Home » Dr Jandhyala Papayya Sastry » Karunasree Saahithyam - 1



                                      కరుణశ్రీ సాహిత్యం-1

                                                                                డా|| జంధ్యాల పాపయ్య శాస్త్రి
    
                                                                   ఉదయశ్రీ
                                                     మొదటిభాగము
             
    
                                              

                                              
    
    పుట్టబోయెడి బుల్లిబుజ్జాయి కోసమై
        పొదుగుగిన్నెకు పాలు పోసి పోసి
    కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్ళతో
        లతలకు మాఱాకు లతికి యతికి
    పూలకంచాలలో రోలంబములకు ఱే
        పటి భోజనము సిద్దపఱచి
    తెలవాఱకుండ మొగ్గలలోన జొరబడి
        వింత వింతల రంగు వేసి వేసి
    తీరికే లేని విశ్వ సంసారమందు
    అలసిపోయితి వేము దేవాదిదేవ !
    ఒక నిమేషమ్ము కన్ను మూయుదువుగాని    
    రమ్ము! తెఱచితి మ కుటీరమ్ము తలుపు !    
    కూర్చుండ మాయింట కురిచీలు లేవు; నా
        ప్రణయాంకమే సిద్దపఱచనుంటి
    పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు;నా
        కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
    పూజకై మావీట పుష్పాలు లేవు; నా
        ప్రేమాంజలులె సమర్పింపనుంటి
    నైవేద్యమిడ మాకు నారికేళము లేదు;
        హృదయమే చేతికందీయనుంటి
    లోటు రానీయ నున్నంతలోన నీకు;
    రమ్ము! దయసేయు మాత్మపీఠమ్ముపైకి
    అమృతఝరి చిందు నీ పదాంకములయందు
    కోటిస్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
    
    
    లోకాల చీకట్లు పోకార్ప రవి చంద్ర
        దీపాలు గగనాన త్రిప్పలేక
    జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
        మామూలు మేరకు మడవలేక
    పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
        గడియారముల కీలు కదపలేక
    అందాలు చింద నీలాకాశ వేదిపై
        చుక్కల ముగ్గులు చెక్కలేక
    ఎంత శ్రమనొందుచుంటివో యేమొ సామి!
    అడుగిడితి వెట్లో నేడు మా గడపలోన;
    గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు;
    అందుకోవయ్య హృదయపుష్పాంజలులను.
    
                                             ఉషస్సు
    
    కర్కశ కరాళ కాలమేఘాల నీడ
    లెగురుచున్నవి ప్రజల నెమ్మొగములందు !
    క్రౌర్య కౌటిల్య గాడాంధకార పటలి
    క్రమ్ముకొన్నది దిగ్దిగంతమ్ములెల్ల.
    
    ఈ నిస్తబ్దత కంతరార్ధ మెదియో! ఈ కారుమేఘాలలో
    ఏ నిర్భాగ్య నిరర్ధ నీరస గళం బెల్గెత్తి వాపోవునో!
    ఈ నీరంధ్ర నిశీధ గర్భకుహర మ్మేభావగంభీరతా
    పౌనఃపున్యము దాచెనో! వెలయవో ప్రాభాత శోభావళుల్!
    
    ఈ చీకట్లిక తెల్లవాఱవటె! లేనేలేవటయ్యా స్మిత
    శ్రీ చైతన్య నవప్రభాతములు నిర్జీవప్రపంచాన! మా
    ప్రాచీబాల కపోలపాళికలపై ప్రత్యూష సౌవర్ణ రే
    ఖా చిత్రమ్ములు గీతు రెవ్వ రనురాగస్విన్నహస్తాలతో !!
    
                                                           ఉదయశ్రీ
    

    సుప్రభాతము! రాగోజ్జ్వలప్రబోధ
    మంధలోకాని కిడు జగద్భాంధవుండు
    ఉదయమగుచుండె నవయుగాభ్యుదయమునకు
    అరుణ కిరణాలతో కరుణార్ధ్రమూర్తి.
    
    చీకటిలో లోక మ్మిది
    చీకాకై పోయె; సంస్కృశింపగవలె నీ
    శ్రీకరముల, కరుణా కమ
    లాకర తరుణ ప్రభాకరా! రావోయీ!
    
