Home » Yandamuri veerendranath » Rudranethra
"అవును సార్ నేనే. ప్రతిదాన్నీ చట్టపరంగా సాధించలేం. యస్బీఆర్ కోసం వస్తూన్న ఆమ్లజలాన్ని అక్కడే సముద్రంలో కలిపేసి అతడిని తిరుగులేని దెబ్బ కొట్టదల్చుకున్నాను."
"దానివల్ల అతడికేమీ నష్టం లేదు. అంతకి అంతా ఇన్సూరెన్స్ వస్తుంది."
"పోయింది కేవలం ఆమ్లజలమే అయితే వస్తుంది. కాని, దాంతోపాటు ప్లూటోనియం కూడా వుంటే?" నేత్ర నవ్వాడు.
శ్రోతలిద్దరూ అవాక్కయి చూశారు.
"నాకెందుకో అనుమానం వచ్చింది సార్. అతడి పరిశ్రమలకి అంత ఆమ్లజలం అవసరం లేదుకదా అనుకున్నాను. అదే సమయానికి ఈ పాకిస్తాన్ వ్యవహారం చదువుతూంటే నాకీ సందేహం కలిగింది. పదిపదిహేను రోజులపాటు సముద్రంలో కాపువేసి ఆ ఓడని పట్టుకోవాలి."
"కాని, నెల రోజులపాటు చిన్న పడవలో ఆహార పదార్థాలు నిలవచేసుకుని రాత్రింబవళ్ళు ఎండలో, వానలో....."
"తప్పదు సార్. ఆధునికమైన ఆయుధాలతో మన షిప్ ఆ ప్రాంతాల్లో కనపడిందంటే ఆ వినాశనానికి మన దేశమే కారణమని ఇంటర్నేషనల్ కోర్టులో మన శత్రుదేశం కేసు వేసే ప్రమాదం వుంది. రుజువైనా, కాకపోయినా మన ప్రతిష్టకు సంబంధించిన విషయం అది."
"కాని..... అంత రిస్క్....."
"మీకు గుర్తుందా? పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో ఒకశత్రు జలాంతర్గామి విశాఖపట్టణ సముద్రతీరంలో నెలల తరబడి కాపువేసింది. మన శత్రువు నీటి లోపల అన్ని రోజులు వున్నప్పుడు నీటిపైన నేను వుండటంలో రిస్క్ ఏముంది? వెళ్ళొస్తాను. పని పూర్తి చేసుకు వచ్చాక కలుస్తాము-"
"కలుస్తాము- అంటున్నావు, నీతోపాటు ఎవరొస్తున్నారు?"
"ఏజెంట్ ప్రతిమ-"
* * *
చుట్టూ నీళ్ళు. అలలు కూడా లేవు. అంతా నిశ్శబ్దంగా వుంది. సముద్రం మీద ఆ నిశ్సబ్దం భయంకరంగా వుంది.
దానికితోడు ఒంటరితనం.
వాళ్ళిద్దరే ఆ పడవలో రెండు వారాల నుంచి వుంటున్నారు. చిన్నసైజు మోటారు బోటులా వుంది. ఎండ నుంచి రక్షించడానికి, వాన నుంచి కాపాడటానికి పైన కప్పు వుంది. సీటు క్రింద దాదాపు నెల రోజులకు సరిపడా టిన్డ్ ఫుడ్ వుంది. నీళ్ళ సీసాలు, స్టవ్, టీపొడి, బిస్కట్లు, అన్ని ఏర్పాట్లూ వున్నాయి. కాలక్షేపానికి ట్రాన్సిష్టర్ వుంది.
అయినా ఆ నిశ్శబ్దం భయంకరంగా వుంది.
ప్రతిమ, నేత్ర ఆ బోట్ తో వున్నారు. ఏడు రోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వుండడం ఎంత కష్టమో ప్రతిమకి అర్థమవుతూంది. ఆమెకి ఈ అనుభవం కొత్త. సీక్రెట్ ఏజెంట్ గా ఆమెకి ఇటువంటి అనుభవం కలగలేదు. వంతుల ప్రకారం లేవడం, బైనాక్యులర్స్ తో చుట్టూ చూడడం, అదే పని. సూర్యుడు వచ్చేవాడు. పడమట కృంగిపోయేవాడు.
వాటర్...... వాటర్ ఎవ్విరివేర్...... వాటే డ్రాప్ టు 'బేత్'. స్నానానికి నీళ్ళుండేవి కావు. రేషన్. తాగే నీటికి సమస్య లేదు.
వాళ్ళు ఆ ప్రదేశానికి చేరుకున్న నాలుగు రోజులకి వర్షం వచ్చింది. లేని దాని అవసరం ఎంత గొప్పగా కనపడుతుందో ఆమెకి అప్పుడు అర్థమైంది. అతనున్నాడని కూడా చూసుకోలేదు. చేతులు గాలిలోకి విసిరి ఆ వర్షంలో తడిసింది. ఉప్పుగాలితో పెళుసయిన శరీరానికి ఆ వర్షం ఎంతో హాయిగా తోచింది. చిన్నపిల్లలా కేరింతలు కొట్టింది.
