Home » History » Diviseema Uppena 1977


   
    నాయుడు సముద్రలంక            నాలి గ్రామము
    వయస్సు 25 సం.

                    
    
    "పూజకొలదీ పురుషుడు, దానంకొలదీ బిడ్డలంటారు." యిది నా విషయంలో అక్షరాలా నిజమను కొన్నాను. ప్రాణానికి ప్రాణమిచ్చే భర్త, చందమామల్లా అందమైన నలుగురు పిల్లలు, పొట్టకు కొరతలేని సంసారం యివన్నీ నాకు ఆనంద దాయకంగానే వున్నాయి. నా నల్గురు పిల్లలలో బాబు పెద్దవాడు, అతనికి పది సంవత్సరాలు. మిగిలిన ముగ్గురు ఆడపిల్లలు. వీళ్ళంతా చిన్నవాళ్ళు.
    
    ఆరోజు శనివారం. నేను అప్పుడప్పుడు శనివారం చేస్తుంటాను అదే ప్రకారం ఆ రోజు శనివారం చేశాను. దీపారాధన చేసి స్వామికి దణ్ణం పెట్టుకొన్నాను. అన్నం వండి పిల్లలకు వడ్డించాను. గాలి చాలా తీవ్రంగా వీచుతూవుంది. దీప మారిపోయింది. పిల్లలు కంగారు పడి ఏడుస్తున్నారు వాళ్ళెవరూ భోజనం చేయలేదు. గాలి మరీ ఎక్కువయింది. గోడలు వూగుతున్నాయి. పై కప్పు అంతా పోయింది. మాకుకూడ భయమేసి కంగారు పడుతున్నాము. నాకసలే భయం మా వారు మాత్రం కాస్త ధైర్యంగానే వున్నారు మాకు ధైర్యంచెప్పి ఓదార్చే మా మామగారు ఆ రోజు యింటి వద్దలేరు. అది మా దురదృష్టం, అత్తయ్య వున్నారు. ఆమె మరో యింటిలో వుంది. మా వద్దకు రాలేక పోయింది. మేముకూడ అచ్చటికి వెళ్ళలేక పోయాము. గాలి చాలా తీవ్ర రూపం దాల్చింది. పిల్లలు మమ్మల్ని కౌగలించుకొని ఏడ్వటం మొదలుపెట్టినారు. వండిన అన్నం వాన పాలయింది. మేమెవ్వరమూ భోజనమే చెయ్యలేదు. ఆకలితో పసిపిల్ల తల్లడిల్లి పోతోంది భయంతో మిగిలిన వారంతా ఏడుస్తున్నారు. మేము మా యింట్లో వుంటే చచ్చిపోతామనిపించింది. మాకు దగ్గరలోనా పెదమామగారైన నాయ్డు లక్ష్మయ్యగారిల్లుంది. మేమా యింటిలోకి వెళ్ళాము. అప్పటికే అక్కడ ఐదుకుటుంబాల వారున్నారు. మేమంతా ఆ యింటిలోనే వున్నాము. శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటింది. గాలి ఎంతో వేగంగా వీస్తోంది. మేమున్న యింటి కప్పు లేచిపోవటం మొదలుపెట్టింది. మగ వారంతా మోకు లతో ఇంటి కప్పును బిగించి కడుతున్నారు. తలుపులు ఆగుటలేదు. గాలికి యిల్లంతా వూగుతోంది. భయంతో అందరూ ఏడుస్తున్నారు. ఇంటికప్పునుండి వాన పడుతూవుంది. మేముబాగా తడిసిపోయాము. ఇంట్లో వారంతా ఏదో వింతగా చెప్పుకుంటున్నారు. ఏమిటి? అని వాళ్ళను అడిగాను. ఉప్పు నీటి వానకురుస్తోంది. యిదిగో యీ నీళ్ళు చూడ మంది ఒకావిడ నేను ఆ నీరు రుచిచూశాను నిజంగా ఉప్పు నీళ్ళే. మేమంతా విస్తుపోయి యీ వింతను గూర్చి చెప్పుకొంటున్నాము. మేమున్న యింటిలోనే ఒక ముసలాయనున్నారు. ఆయనకు సరిగా కళ్ళు కనబడవు. మా గొడవంతా ఆయన విన్నారు. వాన యెటునుండి వస్తోంది చూడమనికేక వేశారు. ఎటునుంచి వస్తే నీకెందుకు? మెదలక పడివుండమని ఒకతను గద్దించాడు. అంతటితో ఆ వృద్దుడు వూరుకోలేదు. ఉప్పెన వచ్చేటట్టుంది. మీరంతా జాగ్రత్త పడండని మరల కేక వేశారు. మేమా కేకల్ని పట్టించుకోలేదు. ముసలివాని మాటల కేమిలే అనుకొన్నాము.
    
