Home » Yandamuri veerendranath » Rudranethra
"థాంక్యూ...... జింకలు ఆడవుల్లోనే వుంటాయి. వాటి నడుము చూసే అవకాశం తరచు మనుష్యులకు దొరకదు. చేపలు నీళ్ళలో వుంటాయి మెరిసే వాటి ఒంటిని చూసే అవకాశం మనుష్యులకి లేదు. పండిన దొండ పళ్ళని వంటకి పనికి రాకుండా చేశాడు దేవుడు. తీరిగ్గా చూసే అవకాశం ఇవ్వకుండా అందమైన వేగంగా తుమ్మెదలు ఎగిరిపోతూ వుంటాయి. ఇన్ని తప్పులు చేశాను కదా- అని ఇన్ని అందాల్ని మనుష్యులు చూడకుండా చేశాను కదా - అని నాలుక్కర్చుకున్న దేవుడు ఈ అనంతానంత మానవజాతి కోసం మీలో ఆ అందాలనిటినీ పెట్టి సృష్టింఛాడనుకుంటున్నాను."
ఆ అమ్మాయి అందంగా సిగ్గుపడి, నేత్రవైపు మనోహరంగా చూసి అక్కణ్ణుంచి తప్పుకుంది.
"నీ స్పాంటేనియిటీకి జోహార్లు. ప్రతీ అమ్మాయితోనూ అలాగే మాట్లాడడం నే ఆచారం అనుకొంటాను" ప్రక్కనుంచి వస్తూ 'క్యూ' అన్నాడు. అతడిని చూసి నేత్ర ఆశ్చర్యపడలేదు. నవ్వేడు.
"ఈ దేశంలో అడుగు పెట్టగానే ఒక అందమైన అమ్మాయితో స్వాగతం చెప్పించడం ఇక్కడి ఆచారం అనుకుంటాను" అన్నాడు.
"అమ్మాయే కాదు. ఆతిధ్యం కూడా ఇస్తాం. అదిగో నీ కోసం వాహనం కూడా రెడీగా వుంది."
నేత్ర అటు చూశాడు. లక్ష డాలర్లు ఖరీదు చేసే కారు వుంది అక్కడ.
"ఇంకో పది నిముషాల్లో నీ మరణం సంభావించబోతూ వుంది నేత్రా. ఈ ప్రపంచంలో దాన్నెవరూ ఆపలేరు. ఈ పది నిముషాలైనా సుఖం అనుభవించు."
"థాంక్యూ. నా అంతిమ యాత్ర అంత అందమైన కారులో వద్దు" అని 'టాక్సీ' అంటూ పిలిచాడు. టాక్సీ వచ్చి ఆగింది. దాన్ని ఎక్కబోతూ వుంటే పది అడుగుల దూరంలో వున్న మరో వ్యక్తి మీద దృష్టి పడింది.
"ఏం మావా- ఛీ- వదులు. వదులు" చీదరించుకుంటూ అన్నాడు యస్బీఆర్.
"నేన్నయ్యా..... యాద్గిర్ని. గట్ట బేజారైతవేంది? నీ తల్లి. ఎంత ఎతికిన నీ కోసం మన దేశంలో...... రాత్రికి వుండాయించినవ్? భయపడినావు?"
"రాత్రికి రాత్రి వుడాయించానో, రాజాగా తిరిగి వెళ్తానో భవిష్యత్తే చెపుతుంది. పొతే ఇది నీ దేశం కాదు. ఈ ఎయిర్ పోర్టులో ప్రతీ మూడో వ్యక్తి మా మనిషే. మరో నిముషంలో మర్యాదగా కారెక్కకపొతే నీ శరీరం తూట్లు పడుతుంది. కేసు కూడా లేకుండా నీ చరిత్ర సమాప్తమవుతుంది. ఈ ప్రభుత్వం నాది."
"నీ కూతురెట్టుంది మావా?"
"నేత్రా స్టాపిట్. ఇంకో ముప్ఫై సెకన్లు మాత్రమే వుంది గడువు."
"అమ్మో. అయితే ఎల్లొస్త. మీ వాల్లని కాల్చొద్దని చెప్పు." అంటూ టాక్సీ ఎక్కాడు. అతడి చేతిలో పూల గుచ్చం అలాగే వుంది.
యస్బీఆర్ వచ్చి క్యూ పక్కన నిలబడి వెళ్తున్న ఆ కారు వైపు చూస్తూ, తన వాచీ పరిశీలించి, "ఇంకా పది సెకన్లు వుంది" అన్నాడు.
క్యూ మాట్లాడలేదు.
అయిదు సెకన్లు గడిచాయి.
నాలుగు......
మూడు......
రెండు......
నేత్ర ఎక్కిన టాక్సీ దూరంగా సాగిపోతూంది.
యస్బీఆర్, క్యూ అటే చూస్తున్నారు.
టైం ఎక్స్ ప్లోజివ్ పేలటానికి ఇంకా రెండు సెకన్లుంది.
