Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta    హరగోవింద్ ఖురానా భారతీయుడు. అతడు అమెరికాలో కృత్రిమ జీన్స్ కనిపెట్టాడు. పై తరాలు తెలియటం వ్యాధి నిర్ణయానికి ఉపయోగపడ్తాయి.
    తల్లిదండ్రులకు ఈ వ్యాధులు ఉన్నాయా? అని డాక్టర్లు అడుగుతున్నారు. ఉంటే ఆ వ్యాధిని జెనిటిక్ అంటున్నారు.

                             
    భారతీయులకు రక్తసంబంధం వేల సంవత్సరాల క్రితం తెలుసు. ఈ వంశానుక్రమం వల్లనే అని తెలిసికొన్నారు.
    "మేనమామ పోలికలు -మేనత్త సాలికలు", సామెత
    మన పెద్దలు శాస్త్రాన్ని సామాన్యులకు తెలియపరచడానికి సామెతలు రూపొందించారు.
    సామెతలో శాస్త్రం తెలియజేయడం సాధారణంకాదు!
    
    రామాయణ వృత్తాంతం   
    రామాయణానికి సాటి లోకంలో మరొక కథాకావ్యం లేదు. వేల సంవత్సరాలు గడిచాయి. కొండలు కరిగాయి. పెరిగాయి. నదులు అదృశ్యం అయినాయి. గతులు మార్చుకున్నాయి. గోళాలు తరిగాయి. పెరిగాయి. సరిహద్దులు చెరిగాయి, పెరిగాయి.
    కాని రామాయణం పసివాడలేదు. సీతారాములు నిత్యనూతనులు భూమిమీద కొండలు, నీరు ఉన్నంత కలం రామాయణ కథ నిలిచి వుంటుంది అన్నారు పెద్దలు.
    కవులలో వాల్మీకి - కావ్యాల్లో రామాయణం.
    రామాయణం అన్నా, విన్నా నా మనసు స్రవంతి.
    శ్రీమద్రామాయణం - సీతాచరితం రెండు వచన కావ్యాలు రచించాను. అయినా అసంతృప్తియే.
    రచిస్తున్నపుడు ఎన్నిసార్లు మనసు కరిగిందో! కన్నీరు జారిందో?
    వందే రామాయణార్ధవం
    ప్రస్తుతానికి వద్దాం.

    రామపట్టాభిషేకపు ప్రయత్నాలు - మంథర మంట కైక కొయ్య - వరాలు సాధించింది. సీతారామ లక్ష్మణులు సాధారణ వస్త్రాలు ధరించారు. అడవికి పయనం.
    ఇదీ రంగం.
    దశరథుడు - కైకా! రాక్షసీ! రాముడు అయోధ్యనొదిలితే నా ప్రాణాలు నన్ను వదులుతాయి.
    
    రాముడే నా ప్రాణం:   
    కైక కొయ్య బొమ్మ ఉలకదు పలకదు. సుమంతుడు.....కైకా! నీ తల్లి గుణాలే నీకు వచ్చాయి నీ తండ్రి నీ తల్లిని వదిలించుకున్నాడు. బతికాడు నీవేమో దశరథుడ్ని వరాల వలలో చిక్కించావు.
    
    ఆ కథ ఏమనగా

    కైక తల్లిదండ్రులు పడుకున్నారు. ముచ్చట్లలో పడ్డారు. ఎందుకో అకారణంగా నవ్వాడు.
    ఎందుకు నవ్వావు? అని భార్య అడిగింది అంతగా పట్టించుకోలేదు. ఆమె మొండి పట్టుపట్టింది.

