Home » Dr C ANANDA RAMAM » Gullo Velasina Devathalu


 

          


    నవ్వుతోనే బెదిరించింది పావని...
    పోనీ, నాలుగురోజులైనా ఫరవాలేదు. వదిన చండశాసనం లేకుండా...హుషారుగా వెళ్ళిపోయాడు రవి.
    అనుపమ మాత్రం దిగులుగా "నువ్వు లేకపోతే నాకు తోచదు వదినా?" అంది.
    ఆ మాట నిజమని పావనికీ తెలుసు....అందుకే అనుపమ మూడ్స్ మార్చాలని పరిహాసంగా        "రేపు పొద్దున్న పెళ్ళయితే పారిపోవూ ఇక్కడ్నుంచి?" అంది. అనుపమ నవ్వి "పో, వదినా పెళ్ళయినా, నీ దగ్గరికే వచ్చేస్తాను" అంది.
    "వద్దు తల్లీ హాస్యంగా నయినా అంత మాట అనకు"
    "భలేదానివి వదినా నా సంగతి నీకు తెలియదూ అలాంటి సాహసాలు నేను చెయ్యగలనా"
    వదిన సర్దుకొంటూంటే కూడా ఉండి సాయంచెయ్యసాగింది అనుపమ.
    "ఏమిటో ఎక్కడాలేని విడ్డూరాలు ఇలాంటి అప్రాచ్యపు గోలలన్నీ మా ఇంటిమీదకే రావాలీ? ఏదో సంప్రదాయంగల కుటుంబమని చేసుకుంటే..."
    ఏదో సణుగుతూనే ఉంది పద్మావతి లోపలినుంచి...పావని దేనికీ సమాదానం చెప్పలేదు.
    పద్మావతి నాలుగు ఊరగాయసీసాలు తెచ్చి పావని ముందు పెట్టింది.
    "ఇవి నాలుగు రకాల ఊరగాయలు.  సరళకు ఊరగాయలంటే ప్రాణం. పాపం, ఏ స్థితిలో ఉందో, తీసికెళ్ళు."
    అనుపమ తలవంచుకుని తల్లికి కనపదకుండా పావనిని చూసి నవ్వింది...పావని మాత్రం బుద్దిగా "అలాగే అత్తయ్యా" అని ఆ సీసాలు బేగ్ లో సర్దుకుంది.
    "ఇలా చూడు నువ్వక్కడ ఎక్కువరోజులు ఉండిపోకు. వెంటనే వచ్చెయ్యి. నువ్వు లేకపోతే, ఈ ఇల్లు ఒక్క క్షణం గడవదు. నా వల్ల కాదు."
    "అలాగే"
    "పోనీ, నన్నూ రమ్మంటావా?"
    కంగారుపడింది పావని. "ఎందుకత్తయ్యా ఫరవాలేదు. నేను త్వరలో వస్తాను."
    "అది కాదే అక్కడ సరళ ఏ స్థితిలో ఉందో? దాన్ని చూసి నువ్వేమయిపోతావో, అదీ నా బెంగ"
    అత్తగారి అభిమానానికి మనసు కరిగిపోయింది పావనికి....ఆవిడకు ఎంత చాదస్తమో అంత మంచి మనసు. అందుకే ఆవిణ్ణి గౌరవిస్తూ ఆ చాదస్తాన్ని భరించగలుగుతోంది.
    విఠల్ టాక్సీ తీసుకొచ్చాడు. అత్తగారికి నమస్కారంచేసి వెంకట్రావుతో భయంగా "వెళ్తున్నాన"ని చెప్పి, గుమ్మంలో నిలబడ్డ అనుపమకు చెయ్యి ఊపి బయలుదేరింది పావని...
    
