Home » Dr C ANANDA RAMAM » Tapasvi



    నిస్సహాయంగా కూర్చున్న వామనమూర్తి దగ్గరకు ఎక్కడినుంచో వచ్చింది సుధ.
    సుధ తన ప్రక్కన వచ్చి నిల్చోగానే ఆ నవ్వు పట్ల భయం పోయింది వామన మూర్తికి. సౌందర్య కూడా నవ్వు ఆపి సుధను చిత్రంగా చూసింది. సుధ సౌందర్యను గమనించనట్లే అంది.
    "కామేశ్వరీగారి పతిత జనోద్దరణ సంఘ భవనానికి అలంకరణల గురించి ఆలోచిస్తున్నాం. మీరూ రండి!"
    నడి సముద్రంలో కొట్టుకుపోతున్న వ్యక్తి అందిన బల్ల చెక్కను గట్టిగా పట్టుకున్నట్లు సుధ వెనకాతలే వెళ్ళిపోయాడు వామనమూర్తి.
    "సౌందర్యా! చూడు! బాగుందా భవనం! పేరు అందంగా చెక్కించాను కదూ!"
    మిసెస్ కామేశ్వరీదేవి సౌందర్య అభిప్రాయం అడగకుండా ఉండలేదు!
    నిజంగానే ఆ భవనం చాలా అందంగానే ఉంది. దాని పైన "పతిత జనోద్దరణ సంఘం" అని చాలా అందంగా పెద్ద పెద్ద అక్షరాలు వ్రాశారు.
    "స్త్రీ ఒక్కసారి కాలు జారినంత మాత్రాన జీవితం ఎందుకూ పనికి రాకుండా తయారయి పోతుంది. అలాంటివాళ్ళకు ఏదో ఒక దారి చూపాలి.."
    తన సంకల్పాన్ని వివరించింది కామేశ్వరీ దేవి.
    "ఎంతో మంచి ఉద్దేశం. ఇలాంటి విశాల భావాలు మీకు తప్ప ఎవరికీ ఉండవు. భవనం ఎంతో బాగుంది. ఆ అక్షరాల పైన ఎలక్ట్రిక్ బల్బులు పెట్టిస్తే ఇంకా బాగుండేది."
    "అవును కదూ! ఇప్పుడు టైం లేదు. ఎలా?"
    "పోనీ, నెమ్మది మీద పెట్టించండి!"
    "కానీ ఫిల్మ్ స్టార్ ఇవాళే వస్తుంది!"
    "మరే! ఆవిడ వచ్చి వెళ్ళిపోయాక అలంకరణ దేనికి?"
    "అరే! బల్బులు పెట్టిస్తేనే బాగుండేది."
    "అప్పుడు అందరికీ ఈ సంఘం ఏమిటో చక్కగా స్పష్టంగా తెలిసేది! ఇలాంటి పతితలను మామూలుగా మనలోకి తీసుకుంటే గొప్పేముందీ? వీళ్ళు పతితలని లోకానికి చాటాలి. ఎంత అథఃపాతాళంలో ఉన్నారో రుజువు చెయ్యాలి! అప్పుడు ఉద్దరించాలి!"
    సౌందర్య కంఠం ధ్వనిలో మార్పుకు కామేశ్వరీ దేవి కొంచెం ఆశ్చర్యపోయి "నువ్వు చిత్రంగా మాట్లాడతావు" అంది.
    అంతలో ఫిలిం స్టార్ కారు ఆగింది. అందరూ ఆవిడను ఆహ్వానించటానికి హడావిడి పడసాగారు. చివరకు ఆ సినిమా తార పతిత స్త్రీలతో కలసి ఫోటో తీయించు కుంది. మరునాడు 'పతితలు'గా పత్రికలలో రాబోయే ఫోటోలో తమ ముఖాలు స్పష్టంగా పడాలని ఒకరినొకరు తోసుకుంటున్న ఆ పతితలను చూస్తూ నిలబడిపోయింది సౌందర్య.
    
