Home » Sree Sree » Srisri Kathalu                               శ్రీ శ్రీ కథలు
    
                                                                      ---శ్రీశ్రీ

                     
    
                                     ఆనంద మందిరము
    
    "మీరనుదినమును వందలకొలది సీసాలనుత్తవి గావించు
    చుండ నేను దినమునకొక యాలి చిప్పెడు పానీయము
    నర్షించిన నపరాధమేమి? ఈ నా చిన్న కోరికనే నిరాక
    రింతురా?" యని యొకనాటి సంధ్యా సమయమున
    మాలతి నిజమనోమన్మధుడగు మన్మధరావును ప్రశ్నించెను.
    
    మన్మధరావు మహారాష్ట్ర వంశజుడు పూనా నగరవాస్తవ్యుడు అతడుత్తమకుల సంజాతయు, సుప్రసిద్దన్యాయవాదియగు మాధవరాయని యనుంగు పుత్రికయునగు మాలతిని పరిణయమాడి నిరభ్యంతర సంతోషవంతుడై యెసగుచుండెను. మన్మధరావొక మహోన్నతోద్యోగి. అతడు రెండు చేతులతోడను ధనమార్జించుచుండుట చేతను. తదయ పిత్రార్జిత విత్తము కూడా నపారమై యుండుట వలనను, సక్కాలమున మన్మధునివంటి ధనికులరుదుగ గన్పట్టుచుండిరి. అట్టి మహాదైశ్వర్యశోభితుడును. నిర్విచార మనస్కుడునగు మన్మధరావునకు బరమేశ్వరానుగ్రహమున నవమన్మథాకారుడగు పుత్రుకుడుదయించెను ఇక మన మన్మథుని యానంద స్రవంతి కడ్డంకులేవి కలవు? ఆ మహోత్సవకాలము వాస్తవముగా దనకదృష్ట దాయకమనియు, లోకముననింక దన్నుమించిన యదృష్టవంతుడుడనియు మన్మధు డూహించెను. అతడట్లెంచిన దప్పులేదు! ఆ స్థితిలో నెల్లరట్లే తలంపకపోరు! పుత్రోదయమైనది కదా యని మన్మథుడు సంతోషము పట్టజాలక వివిధ భంగుల నద్దానిని వెళ్ళబోసెను. అతని స్నేహితులెల్లరతని యుత్సాహమున బాల్గొనిరి. మన్మథరావు విచ్చల విడిగా ధనము వెచ్చించెను. అతడు చేసిన విందులకుగాని దానధర్మములకుగాని పరిమితి లేకపోయెను. అతని దాతృత్వమునకు మెచ్చి యనేకులాతనికి దానకర్ణుడని బిరుదొసంగిరి. అతని పేరు ప్రజలు రామనామమువాలే జపించుచుండిరి అదృష్టమున మన్మథరావుదేకదా! భూలోకమున ధనజన్మము సార్ధకమైనదని యాతడూహించెను.
    
