Home » Sree Sree » Srisri Kathalu



    మన్మథునికుద్యోగ మూడిపోయెనను చింత యావంతయు లేకపోయెను. తన తలనుండి యొక పెద్ద బరుపూడినదనియు నుద్యోగ కారణమున చిత్తము వచ్చినపుడానంద భవనమునకేగ వీలులేకపోయినదనియు నివుడా చిక్కు తొలగిన దనియు నతడు మీదు మిక్కిలి సంతసించెను.
    దైవానుగ్రహమువలన నచిరకాలములో నతని వ్యాధి నిమ్మళించెను. మరికొన్నాళ్ళ కాతడు పూర్తిగా నారోగ్యవంతుడయ్యెను. కాని వైద్యులు త్రాగుత మానుమన్నను లక్ష్యపెట్టక మన్మథుడు తొల్లిటి కంటే నధికముగ బానింప దొరకొనియెను.
    
                                   ౪    
    ఒకనాటి మధ్యాహ్నమున నొంటిగంట యగునప్పుడు మన్మథుడు నిజగృహంబున నిద్రించుచుండెను. ఎన్నడునాతనికి పగలు నిద్రించెడు నలవాటు లేదు. కానినాడు భోజనము చేసి శయ్యపై మేనువాల్చునంతనే నిద్రాదేవి యావహించి యతనిని విస్మ్రుతునొనర్చెను. అట్లు నిద్రపోయిన మన్మథరావు సాయంకాలమారు గంటలకు గాని మేలుకొనజాల డయ్యెను. మేలుకొని వేళమించినదని యాశ్చర్యమొందుచు నింకను నిద్రమత్తు పోవనందున మరొక్కమారు శయ్యాగతుడగునంతలో గది గుమ్మముదాటి వచ్చుచున్న మాలతి ప్రత్యక్ష మయ్యెను.
    ఆమె భర్తను గాంచి చిరునవ్వు తోడ సమీపించి మంచమునకు బ్రక్కగల టేబిలునానుకొని నిలువబడియెను. అతడప్పుడానందమందిరమునకు జన నూహించుచుండెను. ఇది గ్రహించి మాలతి సంభాషణలతో నాతని మరపించెను. ప్రియురాలి వాక్యసుధా స్రవంతినిలో మునిగి తేలుచు మన్మథుడు తన్మయుడై పోయెను. అంతట మాలతి "మీరనుదినమును వందలకొలది సీసాల నుత్తవి గావించుచుండ నేను దినముకొక యాలి చిప్పెడు పానీయము నర్ధించిన నపరాథమేమి? ఈ నా చిన్న కోరికనే నిరాకరింతురా" యని నిజమనో మన్మథుడగు మన్మథరావును ప్రశ్నించెను.
    మాలతి కోరిక మన్మథునాశ్చర్యచకితునొనర్చెను. మరుక్షణమున మహానంద సంభరితునొనర్చెను. ఇక నాతడు భార్య కోరికను నిరాకరింప దలంపలేదు! ఆమెకూడ దనతో సమానురాలయ్యెనని సంతృప్తి వహించివెంటనే ధనాగారమును భార్యవశ్య మొనర్చి నీ ఇష్టము వచ్చినట్లు వెచ్చించుకొనుమని పల్కెను. ఇందులకు మాలతి పొందిన యానందమునకు బరిమితి లేకపోయెను.
    అనంతరము మన్మథరావానందమందిరాభిముఖుడై వెడలిపోయెను. అధికానందము తోడ నధికముగ బావించెను.
    
