Home » Yandamuri veerendranath » Anaithikam


                                         4

 

    నాకు పెద్ద ఉద్యోగం రాబోతోందని తెలిసి ఇంట్లో పరిస్థితులు గమ్మత్తుగా మారాయి. అమ్మ, చిన్నన్నయ్య స్వయంగా వచ్చి ఇంటికి తీసుకెళ్ళారు. నాన్న ఆప్యాయంగా పలకరించాడు. ఒక పెద్ద ఇల్లు తీసుకుంటే అక్కా బావలతో సహా అందరూ కలసి వుండవచ్చనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆశ్చర్యకరంగా నాన్న ఆరోగ్యంకూడా కొద్దిరోజుల్లోనే బాగుపడింది.

 

    అయితే ఈ పరిణామాలేవీ నా కంత ఆనందకరంగా లేవు. తండ్రీ కూతుళ్ళ మధ్య వుండే సంబంధం, అక్కా బావల మధ్య దాంపత్యం, పెద్దన్నయ్య స్వార్థం- అన్నీ నాకు చాలా చిరాకునీ, అసంతృప్తినీ కలగజేయడం ప్రారంభించాయి. స్వార్థరహితమైన ప్రేమకోసం మనిషి ఎందుకంత అల్లాడిపోతాడో కొద్దికొద్దిగా అర్థమవసాగింది. ఇది నాలో వచ్చిన కొత్త పరిణామం. ఇప్పటి వరకూ నేను చదువు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మొదలైన సమస్యల మధ్య కొట్టుకుంటూ వుండటంవల్ల ఈ ప్రేమ, ఆప్యాయతల అవసరం గురించి అంతగా ఆలోచించలేదు. ఒక అవసరం తీరాక మరొక అవసరం యొక్క ఆవశ్యకత తెలుస్తుందనుకుంటాను. బహుశా ఇది వయసువల్ల వచ్చిన పరిణామం కూడా అయ్యుండచ్చు.

 

    కానీ ఈ పరిస్థితిలో కూడా నేను ఒక విషయం మరచిపోలేదు. అన్నయ్య కులం ప్రాతిపదికగా మెట్లెక్కాడు. అక్క తన అందాన్ని సొమ్ము చేసుకుంటోంది. ఈ రెండు అవకాశాల్నీ నేను ఉపయోగించదల్చుకోలేదు. తెలివితేటలు, స్వశక్తి ఆధారంగా కష్టపడి జీవితంలో పైకి రాదల్చుకున్నాను. అందుకే మరింత కష్టపడి పనిచేయసాగాను. చదువుమీద ఏకాగ్రత నిలిపాను. అయితే పెద్ద ఎగ్జిక్యూటివ్ అయిపోవాలనీ, గొప్పగా ఏదో సాధించేసి ప్రపంచాన్ని శాసించాలనీ పెద్ద పెద్ద కోర్కెలేమీ లేవు నాకు. ఒక మంచి గృహిణి నవ్వాలనీ, పిల్లల్ని కని సంసారాన్ని తెరచిదిద్దుకోవాలనీ, భర్త ప్రేమ, ఆప్యాయతల మధ్య కరిగిపోవాలనీ అనిపించడం ప్రారంభించింది. వీళ్ళంతా నా వాళ్ళు కాదు. నా కోసం ఎవరో వున్నారన్న ఫీలింగ్ బహుశా ఈ వయసులో అందరికీ కలుగుతుందనుకుంటాను.

 

    ఒక రోజు సురేష్ నన్నడిగాడు- "మీ క్లాస్ లో మంచి కుర్రవాడెవరైనా వున్నాడా?" అని.

 

    నా కర్థం కాలేదు. "ఏమిటి?" అన్నాను.

 

    అతడికే ఎలా చెప్పాలో అర్థం కాలేదనుకుంటాను. "నేను నాటకాలవీ రాసి డైరెక్ట్ చేస్తూంటాను. నీకు తెలుసో, లేదో?"

 

    నాకు చూచాయగా తెలుసు. సురేష్ ఆఫీసుకి సరిగ్గా రాడు. వచ్చినరోజు కూడా ఏ పన్నెండింటికో వస్తాడు. క్రితం రోజు రాత్రి రిహార్సల్స్ ఆలస్యమైందని అతడు చెప్తూండగా ఒకటి రెండుసార్లు విన్నాను. పనిమాత్రం బాగానే చేసేవాడు. అయినా ఇవన్నీ నాకు సంబంధించని విషయాలు కాబట్టి నేనంతగా పట్టించుకోలేదు.

 

    "ఈ మధ్య దూరదర్శన్ సీరియల్స్ ని ప్రసారం చేయడం ప్రారంభించింది. మీకు తెలిసే వుంటుంది. అందులో ఒకటి నాకు కేటాయించారు. అందులో విలన్ వేషం వేయడానికి ఒక కుర్రవాడు కావాలి. కుర్రవాడంటే మరీ చిన్నవాడు కాదు. ఇరవై ఎనిమిది- ముప్పై మధ్య వుండాలి".

 

    "అలాంటివాళ్ళు సులభంగానే దొరుకుతారుగా!" అన్నాను.