    ఆ రోజు సాయంత్రం 3 గంటలు దాటింది. ఆకాశమంతా కావురుకమ్మింది. యిల్లంతా చీకటి మయమయింది. యింట్లో వాన నీళ్ళు చీలమండలోతు పడ్డాయి. నిలబడలేక నేనా నీళ్ళలోనే చతికిల పడ్డాను. పసిపిల్ల చంకలోవుంది. రెండవ పిల్లను చేతిలో పట్టుకొన్నాను బాబు, పెద్దమ్మాయి వాళ్ళ నాన్న వద్దయున్నారు. సముద్రం పెద్ద పెట్టున ఘోష పెడుతోంది. ఆ ఘోష మా వూళ్ళోకి పెడుతూన్నట్టుంది ప్రళయకాలం యిదే అన్నట్టుంది. మాకెంతో భయమేసింది. కొందరు భజనలు చేస్తున్నారు. మరికొందరు ఏవో దండకాలు చదువుతున్నారు. ఏమి చదివినా ఏమి ప్రయోజనం? ఉప్పు నీటివాగ మా యింటిలోకి రానే వచ్చింది జనమంతా పెద్ద పెట్టున కేకలేసి ఏడ్వటం మొదలు పెట్టారు. కొందరు యింటి అరవమీదకి ఎక్కారు. మరి కొందరు త్రొక్కిసలాటలో చిక్కుకుపోయారు. పైనున్న వారు క్రింద వారిని ఒక్కొక్కరిని పైకి లాక్కొంటున్నారు. ఆజన సమూహంలో ఎవరెక్కడ వున్నదీ తెలియలేదు. అరవమీదనుంచి మా వారు నన్ను పిలిచారు. నేను పలికాను కాని, మా వారి వద్దకు వెళ్ళలేక పోయాను. నాకప్పటికే నీరు కంఠంలోతు వచ్చాయి. మాలో సగం మంది కూడ పైకి వెళ్ళలేకపోయాము. చంకలో పిల్లను ఏమి చేయాలో తెలియలేదు? పిల్ల నీటిలో మునిగివుంది నేనొక చేతితో పిల్లను, మరొక చేతితో అరపను పట్టుకొన్నాను. పిల్ల నా చంకలో తన్నుకొంటోంది. ఇంటిగోడలు కూలి పోయాయి. ఇల్లంతా ఒకేసారి సుడి తిరిగింది. నీళ్ళమీదతేలి వెళ్ళిపోతోంది. నేను మాత్రం అరపను పట్టుకొనే వున్నాను. అరపమీది జనం త్రోక్కిసలాట ఎక్కువయింది. అదికాస్తా విరిగిపోయింది. పై జనం ఎక్కడి వాళ్ళక్కడ పడిపోయారు. కొంత మంది తెప్పరించుకుని యింటి పైకి ప్రాకుతున్నారు. నా పెద్ద పిల్ల నీళ్ళలో పడిపోయి, గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతోంది. ఒక్కొక్కసారి నీళ్ళ పైకి తేలుతోంది. అమ్మా! నాన్నా! నేను చచ్చిపోతున్నా! నన్ను పట్టుకోండి. నన్ను పట్టుకోండి. అని కేకలు పెడుతూ ఏడుస్తోంది. నాగుండె బ్రద్దలైపోయింది. ఏమీ చేయను? పాపిష్టిదాన్ని. నా బిడ్డ చావు కళ్ళారా చూచి కూడా కాపాడుకోలేని నిర్భాగ్యురాలిని.
    