                                   ౫
    
    దినమున కొక రాయి చొప్పున దీసినచో పర్వతములు కూడ దరిగిపోవునందురు. అట్లే నవనిధుల కధిపతియగు కుబేరుని ధనాగారమును కూడా దిన వెచ్చములతోడ దరుగ గొట్టవచ్చును. భార్యాభర్త లవ్వారిగ ధనమును వ్యయమొనర్చుచుండ వారలెంత ధనికులైనను దారిద్ర్యమునకు లోబడ వలసినదే కదా! పాపము మన్మథుని యుద్యోగ మిదివరకే యూడిపోవుటవలన నాదాయము లేదయ్యెను. ఇక దదీయ మద్యపానము నిరాఘాతముగా సాగిపోవుచుండుటవలన వ్యయమధికమగు చుండెను. నాలుగయిదు సంవత్సరములిటులే గడిచి పోయెను. మన్మథుని స్థితి మారుమొగము పట్టెను. దరిద్ర దేవత మెల్లగ వచ్చి యాశ్రయించుచుండెను. ఇంటిలో సంవత్సరముల నుండి కనిపెట్టుకొనియున్న దాసదాసిజను లొక్కరొక్కరే గృహమును వీడిపోవుచుండిరి. మన్మథరావు వారిజీతము వారల కిచ్చి సాగనంపుసరికి యజ్ఞము చేసినట్లయ్యెను. ఆనందమందిరమునుండి యనేక పర్యాయములు బాకీధనముకై పత్రికలు వచ్చుచుండెను. పాపము గొప్పబ్రదుకు బ్రతికిన మన్మథుని కిది దుస్సంకట మయ్యెను. కాని యింతకును మహానర్ధదాయకమగు మద్యపానమును మానజాలడయ్యెను. అదియే ప్రస్తుత దుస్థితికి మూలకారణమని గ్రహింపజాలడయ్యెను. ఎట్టి హీనస్థితిలోనున్నను పూటపూటకును పుచ్చుకొనకుండిన నేమియు తోచకుండెను.
    అట్లే దినములు గడచిపోవుచుండెను. పోయిన యుద్యోగము తిరిగి సంపాదించు కొనుటకు గూడ ప్రయత్నింపక మన్మథరావు మధుపానవ్యసన లోలుడయ్యెను. ధనము చేతలేనందున స్థిరాస్థికి గూడ కాళ్ళు వచ్చుచున్నట్లుండెను. వ్యవహారములనన్నిటి నతని భార్యయే పరిశీలించుచున్నను ఆమెయు మధుసేవనముననే కాబోలు మాంద్యముజెంది యున్నట్లు చూపట్టుచుండెను. మన్మథరావాదాయవ్వయముల బరిశీలించుచుండుడే లేదు. అతడు సర్వకాలములందును చిదానంద స్వరూపియై బాహ్యలోకమునకును, దనకును సంబంధమే లేనట్లు చూపట్టు చుండెను.
    