                       
    చీమల మాటలు నవ్వు తెప్పించాయి అన్నాడు.
    ఆ మాటల ఏమిటి? అని అడిగింది.
    నాకు చీమల భాష ఒక యోగివర్యుని ద్వారా తెలిసింది. ఆ భాష ఇతరులకు తెలియజేస్తే నా తల పగులుతుంది అన్నాడు. అందువలన చెప్పను అన్నాడు రాజు.
    అయినా చెప్పవలసిందేనని భార్య మొండి పట్టుపట్టింది.
    "రాక్షసీ! నువ్వు ఏం పెళ్ళానివే? మొగుడి ప్రాణాలకే ఎసరు పెట్టావు" అన్నాడు. వదిలేశాడు బ్రతికాడు.
    తల్లి గుణం బిడ్డకు అనేది జీన్సు వల్లనే అనేది రామాయణ కాలం నాటికే తెలుసు. అది కేవలం శారీరకం కాదు, మానసికం కూడా అని విదితం అవుతుంది.
    ఇయ్యది అమెరికా జీన్స్ వలువలు వలుచునది.
    భారతదేశపు కల్యాణం సగోత్రీయం కారాదు.
    సగోత్రీయం అంటే వధూవరుల కుటుంబాలు ఒకే గోత్రపువిగా ఉండరాదు అనేది ఆచారం అయింది.
    ఒకే ఇంటి పేరుండి గోత్రాలు వేరైనా, ఒకే గోత్రంలో ఋషులు వేరైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి.
    ఇది ఆచారం, సంప్రదాయం మాత్రమే
    శాస్త్ర ప్రకారం సగోత్రం అంటే ఇటు ఏడు, అటు ఏడు తరాలు!
    ఇది అసాధ్యం. అయితే శాస్త్రం చెపుతున్నది ఏమంటే సంతానానికి పై ఏడు తరాల లక్షణాలు, స్వభావాలు, రూపాలు, వ్యాధులు మున్నగునవి కలిగే అవకాశం వుంది.
    దీనినే ఏడేడు తరాల బంధం అంటాం.
    ఏడు తరాలను అధ్యయనం చేసిన ప్రాణతనం గొప్పయా?
    లేక రెండు తరాలతో మిడుకుతున్న జీన్స్ గొప్పయా?
    బానిసతనం విడవాలి.  మన గొప్పదనాన్ని గుర్తించాలి. గర్వపడాలి.
    
    హ్యూమన్ జీనోమ్
    హ్యూమన్ మాత్రం కాదు.
   