    నేను పట్టుకొన్న యిల్లుకొట్టుకు పోతోంది. నేను నీళ్ళలో వేళ్ళాడుతూ పోతున్నా. ఒక్కొక్కసారి ముళ్ళ చెట్లు పట్టుకొని వళ్ళంతా చీల్చేస్తున్నవి, బట్టలూడిపోయాయి. ఇల్లు సుడి తిరుగుతూ పోతోంది. కొంతదూరం పోయేటప్పటికి నా చేయి పట్టుకొని యెవరో యింటి మీదకు లాగేసుకొన్నారు. ఆయన వంకతేరిపార జూశాను. ఆయన వాటిపల్లి చెంచురామయ్య. ఆయన చలివేసి వణికిపోతున్నాడు నన్ను కాపాడాడు కాని, తాను మాత్రం కాలుజారి వాగల్లో పడికొట్టుకుపోయాడు. నన్ను కాపాడిన దానికి పుణ్యానికి పోతే పాపమెదురైనట్లు ఆయన తన పాణాల్నే పోగొట్టుకొన్నాడు.
    
    నా తెప్పకొట్టుకపోతూనే వుంది. చంకలోని పిల్ల బిగుసుకపోయింది. కొంచెం తెప్పరించుకొని పిల్లవంక చూశాను. చంటిది చచ్చిపోయింది. చంకను కరుచుకపోయింది. బలవంతాన లాగి చూశాను. కన్నీళ్ళు పెట్టుకొన్నాను. అయినా చుట్టూవున్న నీళ్ళలో నా కన్నీరెంత? నా బిడ్డ శవాన్ని వాగాల్లో వదిలేశాను ఏ తల్లీ చేయనంత ఘోరాన్ని నేనే చేశాననిపించింది. నేను చూస్తుండగా యెంతోమంది చనిపోతున్నారు. నా వాళ్ళెవరూ కనిపించుటలేదు. అసలా తెప్పమీద ఎవరెచ్చటున్నారో తెలియదు. మా తెప్ప మహా వేగంగా పోతోంది. ఒక్కొక్కసారి తల క్రిందులవుతోంది. ఎత్తాంటి చెట్లకు తగిలినప్పుడు కొంచెంసేపాగుతుంది. అప్పుడేమా ప్రాణాలను నిలువునా తీసేస్తుంది.
    
    ఎటుచూచినావాగలే! అదంతా సముద్రంలాగుంది. మేము భూమి మీద పోతున్నామో! సముద్రం మీద పోతున్నామో తెలియదు. వగలు పెద్ద పెట్టున వస్తున్నవి. నా కళ్ళు చూడనివ్వటంలా! ఒక చెట్టుకు కొట్టుకొని మా తెప్ప చిందర వందరయింది. మేమున్న తెప్పముక్కలు ముక్కలుగా విడిపోయింది. నేను నీళ్ళలో మునిగిపోయా నాకు యీతరాదు. ఒక్కొక్కసారి పైకి తేలుతున్నా! చేతులతో నీళ్ళ మీద కొట్టుకొంటున్నా ఎవరో ఒకామె చేతులు పట్టుకొని నన్ను తన తెప్ప మీదకు లాగుతున్నది. కళ్ళు తెరచి ఆమె ఎవరో కాదు. నాఅత్త గారు. నన్నెప్పుడు పల్లెత్తి మారాడని తల్లి. కన్నతల్లిని మురిపించిన బంగారు తల్లి. ప్రాణాపాయ సమయంలో నన్ను రక్షించింది. నిజంగా యీమె నా పాలిట దేవత. ఒక్కసారి నా మనసు పొంగింది. అత్తయ్యా! అని ఆమెనొక చేత్తో పట్టుకున్నా. నీవే నా అమ్మా అని ఆమె నా తలనిమిరింది. ఒకరినొకరు మా కడుపులోని వ్యథను చెప్పుకుందామనుకొన్నాము. కాని వ్యవధిలేదు అత్తయ్య చాలా నీరసంగా వుంది. ఆమెకు నేను ప్రత్యుపకారం యేమి చేయగలను? ఎవరికీ యేమేమి చేయాలో అన్నీ ఆ సముద్రుడే చేస్తున్నాడు.
    
