Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర
అప్పటివరకూ రెడీమేడ్ దుస్తుల్నే చూపించే దర్పణంలో చీరకట్టు రిఫ్లెక్షన్స్ వచ్చేలా డిజైను చేశారు కంపెనీవారు మొదటి దఫా వెళ్ళినప్పుడే ఈ చీరకట్టు స్కెచ్ లు వేసి యిచ్చారు. ఆ డిమాన్ స్ట్రేషన్ లతో అతడు సంతృప్తుడయ్యాడు.
ఆ దర్పణాలు భారతదేశంలో మరే కంపెనీకి సంవత్సరంపాటు ఇవ్వకుండా ఏర్పాటు జరిగింది.
న్యూయార్క్ లో ఈ దర్పణాలున్న షాపుల్లో రద్దీని చూసి అతడు విస్మయం చెందాడు. ఎంతో వేగంగా జరిగిపోతున్నాయి అమ్మకాలు. శ్రమకూడా లేదు. నాలుగు రోజుల్లో పని విజయవంతంగా పూర్తయింది.
అతడి మనసు ఎప్పుడు వెళ్దామా అని వువ్విళ్ళూరుతోంది.
అయిపోవడం వేరు. దానికోసం ఎదురుచూడటం వేరు. ఆ రెండోదాన్లో వున్న థ్రిల్ మొదటిదానిలో వుండదు. ఏ పని చేస్తున్నా అతడి మనసంతా జరగబోయేదానిమీదే వుండేది. ఏదో తెలియని ఉద్వేగం.
కోటి రూపాయల టెండరు పాడేటప్పుడు కూడా ఎపుడూ అతడింత టెన్షన్ ఫీలవలేదు. ఎందుకో అప్రయత్నంగా పెదాల మీద చిరునవ్వు దానంతట అదే వచ్చేది. అవతల అమెరికన్ డైరెక్టర్లతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ ఆలోచన వదలిపెట్టేది కాదు. అతడి కిదంతా వింతగా కూడా అనిపించింది. ఇది సవ్యమైన థ్రిల్లేనా అంటే చెప్పలేడేమో కానీ ఇందులో ఇంత థ్రిల్ వుంటుందని అతడికీనాడే తెలిసింది. ఒకరికోసం ఎదురు చూడటంలో వుండే థ్రిల్లు....! మాధవితో వివాహం చిన్న వయసులో అయిపోయింది. కాబట్టి ఆ తరువాత అతడికి అటువంటి థ్రిల్సేమీ ఇచ్చే ప్రయత్నం ఆమె చేయలేదు కాబట్టి ఇంతకాలమూ ఆ ఆనందం తెలియలేదు.
పని ముగించుకుని అతడు స్వదేశానికి బయల్దేరాడు. అనుకున్న రోజే పని పూర్తయింది.
ముంబాయిలో దిగేసరికి రాత్రి పదయింది. ఆ రాత్రి అక్కడే వుండి మరుసటిరోజు ప్రొద్దున్న పదకొండింటికి హైదరాబాద్ బయల్దేరాడు ముంబాయి విమానాశ్రయంలో టిక్కెట్టు కొనేటప్పుడు పూర్తి చేయవలసిన ఫారంలో మామూలుగానే "రవితేజ" అనే పూర్తిచేశాడు. మరీ అంత భయపడవలసిన అవసరం అతడికేమీ కనపడలేదు. విషయం అంతవరకూ వస్తే "అవును చేశాను ఏం?" అని ఎదురుతిరిగే ధైర్యం అతడికెప్పుడూ వుంది. కేవలం ప్రియంవద కోసమే అతడీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
విమానంలో మాత్రం తెలిసిన వాళ్ళెవరయినా కనపడతారేమోనని మాత్రం చూశాడు. అలాటి వారెవరూ కనపడలేదు.
ఎయిర్ పోర్ట్ లో దిగి, అతడు టాక్సీ వేసుకుని, ప్రియంవద ఇంటికి బయల్దేరాడు. అదృష్టవశాత్తూ క్రింద ఇల్లు తాళంవేసి వుంది. పైన అతడికోసం ప్రియంవద ఎదురు చూస్తూంది. అతడిని చూడగానే ఆమె మొహం విప్పారింది. "అనుకున్న టైమ్ కే వచ్చేశారే" అంది.
అతడు నవ్వి, "బయల్దేరదామా?" అన్నాడు.
సర్ది వుంచిన చిన్న బ్రీఫ్ కేసుతో ఆమె బైటకి వచ్చింది.
