Home » Yandamuri veerendranath » Rudranethra
సర్పభూషణరావు మాట్లాడలేదు. అతడి చర్య అతడికే సిగ్గు తెప్పిస్తోంది. నేత్ర తనని ఏ విధంగా ఫూల్ ని చేశాడో తలుచుకుంటుంటే మరోవైపు వళ్ళు మండిపోతోంది. అతడి కళ్ళముందు జనం ఇంకా తనని పిచ్చికుక్కని వెంటాడినట్టు తరిమిన దృశ్యమే కదలాడుతోంది.
క్యూ అన్నాడు- "రెండు గంటల్నుంచీ అరగంట కొకసారి టి.వి.లో వస్తోందట ఆ ప్రకటన. నేనూ అరగంట క్రితమే చూశాను. నిన్ను పట్టుకోవటానికి నేత్రే ఈ నాటకం ఆది వుంటాడని వెంటనే అర్థమైంది! నిన్ను నాతోపాటు తీసుకురావడం, మానాన్న చెప్పినట్టు- ఎంత తప్పో ఇప్పుడు తెలుస్తోంది."
"ఆ ప్రకటనలో నేత్ర తన అడ్రస్సు ఇచ్చి వుంటాడు" అన్నాడు యస్బీఆర్.
"లేదు. హాస్పిటల్ అడ్రసు ఇచ్చాడు. ఎవరైనా నీ గురించి ఫోన్ చేస్తే తనకి అందేలా లంచం ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాడు-"
"ఆ నేత్రని వదిలిపెట్టను"
"అలా అనే ఇంతదూరం తీసుకొచ్చావ్ యస్బీఆర్! అందమైన కూతురు తప్ప నీకు మరో క్వాలిఫికేషన్ లేదు. చేసింది చాలు! ఇంకో రెండ్రోజులు ఇక్కణ్ణుంచి మీరిద్దరూ బైటికి కదలకండి. మా దీవికి వెళ్ళాక మిగతా విషయాలు చూసుకోవచ్చు."
అంతలో అక్కడికి బ్లాక్ ఈగిల్ వచ్చాడు. "ఏమిటిదంతా?"
"ఇందులో నా తప్పేం లేదు". అన్నాడు యస్బీఆర్.
"దొంగతనంగా దేశంలో ప్రవేశించావని తెలిసీ, పాస్ పోర్టు లేకుండా తిరగటం తప్పుకాదూ? ఇక మాట్లాడకు-" అన్నాడు విదిలిస్తున్నట్టు. తరువాత కొడుకు వైపు తిరిగి, "నీకు ముందే చెప్పాను. వేడిని వదిలించుకో...... నీకి అమ్మాయి అంటే ఇష్టం. అంతేగా. హాయిగా అనుభవించు. లేకపోతే పెళ్లి చేసుకో. డానికి ఈ ముసలాడెందుకు?" అన్నాడు.
హంసలేక గుండెల్నిండా వూపిరి పీల్చుకుంది. అప్పటివరకూ ప్రేక్షకురాలిగా జరుగుతోన్నదంతా చూస్తున్నదల్లా ఇక తను మాట్లాడవలసిన సమయం వచ్చినట్టు గ్రహించింది. నేత్ర ఇక్కడే, తనకు దగ్గరలో వున్నడన్న విషయం ఆమెకు అమితమైన ధైర్యాన్ని, ఉత్సాహాన్నిచ్చింది.
"మీరందరూ ఏమనుకుంటున్నారు? అసలు నా గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు? నేనేం బజార్లో దొరికే వస్తువు ననుకుంటున్నారా? నా తండ్రి నీకు నన్ను లంచం ఇద్దామనుకున్నాడా? నువ్వేమో అది తీసుకుందా మనుకున్నావా?"
"అమ్మా హంసలేఖా"
ఆమె పట్టించుకోకుండా అంది- "మిస్టర్ క్యూ! గుండె బ్రద్దలవకుండా నే చెప్పేది విను. నేనూ నేత్రా ప్రేమించుకున్నాం. అతడి కోసం చావటానికి కూడా నేను సిద్ధపడ్డాను. అంత గొప్పది నా ప్రేమ. ఇప్పుడు చెప్పు. ఈ ఎంగిలి కూడు నువ్వు తింటావా?"
"ఎంగిలికూడా?"
"అవును. నాకు నాలుగో నెల"
"యస్బీఆర్ మొహం మీద బాల్చీడు చల్లటి నీళ్ళు గుమ్మరించి నట్టయింది. క్యూ స్తబ్దుడయ్యాడు.
ఆ గదిలో సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించింది.
అందరికన్నా ముందు తేరుకున్నది బ్లాక్ ఈగిల్...... "సో...... సర్పభూషణరావు బతికి వుండటానికి కావాల్సిన ఆఖరి అర్హత కూడా కోల్పోయాడన్న మాట" అన్నాడు తాపీగా!
