Home » mainanpati bhaskar » Prema Tharangam

 ఒక పది నిమిషాలు గడిచాక, "మీరలా చూస్తూ ఉంటే నాకు నిద్దర పట్టదు" అంది, కళ్ళు మూసుకునే నవ్వుతూ.
ఆ దగ్గరితనంలో, ఆ బిడియంలో , సాయంత్రమైపోయింది.


    శ్రీహర్ష ఇంటికెళ్ళిపోయాడు.

                                                  * * *

నాలుగు రోజుల తర్వాత కుటుంబరావుగారు వచ్చారు. రాగానే శ్రీహర్షని కలుసుకుని పెళ్ళి ప్రసక్తి తెచ్చారు. అయన మాటలు దాదాపు లావణ్య అనుకరించిన మాటల్లాగే ఉండడం గుర్తొచ్చి నవ్వొచ్చింది శ్రీహర్షకి.
"పెళ్ళి ఇంకో ఆరునెలల తర్వాత అయితే బావుంటుంది. ఈ లోపల మా చెల్లెలి పెళ్ళి కూడా సెటిల్ చేస్తాను" అన్నాడు శ్రీహర్ష.
"నీ ఇష్టం" అన్నారు కుటుంబరావుగారు.
"ఆర్నెల్లు వాయిదా వేశారా? ఎందుకు?" అంది లావణ్య శ్రీహర్షతో కోపంగా.
"మా చెల్లెలు రేవతి పెళ్ళి ఈ లోపల అయిపోతే బావుంటుంది. కనీసం సంబంధం కుదిరినా చాలు, తర్వాత మనం ఫ్రీ బర్డ్స్ లాగా విహరించొచ్చు" అన్నాడు శ్రీహర్ష.
కాస్త దెబ్బ తిన్నట్లు చూసింది లావణ్య.
"నాన్నగారితో చెప్పెముందే నాకు చెప్పి ఉంటె బావుండేది."
"పొరపాటయిపోయింది. సారీ! లావణ్యా! నేను మీతో కాసేపు సావకాశంగా మాట్లాడాలి ఇవ్వాళ.
"ఇంకా ఎన్నాళ్ళు మీరు మీరు అని పిలుస్తారు నన్ను?"
"నిజమే! ఇంకెన్నాళ్ళు! ఆర్నెల్లు కదా? ఆర్నెల్లపాటూ మిమ్మల్ని మీరు అనే పిలవనివ్వండి."
"పెళ్ళి కుదిరిన తర్వాత కూడా మీరు అని పిలిస్తే వెక్కిరించినట్లుంటుంది నాకు. అలా వద్దు. నువ్వు' అనే పిలవండి."
"సరే! సరే! లావణ్యా! ఇవాళ నీతో చాలా సంగతులు మాట్లాడాలి."
"అలా తోటలో కూర్చుని మత్;మాట్లాడుకుందాం."
గార్డెన్ లో పొగడ చెట్టు కింద సిమెంటు బెంచి ఉంది. దాని మీద కూర్చుంది లావణ్య.
బెంచి మీద ఒక కాలు పెట్టి నిలబడ్డాడు శ్రీహర్ష.
"ఇదివరకు ఒకటికి రెండు సార్లు నీతో చెప్పాను. నీకు గుర్తుందో లేదో! ముకుందరావుగారని ఒకాయన- నేను చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు సహాయం చేసి నాచేత చిన్న వ్యాపారం పెట్టించాడు."
"చెప్పారు."
"అయన దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది ఇవాళ."
"అలాగా!"
జేబులోంచి ఉత్తరం తీశాడు శ్రీహర్ష.
"చదువు"
ఉత్తరం విప్పింది లావణ్య.
"శ్రీహర్షకి,
ఈ ఉత్తరం ఏ ఊరినించి రాస్తున్నానో నాకు తెలియదు. ఇదొక రైలు స్టేషను. పేరు కనపడటం లేదు. చూసే వ్యవధి లేదు. కారణం ఏ క్షణంలోనైనా నాకు మళ్ళీ మతి చలించవచ్చు. ఆ లోపల కొన్ని విషయాలు నీకు తెలియజెయ్యాలి.