    మా తెప్ప మీద యెవరో మనుష్యులున్నారు. వారెవరయింది తెలియటంలా. అత్తయ్యను పిలిచాను. ఆమె పలకలా. చలివేసి వణికిపోతోంది. అంకిళ్ళు గిట్టు కొన్నట్టున్నాయి. మా తెప్పకొక తాడి చివర తగిలింది. తెప్పను చెట్టుకేసి వాగలు బాదేస్తున్నాయ్. తెప్పమీద కూర్చోలేకపోతున్నాము. పెద్దవాగా వచ్చి మా తెప్ప నా చెట్టుకేసి బాదింది. నా చేతులు పట్టుతప్పాయి. అప్రయత్నంగా యెగిరి తాడిని కావిటించుకొన్నా అత్తయ్య నీళ్ళలో పడిపోయింది. వాగలో కొట్టుకపోయింది. తెప్పకూడా కొట్టుకపోయింది. అత్తయ్య బ్రతుకంతమయింది.
    
    వాలుకు తెప్పవాగలు చూడనివ్వటంలా వళ్ళంతా మంటెత్తిపోతోంది. కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. కళ్ళు చింతనిప్పుల్లా యెర్రగా వున్నాయి. గాలికి చెట్టంతా వూగిపోతోంది. ఒక్కొక్క సారి వాగలు నా మీదుగ పోతున్నాయ్. చెట్టు మీద నేను నిలబడలేకపోతున్నాను. మరల మరో వాగ వచ్చింది. నేను నీళ్ళలో పడి పోయా. ప్రాణాలమీద ఆశతో చిట్టచివరి ప్రయత్నం చేస్తున్నా! నీళ్ళలో కొట్టుకొంటున్నా.
    
    నా ప్రక్కనుంచి ఒక యెద్దు పోతోంది అది నీళ్ళ మీద తేలి వెళ్ళుతోంది, దాని తోక నాకు దొరికింది. అది అంబా అని అరిచే టట్టులేదు. నేను అమ్మా అని అరచినా నామొరాలించే వాళ్ళు లేరు. నేనొక్కదాన్నే ఏ కాకిగాపోతున్నా. ఈ ఎద్దు కళేబరం నా కాధారమయింది. ఇది కూడా యెప్పుడు పోతుందో తెలియదు. నేనేమైపోతాను. చూస్తుండగానే నేనూ ఆ ఎద్దు ఒక తెప్పకు తాకాము. దానిమీద ఎవరో వున్నట్టున్నారు. నన్ను లాగి తెప్పమీద వేసుకున్నారు. నా వంటిమీద బట్టలు లేవు. ఆయనకు కూడా బట్టలు లేవు. డ్రాయరు మాత్రమే వుంది, నన్ను చూచి ఆయన గావురుమన్నారు. అది నా భర్త కంఠం. నాకు దుఃఖమాగలేదు. బోరున యేడ్చాను. ఆయన నన్ను కావటించుకొన్నారు. ఈ సముద్ర ఘోషలో మా యేడుపు యెంత ఏడ్చినా యెవరికి జాలి?