సర్పభూషణరావు ఆ మాటలు వినటంలేదు. కూతురు చెప్పిన వార్త తాలూకు షాక్ నుంచి ఇంకా అతను తేరుకోలేదు. "ఏమిటీ?...... నువ్వు...... నువ్వు..... నీకు ..... నీకు....." అంటూ ఆ మాటలు పూర్తి చేయలేకపోయాడు.
హంసలేఖ మాట్లడలేదు. అంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఒక ఉత్తరాన్ని బ్లాక్ ఈగిల్ కి ఇచ్చాడు. అతడు దాన్ని విప్పి చదువుతుంటే యస్బీఆర్ "ఏమిటది?" అన్నాడు.
"నేత్రకి నీ కూతురు వ్రాసిన ఉత్తరం! హోటల్లో వున్నంతకాలం నీ కూతురు కంగారుపడి ఏ భారత రాయబారి కార్యాలయానికో ఫోన్ చేయటం కానీ, ఉత్తరం వ్రాయటం కానీ చేస్తుందని అనుమానం వచ్చి, మనుష్యుల్ని రహస్యంగా కాపలా పెట్టాను. ఇదిగో - ఈ ఉత్తరాన్ని పోస్టులో వేసింది గంట క్రితం! ఏమ్మా? నేత్రని అంతగా ప్రేమించావా?"
"అవును. అందుకే చనిపోవాలని నిర్ణయించుకుని ఉత్తరం వ్రాసాను."
"నువ్వు చాలా అమాయకురాలిలా వున్నావే. 'నేత్ర, కేరాఫ్ సీక్రెట్ సర్వీస్, భారతదేశం' అంటే ఉత్తరం వెళ్తుందా? ఉత్తరం మాత్రం అద్భుతంగా వ్రాసావు. ఆ గుడ్డివాడెవడూ? కవి?? మైకెల్ జాక్సన్ కదూ."
"కాదు. జాన్ మిల్టన్".
"ఆ ..... ఆ జాన్ మిల్టన్ వ్రాసినట్టు వ్రాసావు....... నేత్రని అంతగా ప్రేమించావు సరే. కానీ అతడి గురించి నువ్వు చనిపోవటం, నీ కడుపులో పెరుగుతున్న చిన్న బిడ్డని చంపటం అంత మంచిపని కాదు. అయినా నీ కవిత్వం చదువుతూంటే నాకే నిన్ను ప్రేమించాలనిపిస్తూంది."
"మీ కెవరికీ ప్రేమ స్పెల్లింగ్ తెలీదు. నా దేశాన్ని మోసం చేశారు మీరు. నా తండ్రిని మోసం చేసారు మీరు. స్వార్థం వున్నచోట ప్రేమ వుండదు."
"నీ తండ్రిని మేం మోసం చేసామా? హహ్హా...... సరే అయితే- యస్బీఆర్ ఒక నిముషం బైట గదిలోకి వెళ్ళు. నీ కూతురుతో ప్రైవేటుగా మాట్లాడాలి?"
"ఏం మాట్లాడాలి?"
"రేప్ చెయ్యనులేవయ్యా. ఇద్దరూ వెళ్ళండి."
"క్యూ, యస్బీఆర్ వెళ్ళారు. నిముషం తర్వాత బ్లాక్ ఈగిల్ ఆ గదిలోకి వచ్చాడు.
"నీ కూతురు నేత్రని చాలా గాఢంగా ప్రేమించింది. నేత్ర ఈ దేశంలోనే వున్నాడని ఆ అమ్మాయికి తెలియదు. ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. ఇదీ నేనీ నిముషంలో కనుక్కున్నది. యస్బీఆర్! నేనొక ఆలోచన చెప్తాను- నేత్రను పట్టుకోవడానికి."
"ఏమిటది?"
"నీ కూతురు ఎలాగూ తను చనిపోబోతున్నట్టు ఉత్తరం వ్రాసి పెట్టింది. జాన్ మిల్టన్ స్థాయిలో వుందది! దాన్ని మనం ఆమె చేతివ్రాతతో అన్ని దినపత్రికల్లో పబ్లిష్ చేస్తాం. నేత్రని నిన్ను పట్టుకోవడానికి టి.వి. ఉపయోగిస్తే, అతన్ని పట్టుకోవటానికి మనం న్యూస్ పేపర్లు ఉపయోస్తాం. హంసలేఖని చంపేసి, శ్మశానానికి తీసుకువెళ్తాం. నేత్ర తప్పక వస్తాడు."
"వ్హాట్" అరిచాడు యస్బీఆర్. బ్లాక్ ఈగిల్ అతని అరుపు పట్టించుకోకుండా కొనసాగించాడు.
"ఎలాగూ ఉత్తరం వ్రాసింది కాబట్టి మన మీదకు కేసు రాదు. ఆమె మరణవార్త, ఈ గేయం, ఫలానా టైమ్ లో అంత్యక్రియలు అన్న విషయం అన్నీ పేపర్లలో వేస్తే నేత్ర తప్పక హాజరవుతాడు. అప్పుడతన్ని చంపవచ్చు."