                                  ౨
    
    పూనా నగరమున నానందమందిరమనియెడు మనోజ్ఞభవన మొకటి కలదు అది రామణియకనిధానమే యైనను త్రాగుడు కొంపయునగుటవలన నద్దానిని తక్కుంగల భవనములట్లు పూర్తిగా గౌరవింపవీలులేదు! అయినను నాభవనమున జనసంచారమపారము. గొప్ప గొప్ప వారనేకులా భవనమునందలి గౌరవముచేత నెల్లప్పుడామందిరమునందే పడియుందురు. రాత్రిందినములా ప్రదేశము ధనిక యువకుల చేత గ్రిక్కిరిసి యుండును. అందెల్లవారలును నిరంతర మద్యపాన పరాయణులై స్వపర తారతమ్యమూలా నెరుంగ బాలక "పీత్వా పీత్వా పునః పీత్వా" యనెడు తారకమంత్రమును జరిపించుచుందురు. విదేశములనుండి దిగుమతి కాబడిన విలువగల మత్తుపదార్ధములు నలుగురి చేతులలోన సాగిపోవుచుండును. అసంఖ్యాకమగు సేవకబృందము వచ్చిన ప్రభువులకు వడ్డనలోప మొనర్ప కుందురు. ఆ మనోజ్ఞమందిరమున మధ్యదేవత మూర్తీభవించి తన్నుపాసించిన వారల ధన్మయుల జేయుచుండెను. ఎల్లవారలా దేవమూర్తిని వినయ విధేయతలతోడ నర్చించుచు నధికానంద సంభరిత స్వాంతులగుచుండిరి.
    అట్టి యాదివ్యప్రదేశమునకు గొందరు యువకులేగుదెంచిరి. వారెల్లరును మన్మధుని మిత్రజనులు వారినడుమ మన్మథరావు కూడా కలడు. అమాయకుడగు నామన్మథుడు స్నేహితుల యాచ్చిక బుచ్చికల కలరి యచ్చటికి వచ్చి యుండెను. అతనికిది వరకు తమ పురమునందే యట్టిచోటొకటి కలదని తెలియదు. అట్టి దివ్యదర్శనము నేడతనికి మిత్రుల కరుణావేశమున నయాచితముగ లభించినది. వివిధ వాక్యంసందోహవృష్టి గురిపించుచు మిత్రులాతని నిటకు దోడ్కొని వచ్చి  తమలో తాము కన్నులగీటుకొనుచు "నేడు మన మిత్రుడందరకు దక్కున చేయకుండ కావలసినంత కడుపులో పోయించునురా! మరి కాచుకొనుడు! ఏపనికేమాత్ర మోపిక కలదో? పందెములు వేసికొని మఱియు కానీయుదము! కాకున్న వేడిపుట్ట" దని ప్రోత్సాహపూర్వకముగ బల్కుకొనిరి.
    మన్మధునికీ చర్యలు మనస్కరించుట లేదు! ప్రాణముల బిగబట్టుకొని నిల్చియుండెను. చెప్పరాని తొందరలో సేవకులాగంతకుల రాక నవలోకించి యొక విశాలమగు బల్లముందా సనములను పేర్చి గౌరవించిరి. అంతట మన్మథుని మిత్రులెల్లరు నాసనముల నాక్రమించి మిత్రునిగూడ గూర్చుండజేసిరి. క్షణకాలములోన సేవకులు సుందరముగ నలంకరింపబడిన బల్లమీద వివిధ వర్ణ ప్రశస్తములగు సీసాలతోడ పానీయమూలా నలంకరించిరి. ఎల్లరును సంతోషపూర్వకముగా నిలువేల్పునారాధింప నుపక్రమించిరి. మన్మధుడు మాత్రము నిశ్చేష్టితుడయ్యెను. అతని గుండెలు కొట్టుకొనసాగెను. ఆ చోటనిక నిలువరాదని దిగ్గునలేచి నిలుపబడెను.
    ఇది చూచి మిగిలిన వారిలో నొకడు తొందరతో సగము త్రాగిన బుడ్డిని చేతబట్టుకొని రెండవ చేతితో మిత్రుని గూర్చుండ జేయుచు "నిదేమి మిత్రమా! చేయరానిపని చేయుచుంటివి? దేవాలయమునకు వచ్చి దేవునారాధింపకున్నను పాపము లేదు కాని మధ్య దేవాలయమునకు వచ్చి యామెనుపాసింపకున్న నాగరిలోకమున నగుబాట్లు సంభవింపవా? ఇది యెరిగినచో నీవిట్లు విముఖుడువగుదువా? అయ్యో! ఎంత తప్పు? ఇంతకు నిందరకు లేని నియమము నీకేల? నీవు త్రాగని యెడల నతిధులమగు మేమెట్లు త్రాగానగును? ఇట్టి సంతోష సమయమున నలుగురి కిప్పించి నీవును కొంచెము పుచ్చుకొనవలెను కదా? ఈ మధ్య మహాదేవిని నేను వర్ణింపజాలను. కాని ఇప్పుడొక్క చుక్కకు గొంతుపట్టితివేని రేపటినుండి నీయంతట నీవే భుజము లెగురవైచుకొని పానీయము కొరకు ప్రాకులాడెదవని పందెమువేసి పలుకగలను. ఇంతేల! ప్రస్తుతకాలమున మద్యముసేవింపపనివాడు మనుజుడేకాడు? రమ్ము! జాగుచేయకు" మనిపల్కుచు తనచేతిలోని మద్యమును బలవంతముగా నాతని గొంతులో పోసెను. అంత మరియొకడు మరికొంత పోసెను. ఇంకొకడు కొంచెము పోసెను. అట్లేయందరాతనిచేత నత్యధికముగ ద్రాగించివైచిరి. మన్మథరావు మిత్రులమాట త్రోసివేయజాలక కాబోలును నోటిని తెరచి యుంచెను. నాడాతడధికముగ ద్రాగుటవలన మాంద్యము క్రమ్మెను. స్మృతితప్పి పోవజొచ్చెను. అంతట నతడు తన్మయుడై మద్యమును పొగడుచు పద్యపాదముల నుదహరించుచు నాద్యంతములు లేని యవకతవక మాటలాడుచు తుదకు నేలబడి పొరలాడసాగెను. మిత్రుని దురవస్థగాంచి మిగిలినవారలతని నచ్చోటినుండి కదలించుకొని పోయిరి.
    