    ఆయనొకచేత్తోనన్ను పట్టుకొన్నారు. మరోచేత్తో తెప్పనుపట్టుకొన్నారు. తెప్ప మహావేగంగా పోతోంది. ఇప్పటికి మా వూరునుంచి చాలాదూరం వచ్చాము. ఎటుపోతున్నామో ఎక్కడికిపోతున్నామో తెలియదు. బట్టలు లేకుండా మోడులాగున్న నన్నుజూచి, మావారు బాధపడ్డారు. పిల్లలంతా పోయారు అత్తగారు పోయిందని నేను ఏడుస్తున్నా! ఎందుకేడుస్తావు? మనమైనా బ్రతుకుతామనే నమ్మకముందా? అని ఆయనన్నారు. ఏమో నేను బ్రతుకుతాననే నమ్మకంలేదు. మీరైనా జాగ్రత్తగా యెక్కడికైనా జేరండి. అని అంటుండగానే ఆయన నోటిమీద చెయ్యివేశారు. నీవామాటనొద్దు. నా ప్రాణమున్నంత వరకు నిన్ను కాపాడుతా! నీకేమి ఫరవాలా! అన్నారాయన. ఈమాట విన్నాడేమో? సముద్రుడు ఆకాశాన్నికప్పి అమాంతం మామీద పడ్డాడు. ఆ సముద్రుని వికటాట్టహాసానికి మా తెప్ప రెండుగా చీలిపోయింది. నాభర్తా, నేనూ చెరో తెప్ప పట్టుకొన్నాము. మేము చెరొకవైపు పోతున్నాము ఏమండీ! ఏమండీ! మీరేదైనాచెట్టును పట్టుకోండి. మీరైనా బ్రతకండి. అని నేను కేకలేస్తున్నా. ఆయనా కేకలేస్తున్నారు. అవి యేమిటో నాకు వినపడుటలేదు. ఒకటి మాత్రం వినపడింది. ఇవే కడసారి చూపులేమో! నీవైనా జాగ్రత్త అనేది, ఆయనగారన్నంత జరిగింది. ఆ తెప్ప నీళ్ళలో మునిగిపోయింది. ఆయన కూడా మునిగిపోయారు. కడలి గర్భంలో కలిసిపోయారు:

    నేనొక్కదాన్నే నా తెప్పమీద పోతున్నా. నా వాళ్ళంతా పోయారు. నేనెందుకు బ్రతకటం? అని నీళ్ళలో పడబోయా. నా ప్రక్కనుంచే ఒక తెప్పకొట్టుకపోతోంది. దాని మీద యెవరో పిల్ల వాడు యేడుస్తూ పోతున్నాడు. ఎవరివయ్యా; నీవని కేకేశా. నాకేక విని అమ్మా! అని కేకేశాడు ఆ బిడ్డ. అతను యెవరో కాదు. నాబిడ్డే. అల్లారు ముద్దుగా పెంచుకున్న నాకొడుకును ఇప్పుడీ మృత్యుముఖంలో చూడవలశి వచ్చింది. నీవా తెప్పను వదిలి పెట్టవద్దు. గట్టిగా పట్టుకొని కూర్చో. అనికేకేశా. నా బిడ్డ ఆ తెప్పమీద కూర్చోలేక పోతున్నాడు. వంటిమీద బట్టలన్నీ పోయాయి. చలికి వణికి పోతున్నాడు అమ్మా! నేను పట్టుకోలేనమ్మా! నేను చచ్చిపోతున్నానమ్మా! నన్ను పట్టుకో అమ్మా! అని నా పిల్లవాడు గోల జేసి యేడుస్తున్నాడు. నా గుండెలు బ్రద్దలయిపోయాయి. ఏమి చేయను పాపిష్టిదాన్ని. నాకన్నా దురదృష్టవంతులీ లోకంలో లేరేమో! కనిపించిన భర్త కనుమరుగయ్యారు. చేరి వచ్చిన బిడ్డ చెయి జారి పోతున్నాడు. ఏంచేసేది? ఎంత గుండెలు బాదుకున్నాయేమి ప్రయోజనం? ఎంతయేడ్చినా యెవరికి జాలి?
    
    బాబున్న తెప్పనా నుంచి కొంత దూరంపోయింది. నా తెప్ప కూడా కొట్టుకపోతూనే వుంది. బాబు యేడుస్తున్నాడు. నేను నిలబడలేను పడిపోతున్నా అమ్మా! నన్ను పట్టుకో! అమ్మా! నన్ను పట్టుకో! అమ్మా! అని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. నాగుండెను బాదుకొంటూ బాబూ! బాబూ! అని అరచాను. ఇంకెక్కడి బాబు? బాబు? నీళ్ళలో పడిపోయాడు. తెప్పకొట్టుక పోయింది. బాబును నోటకరచుకొని సముద్రుడు వెళ్ళిపోయాడు.
    
