Home » VASUNDHARA » Trick Trick Trick    "నీ భావాలు, ఆలోచనలు ఎంతో విశాలంగా వుండాలని! ఎంతసేపూ అక్క గురించే కాక-ఈ ప్రపంచం గురించికూడా నువ్వు ఆలోచిస్తూండాలి.ఎవరైనా నిన్ను బాధపెట్టినా ప్రతీకారం గురించికాక-క్షమించి ఆదరించడం గురించే ఆలోచించాలి...." అన్నది పార్వతమ్మ.
    "అప్పుడేమవుతుంది?"
    పార్వతమ్మ కూతుర్ని దగ్గరగా తీసుకుని - "ఏమవుతుంది? మా బంగారు పాప గాంధీ అంత గొప్పదై పోతుంది. అంతా మా విశాల గురించే చెప్పుకుంటూంటారు. పత్రికల్లో మా విశాల ఫోటోలు...." అంటూ ముద్దులాడింది.
    విశాల కళ్ళు సంతోషంతో పెద్దవైనాయి - "ఇంకా చెప్పు-" అన్నది.
    పార్వతమ్మకు నవ్వొచ్చింది- "చెబుతాను కానీ నువ్వీరోజునుంచీ మీ నాన్న పెట్టిన పేరు నిలబెట్టడానికి ప్రయత్నించాలి-"
    "అలాగేనమ్మా-అందుకు నువ్వేం చెబితే అవి చేస్తాను-"
    "మా విశాల బంగారుతల్లి...." అంటూ మళ్ళీ ముద్దులాడింది కూతుర్ని పార్వతమ్మ.
    "అమ్మా-పెద్దవాళ్ళు పిల్లలకు పేరు పెట్టేముందు అన్నీ ఆలోచిస్తారా?" అన్నది విశాల కుతూహలంగా.
    "అవును-"
    "మరి అక్కకు శకుంతలని పేరుపెట్టారుకదా-ఎందుకోచెప్పవూ?" అన్నది విశాల తన కళ్ళను చక్రాల్లా తిప్పుతూ.
    పార్వతమ్మ ఉలిక్కిపడింది.
    అవును-కూతురికి శకుంతలని పేరెందుకు పెట్టారు?
    అది తన భర్త నాయనమ్మ పేరు. ఆవిడకు తన భర్తఅన్నా, తన భర్తకు ఆవిడన్నా ఎంతో యిష్టం. అందుకే ఆ పేరు. కానీ పురాణాల్లో శకుంతల కథ ఏమిటి? అప్పటికే వివాహితుడైన దుష్యంతుడి చేతిలో మోసపోయిందామె. కానీ అది పూర్వ భాగం.
    "చెప్పమ్మా-" అన్నది విశాల తల్లిని కుదుపుతూ.
    "శకుంతల భరతుడి తల్లి. మన దేశానికి ఆ భరతుడి పేరే పెట్టారు. అలాంటి గొప్పకొడుకునికనాలనినాన్న దానికాపేరు పెట్టారు...."
    విశాల ఇంకా ఏదో అడగాలనుకున్నది. కానీ పార్వతమ్మకు అదింకా ఏమని అడుగుతుందని భయంవేసిందో. "అవతలచాలాపనులున్నాయి. ఇప్పుడింకేమీ అడక్కు-" అంటూ దాని నోరు నొక్కేసింది.
    
