నిజం చెపుదాం" అన్నాడు రవితేజ. రంగనాధం శర్మవైపు చూశాడు. శర్మ లేచి వెళ్ళిపోబోయాడు. "శర్మగారు కూడా విననివ్వండి- ఫర్వాలేదు" అన్నాడు రవి. ఇంతవరకూ వచ్చాక ప్రియంవద విషయం దాచడం ఇష్టం లేకపోయింది అతడికి.
"నేనది కూడా ఆలోచించాను. విదేశాల్నుంచి మీరు సరాసరి హైద్రాబాద్ వచ్చేశారు. మారు పేరుతో రూమ్ తీసుకుని మీ ఆఫీసు అమ్మాయితో మూడురోజులు గడిపారు. మీ ఆఫీసువాళ్ళకి అనుమానం రాకుండా వుండడం కోసం, ఒకే ఊళ్ళో వుంటూ ముంబాయి నుంచి మాట్లాడినట్టు మాట్లాడారు. మీ భార్యగారు మరణించిన రోజు కూడా మీరు హోటల్లోనే వున్నారు. ఇదేనా జరిగింది-"
"అవును. అదే..."
"ఈ వాదనలో చాలా లొసుగులు కనపడుతున్నాయి. మీతోపాటు వున్నా ప్రియంవద ఏమైంది? మూడురోజులూ అయిపోగానే ఇంటికి రాకుండా మీరు ఏమయ్యారు? వారంరోజులపాటు ఎందుకు పరారీ అయ్యారు? మరీ "ఎయిర్ పోర్ట్ నుంచి" అని వచ్చే ముందు ఫోన్ చెయ్యవలసిన ఆగత్యం మీకేమొచ్చింది? ఒక అమ్మాయితో ఏకాంతంగా గడపడం తప్పుకాదే! దానికింత మూడు రోజులపాటు ఆమెని తీసుకుని నాగార్జునసాగరో వెళ్తే మిమ్మల్ని కాదనే వారెవరు?.... ఇన్ని ప్రశ్నలొస్తాయి రేపు కోర్టులో..."
రవితేజ తలదించుకున్నాడు. ఇప్పుడీ లాయర్ అడుగుతూంటే నిజమే ననిపిస్తూంది కానీ, అప్పుడు అసలు తోచలేదు. ఆ 'వేడి'లో తనసలు పరిణామాలు ఆలోచించలేదు. ప్రియంవద ఏం చెప్పితే దానికి వప్పుకున్నాడు. నిజంగానే ఇన్ని అబద్దాలు ఆడవలసిన ఆగత్యం ఏముంది?
-ఈ లోపులో రంగనాధం అన్నాడు-"అన్నిటికన్నా ముఖ్యమైనది ముంబాయిలో మీ పేరుమీద గది తీసుకున్నదెవరు అని...?"
"నాకు తెలీదు, భాస్కర్ అట ఎవరో-"
"అని మీరంటారు కాని ఇంత భయపడి ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నవారు అది కూడా మీరే అరేంజ్ చేసుకున్నారని అనుకుంటారు ఎవరైనా! కనీసం అతడి సాక్ష్యమైనా మనం సంపాదించగలగాలి..."
శర్మ మధ్యలో కల్పించుకుని, "పోనీ, ప్రియంవదా, రవితేజ దిగిన హోటల్ లో వాళ్ళు సాక్ష్యం ఇస్తారు కదా".
రవి అన్నాడు- "ఎవరూ ఇవ్వరు ఎవరికీ నేను కనపడలేదు. పైగా రిజిష్టర్ లో చేతివ్రాత కూడా మార్చి వ్రాశాను".
"ఇవన్నీ గాక సుధాకర్ సాక్ష్యం ఒకటుంది. అర్దరాత్రి మీలాటి వాడిని ఇంటివెనుక చూశానని అతను అంటున్నాడు".
"అబద్దం".
"అని మీరంటే లాభంలేదు. సరే- ఇక అసలు విషయానికొచ్చి, నేను చెప్పదల్చుకున్నది చెపుతాను. మనకి రెండు మార్గాలున్నాయి. రెండింటిలో మీకేది బావుంటే అది నిర్ణయించుకోండి-" ఫైనల్ గా అన్నాడు లాయర్. రవితేజ ముందుకు వంగాడు.