నేత్ర బోటుకి అటువైపు వెళ్ళిపోయాడు. తరువాత అడిగింది. "ఎందుకలా చేశావ్" అని.
"నీ ఉత్సాహాన్ని పాడుచేయడం ఇష్టంలేక. నేనుంటే ఆ తడిసిన చీరలో నువ్వు అంత స్వేచ్ఛగా వుండవు."
ఆమె రవ్వంత సిగ్గుతో "కాని ...... ఆ రోజు నారాయణ్ పేట్ లో......" అసంపూర్తిగా ఆపుచేసింది.
"అది వేరు..... ఆ రోజు నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇక్కడ అలా కాదు. నన్ను నమ్మివచ్చావు. ణీ నమ్మకాన్ని పాడుచేయడం, ఈ డిపార్ట్ మెంట్ కి అన్యాయం చేసినట్టవుతుంది. అదీగాక ఆ భంగిమలో అలా చూస్తే నేను తర్వాత టెంప్ట్ కావచ్చు."
ఆమె అతడివైపు గౌరవంతో కూడిన ఆరాధనా పూర్వకంగా చూసింది. మామూలప్పుడు ఎంత అల్లరిగా ఏడిపించేవాళ్ళే అవసరమైనప్పుడు ఇంత నిజాయితీగా వుండగలరన్నమాట అనుకుంది. మామూలుగా అతిమర్యాద, వినయం చూపించే మరొక మొగవాడు ఈ పరిస్థితిలో వుండి వుంటే అత్యాచారం చేయకపోయినా, కనీసం మాటలు కలిపి, పరిచయం మరింత పెంపొందించు కోటానికైనా ప్రయత్నించి వుండేవాడు. వెన్నల రాత్రుల్నీ, ఒంటరితనాన్ని తేలిగ్గా వదులుకుని వుండేవాడు కాదు. పైకి ఎంతో గౌరవాన్ని చూపించే మొగవాళ్ళు, అవకాశం వస్తే ఎంత 'లేకి'గా ప్రవర్తిస్తారో ఆమెకి తెలుసు. 'ఐ లవ్ యూ..... ఐ లవ్ యూ నేత్రా' అనుకుంది. స్త్రీ సహజమైన బిడియంతో దాన్ని పైకి చెప్పలేదు.
ఆమెకెందుకో హాయిగా అనిపించింది. చుట్టూ వున్న అగాధ జలరాశి, పైన ఆకాశం, నక్షత్రాలు, సముద్రం మీదనుంచి వచ్చే చల్లటి గాలి, కెరటాలమీద మెరిసే చంద్రకాంతి, వర్ణంతో శబ్దం మిళితమై వచ్చే అపురూపు నాదం ప్రే.... మ... ఆమె కెందుకో ఆ అనుభవం చాలా గమ్మత్తుగా అనిపించింది. ఇంత దూరంలో నీతిమధ్య ఊగుతున్న పడవలో మానవాళికి దూరంగా తామిద్దరే.
ఆమె తన ఆలోచనల్లో వుండగా దూరంగా శబ్దం వినిపించింది.
షిప్ శబ్దం.
నేత్ర బైనాక్యులర్స్ తో చూశాడు. చీకట్లో దూరంగా దీపాల వెలుగు కనిపించింది.
అతడు తయారవసాగాడు. ఆమె అతడినే చూడసాగింది. అంత చలిలోనూ, టెన్షన్ తో ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది.
అతడు చేపలా నీటిలోకి జారిపోయాడు. దాదాపు కిలోమీటరు దూరంలో షిప్ వస్తూంది.
ఇది చాలా రిస్క్ తో కూడిన పని అని ఆమెకు తెలుసు. ఏ మాత్రం అటు ఇటు జరిగినా అతడు తిరిగి రాకపోవచ్చు.
* * *
ముప్ఫయి అడుగుల ఎత్తుంటుంది ఆ ఓడ అంచు.
నీటిలోంచి తల పైకెత్తి చూశాడు నేత్ర. జేగురు రంగు ఇనుము చెక్క మిశ్రమంమీద నీటి పాకుడు పచ్చగా కనపడుతూంది. అతడు చేతిలో వున్నా పరికరాల్ని డానికి అమర్చాడు. పూర్వకాలంలో సైనికులు కోట గోడలు ఎక్కడానికి ఉపయోగించే 'ఉడుం' లాంటి ఆధునికమైన ఆ పరికరాలు సాయంతో ఆ అంచులు ఎక్కడానికి ప్రయత్నించాడు. చాలా కష్టమైనా ఫీటు అది.