                                  ౬
    
    పూనానగరమున సుప్రసిద్ధుడును, మహనీయుడునగు జస్వంతరాయని మరణవార్త తన్నగర వాస్తవ్యులకు దారుణ నిర్ఘాంతపాత సదృశమయ్యెను. అనేక సుగుణగుణ శోభితుడగు జస్వంతుని హఠాన్మరణమునకు దపింపనివాడేలేడు. ఎట్టకేలకా నగరవాస్తవ్యులందరూర డిల్లి మహాత్ముడగు జస్వంతుని ధవళకీర్తి చిరస్థాయిగ నుండుట కేదైన ఘనకార్యమొనర్ప సమకట్టిరి. అధిక ధన సంపన్నులగు పూనా నగర వాస్తవ్యులు సంకల్పించుకొనిన కార్యము వ్యర్ధమగునా? అదియుగాక మహానుభావుడగు జస్వంతుని కొరకొనర్చెడు కార్యమున కెవ్వడు వెనుదీయును? కావుననే ఆ ఘనకార్యమునకు బ్రతి పౌరుడును సాధ్యమగు ధనసహాయ మొనర్చెను.
    కాని మన్మథరావుకీ యుదంత మావంతయు దెలియకుండెను. నిరంతర మద్య పానోల్లాసియై యానందమందిరమున బడి యుండిన యతనికి జస్వంతుని చావెట్లు తెలియనగును. పురమంతయు దుర్భర విచారాగ్ని హోత్ర దందహ్యమానమైనను, ఆనంద భవనముమాత్ర మమృతార్ణవముననే తేలియాడుచుండును. కావుననే మన్మథునికి ప్రాణ స్నేహితుడును. ప్రాణాధికుడునగు జస్వంతుని మరణవార్త తెలియదయ్యెను. కాని పురజనులు తాము తలపెట్టిన మహత్కార్యార్ధమర్ద మర్దించుచు నానందమందిరమున కరుగుదెంచి నంతట మన్మథరావు సర్వనాశనకరమగు మిత్రమరణవార్తను వినియెను. అంతటితోడ నతని హృదయము చలించిపోయెను. దుఃఖ స్రవంతి నిరాఘాటముగ బ్రవహింపసాగెను. అతడా ప్రవాహము నరికట్టజాలడయ్యెను.    
    అతడట్లు విచారించుచుండ జనులు  తామొనర్పనున్న కార్యము నెరుంగజేసి జస్వంతునికై ప్రాణములనైన ధారబోయవలసిన మన్మథరావును రెండు వందల రూపాయలను మాత్ర మొసంగ గోరిరి. అట్లేయని మన్మథుడు వారలనంపి తానింటికిపోయెను. ఇక మిత్రుని కొఱకై చింతించుట కంటే ధనమెక్కడనుండి తీసికొని రాగలనని చింతింప జొచ్చెను. అంతట నాతనికి దమ దారిద్ర్యస్థితి యంతయు గన్నులకు గట్టినట్లు గోచరించెను. తమ దురవస్థకు మద్యపానమే కారణభూతమని గ్రహింపజాలెను. ధనహీనుడనగు తానిక వ్యర్దుడనని తిట్టుకొనియెను. మిత్రుని జ్ఞాపకార్దమొనర్చెడు సత్కార్యమునకు మొదట కాలుపెట్టవలసిన తానే ధనసహాయమొనర్పకుండుటా! పాపము మన్మథుడు సందిగ్దావస్థలో పడెను. వలలో పడిన చేపవలె తటతటలాడి పోవుచుండెను. ఇక నేమైనను చిరనిర్మితమగు నిజగృహమునుజూపి ధనమప్పుతెచ్చి ఋణవిముక్తుడగుటకు దృఢ నిశ్చితుడయ్యెను.
    అట్లతడు నిశ్చయించి భార్యకు తన యవస్థ నెరుంగ జేసెను. ఆమెయును జస్వంతుని మృతికి బెల్లుగదల్లడిల్లెను మన్మథుడామె నూరడించుచు, "సుదతీ! జస్వంతుని మృతికి నేనుపొందు విచారము కంటే అతని ఋణము దీర్చుకొనజాలనైతిగదా యను చింతయే సహస్రాధికమై నన్ను బాధించుచున్నది సుమా! మాలతీ! వ్యర్దుడను, నిర్ధనుడగు నేనిక చేయగల్గునదేమి? మన యవస్థనీకు గరతలామలకమే కదా! నాయుద్యోగము నాడే యూడినది. చరాస్థి యందు గవ్వయైన గన్పించుటలేదు. భూములమ్మబడినవని నీవే పల్కితివి! ఇన్ని దురవస్థలకు బాల్పడియుండ మిత్రుని మరణగాధ కర్ణకఠోరముగ దాకినది. జస్వంతుని జ్ఞాపకార్ధము పురజనులొక వైద్యశాలను నిర్మించి యందాతని విగ్రహము బ్రతిష్టింపదలచిరి. ఇది ధనముతోబనికాని మాటలతోడిది కాదు. రెండువందల రూపాయలనిమ్మనిరి. ఉన్నత దశయందున్నచో కోరకనే వేయి రూపాయల నొసంగ గల్గిన నాతల యిప్పుడు రెండువందల రూకలకు జేయడయ్యెను. ఇక నేనెట్లయిన ధనమొసంగాక తీరదుకదా! కావున మాలతీ! మరి చెప్పకేమి! మన యింటిమీద నా మొత్తము వెచ్చి యొసంగ గృతనిశ్చయుడనైతిని. ఇంతకంటే నాకు గత్యంతరమేమి?" యని దుఃఖింపసాగెను.
    ఇవి యంతయువిని మాలతి లోనిదుఃఖమును మరచి యొక చిరునవ్వు నవ్వి "మనోహరా! ఎందరో తమకు గూర్చుమిత్రులు త్రాగుడు మానుడని చెవినిల్లుకట్టుకొని పోరినను వినక ఆనందమందిరమునకు దాసానుదాసులై నందులకు ఫలమిదియే! త్రాగుడునర్ద దాయకమని యొకరు చెప్పినపుడు గ్రహింపజాలని మీకిది స్వానుభవనమువలన సృష్టీ కృతమై యుండవచ్చును! ఆహా! మన యీ దారిద్ర్యమునకా పాడుత్రాగుడేకదా మూల కారణము! ఇక నన్ను మీరేమి చేసినను జేతురు గాక! ఈ సమయమున నే జెప్ప దలచినది చెప్పకమానను! అది ప్రాణహానికరమని గ్రహింపజేయక మానను! ఇంతేల? దేహ దార్ధ్యసంపన్నులగు మీరు త్రాగుడువలన చిక్కి శల్యముగ జూపట్టుటలేదా! మీకు నేను బోధింపవలెనా?...."అని పల్కుచున్నప్పుడు మన్మథుని  ముఖమింత యయ్యెను. అతడు వెంటనే భార్య పాదములపై వ్రాలి "మాలతీ! ఓ మాలతీ! కష్టపరంపరల కారణమున నిది వరకే మొరడైన యీమ్రానిని నీ మస్సాహవాక్యాగ్ని కీలలచే భస్మీపటల మొనర్ప జూడకుము! ఇదిగో విశ్వేశ్వరుని సాక్షిగా జెప్పెదను. నేటినుండి యానందమందిరమున మొగము జూపను! త్రాగుడు పూర్తిగా మాని వేసెదను. ఇక దయాతరంగిణివై నన్ను రక్షింపుము! నీవును త్రాగుచుంటివే కాని నీమముతో లేవుకదా! పోనిమ్ము! ఇక నా ప్రసక్తియేల? మిత్రుని ఋణము దీర్పబోవునా నిశ్చితమును పనులలో బెట్టబోయెదను! దరిద్రుడనగు నాకిక గతియేమి?" యని లేచెను.




Related Novels


China Yaanam

Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.