                                                           *    *    *    *
    
    శకుంతల అసహనంగా టైము చూసుకుంది. ఏడున్నరయింది. శేఖర్ ఏడింటికల్లా వస్తానన్నాడు. ఇంకా రాలేదు.
    "అతనెప్పుడూ ఇలా చేయలేదు...." అనుకున్నదామె.
    పార్కులో జనంలేరు. శకుంతలకు విసుగు వస్తున్నది.
    "శకూ- రేపు పార్కులో నేను నీకు కొన్ని ముఖ్యమైన విశేషాలు చెప్పాలి. ఉదయం ఏడింటికల్లా మనచోతుకు వచ్చేసేయి. నేను చెప్పింది విన్నాకకూడా మన పెళ్ళి వెంటనే జరగాలని నువ్వంటే- నేను మీ యింటికి వస్తాను. రాణీగారి ఆజ్ఞల్ని మీరగలనానేను...."అన్నాడు శేఖర్.
    అప్పుడు శకుంతల సిగ్గుపడింది. ఆ విషయం గుర్తుకు వచ్చి ఇప్పుడు కాస్త సిగ్గుపడింది. కానీ ఆ సిగ్గెంతోసేపు నిలవలేదు. మామూలుగా ఎదురు చూడడమే ఎంతో విసుగ్గా వుంటుంది. ప్రియుడికోసం ఎదురుచూడడమంటే....
    శకుంతల పార్కులో ఎనిమిదింపావు వరకూ ఉన్నది. అప్పుడక్కడి పచ్చగడ్డి ఆమె పాదాలను నిమిరింది. గాలిపైటతోసరసమాడింది. చెట్లు కుశల ప్రశ్నలు వేశాయి. పూలు తుమ్మెదలకై ఎదురుచూస్తూ ఆమెతో తమ ఆవేదనను పంచుకున్నాయి. కానీ శకుంతల ఇవేమీ గుర్తించలేదు.
    శేఖర్ రాడేం?.....అదొక్కటే ఆమె ఆలోచన.
    కాసేపాగి ఆమె లాడ్జికి దారితీసింది.
    శేఖర్ బడచేసిన లాడ్జి ఆమెకు తెలుసు. అక్కడ గదిలో ఒక పూట తాము గడిపారు. అప్పుడే ఇద్దరూ ఒకరికొకరు ఎంతో దగ్గరయ్యారు.
    అది చంద్రశేఖరా లాడ్జి.
    శకుంతల రిసెప్షనిస్టు వద్దకు వెళ్ళి- "శేఖర్ కావాలి-" అన్నది.
    "ఏ శేఖర్!" అన్నదామె.
    "రూం నంబర్ డెబ్బై ఏడు-"
    రిసెప్షనిస్టు ఏదో పుస్తకం చూసి- "రూం నంబర్ డెబ్బైఏడులో రమణి అనే వనిత ఉంటున్నది-" అన్నది.
    శకుంతల ఉలిక్కిపడి- "అయితే శేఖర్ ఏ రూంలో ఉంటున్నాడో చెప్పగలరా?"
    రిసెప్షనిస్టు విసుక్కోలేదు. పుస్తకం తిరగేసి- "శేఖర్ అన్న పేరు గల వారెవరూ ప్రస్తుతం ఇక్కడ బస చేయడం లేదు-" అన్నది.
    అంటే-శేఖర్ బస కాళీచేసి వెళ్ళిపోయాడా? తన్ను మోసంచేసి పారిపోయాడా?......కానీ అలా ఎందుకు చేస్తాడు?
    ఇంకా ప్రపంచం సరిగ్గా తెలియని శకుంతలకు ఆ విషయం నమ్మడానికి మనస్కరించలేదు.
    "మీరు ఇక్కడ బసచేసిన వారి వివరాలు నోట్ చేసుకుంటారు కదూ?"
    "ఊఁ" అన్నది రిసెప్షనిస్టు.
    "నాలుగు రోజుల క్రితం రూంనంబర్ డెబ్బై ఏడులో ఉండేవాడు శేఖర్...." అన్నది శకుంతల. అప్పటికే తను రిసెప్షనిస్టును ఇబ్బంది పెడుతున్నానన్న భావ మామెను ఆవహించింది.
    రిసెప్షనిస్టు మాత్రం ఏమాత్రమూ విసుక్కోకుండా-ఓపికగా పుస్తకం తిరగేసి ఒకతను ఉన్నమాట నిజం. అతడిపేరు శేఖర్ కాదు. కృష్ణ మూర్తి...." అన్నది.
    శకుంతల తెల్లబోయి-"మీరు చూసింది రూంనంబరు డెబ్బైఏడేకదూ-" అన్నది.
    రిసెప్షనిస్టు తలాడించి-"ఈ హోటల్లో అసలుపేరుతో దిగేవారు తక్కువ-" అన్నది.
    "ఎందుకని?"
    "అలాంటి వివరాలు నన్నడక్కూడదు. నేనిక్కడి ఉద్యోగిని-" అన్నదామె.
    "మరైతే నేనిప్పుడేం చేయాలి?" అన్నది శకుంతల నిస్సహాయంగా.
Related Novels


Vasundara Short Stories

Pelli Chesi Chudu

Trick Trick Trick

ఆపరేషన్ మేడిపండు

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.