ఇద్దరూ కూర్చున్నాక టాక్సీ బయల్దేరింది. అరగంట తరువాత నగరంలోకెల్లా ఖరీదైన హోటల్ గదిముందు ఆగింది.
అక్కడ ఫారం పూర్తిచేసేటప్పుడు మాత్రం చంద్రప్రియ అని వ్రాసేడు ముంబాయినుంచి వస్తున్నట్టు. ఈ లోపులో బెల్ బోయ సామాన్లు పట్టుకున్నాడు.
ఇద్దరూ మూడో అంతస్తులో గదిలోకి ప్రవేశించారు. ఆమె ఆ గదిచూసి అవాక్కయి, 'మైగాడ్' అంది అప్రయత్నంగా.
విశాలమైన గది నీలం రంగు కార్పెట్. ఒక మూల ఫ్రిజ్ బల్లమీద గులాబిపూలు. కిటికీ తెరల్లోంచి సన్నటి వెలుతురు కిరణం తప్ప మిగతా గదంతా లైటింగ్... ఛానెల్ మ్యూజిక్ లో సితారు ప్రకంపనం- అడ్డంగా విశాలమైన అద్దం- ఒక మూల టీ.వీ., ఎత్తయిన మంచం, వాటర్ జగ్, స్టెరిలైజ్డ్ నీళ్ళగ్లాసులు, మందంగా సువాసన చల్లటి గాలితో కలిసి శరీరాన్ని వణికించే కొత్తదనం...
బెల్ బోయ్ వెళ్ళగానే చిన్నచప్పుడుతో తలుపు మూసుకు పోయింది. వెనక్కి తిరుగుతూ వుండగా అనిపించింది రవితేజకి- తాను వేసిన బోల్టు ప్రపంచాన్ని చూడదల్చుకోలేక తలుపులు వేయడానికా? లోకం కళ్ళు కప్పడానికా? తన మనసు తలుపు దేనినో తెరుచుకోవడానికా?
ఈ మీమాంస చాలా చిత్రంగా అనిపించింది. 'చిత్రంగా' అన్న పదం సరైంది కాదేమో! ఉద్వేగం, ఉత్సాహం, అన్న సయించని ఆకలి తీరిపోవడాన్ని ఒప్పుకోని కోరిక అన్నీ తమాషాగా కలగలసిన ఒక భావం!
బోల్టు వేసి వెనక్కి తిరిగాడు. ఎదురుగా వున్న ప్రియంవద కళ్ళలోకి చూడగానే...ఆ క్షణాన అతను సెక్సువల్ ఆర్జ్ కీ ఎమోషనల్ సర్జ్ కీ అతీతంగా ఒక స్త్రీ దేహాన్ని గాక, తనను తాను హత్తుకుంటూ-
రావితేజకి ప్రియంవద కనిపించడం లేదు. మాధవీ కనిపించలేదు. ఆ మాటకొస్తే ఆ క్షణాన అతనికి తను తప్ప మరేమీ కనిపించడంలేదు. కానీ అది ఒంటరితనం కాదు.
కవినై, కవితనై, వేసవి వేడిలో...వెన్నెల వాడిలో, పన్నీటి జలజాతాల, కన్నీటి జలపాతాల...నాతో నేనే అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ...
స్తంభించకుండా అంతరంగంలో తరంగిస్తోన్న ఈ వాక్యాల మేలుకొలుపుతో ఒళ్ళు విరుచుకొని లేస్తున్నాడు. రవితేజలోని 'రవితేజ'. ఇన్నాళ్ళూ రవితేజలోని భావుకుడు చీరల్లోని గళ్ళల్లో, పువ్వుల్లో, రంగుల్లో, అంచుల్లో, అల్లికల్లో ఆదమరచిపోయి, కూనిరాగాల నలపించే ఒకనాటి రొమాంటిస్టు ఈ క్షణాన నిద్రలేచాడు... మార్కెట్ జయించడం కోసం మేధస్సుతో చీరల్ని అల్లే రవితేజని....
ఈ క్షణంలోని జలతారు అల్లికల జరీ కల జయించింది.
అతనంత మోటుగా ఏ వస్తువునైనా పట్టుకోగలడని యింత వరకూ అతనికే తెలియదు- అతని కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రియంవదకు కూడా తెలీదు. అయితే ఆమెకి మరో సంగతి కూడా తెలియదు.
అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయని.
నాతి తోనె కాదు
రాతితో కూడా
సురతం సాధ్యమె
హృదయానికి రస స్పందనా
ఊహలకి ఉలి కదలికే వుంటే.....!