నా ప్రాణానికి ప్రాణమైన సీత, హఠాత్తుగా కన్ను మూసింది. కొత్త వ్యాపారం పెట్టానని నీకు తెలుసు. అందుకోసం వేలకు వేలు అప్పులు చేశాను. కొత్త వ్యాపారం పాత బిజినెస్ ని నన్నూ కూడా ముంచేసింది. ఎటు చూసినా అప్పులు మాత్రం మిగిలాయి. సీత పోయిన దుఖం గుండెల్ని కాల్చేస్తుంటే అప్పులేలా తిర్చాలనే భయం మెదడు కోరికేస్తుంటే, పిల్లలెలా బతుకుతారనే దిగులు హుదయాన్ని లక్ష ముక్కలు చేస్తుంటే- శ్రీహర్షా! పదిరోజులపాటు- ఎంత భయంకరమైన నరకం అనుభావించానో నీకెలా చెప్పను? కర్మ అంతా యాంత్రికంగా చేశాను. నీకు ఉత్తరం రాయాలి రాయాలి అనే కవరు దగ్గర పెట్టుకునే రోజులు గడిపేశాను. ఏమిటో! మనసు మనసులో లేదు నాకు. పదిరోజులు భరించలేని మానసిక వ్యధ. తర్వాత తర్వాత నాకు మెదడు స్థంభించిపోయింది. అజ్ఞానంలాంటి చీకటి- ఏ బాధా లేని మానసిక జడత్వం- తర్వాత మధ్యలో ఒక్కసారి మాత్రం తెలివి వచ్చింది. ఎక్కడున్నాను నేను? క్షణం సేపు అర్ధం కాలేదు. చుట్టూ చూశాను. చుట్టూ జనం- పక్కలు, పెట్టెలు, బెడ్డింగులూ- అదొక రైల్వే ప్లాట్ ఫారం- ఎలా వచ్చానిక్కడికి. చేతిలో చూసుకున్నాను. కారప్పూస . ఏ ప్రయాణికుడో దయతలచి పడేసి ఉంటాడు. గెడ్డం తడుముకున్నాను. రెండు మూడు రోజులయి ఉంటుంది షేవ్ చేసుకుని. తల తడిమి చూసుకున్నాను. గుండు. అంటే కర్మకాండ ముగుసిపోయిందన్నమాట. అప్పట్నుంచి నేనిలా... మరి పిల్లలు స్నేహ, రాజూ ఏమయ్యారు? నేనిక్కడ ఎందుకున్నాను? అంతే! మళ్ళీ తెలివి తప్పిపోయింది. ఇవాళ మళ్ళీ స్పృహ. ఇదే ఊరో తెలియదు. మొత్తానికి రైల్వే స్టేషన్ . టిక్కెట్టు లేకుండానే రైలెక్కి వచ్చానా? అంటే.....పిచ్చెక్కిందా నాకు? మళ్ళీ తెలివి తప్పిపోతుందేమో!
శ్రీహర్షా! నా పిల్లలి కింకేవరు తోడులేరు. దిక్కులేరు. అప్పులు తప్ప ఆస్థి మిగల్చలేదు. తల్లి పోయింది. తండ్రి ఇలా తిరిగుతున్నాడు. ఎలా బతుకుతారు నా బిడ్డలు? ఏం తింటారు? శ్రీహర్షా! నువ్వు వయసులో నా కంటే చిన్నవాడివయినా, నీకు చేతులెత్తి దణ్ణం పెడుతూ ఒక కోరిక కోరుతున్నాను. నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. పెద్ద పెద్ద చదువులు చదివించలేకపోయినా, పెళ్ళిళ్ళు చెయ్యలేకపోయినా కనీసం..... కనీసం వాళ్ళు రెండు పూటలా గంజినీళ్ళయినా తాగే సదుపాయం చెయ్యి. శ్రీహర్షా! నీకు గుర్తుందా? ఒకప్పుడు నీకో వెయ్యి రుపాయలిచ్చాను నేను. నువ్వు ఎన్నో సార్లు ఆ అప్పు తిర్చబోయావు. నేను ఒప్పుకోలేదు. ఆ సహాయానికి ప్రతిఫలంగా నయినా నా పిల్లల్ని కనిపెట్టి ఉండవూ?


Related Novels


The Editor

Vairam

Mister U

Ardharathri Adapaduchulu

More