Home » Yandamuri veerendranath » Anaithikam
"నీకు తెలీదు. నేను చాలా సెంటిమెంటలిస్ట్ ని. చాలా చిన్న విషయానికే అమితంగా స్పందిస్తాను. మిగతా మగాళ్లలాగా అయిపోయిందేదో అయిపోయిందనుకుని మేటిరియలిస్టిక్ గా బతకడం నాకు చేతకాదు" తడికళ్ళతో అన్నాడు. అతన్ని ఓదార్చి మామూలు మనిషిని చేయడానికి చాలాసేపు పట్టింది.
మా తొలిరాత్రి ఆ విధంగా గడిచింది.
7
సురేష్ కున్న ఒకే ఒక దురలవాటు పొద్దున్నపూట ఆలస్యంగా లేవడం. ఇటువంటి ఫీల్డ్ లో వున్నవాళ్ళ కిదంతా సహజమేమో కానీ నా ఇబ్బంది దీనితోనే ప్రారంభమైంది. పొద్దున అతడు లేచేసరికి వంట పూర్తిచేసేదాన్ని. భోజనం చేసి ఇద్దరం ఆఫీసుకి వెళ్ళిపోయేవాళ్ళం. ఆఫీసయ్యాక కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయ్యేది.
"సాయంత్రం పూట వంటపని నా కొదిలిపెట్టు" అన్నాడు సురేష్. "ఇద్దరం బాధ్యతల్ని సమానంగా పంచుకుందాం".
రెండు రోజులు బాగానే గడిచాయి కానీ సురేష్ కి ఉప్పుకీ, పంచదారకీ తేడా తెలీదు. కష్టపడి నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడు. జోకు లేసుకుంటూ భోజనం చేసేవాళ్ళం.
మూడో రోజు నేను ఇంటికి వచ్చేసరికి తాళం వేసుంది. రాత్రి పదకొండింటికి వచ్చాడు. అప్పటికే వంట పూర్తిచేసి నేనతని కోసం ఎదురుచూస్తున్నాను. "నేను బయట భోజనం చేశాను" అన్నాడు. మనిషి చిరాగ్గా వుండటం చూచి 'ఏమైంద' నడిగాను.
"ఆ సీరియల్ ఇప్పట్లో వచ్చేలా లేదు. మన డబ్బంతా బ్లాకైపోయింది. అ విషయం మాట్లాడుతూ వుండిపోవడంతోనే ఆలస్యమైంది". దిగులుగా అని అటు తిరిగి పడుకున్నాడు.
"ఇదంతా ఎందుకొచ్చిందండీ? మనిద్దరం హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా! ఎందుకింత శ్రమపడడం?" అన్నాను.
ఛివాలున తల తిప్పి నావైపు చూశాడు. అతడిలో అంత కోపాన్ని నేనెప్పుడూ చూడలేదు. "చాలామంది కళాకారుల్లో కళ మొదట్లోనే చచ్చిపోవడానికి కారణం నీలాంటి భార్యలే! ఇంకెప్పుడూ అలా మాట్లాడకు. అండర్ స్టాండ్?" అని అరిచాడు.
ఆ రాత్రి చాలాసేపు నాకు నిద్రపట్టలేదు. ఎందుకో దిగులుగా అనిపించింది.
మరుసటిరోజు నేను ఇంటికి వచ్చేసరికి తాళం వేసి లేదుకానీ ముందు గదిలో ముగ్గురు నలుగురు స్నేహితులతో కూచుని వున్నాడు. వాళ్లు మా యూనిట్లో పనిచేసే టెక్నీషియన్లే. జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నారు. కోర్టులో దావావేసినవాణ్ణి తిట్టుకుంటున్నారు. ఇంకొక హీరోయిన్ ఎవరి గురించో జోకులు వేసుకుంటున్నారు.
ఆ నిరర్థకమైన సంభాషణంతా వింటూ వంట పూర్తిచేశాను. తన భార్యతో వేషం వేయిస్తూ కూడా మరొక అమ్మాయి గురించి అలా మాట్లాడుకోవడం సహించడాన్ని జీర్ణించుకోలేకపోయాను.
అరగంట తర్వాత లోపలికి వచ్చాడు. ఇద్దరం మౌనంగా భోజనాలు పూర్తిచేశాం.
"అయామ్ సారీ! రాగానే వంట చేద్దామనుకున్నాను. కానీ ఇదిగో వాళ్ళు రావడంతో కుదర్లేదు".
"ఫర్వాలేదులెండి" అన్నాను క్షుప్తంగా.
ఆ మరుసటి రోజు నుంచీ రెండు పూటలకీ కలిపి వంట చేసి ఆఫీసుకి వెళ్ళడం ప్రారంభించాను. ఈ విధంగా నెల రోజులు గడిచాయి. ఒక రోజు సాయంత్రం శ్రీకాంత్ స్టాఫ్ రూమ్ కి నన్ను పిలిపించాడు. మార్కుల లిస్ట్ నా ముందుకి తోస్తూ "ఏమిటిది?" అన్నాడు. నేను మాట్లాడకుండా తల వంచుకుని కూర్చున్నాను.
"నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ వి. కానీ ఈసారేమిటిలా వచ్చాయి మార్కులు?" నెలరోజులుగా నేనసలు పుస్తకాలు ముట్టుకోలేదన్న విషయం ప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇంటికొచ్చాక "నేను ఉద్యోగం మానేస్తే ఎలా వుంటుంది?" అనడిగాను. నోట్లో పెట్టుకోబోతున్న ముద్దని కంచంలో వదిలేసి "ఏమిటీ?" అన్నాడు సరిగ్గా వినబడనట్టు. "ఆఫీసు, చదువు రెండూ కష్టమవుతున్నాయ్. ఈ మాత్రం ఉద్యోగం ఎప్పుడైనా దొరుకుతుంది. ముందు చదువు పూర్తి చేద్దామనుకుంటున్నాను".
"ఈ మాత్రం ఉద్యోగం ఎప్పుడైనా దొరుకుతుందా? మనది ఎంత పెద్ద ఆర్గనైజేషనో తెలుసా నీకు?"
"ఏ క్వాలిఫికేషన్ లేనప్పుడే దొరికిందిగా నాకు".
"ఎదురు సమాధానాలు చెప్పకు". మొహం చిట్లిస్తూ కోపంగా అన్నాడు.
"ఇంతకుముందు కూడా నువ్వు ఆఫీసుపని చేస్తూ చదువుకునేదానివి. ఇప్పుడు ఇంటి పనంతా మీదొచ్చి పడిందని అన్యాపదేశంగా చెప్పడమేగా నాకు! రేపట్నుంచి కేరేజీ తెచ్చుకుందాం".
నేను విస్మయంగా "రెండు సంవత్సరాలపాటు కేరేజీ తెచ్చుకుందామా?" అనడిగాను.
"రెండు సంవత్సరాలేమిటీ? నువ్వు ఎం.కాం. చదివి ఎల్.ఎల్.బి. చేస్తే ఏడు సంవత్సరాలపాటు కేరేజీ తెప్పిస్తాను. ఏమనుకుంటున్నావ్ నా గురించి? అందరు మొగుళ్ళూ ఎలా వుంటారో తెలుసా? పెళ్ళవగానే చేస్తున్న ఉద్యోగాన్ని మానిపించి పెళ్ళాన్ని నాలుగు గోడలమధ్యా దాచెయ్యాలనుకుంటారు. స్త్రీ స్వాతంత్ర్యాన్ని ఆ విధంగా హరించేసి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటారు. నేను కాబట్టి నువ్వు ఆఫీసునుంచి కాలేజీకి వెళ్ళి రాత్రి పదింటికొచ్చినా ప్రోత్సహిస్తున్నాను. ముందు గదిలో కూచుని ఆఫీసునుంచి అలసి వచ్చిన పెళ్ళాంతోనే ఇంటి పనంతా చేయించే మగవాళ్లెంతమందో నాకు తెలుసు. నేను చూడెంత కష్టపడుతున్నానో? ఇదంతా ఎవరికోసం? అలసిపోయి ఇంటికి రాగానే భార్య కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలనీ, స్నానానికి నీళ్ళు తోడివ్వాలని నాకు మాత్రం అనిపించదూ? ఇదంతా త్యాగం చేయడం లేదూ? పెళ్లై ఏడాది తిరక్కుండానే తమకో వంశాంకురం కావాలని పెళ్ళాల అందాన్నీ, ఆరోగ్యాన్నీ పాడుచేసే ఎంసిపిల్లాంటి వాడిననుకున్నావా నేను? స్త్రీ ఆర్థిక స్వాతంత్ర్యాన్నీ, స్వేచ్చనీ గౌరవించే వాళ్ళలో ప్రధముణ్ణి నేను. కాబట్టి ఇంకెప్పుడూ ఉద్యోగం మానేస్తాననకు" అని సగం తిన్న కంచంలో చెయ్యి కడిగేసుకుని లేచెళ్ళి పడుకున్నాడు.
అతడు చెప్పిన దాంట్లో చాలా తర్కం కనపడింది కానీ- ఇంతకీ నా సమస్యకి పరిష్కారం ఏం చెప్పాడో అర్థంకాలేదు.
మాగన్నుగా నిద్రపడుతున్న సమయలో ఫ్లాష్ లా నాకో ఆలోచన వచ్చింది. సురేష్ ని లేపి "ఏమండీ, నాకో చక్కటి అయిడియా వచ్చింది" అన్నాను.
కళ్ళు బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ "ఏమిటీ?" అన్నాడు.
"ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకో నాలుగు నెలల్లో వున్నాయి కదా! ఈ నాలుగు నెలలూ ఆఫీసుకి సెలవు పెట్టేసి పరీక్షలకి చదువుకుంటాను. ఎం.బి.ఎ. చదవాలంటే ఈ మార్కులు సరిపోవు".
"కానీ నాలుగు నెలలు నీకు సెలవు ఎవడిస్తాడు?"
"జీతం నష్టంమీద సెలవు పెడతాను".