    శుద్దోదన రాజేంద్రుని
    శుద్దాంతము చిందె శాంతిసుధల! అహింసా
    సిద్దాంత మొలుకు గౌతమ
    బుద్ధుని చిరునవ్వులోన పులకీకృతమై.    
    
                                                 కరుణమూర్తి
    

    ఈ ప్రగాఢ నిగూఢ మధ్యేనిశీథి
    గడియ కదలించుచున్న సవ్వడి యిదేమి?
    ఇప్పు డంతఃపురమ్మునం దెవరు వీరు    
    మూసియున్నట్టి తలుపులు దీసినారు?
    
    తెర తొలగి ద్రోసికొని యేగుదెంచుచున్న
    ముగ్ధ మోహన కారుణ్యమూర్తి యెవరు?
    అందములు చిందు పున్నమ చందమామ
    కళ దరుగ దేమి కాలమేఘాలలోన?
    
    నిండు గుండెలపై వ్రాలి నిదురవోవు
    ఏ హృదయదేవి పావన స్నేహమునకు
    ద్రోహ మొనరించి ప్రక్కకు త్రోసిపుచ్చి
    వచ్చెనో కాక - వదనవైవర్ణ్యమేమి?
    
    ఆ మహోన్నత భర్మ హర్మ్యాలు దిగుట
    ఏ మహోన్నత సౌధాల కెక్క జనుటొ?
    ఈ వన విహారములు త్యజియించి చనుట
    ఏ నవ విహారములు సృజియించుకొనుటో?
    
    లలిత లజ్జావతీ లాస్య లాలనములు
    కనెడి కన్నులు సత్యనర్తనము కనెనొ?
    శ్రీ చరణ మంజు మంజీర శింజితములు    
    వినెడి వీను లంతర్వాణి పిలుపు వినెనో?
    
    మినుకు మినుకున గుడిసెలో కునుకుచున్న
    దీప మంపిన దీన సందేశ మేమొ!
    స్వర్ణశాలలపై భ్రాంతి సడలి, జీర్ణ
    పర్ణశాలల మార్గమ్ము పట్టినాడు !

                                        కరుణాకుమారి
    

    ఆమె భువనైక మోహిని, అమృతమయి, అ
    నంత విశ్వ విహారిణి, శాంతమూర్తి;
    ఆమె లోకైక పావని, ఆమెవంటి
    అందములరాణి లేదు బ్రాహ్మాండమందు.
    
    ఆమె మానస కమలాకరాంతరమున
    జలజమై తేలు నీ చరాచరజగత్తు;
    ఆమె నిట్టూర్పులో పరమాణులట్లు
    కరగి నీరౌను మేరు మందరము లెన్నొ!
    
    ఆమె కడకంటి చూపులో అనవరతము
    కాపురము సేయు దివిజ గంగాభవాని;
    ఆమె చిఱునవ్వు తళుకులో అహరహమ్ము
    నవ్వుకొన్నవి వంద నందనవనాలు !!
    
    బాలభానుడు పసిడి హస్తాలతోడ
    పసుపు పారాణి నిడు నామె పాదములకు;
    ఆ దయామయి విశ్వవిహారమందు
    ప్రతి పదమ్మును "కోటిస్వర్గాల పెట్టు".
    
    ఆర్ద్రత - అహింస - అనసూయ - ఆమె యింటి
    ఆడుబిడ్డలు; నిత్యకల్యాణి ఆమె;
    ఆ మహారాజ్ఞి మృదుల పాదాంతికమున
    అవనతశిరస్కు డగును బ్రహ్మంతవాడు.
    
    ఆమె గాఢపరిష్వంగమే మదీయ
    జీవితమునకు మోక్ష లక్ష్మీ ప్రసాద;
    మామె యనుభూతియే శుష్కమైన నాదు
    బ్రతుకు నోదార్చు మలయమారుతపువీచి.
    
    కర్కశ కఠోర కాలచక్రాన నలిగి
    చితికిపోయిన నా ముగ్ధజీవితమ్ము
    నింపుకొందును అంచులనిండ, ఆమె
    అడుగుదమ్ముల కమ్మపుప్పొడులతోడ.




Related Novels


Karunashri Sahithyam - 3

Karunasree Saahithyam - 2

Karunasri Sahityam - 5

Karunasree Saahithyam - 1

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.