 

    "ఇందులో ఓ ఇబ్బంది వుందండీ! చాలా కష్టపడి ఆ పాత్రని రాశాను. పైకి అందరు మగవాళ్ళలాగే మామూలుగానే వుంటాడు. కానీ అతడి అసలు స్వరూపం వేరు. ఈ క్లిష్టతని జాగ్రత్తగా పోషించాలి. ఆఫ్ కోర్స్! డైరెక్టర్ గా అది నేను రాబట్టుకోగలననుకోండి, కానీ చూడడానికి మాత్రం మనిషి చాలా హుందాగా, అప్పుడప్పుడు అల్లరిగా, ఒకోసారి గంభీరంగా, స్త్రీ పట్ల మంచి అవగాహన వున్నవాడిలా వుండాలి. సగం జరిగాక కథ మరో మలుపు తిరుగుతుంది. ప్రేక్షకులు షాక్ తినాలి!"

 

    "అమ్మో! అలాంటివన్నీ నాకు తెలియదండీ! అసలీ రంగమే నాకు కొత్త. నాకెవరు దొరుకుతారు?"

 

    "మీరు ఈవెనింగ్ కాలేజీలో చదువుతున్నారు కాబట్టి అలాంటి మధ్య వయస్కులైన యువకులెవరైనా దొరకవచ్చు. చూస్తూండండి. ఎవరినైనా చూడగానే నేను చెప్పిన లక్షణాలకి, 'ఇదిగో ఇతను కరెక్ట్ గా సరిపోతాడు' అనిపిస్తే మొహమాటం లేకుండా అడిగేసెయ్యండి. టీ.వీ.లో వేషమంటే- అందులోనూ మీరడిగితే ఎవరు కాదంటారు?"

 

    ఆ క్షణం నాకైతే ఏ నమ్మకం లేకపోయింది కానీ అలాంటి కుర్రవాడు (?) నాకు మరుసటిరోజే కనబడ్డాడు. ఆయన మా లెక్చరర్. సురేష్ అడిగినట్టే ఆయన వయస్సు ముప్పై దాటదు. ఎక్కడో ఉద్యోగం చేస్తూ పార్ట్ టైమ్ లెక్చరర్ గా చేస్తున్నట్టున్నారు. లెక్చర్ చెప్పినంతసేపూ సీరియస్ గా వుంటారు. బయట నవ్వుతూ మాట్లాడతారు. జీవితం పట్ల మంచి అవగాహన వున్నట్టు ఆయన మొహం చూడగానే అనిపిస్తూంది. అంతవరకూ చాలు. మిగతాది సురేష్ చూసుకుంటాడు.

 

    నేనింకేమీ ఆలోచించకుండా ఎకాఎకిన వెళ్ళి అడిగేశాను. ఆయనొక క్షణం దిగ్భ్రాంతిగా చూశాడు. "మీరేం చేస్తుంటారు?"

 

    నేను పనిచేస్తున్న కంపెనీ పేరు చెప్పి, "బ్రాంచ్ మేనేజర్ ట్రైనీని" అన్నాను.

 

    "మరిదేం పోయేకాలం?" అన్నాడు నా మొహంకేసి పరీక్షగా చూస్తూ.

 

    నా మొహం ఎర్రబారింది. ఈవెనింగ్ కాలేజీలో విద్యార్థులూ, అధ్యాపకులూ దాదాపు ఒకే వయసు వారవడం వల్ల భక్తి, గౌరవాలకన్నా సంబంధాలు సమానస్థాయిలోనే వుంటాయి.

 

    "నాటకాల్లోనూ, టీవీల్లోనూ నటించే వాళ్ళందరూ పోయేకాలం దాపురించిన వాళ్ళు కాదు!" అన్నాను కోపంగా.

 

    "ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చెయ్యి. బ్రాంచ్ బాధ్యతలు స్వీకరించబోతున్నావు కాబట్టి మరింత ఏకాగ్రతతో పనిచేయవలసి వుంటుంది. ఈ నాటకాలు, సినిమాల వేషాలు మానేసి వాటిమీద దృష్టి నిలపమని నీకన్నా పెద్దవాడిగా సలహా యిస్తున్నాను!"

 

    "థాంక్స్! మీ సలహాకి మెనీ మెనీ థాంక్స్!" అని అక్కణ్ణించి విసురుగా వచ్చేశాను.

 

    ఆ మరుసటిరోజు సురేష్ కి చెప్పాను- "అచ్చు మీరడిగినలాంటి మనిషి దొరికాడు. చూడగనే నాకెందుకో ఆ శాడిస్టువేషానికి సరిపోతాడనిపించింది!" అంటూ జరిగినదంతా చెప్పాను.

 

    "మిమ్మల్నంత మాటన్నాడా! ఆ పాత్ర నాకెంత సూటైన వాడైనా సరే అంత మాటన్నవాడి నెలా తీసుకుంటాం?"

 

    "అతను నన్నేదో మాటన్నాడని మీరిలాంటి నిర్ణయం..." నా మాటలు పూర్తికాకుండానే, "మిమ్మల్నంటే ఒకటీ, నన్నంటే ఒకటీనా? సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ నెస్ వుండాలండీ!" అన్నాడు. ఆ మాట నాకెందుకో బాగా నచ్చింది. ఎలాగైనా సురేష్ కి సహాయం చేద్దామనుకున్నాను.

 

    ఆ లెక్చరర్ పేరే శ్రీకాంత్. ఆ మరుసటిరోజు క్లాసునుంచి బయటికి వస్తూండగా ఆపి, "అయామ్ సారీ! నిన్న మిమ్మల్ని అనవసరంగా మాటనేశాను!" అన్నాడు.

 

    "అనేసిన తర్వాత క్షమాపణ చెప్పి ఏం లాభం?"

 

    "నా సంతృప్తి కోసం".


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More