యస్బీఆర్ ఊపిరి బిగపట్టాడు. అందరూ నిశ్శబ్దంగా వున్నారు. ఆ నిశ్శబ్దంలోంచి 'టిక్.... టిక్' మని వినిపించింది. క్యూ సునిశితమైన గ్రహణ శక్తికి మాత్రమే ఆ శబ్దం వినిపించింది.
"మైగాడ్" అన్నాడు యస్బీఆర్ అయోమయంగా తలెత్తి చూశాడు.
"అక్కడ..... అక్కడ చూసుకో ఇడియెట్....." క్యూ అరిచాడు. అతడి దృష్టి యస్బీఆర్ కోటు జేబుమీద వుంది. అతడి కంఠంలో కంగారు వుంది. యస్బీఆర్ అసంకల్పితంగా జేబులో చెయ్యి పెట్టాడు.
అక్కడ తగిలింది టైం ఎక్స్ ప్లోజివ్! ......పూలగుత్తిలో పెట్టి విమానం దిగగానే అమ్మాయితో ఇప్పించిన బాంబు- 'బాగున్నావా మావా' అంటూ వచ్చి కౌగిలించుకుంటూ నేత్ర అతడి జేబులో వేసిన ఆ బాంబు ఇంకొక్క సెకనులో పేలటానికి సిద్ధంగా వుంది!
యస్బీఆర్ దాన్ని బైటకు తీయడం, దాన్ని చూడగానే చేతిలో పాముని చూసినట్టు అతని చెయ్యి వణకటం, కరెంటు వైరు తగిలినట్టు దాన్ని దూరంగా విసిరెయ్యటం, వాళ్ళు విమానాశ్రయానికి తీసుకొచ్చిన అత్యంత ఖరీదైన కారు మీద అదిపడి, అక్కడో బ్రహ్మాండమైన విస్ఫోటం జరగటం క్షణాల్లో అయిపోయింది.
అక్కడంతా నల్లటి పొగ కమ్ముకుంది. జనం భయభ్రాంతులై పరుగెడ్తున్నారు. దూరంగా పోలీసు సైరన్ వినపడుతూంది.
ఇటువంటి 'ఆకస్మిక' సంఘటనల్ని క్షణాల్లో జీర్ణం చేసుకోగల 'క్యూ' క్కూడా ఈ సంఘటన్నుంచి తేరుకోవటానికి కొంచెం సేపు పట్టింది. యస్బీఆర్ వైపు చూశాడు. ఆ చూపుకేగానీ శక్తి వుంటే సర్పభూషణరావు అక్కడే మసి అయి వుండేవాడు.
క్యూ తన మనుషుల వైపు తిరిగి, "ఫాలో అండ్ కిల్ హిం" అన్నాడు.
ఆ టైంకి నేత్ర తన సీటులో వెనక్కి వాలబోతూ - డ్రైవర్ వైపు చూసి, నిటారుగా అయ్యాడు. స్టీరింగ్ పట్టుకున్న చేతులు చూడగానే అవి స్త్రీవని అర్థమైంది. "ప్రతిమా" అన్నాడు.
"యస్....." తల తిప్పకుండా అంది.
"ఇక్కడికి నువ్వెలా తయారయ్యావ్?"
"నువ్వు దేశం కోసం వస్తే- నేను దేశం ప్లస్ నీ కోసం.... దట్సాల్".
"డిపార్ట్ మెంట్ పర్మిషన్ తీసుకున్నావా?"
"లేదు. శలవు మీద వచ్చాను-"
"నేనిక్కడికి వస్తున్నట్టు నీ కెవరు చెప్పారు?"
"అహుబిల"
"మైగాడ్ మన ఏజన్సీకి 'సీక్రెట్' అని పేరు పెట్టడం ఎంత తప్పో ఇప్పుడర్థమైంది. మీ ఇద్దరూ ఇంత మంచి స్నేహితులెప్పుడయ్యారు?"
"శత్రువుకి శత్రువు మిత్రుడే కదా"
"మీ ఇద్దరికీ కామన్ శత్రువు ఎవరు?"
"హంసలేఖ"
"అయ్యోపాపం- తనేం చేసింది?"
"తన ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం అని నిందమోపలేదూ!"
"అదా...." నేత్ర నవ్వాడు. ".......అసలు జరిగిందేమిటంటే-" అంటూ చెప్పబోతూవుండగా ఒక బుల్లెట్ వచ్చి వెనుక అద్దాన్ని బ్రద్దలు కొట్టింది. నేత్ర చప్పున తలవంచి ముందు సీట్లోకి దూకాడు, వెనుకనుంచి కార్లు వేగంగా వొస్తున్నాయి. ఒక కారులోంచి మిషన్ గన్ విరామం లేకుండా పేలసాగింది. వీధిలో జనం కకావికలవుతున్నారు. మెరుపు వేగంతో వాహనాలు ముందుకు కదులుతున్నాయి. వాళ్ళిద్దరి పక్కనుంచీ బుల్లెట్స్ దూసుకుపోతున్నాయి.



