Home » Dr C ANANDA RAMAM » Neeraja



    యశోధర బయటికి వెళ్ళినట్టుంది- అప్పుడే వచ్చింది-నీరజను చూసి మొదట ఆశ్చర్యపోయింది-తరువాత ఆనందంతో కౌగలించుకుంది.
    "నేను ఊళ్ళో లేను-ఇవాళే వచ్చాను. నీ దగ్గరకి వద్దామనే అనుకుంటున్నాను- నువ్వేవచ్చావు-వస్తావని అనుకోలేదు-"
    "వస్తానని అనుకోలేదా? ఒక్కరోజైనా మీ ఇంటికి రాకుండా ఎప్పుడైనా ఉన్నానా?"
    "ఇదివరకు సంగతి సరే! ఇప్పుడు అందరూ చూస్తుండగా రోడ్డుమీదనుండినడిచి..."
    మధ్యలో ఆగిపోయి నవ్వేసింది యశోధర.
    నీరజకు అర్దమయింది. లోపలినుండి లక్ష్మీదేవి "యశోధరా!" అని కేకపెట్టింది-
    "వస్తాను-" అని యశోధర లోపలికి వెళ్ళింది.
    "యశో! నువ్వు ఇదోవరకులాగ ఆ నీరజతో మాట్లాడటానికి వీల్లేదు!"
    "హుష్! నీరజకు వినిపిస్తుంది!"
    "వినిపించనీ! అంతగా అవసరమయితే, నీరజముఖంమీదే చెపుతాను!"
    "పాపం, నీరజ తప్పేముంది అమ్మా?"
    "తప్పుఉందని నేను అనటంలేదు-కానీ ఈ విషయం ఇంతటితో ఆగరు...వాళ్ళెవరో మళ్ళీ నీరజకోసం రాక మానరు-ఇలాటి గొడవల్లో నువ్వూ చిక్కుకుంటే నేను భరించలేను!"
    "అమ్మా! నువ్వే నీరజను గురించి ఇలా మాట్లాడుతోంటే మిగిలినవాళ్ళు ఏమంటారో చెప్పు..."
    "నాకు నీరజమీద అభిమానం ఉంది ఇప్పటికీ ఉంది. కానీ అది నాకన్నబిడ్డల మీదఉన్న అభిమానంకంటే ఎక్కువదికాదు - నీ మేలుకోరి చెపుతున్నాను. నువ్వు నీరజకి దూరంగా ఉండు..."
    తమ సంభాషణ నీరజను వినిపిస్తుందని యశోధరకు తెలుసు - వినిపించకుండా ఉండాలని తల్లి ఏమీ జాగ్రత్త తీసుకోలేదు - నీరజను ఎలా ఎదుర్కోవలసివస్తుందోనని భయపడింది. ఎప్పటి చిరునవ్వుతో ఉన్న నీరజనుచూసి ఆశ్చర్యపోయింది.
    "నీరజా! నాకు లోపల కొంచెం పని ఉంది- నువ్వు ఈ పుస్తకాలు చూసుకుంటూ కూర్చుంటావా? వెళ్తావా?"
    "కూర్చుంటాను!"
    ఒక్కసారి నీరజముఖంలోకి చూసి లోపలకు వెళ్ళిపోయింది యశోధర....యశోధర కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. ఆ కళ్ళలో సానుభూతి ఉంది. మనసులో ఆర్ద్రత ఉంది. అయినా వెళ్ళిపోయింది.
    ప్రభు వచ్చేసరికి కొంచెం పొద్దుబోయింది - తన స్నేహితుడు నీలకాంత్ తో కబుర్లుచెపుతూ కూచున్నాడు-నీలకాంత్ కూడా వస్తానంటే అతడిని కూడా తీసుకుని వచ్చాడు.
    తన ఆఫీస్ రూంలో కూచున్న నీరజను చూసి ఆశ్చర్యపోయాడు - నీరజ తన ఇంటికిరావటం మామూలే! కానీ, ఇంతకుముందు ఎన్నడూ ఇలా ఆఫీస్ రూంలో కూచోలేదు. వంటింట్లో లక్ష్మీదేవికి వంటసాయంచేస్తూనో - యశోధరతో ఒక మంచంమీద పడుకుని కబుర్లు చెపుతూనో ఉండేది...
    నీరజను ఎవరో టాక్సీలో తీసుకుపోయారని విన్నప్పుడు లక్ష్మీదేవి ఎంతో బాధపడింది... ఒకరాత్రి అంతా నిద్రపోకుండా కుమిలి కుమిలి ఏడ్చింది - కానీ, తర్వాత నీరజ తిరిగి వచ్చిందని తెలిసినపుడు ఏ మాత్రమూ సంతోషించలేదు-