    నా కంతా అయోమయంలాగుంది. బ్రతుకు మీద ఆశవదులుకున్నా. నా వాళ్ళంతా పోయారు. నేను బ్రతికి మాత్రంయేమి ప్రయోజనం? నేనెవరికొరకు బ్రతకాలి? నాగుండె బరు వెక్కి పోతోంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయ్. ఆయాసం వస్తోంది. కాళ్ళుచేతులు, కొంకర్లుపోతున్నాయ్, నాకుస్పృహతప్పింది. ఆ తెప్పమీద పడిపోయాను.
    
    తరువాత యేమి జరిగిందో నాకు తెలియదు, నాకు స్పృహ తెలిసే సరికి యెవరివో మాటలు వినపడుతున్నాయి. కళ్ళెత్తి చూడనివ్వటంలా. నాకాళ్ళూ, చేతులు యెవరో రుద్దుతున్నారు. కొంచెం కళ్ళూ తెరిచా. నా చుట్టూ జనమే, నా మీద యెవరిదో పై పంచికప్పారు. అది మా వూరుకాదు. నేనొక చెరువు కట్ట మీద పడుకోపెట్టబడియున్నాను ఆ వూరు చోడవరం, అక్కడ నుండి మా వూరు 6 కిలో మీటర్ల దూరం వుంటుంది. ప్రొద్దు బాగా యెక్కింది. వాళ్ళొక కొబ్బరి బొండాము తెచ్చి నా నోరు తడిపారు. చలిమంటలు వేస్తున్నారు. వీళ్ళంతా పోయిన సామాన్లు వెతుకుతుంటే! నేనీ చెరువులో కనపడ్డానంట. వాళ్ళు నీదే వూరని నన్నడిగారు. నాది 'నాలి' అని చెప్పాను. వాళ్ళంతా కన్నీళ్ళు పెట్టారు.
    
    పొద్దు చాలా యెక్కింది. నేను నా వాళ్ళని తలచుకొని యేడుస్తున్నా! నన్ను మాగ్రామానికి పంపమని వారిని కోరుకున్నా! దిగువ గ్రామాల వాళ్ళంతా నాగాయలంక వస్తున్నారు. నిన్నక్కడికి చేర్చేస్తామన్నారు. తరువాత నన్ను నాగాయలంకకు చేర్చారు. మా వాళ్ళెవరూ నాకక్కడ కనిపించలేదు కొన్నాళ్ళ తరువాత నేను మాగ్రామానికి వెళ్ళాను. నాకక్కడ నిలువనీడ లేకుండా పోయింది. నేను పుట్టిన వూరయిన గుల్లలమోదకు వెళ్ళుదామని పించింది. మా పుట్టింటి వాళ్ళంతా ఉప్పెనలో అన్ని విధాలా దెబ్బతినిపోయారు. నన్ను పోషించే స్థితిలో లేరు నాకేమిటి? నేనేమి కావాలి? దిక్కులేని పక్షిలాగయింది నా బ్రతుకు. మతి చెడిన మనిషిలా తిరుగుచున్నాను.
    
    ప్రాణానికి ప్రాణంగా చూచుకొనే భర్తపోయారు. ఆప్యాయతగా అమ్మా! అని పిలిచే పిల్లలు పోయారు. మాటకు మంచికి కట్టుపడేవారు నా మామయ్య; ఆయనే నాయుడు చంద్రయ్య. ఆయనిప్పుడేమి చేయలేని నిస్సహాయస్థితిలో వున్నారు. నేనేమి చేసేది? నా దురదృష్టానికి నేను బలియైపోయి ఒక పిచ్చిదానిలా తిరుగుచున్నాను. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కన్నట్లు, వల్లభుని నాగేశ్వరరావుగారు నన్నాదుకొన్నారు. మోడువారిన నా జీవితానికి పచ్చదనాన్ని ప్రసాదించారు. ఆయన అండదండలలో నేనిప్పుడు సొర్లగొందిలో వుంటున్నాను. పాతకథల్ని మరువలేక, క్రొత్తదనానికి తలొగ్గలేక సతమతమగుచున్నాను.                               




Related Novels


Diviseema Uppena 1977

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.