    1999లో హ్యూమన్ జీనోమ్ మానవునికి వెయ్యేళ్ళ జీవితం కలిగించగలదని ప్రచారం.
    అప్పుడు నేను వ్రాసిన వ్యాసం -
    నేను ప్రాణాలొడ్డి స్వాతంత్ర్య ఉద్యమంలో నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో పాల్గొన్న అదృష్టవంతుణ్ణి. మేం త్యాగమే చేశాం. ఆర్జించింది బూడిద స్వాతంత్ర్యం అనేది వచ్చి అర్ధ శతాబ్దం దాటిపోయింది. తరాలు దాటిపోతున్నాయి. నా దేశపు నేటి దుస్థితిని చూసి ఏడ్చి కన్నీరు వడిసిపోయింది. ప్రస్తుతం కనీసం ఏడవలేకున్నాం!
    ఇవ్వాల్టి పాలకులకూ, రాజకీయ పక్షాలకూ స్వాతంత్ర్యం తెలియదు. స్వాంతంత్ర్య ఉద్యమం తెలియదు. భారతదేశం తెలియదు. భరత ఇతిహాసం, నాగరికత, సంస్కృతి తెలియవు. భరతధర్మం తాల్పికత, న్యాయం, సత్యం తెలియవు. విచిత్రమేమంటే వారికి. ఈ దేశం పేరు తెలియదు!
    మహాత్ముడు ఇలాంటి స్వాతంత్ర్యం కోసం కాదు అనితరసాధ్య అహింసా సమరం సాగించింది. వారు కోరింది స్వరాజ్యం - గ్రామ స్వరాజ్యం. స్వదేశీ ఉత్పత్తి సాంతం ఈ దేశంలోనే జరగాలనీ, స్వావలంబనం అన్నింటినీ స్వయంగా సమకూర్చుకోవాలని, నేటి పాలకులు అన్నింటికీ దాసులైనారు. దేశంలో చెట్టు పుట్ట నుంచి పరదేశ్యం చేశారు. మన పాలకులకు ఆదర్శాలూ, లక్ష్యాలూ అంటూ ఉండవు. వారి ఏకైక లక్ష్యం అధికారం! దాన్ని దక్కించుకోవడానికి పవిత్ర భరతధాత్రిని పట్టపగలు - నడివీధిలో - చంద్రమతిని వలె - వేలం వేస్తున్నారు. చిలకమర్తి వారి 'భరత ఖండంబు చక్కని పాడియావు' ఈ నాటికీ బహు చక్కగా వర్తిస్తుంది.
    స్వాతంత్ర్యం వచ్చిందనుకుంటున్న అర్ధశతాబ్దం దాటిం తరువాత ఈ దేశంలో పన్నులిచ్చే వాళ్ళు, ఓట్లిచ్చేవాళ్ళు తప్ప ప్రజలు మిగల్లేదు. పాలకులు - ప్రజలను తమ పబ్బం గడుపుకోవడానికి విదేశీ వ్యామోహులను చేశారు. వారికి టీవీలు - సినిమాలు - ఆటపాటలు - తాగుళ్ళూ తప్ప అన్యం తెలియకుండా చేశారు. జనం కాదు, ప్రజ కాదు, కుహనా విద్యావంతులు dirty india, dirty life అంటున్నారు. L.K.G లో పిల్లలను చేర్చేటప్పుడే అమెరికా ప్రస్థానానికి ప్లాన్ లు వేస్తున్నారు. This is india Today and not India Tomorrow.
    కుహనా మేధావులు, రాజకీయ రాబందుల శాతం భారతదేశంలో బహుస్వల్పం. మిగతా బహుసంఖ్యాకులను silent Majority అనుకోవడం Hi malayan Blunder మాత్రమే!
    ఈ వ్యాసం ఈ సమాజానికి ఇంకా ఉచ్చ్వాస నిశ్వాసాలవుతున్న సామాన్య ప్రజానీకం కోసం, ఇన్ని విదేశీ రంగులు, టెక్కులు బరిబద్దలు, హింసల మధ్య కూడా సామాన్యులు, యువతీయువకులు, సనాతన భారతదేశాన్ని, దాని మహత్తర నాగరికతను తెలుసుకోవడానికి ఆతురత పడుతున్నారు. నేను తెనిగించిన వేదాలకు లభించిన ఆదరణ, అభిమానాలు ఇందుకు నిదర్శనాలు.
    జీనోమ్ ఆవిష్కరణ గురించి బహుళ ప్రచారం జరిగింది. ఇది కేవల వ్యాపార ప్రక్రియ. ఇది మానవుడు సాధించిన రాక్షస విజయం. ఇది మానవ జీవితం సుఖప్రదం కావడానికి మాత్రం కాదు. కొన్ని రాక్షస దేశాలు అనంత మానవాళిమీద పెత్తనం సాగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇవాళ జరిగింది ప్రచారం మాత్రమే! ఫలితాలకు మరికొంత కాలం పడుతుంది. అప్పుడూ అమెరికాలాంటి ధనిక దేశాలే లాభపడ్తాయి. వాళ్ళు వెయ్యేళ్ళు జీవిస్తారు. అన్యులను పదేళ్ళకు అంతంచేసే ప్రయత్నం చేస్తారు! ఇది కేవలం అధికార దాహానికే! అగ్రదేశాల వారు చంద్రుని లాంటి గ్రహాల మీద అడుగుపెడ్తున్నాడు. తిండిలేని పేదలకు, పేద దేశాలకు ఒరిగిందేమిటి? ఎహ్ సబ్ దిఖానాహై, ఇది మానవాళిని మోసపుచ్చే మహామంత్రజాలం మహామాయ!
Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.