Home » Yandamuri veerendranath » Rakshasudu
"గుడ్" అన్నాడు రాజన్. "మంచి ఆలోచన..."
"అయితే వచ్చే అమావాస్య వరకూ ఆగాలి. ఆ రోజు ముహూర్తం పెట్టుకుందాం. అదీగాక ఇంకా పడవకి తారు పూసేపని మొదలుపెట్టలేదు. సింహం నాకు తోడు కావాలి".
"టెంటుగుడ్డల మీద రాసేది సరిపోతుందా?"
"సరిపోతుంది".
ముగ్గురూ విడిపోయారు. చెట్టుచాటు నుంచి వాళ్ళ మాటలు వింటూన్న ఆకారం అక్కణ్నుంచి తప్పుకుంది.
ఆ రాత్రి అతడు తోపుడుబండిలో బయల్దేరాడు. నిర్ణీత స్థలం వచ్చేసరికి బండి ఆపి పొదలో వెతికాడు. తారుడబ్బా దొరికింది. అతడికి అందించే పరికరాలూ, మిగతా వస్తువులూ అవీ సింహం ఆ పొదలోనే వుంచుతాడు.
తోపుడుబండితో అతడు జలాశయంవైపు నడిచాడు. యధాప్రకారం ఉండల్ని జల్లి, దూరంగా వున్న తుప్పలవైపు వెళ్ళాడు. సంవత్సరం నుంచీ అతడు రాత్రిళ్ళు మేల్కొని చేసిన పడవ వున్నది అక్కడే!
అమావాస్య రావటానికి ఇంకా మూడు రోజులు వుంది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అడవిలో మరీ భీకరంగా వుంది. అయినా చాలా కాలం నుంచీ అతడికి ఆ ప్రదేశం అలవాటు అవటంవల్ల మామూలుగానే ఆ తుప్పల దగ్గరకి చేరుకొని వాటిని పక్కకి తొలగించాడు. తొలగిస్తూన్న చెయ్యి సగంలో ఆగిపోయింది.
తుప్పల వెనుక పడవ లేదు!!
ఒక్కసారిగా రక్తం వెన్నులోంచి మెదడులోనికి ప్రవహించినట్లయింది. కళ్ళని నమ్మాలో లేదో తెలియని స్థితిలో శిలాప్రతిమలా వుండిపోయాడు. నిజంగానే అక్కడ పడవలేదు!
అప్పుడు వినిపించింది. వెనుక నుంచి సన్నటి నవ్వు. చివాలున వెనుదిరిగాడు. చెట్ల మధ్య ఒక ఆకారం అదృశ్యం అయింది.
గాలికన్నా వేగంగా పరుగెత్తాడు. ఆ వెళ్ళేది ఎవరైనా, ఈ రహస్యం గార్డులని చేరుకోకముందే అంతం చెయ్యాలి. ఊపిరి బిగపట్టి పరుగెత్తసాగాడు. అయితే ఆ ఆకారం ఎక్కువ దూరం పరుగెత్తకుండా నీటిలోకి దూకింది. అతడు కూడా ముందు వెనుక చూడకుండా నీటిలోకి దూకాడు. రెండు నిముషాల గాలింపు తరువాత ఆ శరీరం అతడికి దొరికింది. అయితే అతడనుకున్నట్టు ఆ శరీరం పురుషుడిది కాదు. మొత్తం సున్నితంగా వున్న స్త్రీది. ఏమీ ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండానే ఒడ్డుకు వచ్చింది. తెల్లటి రాళ్ళ మధ్య ఆ చీకటిలో కూడా ఆమె శరీరంలో యవ్వనం అవసరమైనచోట అందంగా ఇమిడిపోయింది. ఎంతో కసితోనూ కోపంతోనూ పట్టుకున్నవాడల్లా, తను పట్టుకున్నది స్త్రీ అనీ, పైగా సరి అయిన అచ్చాదన లేనిదనీ తెలియగానే తబ్బిబ్బై, వదిలేశాడు. అయితే ఆమె మాత్రం అలానే అతడిని నొక్కిపట్టి అతడితోపాటూ వడ్డుకి వచ్చింది. వడ్డుకి వచ్చాక ఆమె మొహంలో ఇంకా నవ్వు అలాగే వుండటం గమనించి, ఇదంతా కావాలనే చేసినట్టు తెలుసుకున్నాడు. "ఎవర్నువ్వు-" అని అడిగాడు.
"చెప్పను"
"ఈ అడవిలోకి ఎలా వచ్చావు?"
"అదీ చెప్పను-"
"ఏం కావాలి నీకు?"
"ఇది మాత్రం చెపుతాను".