                                                 2
    
    ధన్ ధన్ మని చప్పుడుచేస్తూ పరుగెడుతోన్న రైలు చక్రాలు తన మనసు మీదనుంచే పరుగెడుతున్నంత క్షోభతో ఉంది పావనికి సరళణు తలుచుకోగానే...
    రామాపురానికి మకుటంలేని మహారాజు జగన్నాథంగారి కూతురు సరళ. ఈనాటికి ఇలాంటి దీన పరిస్థితిలో చిక్కుకుంటుందని ఎవరూహించగలరు?
    పావనిని అర్జంటుగా తీసుకురమ్మని మనిషిని పంపాడు జగన్నాథం. కంగారుపడుతూ బయలుదేరింది పావని...
    పావని రాగానే తల్లి సుందరమ్మ పావనిని కౌగలించుకుని బావురుమని ఏడ్చింది.
    "ఏం జరిగిందమ్మా! అంతా కులాసాగా ఉన్నారా?" ఏదీ అర్ధంకాక ఆందోళనగా అడిగింది...
    "ఏం చెప్పమంటావే నీ చెల్లెలు ఆ హరిజనుడ్ని చేసుకుంటానని కూచుంది. ఈ ఊళ్ళో ఇంక తలెత్తుకు బ్రతకగలమా?-చెప్పు....
    విషయం అర్ధమయింది పావనికి-సరళ హరిబాబును చేసుకుంటానని ఇంట్లో చెప్పి ఉంటుంది. ఈ విషయం తల్లిదండ్రులకు కలిగించినంత ఆశ్చర్యం పావనికి కలిగించలేదు.
    రామాపురం పల్లెటూరయినా ఆ ఊళ్ళో చాలామంది టౌన్ కి వెళ్ళి చదువు కునేవారు. యెల్లయ్యకూడా కష్టపడి కడుపుకట్టుకుని తన కొడుకు హరిబాబును చదివించాడు. హరిబాబు కులానికి హరిజనుడయినా చూడటనికి బాగుంటాడు. తెలివయినవాడు. ఒకే ఊరివాళ్ళు కావటంతో సహజంగా సరళా హరిబాబుల మధ్య చనువు ఏర్పడింది. హరిబాబుణు సరళ ప్రేమించటంలో విడ్డూరమేమీ కనిపించలేదు పావనికి. కానీ, ఆమాట ఏదో ఘోరం జరిగిపోయినట్లు గోలపెడుతున్న తల్లిదండ్రుల ముందు అనలేకపోయింది.
    "ఎలాగైనా డానికి నచ్చజెప్పవే" అంది తల్లి.
    సరళ పేరుకుమాత్రమే సరళ...మహా మొండిది పావనిని నోరెత్తనియ్యకుండా తనే మొదలుపెట్టింది.
    "ఈ అన్యాయం చూడక్కయ్యా నేనేం తప్పుచేసాను? అందమైనవాడు. మంచివాడు చదువుకున్నవాడు ....అలాంటివాణ్ని చేసుకుంటానంటే కులాల ప్రస్తావన తెచ్చి కాదంటారు కులంట, కులం ఎక్కడుంది కులం? మొన్న ఎవరో ఆఫీసర్ వస్తే ఆయన యానాదివాడని తెలిసీ నాన్న నెత్తిన పెట్టుకుని ఇంట్లో సకలమర్యాదలూ చెయ్యలేదూ? అప్పుడేమయిపోయింది ఈ కులం? ఎల్లయ్య బీదవాడు కావటంతో, తన కళ్ళముందు కూలిపనిచేసుకుంటూ కనిపించటంతో కులం సంగతి గుర్తుకొచ్చింది. నేను హరిబాబునే చేసుకుంటాను. ఏంచేస్తారేం? ఆస్తిలో భాగం ఇయ్యనంటారు. అంతేగా..."
    పావని నోరు మెదపలేకపోయింది. సరళా హరిబాబులు ఈడూ జోడూ చాలా బాగుంటారు. పోనీ, ఈ పెళ్ళి జరిగితేనేం?
    జంకుతూనే తల్లితో అంది...
    "పోనీ, సరళ కోరినట్లే చెయ్యకూడదమ్మా! హరిబాబుకేం తక్కువయింది?"
    సుందరమ్మ గుండె బాదుకుని, "నీక్కూడా మతిపోయిందా ఏమిటే? దాని కేదో నచ్చజెపుతావని పితిస్తే...ఆయన ఎవరికైనా బతకనిస్తారా?" అంది....
    "ఛీ? ఛీ! నాకూతురు ఆ హరిజన కొడుకుని పెళ్ళిచేసుకుందని నలుగురికీ, ఎలా చెప్పుకోను? మళ్ళీ నలుగురిలో ఎలా తలెత్తుకుని తిరగను?"
    రంకెలు వేశాడు జగన్నాథం. ఆయనకు ప్రధానంగా కావలసింది నలుగురిలో తలెత్తుకోవటం...'
    పావని సరళకే నచ్చజెప్పటానికి ప్రయత్నించింది...
    "పోనీ, సరళా! నువ్వే మనసు మార్చుకోరాదూ? ఎంత గొడవ జరుగుతోందో చూస్తున్నావుగా..."
    సరళ పావనిని విచిత్రంగా చూసింది.
    "అక్కయ్యా! నువ్వు...ఎం.ఏ పాసయి లెక్చరర్ గా పనిచేస్తున్న నువ్వు....నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావా? నిష్కారణంగా నా మనసు చంపుకోవాలా? ఎందుకూ? గొడవలు జరుగుతాయనా? నేను నిజంగా న్యాయమని నమ్మినదానికోసం ఈ మాత్రం ఎదుర్కోలేనా? పిరికిదానిలా అయినదానికీ, కానిదానికీ తలవంచి బ్రతుకంతా జీవచ్చవంలా గడపమంటావా?"
    తనకంటే ఎంతో చిన్నదయిన సరళ ఎంతో ఎదిగిపోయి కనిపించింది పావనికి. చదువు పూర్తికాగానే తండ్రి కుదిర్చిన సంబంధం చేసుకుని భర్తను ప్రేమిస్తూ సంసార పక్షంగా అత్తింట్లో కలిసిపోయిన పావనికి సరళ కొత్తగా, వింతగా ఉంది. అయినా సరళ మాటల్లో నిజాలను పావని విజ్ఞానం కాదనలేక పోతోంది.
    సరళను ఏ విధంగానూ లొంగదీసుకోలేనని అర్ధమయింది జగన్నాధానికి. పట్టుదల హెచ్చింది. మాలగూడెంలో పెద్దల కబురుపెట్టాడు. పరుగుపరుగున వచ్చారు వాళ్ళు "దండాలు దొరా?" అంటూ.
    "ఏరా? పెద్ద మొనగాళ్ళైపోతున్నారు. మా యింటి పిల్లనే పెళ్ళిచేసుకుంటారా?"
    "అదేంటి దొరా మీ పిల్లను మేమేడ భరిస్తాం! మాకెందుకీ బెడద..."
    భయపడిపోతున్నారు అప్పుడే ఏం జరిగిందో అని.
    "ఊ?...మీ యెల్లయ్య కొడుకు హరిబాబు సంగతి చూడండి చదువుకున్నానని కళ్ళు నెత్తిమీద కొచ్చినయ్! వెంటనే కులం పిల్లతో పెళ్ళిచేసెయ్యండి. లేకపోతే మర్యాద దక్కదు."




Related Novels


Tapasvi

Neeraja

Gullo Velasina Devathalu

Nisabdha Sangeetham

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.