                                       3
    
    వామనమూర్తి విక్రమ్ దగ్గరకు చాలా సంతోషంగా వచ్చాడు. తను తెచ్చిన వార్త విని విక్రమ్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడని అనుకున్నాడు.
    సాధ్యమయినంత మామూలుగా మాట్లాడాలని ప్రయత్నించినా మాటల హావభావాలలో అణచుకోలేని గర్వరేఖ తొంగిచూస్తుండగా అన్నాడు.
    "విక్రమ్! నీకు కూడా ఉద్యోగం దొరికినట్లే లెక్క. చాలా అవస్థ పడవలసి వచ్చిందనుకో! అయినా ఫరవాలేదు. స్నేహమనే మాటకు అర్ధమేమిటి? స్నేహితుల కోసం ఎంత కష్టపడితే మాత్రం ఏం నష్టం? నేను స్నేహం కోసం ప్రాణమైనా ఇస్తాను. ఈ మాత్రం నీకు ఉపయోగపడగలిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది."
    చదువుకుంటున్న రోజులలో వామనమూర్తి విక్రమ్ మీద ఆధారపడని క్షణం లేదు. అందుకతను ఏనాడూ కృతజ్ఞతలు చెప్పుకోలేదు. కృతజ్ఞతలు చెప్పుకోవటమంటే, తన చేతకానితనాన్ని కనీసం ఒక్కరి ముందయినా ఒప్పుకోవడం, ఆ పని వామనమూర్తి వల్ల కాదు.
    అందుకే స్నేహితుల కోసం ఎంత కష్టపడితే మాత్రం ఏం నష్టం? అన్నాడు. ఆ మాటలు విక్రమ్ తో అన్నవే కాదు- తనకు తనే చెప్పుకుంటున్నవి. విక్రమ్ కు తాను కృతజ్ఞతలు చెప్పుకోనక్కర్లేదని తనకు తను ఇచ్చుకొంటున్న సంజాయిషీ....
    "ఎందుకు పడ్డావ్ అంత అవస్థ?"
    తను చదువుకుంటున్న పుస్తకంలో పెన్సిల్ గుర్తుగా పెట్టి మూస్తూ అన్నాడు విక్రమ్.
    వామనమూర్తికి మండిపోయింది. తను బంగారం లాంటి ఉద్యోగం చూపిస్తోంటే తనకు థాంక్స్ చెప్పుకోవలసింది పోయి ఇలా నిర్లిప్తంగా...
    "స్నేహితున్ని కనుక- నీ మేలు కోరినవాణ్ని కనుక!"
    "నాకు మేలేదో నీకేం తెలుసు? అసలు నీకేది మేలో నీకు తెలుసునా?"
    వినిపించీ వినిపించని సన్నని వ్యంగ్య ధోరణి.
    వామనమూర్తి తబ్బిబ్బు పడిపోయాడు.
    "గవర్నమెంటులో ఉద్యోగం దొరకటం నీకు మేలు కాదా?"
    "కాదు!"
    "నువ్వింత కష్టపడి ఎలా నీ చదువు పూర్తి చేసుకున్నావో నాకు తెలుసు! ఇప్పుడా ఇబ్బందులన్నీ పోయాయా?"
    "ఎక్కడికి పోతాయి?"
    "మరి?"
    "నేను ఉద్యోగం చెయ్యాలనుకోవటం లేదు, రీసెర్చ్ చెయ్యాలనుకుంటున్నాను!"
    "వద్దు! వద్దు!" గట్టిగా అరిచాడు వామనమూర్తి...
    "అంత గట్టిగా అరవకు. నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు!"
    వామనమూర్తి తన ఉద్రేకానికి చాలా సిగ్గుపడ్డాడు.
    "అవును. నాకిష్టం లేదు. ఇప్పటికే ఎన్నో కష్టాలు పడ్డావు. ఇకనైనా ఉద్యోగంలో చేరి సుఖపడక..."
    "కష్టాలూ...సుఖాలూ....ఇలాంటి మాటల్ని నీ దృష్టి కోణం లోంచి జనరలైజ్ చేసెయ్యకు. నాకు సుఖం నా రీసెర్చ్ వర్కులో ఉంది. హోటల్ భోజనంలోనూ, సినిమా థియేటర్ లోనూ లేదు!"
    విక్రమ్ రీసెర్చ్ చేస్తే ఆ ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో వామనమూర్తికి తెలుసు- విక్రమ్ బ్రహ్మాండమైన పరిశోధన చెయ్యటం...అది దేశ విదేశాలలో గుర్తింపబడి కీర్తింపబడటం- జనులందరూ విక్రమ్ కి బ్రహ్మరథం పట్టడం...ఆ పైన ఊహించలేక పోయాడు....ఒళ్ళంతా కారం రాసినట్లయింది.




Related Novels


Tapasvi

Neeraja

Gullo Velasina Devathalu

Nisabdha Sangeetham

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.