"చెప్పు"
"ఇంత మంది ఖైదీలు బానిసల్లా ఇక్కడ పనిచేస్తుంటే నాకు ఆశ్చర్యమేసింది. నేనిక్కడకు వచ్చి పది రోజులైంది. ఇంకో రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాము. తెలివి తేటలున్న వాళ్ళన్నా, ఎత్తుకు పైఎత్తు వేసేవాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. ఇంతమంది ఖైదీల్లో ఒక్కరు కూడా బయటపడే ప్రయత్నం చేయటం లేదా అని ఆశ్చర్యపోయాను. ఈ లోపులో నీ గురించి చెప్పారు. జంతువుల్ని వేటాడ్డంలో నువ్వు చూపించే ధైర్యాన్నీ, తెలివితేటల్నీ వాళ్ళు చెబుతుంటే నిన్ను చూడాలనిపించింది. నేను ఏ పని చేసినా మూడో కంటికి తెలియకుండా చేస్తాను. అలా మూడో కంటికి తెలియకుండా వచ్చి నిన్ను చూడబోయి- మీ ముగ్గుర్నీ చూశాను. నా అంచనా తప్పు కాలేదు. నువ్వు ఇక్కడ ఉండటానికి శాశ్వతంగా సిద్ధపడిలేవు. నువ్వు ఇక్కడ నుంచి పారిపోవటానికి వేసిన పథకం ఏమిటా అని మొన్న రాత్రి నిన్ను అనుసరించాను. ఇక్కడి కొచ్చావు నువ్వు. నీ వెనుకే వచ్చిన నాకు పడవ కనబడింది. చాలా బాగా కష్టపడి తయారు చేసినట్టున్నావు కదూ...." అంటూ నవ్వింది.
అతడు పళ్ళు బిగించి "ఇంతకీ నువ్వెవరు?" అని అడిగాడు. "నా పడవ ఏమైంది?"
"మొదటిది చెప్పనన్నాగా- రెండోది నాకు తెలీదు".
"ఏం కావాలో చెబుతానన్నావ్ గా. అది చెప్పు పోనీ"
"నోటితో చెప్పను. పెదవుల్తో చెపుతాను".
ఆమె భావం అతడికి అర్థమైంది. అతడు అడుగువెనక్కి వేసి, "ఈ అడవిలో ఆడగాలి తగలక అందరూ విలవిలాడిపోతున్నారు. ఇలా ఒక స్త్రీ వచ్చిందని తెలిస్తే అయిదువందల మంది ఒక్కసారిగా మీదపడతారు. వెళ్ళి వెతుక్కో" అన్నాడు కసిగా.
"ఆడదాని గురించి నీకు చాలా తక్కువ తెలుసుననుకుంటాను. ధైర్యమూ తెలివితేటలువున్న మనుషులకే తప్ప మరేవరికే ఇష్టపూర్వకంగా లొంగదు".
"మొగవాళ్ళ సంగతి కూడా నీకు చాలా తక్కువ తెలుసుననుకుంటాను. ప్రేమ లేనిచోట వాళ్ళకి ఆవేశం కలుగదు!!"
ఆమె ఈ జవాబు ఆశించకపోవటంతో దెబ్బతిన్నది. ఇంకా, ఇరవై అన్నా నిండని ఆ బలిష్టమైన కుర్రాడివైపు అదోలా చూస్తూ "ఎవర్నన్నా ప్రేమించావా నువ్వు" అని అడిగింది.
"ఏ ప్రేమ గురించి నువ్వు అడిగేది?"
"ఏ ప్రేమ గురించైనా సరే"
"నేను నా తల్లిని తప్ప ఇంకెవరినీ ప్రేమించలేదు ఇంతవరకూ".
"ఆ ఇంకో రకం ప్రేమగురించి నేను చెబుతాను... చూడు నేను అందంగా లేనూ" తన వైపు చూసుకుంటూ ముందుకు అడుగువేసింది. కదుల్తూంటే ఆమె జఘనం అందంగా వూగింది. ఎత్తయిన రొమ్ముల మధ్య వస్తూన్న సుగంధ భరితమైన పరిమళం అతడిని చుట్టుముట్టింది. నిజంగానే ఆమె చాలా అందంగా వుంది. వయసు కూడా పాతికలోపే ఉంటుంది. కానీ పద్దెనిమిదేళ్ళలాగా ఎక్కడా బింకం సడలకుండా వుంది శరీరం. సన్నటి నడుమూ- మెరుస్తూన్న పొత్తికడుపు, మోకాళ్ళ నునుపు -
అతడు తలతిప్పుకుని "వెళ్ళిపో!" అన్నాడు.
ఆమె రోషంగా "ఏం ? కోరివచ్చిందని చులకనా" అంది.
"కాదు చెప్పానుగా, దేనికైనా ప్రేమ ఉండాలని"
"నా మీద ప్రేమ కుదరాలంటే ఏం చెయ్యాలి-"
"నాకు మా అమ్మ దొరకాలి"



