Home » D Kameshwari » Vivahabandalu



    "ఏం ఆయన కీ పెళ్ళి యిష్టంలేదా? నిన్ను హింసించడానికి కారణం ఏమిటి?" విజయ కుతూహలంగా అడిగింది.
    "కారణం? ఆ కారణమేమిటో ఈనాటికీ నా కర్ధం కాదు డాక్టర్. పెళ్ళి చూపులకి వచ్చారు. నచ్చిందన్నారు. చేసుకున్నారు. ఎవరూ బలవంత పెట్టినట్టు నేను వినలేదు. నా పట్ల ఆయన ప్రవర్తనకి ఒక కారణం అంటూవున్నట్టు నాకు కనపడలేదు. ఆఖరికి అది ఆయన తత్వం. భర్త అంటే భరించేవాడు. పెళ్ళానికి తిండి పెట్టి పోషిస్తున్నప్పుడు ఆ భార్య తనకింద బానిసలా వుండాలేగాని ఆమెకో వ్యక్తిత్వం వుండరాదని ఆయన భావం అని చాలారోజులకికాని అర్ధం చేసుకోలేకపోయాను."
    "విచిత్రమే! చదువుకున్నారు. మంచి ఉద్యోగంలో వున్నట్టున్నారు. అయినా యింత పాత భావాలు ఆయనలో వున్నాయంటే ఈ రోజుల్లోనూ యిలాంటి పురుషులు వున్నారంటే అనుభవించినవారుగాని నమ్మరు. ఆయనిలా ప్రవర్తించడానికి ఏదయినా కారణం వుందేమో కని పెట్టడానికి ప్రయత్నించావా, ఆయనని మార్చడానికి ఏమయినా ప్రయత్నం చేశావా అసలు? మీ అత్తగారు మామగారు వున్నారా. వాళ్ళకి కొడుకు యిలా ప్రవర్తిస్తున్నాడన్న విషయం తెలుసా?" ఒక్కమ్మడిగా ప్రశ్నలు కురిపించింది విజయ.
    "అందరికీ తెలుసు డాక్టర్. ప్రతీవాళ్ళు చెప్పే నీతులు ఒకటే. భర్త మనసెరిగి మసులుకోవాలి. ఆడదానివి నీవే కాస్త సర్దుకోవాలి. ఈ మాత్రం దానికి కాపురాలు వదులుకుంటారా. ఆడదాని బతుకు అరిటాకు లాంటిదమ్మా. మన అదృష్టంయింతేనని సరిపెట్టుకోవాలి తల్లీ. భర్తని కాదన్న ఆడదానికి పుట్టింట్లో కూడా స్థానం వుండదమ్మా! అంచేత కాస్త చూసి చూడనట్టు సర్దుకోవాలి అమ్మా. డాక్టరు గారూ ఈ నీతిసూక్తులు వినివిని విసిగిపోయాను. సర్దుకోవడం ఎంత కని? ఎన్నింటికని ప్రతిరోజు ప్రతిక్షణం ఎదురు తిరిగే ఆత్మాభిమానాన్ని బలవంతంగా ఎన్నాళ్ళని అణిచిపెట్టి బతకను?" ఆవేశంతో శారద గొంతు వణికింది.
    విజయ శారద వంక సానుభూతిగా చూసింది.
    "డాక్టరుగారూ, సరిగా ఏణ్ణర్థం క్రితం ఆయనతో నా జీవితం ముడిపడింది. ఈ ఏణ్ణర్థంలో కనీసం మొదటి రోజైనా నేను కన్న కలలు నిజమవలేదు. నేను ఏణ్ణర్థం వైవాహిక జీవితంలో మనశ్శాంతిగా ఒక్క రోజైనా గడపలేదంటే మీరునమ్మాలి. అలా అని నేను కోరరాని కోరికలు కోరలేదు. సినిమాలు, నవలలో మాదిరి, సినిమా సెట్టింగులాంటి యిల్లు, కార్లు, నవమన్మధుడిలాంటి భర్త - నన్ను కాలు కదపనీయకుండా నెత్తిన పెట్టుకొని పూజించే భర్త కావాలని ఆశించలేదు. నన్ను అర్ధం చేసుకొని, ఆదరించి, అభిమానించి అనురాగంతో చూసే భర్త రావాలని, మాది ముచ్చటయిన సంసారం అవాలని మాత్రం కోరుకున్నాను. ఇదే అత్యాశ అంటారా? ప్రతి కన్నెపిల్ల కోరుకొనే కనీస కోరికలు కావా యివి? ఇంత చిన్న కోరికలు కూడ తీరని నా బ్రతుకు నరకమవడానికి నేను చేసిన అపరాధం ఏమిటి? ఆడపిల్లగా పుట్టడమా? లేక నా పూర్వజన్మ సుకృతమని సరిపెట్టుకోవాలా?