    "ప్రభూ! నీరజ నా కోడలవుతుందని ఎంతో ఆనందించాను. ఇంక ఆ రాతలేదు. నువ్వు నీరజను మరచిపో?" అంది-
    "నీరజ వచ్చింది కదమ్మా! ఇంక మరిచిపోవటం దేనికి?"
    "వస్తేమాత్రం ? మళ్ళీ మామూలు నీరజ అవుతుందా?"
    "నీరజ ఎప్పుడూ నీరజే! నీరజలో మార్పు ఎందుకు వస్తుంది?"
    "ఎవరో ఎత్తుకుపోయి కొన్నిరోజులు ఉంచుకొని తిరిగి పంపించిన అమ్మాయిని చెసుకుంటావా?"
    "ఎవరో తప్పుచేస్తే దానికి నీరజను శిక్షించమంటావా? ఎప్పటినుంచో నీరజను పెళ్ళిచేసుకుంటానని చెప్తున్న నేను కాదంటే నీరజ కసలు పెళ్ళి అవుతుందా? ఆ అమాయకురాలి బ్రతుకుమొత్తం బలికావలసిందేనా?"
    "అందుకని ... నువ్వు చేసుకుంటానంటావా? అంత త్యాగం నేను చెయ్యలేను?"
    "త్యాగం కాదమ్మా! నీరజలేకుండా నేను బ్రతకలేను. ఇది స్వార్ధమే!"
    ప్రభు మాటలు లక్ష్మీదేవికి అర్ధంకాలేదు - ఆవిడకు అర్ధమయ్యేలా ఎలా చెప్పాలో ప్రభుకు అర్ధంకాలేదు - ముందుకు నడుస్తోన్న తరంలోని అభ్యుదయ దృక్పథం ప్రభుది-వెనుకబడిన తరంలోని మగ్గిపోయిన భావాలతోకూడిన మంచితనం లక్ష్మీదేవిది...
    అయినా ప్రభును గట్టిగా ఏమీ అనలేదు. ఎందుకంటే ఆ కుటుంబానికంతకూ ప్రభు ఒక్కడే ఆధారం-ప్రభు తండ్రి చంద్రశేఖరరావుకు తాతలనాటి ఆస్తులు రాకపోయినా ఆ దర్జాలన్నీ వచ్చాయి. ఉన్న కొంచెమూ కూడా తగలబెట్టుకున్నాడు-ఉద్యోగం చెయ్యటం చిన్నతనమని చెయ్యడు - ఎకౌంటెంట్ గా ప్రభుతెచ్చే అయిదువందలతోనే ఆ కుటుంబం నడవాలి - తనకు సరీగ్గా అన్నీ అమరటంలేదని చంద్రశేఖరరావు భార్యమీద ఎప్పుడూ చిరాకుపడుతూ ఉంటాడు-లక్ష్మీదేవి అవన్నీ శాంతంగా సహిస్తూ భర్తను సంతృప్తిపరచటానికే ప్రయత్నించేది - తన కష్టార్జితం తల్లి దగ్గిరనుండి తీసుకుని తండ్రి పేకాటలో తగలెయ్యటం ప్రభు సహించలేకపోయేవాడు-
    "నాన్నకు డబ్బు ఇయ్యకమ్మా!" అనేవాడు -
    "ఆడుగుతోంటే లేదనటం ఎలా?" అనేది లక్ష్మీదేవి....'భర్తమాట కాదనమంటావా?' అన్న ధోరణిలో-
    ఈ రకమైన మంచితనం ప్రభుకు నచ్చలేదు-రానురాను తల్లికికూడా డబ్బు అందకుండా జాగ్రత్తపడేవాడు-
    తన తల్లి చాలా మంచిది-కానీ ఆ మంచితనం ఒక శతాబ్దం వెనుకటిది!
    నీరజ ఆఫీస్ రూంలో కూచుందంటే, తల్లి ఇంట్లోకి రానియ్యలేదన్న మాట! తను తల్లిని గౌరవిస్తాడు-కానీ భయపడడు.
    నీరజనుచూసి ఆప్యాయంగా నవ్వాడు-సమాధానంగా నవ్వబోయిన నీరజ ప్రభు వెనకనే వస్తోన్న నీలకాంత్ ను చూసి ఆగిపోయింది. అంతవరకూ సహనంతో కూచున్నది, అక్కడ నిలవలేనట్లు వెళ్ళడానికి లేచింది- దారికి అడ్డు తగులుతున్నట్లు గుమ్మానికి చేతులానించి నిలబడ్డాడు నీలకాంత్. నీరజ ముఖం లోకిచూస్తూ నవ్వాడు-నించున్న నీరజ మళ్ళీ కూలబడింది-
    