థాంక్స్ నాట్ టు ప్రియంవద....
థాంక్స్ టు మాధవి...
అర్ధనారీశ్వర చిత్రంలో చూడటానికి కనిపించే తేడా భావించడానికి కనిపించదు. ఆ అల్లికలో ఎక్కడ ఏది మొదలు, ఎక్కడ ఏది విభుజ్యరేఖ? తర్కిస్తోంది వేడెక్కుతున్న గదిలో గాలి.
ఉచ్చ్వాసానికి, నిశ్వాసానికి మధ్య నిశ్శబ్దం, అలసిపోయిన పాదాలతో నాట్యంచేస్తూ ఆ క్షణాన్ని నిశ్చలంచేసే ప్రయత్నం చేస్తుంది. శరద్వలువలను హేమంత శిశిర నిశిలోకి వలిచి విసురుతూ, కోరికతో వణుకుతున్న శృంగార వాసంతి గ్రీష్మ తాపాన్ని వర్షిస్తోంది. తనని తాను మరచిపోయే ప్రయత్నంలో అతడు తనను తాను తెలుసుకుంటున్నాడు.
పెదవి అంచుని నాలుక కొన మీటితే వినిపించే ఊర్పుల మోహనరాగం.
పృథ్వి అంచున నించుని నింగినందుకోవాలనే ఆరాటం.
ఆకసపు విల్లు వంచి, సూర్యచంద్రుల కొసల్ని కిరణాల నారితో సంధించి రేబవళ్ళ సరాల్ని విసురుతున్న వసుధ, పురుషున్ని రగిలిస్తూ, చల్లారుస్తూ ఆ కేళిలో కాలాన్ని కంటున్నది.
బుగ్గమీద నీతి చుక్క అతడి కంటినుంచి జాలువారిందో, ఆమె ముంగురులు నుంచి జారి చేరిందోకాని, విజయ కేతనపు రెపరెపల్ని విశ్లేషిస్తోంది.
ప్రత్యూషం మధ్యాహ్నానికి స్వాగతం చెప్పి, వెళ్ళిపోతున్న సమయానికి మెలకువ వచ్చింది రవితేజకి. ప్రియంవద ఇంకా నిద్రపోతూ వుంది. కిటికీ తెరలు తొలగించగానే సూర్యకిరణాలు గదిని ప్రకాశవంతం చేశాయి. బయట వెచ్చటి సూర్యుడి ఉనికి, లోపలి చల్లటిగాలికి కాంట్రాక్టుగా వుంది.
టీ.వీ. ఆన్ చేశాడు. టెన్నిస్ మాచ్ వస్తోంది. రమేష్ కృష్ణన్ ఆడుతున్నాడు. స్నేహితుల బలవంతం మీద ఓ పదిరోజులు టెన్నిస్ ప్రాక్టీసుకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి వళ్ళు నొప్పే! అతడు షవర్ ఆన్ చేశాడు. వెచ్చటి నీరు వంటిమీద ప్రవహిస్తూనే అలసిపోవడంలో ఆనందాన్ని తెలుపుతూంది.
దాదాపు అయిదు నిముషాలు అలాగే బాత్ టబ్ లో కళ్ళు మూసుకొని పడుకున్నాడు. గదంతా తెల్లటి ఆవిరి మేఘాల్లో తేలిపోతున్న శరీరం ఛానల్ లో "లవ్ బిట్వీన్ రెయిన్ డ్రాప్స్" అన్న పాట సన్నగా వస్తూంది. బయట ఫోన్ చేస్తున్న శబ్దం అతడిని మేలుకొలిపింది. అతడికి అర్ధంకాలేదు. ప్రియంవద ఎవరికి డయల్ చేస్తుంది? ఆమెమీద కాస్త కోపం కూడా వచ్చింది. ఈ హోటల్ లో తామిద్దరూ వున్నట్టు బయటవాళ్ళకి ఏ మాత్రం అనుమానం వచ్చినా ప్రమాదం కదా! ఆ సంగతి తను మరచి పోయిందా? అతడు బాత్ టబ్ లోంచి లేచి టవల్ చుట్టుకొని గదిలోకి వచ్చాడు. అప్పటికే ఆమె సంభాషణ ప్రారంభించింది.
"అవునే, ఈ రోజే వచ్చాను. ఎల్లుండి జాయిన్ అవుతాను. ఏమిటి ఆఫీసు విశేషాలు?"
అట్నుంచి ఏమన్నదీ వినిపించలేదు.
"ఎం.డి. ఎప్పుడొస్తారట?"