    "డాక్టరుగారూ నాకూ ఓ డిగ్రీ వుంది. ఆత్మాభిమానం వుంది. వ్యక్తిత్వం వుంది. ఇవి వుండడంవల్ల నేను సుఖపడలేకపోయననుకుంటాను. ఇవేవీ లేకపోతే నేనూ ఇదివరకు రోజుల్లో ఆడవాళ్ళ మాదిరి భర్తే దైవం, భర్తకి భార్యని తిట్టి కొట్టే హక్కువుంది. భర్త ఏం చేసినా పడుండటం హిందూ స్త్రీ ధర్మం - అనుకుంటూ నేనూ ఓ మనిషినని మరిచి ఆయనకీ వళ్ళప్పగించి ఆయన కొట్టిననాడు యింతే అదృష్టం అనుకొని ఏడ్చి, కొట్టనివాడు సంతోషించి ఆయన పాదాలచెంత యింత చోటిచ్చారు అనుకొని సంతోషించి సంతృప్తిపడి గానుగెద్దులా బతుకు యీడ్చేదాన్ని..." శారద ఆవేశంగా చెప్పుకు పోతూంది.
    "అసలు మీ మధ్య కలతలు రావడానికి కారణం ఏమిటి?" ఆ వాగ్దోరణిని ఆపి ప్రశ్నించింది విజయ.
    "ఒకటేమిటి? డాక్టరుగారూ! చూడండి. మా నాన్న గారికి మేము ఐదుగురు సంతానం. ఆయన బ్యాంకి మేనేజరు. వెయ్యి రూపాయల పై జీతం అన్న మాటేగాని ఈ రోజుల్లో ఐదుగురు పిల్లలని పెంచి పెద్దచేయడానికి ఆ వెయ్యి రూపాయలు ఏ మూల? అపురూపంగా, ఐశ్వర్యాల మధ్య మేము పెరగక పోయినా మాకే లోటు లేకుండానే పెంచారు మా వాళ్ళు ఆడపిల్లలకీ డిగ్రీలు దాకా చెప్పించారు. మ అక్క బి. యస్సీ అవగానే ఒక కాలేజీ లెక్చరర్ కిచ్చి బాగానే కట్న కానుకలు యిచ్చి పెళ్ళిచేశారు. మా అన్నయ్య ఇంజనీరింగు ఆఖరి సంవత్సరం. నేను మూడోదాన్ని. నా తరువాత చెల్లెలు మెట్రిక్, తమ్ముడు ఫోర్తుఫారం-ఇదీ మా కుటుంబం. ఆడంబరాలకి పోకుండా ఉన్న దాన్లో గుట్టుగా సంసారం చేస్తే దేనికి లోటులేని సంపాదన మా నాన్న గారిది.
    అక్క పెళ్ళికి తీసుకున్న లోను తీరకుండానే నేను పెళ్ళికి సిద్దమైపోయాను. బి.ఏ. డిగ్రీ చేతికి వచ్చిందగ్గర్నుంచి నాన్నగారు సంబంధాల వేట ప్ర్రారంభించారు. నా అందం చూసి తిరిగి కాకపోయినా కట్న, కానుకలు చాలక రెండు సంబంధాలు కుదరలేదు. ఇంట్లో నాన్న అమ్మ అవస్థలు చూస్తూ "ఏమిటమ్మా అక్క పెళ్ళి అప్పుతీరలేదు. ఇంకా నా పెళ్ళి ఏం పెట్టి చేస్తారు? ఇదుగో ముందే చెపుతున్నాను కట్నం తీసుకొనేవాడ్ని చేసుకోను. నేనసలు ఇప్పటి నుంచీ చేసుకోను, ఏదన్నా ఉద్యోగం చేస్తాను" అని గొణిగాను.
    "మా బాధలు ఏవో మేం పడ్తూండగా నీకెందుకీ గొడవలు" అనేది అమ్మ.
    ఏదో అన్నానుగాని ఆడపిల్లకి పెళ్ళి చెయ్యక తప్పదు - కట్నం తీసుకోకుండా పెళ్ళాడే సంస్కారులు నూటికి ఒకరన్నా వుండరనీ తెలుసు నాకు. ఉద్యోగం రావడం అంత సులభం కాదనీ తెలుసు. నాలాంటి ఆడపిల్లలు ఇంచుమించు ప్రతి ఇంటా ఉంటారు. ఏవేవో ఆశలు, అభ్యుదయ భావాలు అందరికీ ఉంటాయి. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు చేసుకోవడం తప్ప ఆచరణలో అవి నిలువలేవని కాలం పాఠం నేర్పింది నాకు. పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు.




Related Novels


Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

D Kameswari Kathalu

Teeram Cherina Naava

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.