                                            *    *    *
    
    "కంగ్రాట్యులేషన్స్ నీరజా! గూండాల చేతుల్లో పడికూడా తప్పించుకుని బయటపడ్డావు..."
    నవ్వుతూ అన్నాడు నీలకాంత్.
    పాలిపోయిన నీరజ ముఖంచూసి జాలిపడ్డాడు ప్రభు.
    "ఫర్ గెట్ ఇట్ నీలకాంత్?" అన్నాడు కటువుగా.
    "ఏం? నేను అన్నదాట్లో తప్పు ఏముందీ?"
    "తప్పు ఉందనికాదు - ఎందుకు అనవసరంగా మనసుకు కష్టం కలిగించేవిషయాలు కెలుక్కోవటం?"
    "నో! నో! ఇందులో కష్టపెట్టుకోవలసింది ఏమీలేదు."
    "నీరజా! ఆ గూండా లెవరో నీకేమీ తెలియదా? డర్టీ రోగ్స్! వాళ్ళను శిక్షించకుండా వదిలిపెట్టకూడదు..." నీరజ చివ్వున తలెత్తింది - ఎర్రబారిన కళ్ళు నిప్పురవ్వలను చిమ్మాయి - అంతసెగకూ తట్టుకుని నిర్లక్ష్యంగా నవ్వాడు నీలకాంత్.
    "ఇంతవరకూ జరిగిందీ జరగబోయేదానితో పోలిస్తే చాలా అల్పం నీరజా! నువ్వు ఆ గూండాలా చేతుల్లోంచి బయట పడినా, ఈ సమాజం నిన్ను మళ్ళీ వాళ్ళ దగ్గిరకు....ఇంకా అంతకంటే నీచుల దగ్గిరకు తరమక మానదు..."
    'నీలకాంత్?" ప్రభు అసహనంతో అడ్డుతగిలాడు-
    "సమాజమంటే అమ్మలక్కలు, స్వార్ధపరులు మాత్రమే కాదు - నువ్వూ, నేనూ కూడా ఉన్నాం...మన అండ ఉన్నంత వరకూ నీరజకు భయంలేదు !"
    "అవుననుకో! కానీ ఒక్క విషయం అర్ధంచేసుకో! అసలు మూఢత్వమే ప్రమాదకరమైనది....అందులో సామూహికమైన మూఢత్వం మరింత పట్టపగ్గాలు లేనిది! ఫరవాలేదు నీరజా! ఏ క్షణంలోనయినా నేను నీకు సహాయం చెయ్యటానికి సిద్దంగా ఉంటాను."
    ఆడపులిలా చూసింది నీరజ-
    "నీ సహాయం కోరే దుర్దశ నాకు కలిగిననాడు...నాకు సహాయం చెయ్యటానికి నువ్వు బ్రతికి ఉండవు."
    "నీరజా?" వారిస్తున్నట్లు అన్నాడు ప్రభు....నీలకాంత్ స్నేహంగా ప్రభుభుజంమీద చేత్తో పట్టి "పోనీలే ప్రభూ! నీరజ నన్ను అర్ధంచేసుకునే రోజు రాకపోదు. అప్పటి వరకూ నేను శాంతంగా ఎదురుచూడగలను. ఇప్పుడు నేను మీ మధ్య ఉండటం మంచిది కాదు - వస్తాను -" అని నవ్వుతూనే వెళ్ళిపోయాడు.




Related Novels


Tapasvi

Neeraja

Gullo Velasina Devathalu

Nisabdha Sangeetham

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.