                                        
    నాటి నుండియు మన్మథరావు మిత్రుల ప్రోత్సాహము చేత మద్య దేవతకు దాసానుదాసుడై దినదినమదేపనిగ ద్రాగజొచ్చెను. నాలుగు నెలలలోన మిత్రుల ప్రోత్సాహ మవసరము లేకుండా మద్యపానమొనర్ప నేర్చెను. మరిరెండు నెలలలోన నతడు నిపుణుడగు త్రాగుబోధన నెగడెను. అప్పటినుండియు నతడెడతెరపి లేకుండా త్రాగుటయే పనిగా, ఆనంద మందిరమే నివాస స్థానముగా సంచరింప జొచ్చెను. ధనము క్షీణింప దొడగెను. కాని మన్మధరావు లక్ష్యపెట్టుట లేదు. కాలక్రమమున నతని యసాధారణ మధుపానాసక్తి యందర కవగత మయ్యెను. ఐనను మన్మధునికి భయమేల? నిరాఘాతముగ నతడు తన కృత్యముల నడుపు చుండెను.
    అట్లు మన్మథరావు చెప్పరాని త్రాగుబోతుతనము చేత నానందమందిరము వీడజాల కుండెను. మిత్రబల మధికమగుచున్న కొలది యుక్తాయుక్త జ్ఞానశూన్యుడై యవ్వారిగ ధనము వెచ్చింపదొడగెను. సర్వకాల సర్వావస్థల యందాతనికి మద్యపాన మహామంత్ర పునశ్చరణమే పరమావధి యయ్యెను. పాపము ధనుకులలో ధనికుడని పేరొందిన మన్మథరావు త్రాగుడుకై ధనమవ్వారిగ వెచ్చింప జొచ్చెను. బుద్ది మందమైనప్పుడాతనికి భవిష్యత్పరిశీలన జ్ఞానమెట్లవవడును? అతని మాంద్యబుద్ధి నిజోద్యోగభంగకారియగునేమో యని తదీయ శ్రేయోలాభిలాషులు కొందఱు మిక్కుటముగ బోధించి యతనిని పాన విముఖునిగ చేయ సమకట్టిరి. కాని మన్మథుడు మాత్రము మధ్యదేవిని విడువజాలడమయ్యెను! అతని ప్రాణ మిత్రుడును, మహోపకారియును, సహచరుడునగు జస్వంతరావను నాతడు బోధించినను మన్మథుడు పెడచెవిని బెట్టెను. ఇక నితరుల మాట లెక్కయేమి? ఒక్కొక్కప్పుడాతనికి బోధింపవచ్చిన వారల నాతడు దుర్భాషలాడి వెడలగొట్టెను. కాన నెవ్వరును మరి బోధింప సమకట్టరైరి. ఇట్లు మన్మథరావు నిరాఘాటముగా త్రాగజొచ్చెను. తన్నడ్డువారెవ్వరును లేని సర్వస్వతంత్రుడై పోయెను.
    ఇట్లుండ క్రమక్రమముగ నాతని యారోగ్యము క్షీణింపదొడగెను. రోగములు పొడసూపెను. ఆనందమందిరమునకేగ వీలులేకపోయెను. అందువలన తగుమాత్ర మింటికే తెప్పించుకొని యతడు సేవింపజొచ్చెను. వైద్యుల యౌషధసేవకంటే మద్యసేవయే ముఖ్యతరమయ్యెను. అతడలవాటు నడచుకొనలేక పోయెను. కావున తన్నలము కొన్న రోగములు ప్రబలమయ్యెను. త్రాగుటకే వీలులేకపోయెను. అంతట జీతము నష్టముపై రెండు నెలల సెలవు పుచ్చుకొని యతడు మంచము పట్టెను. తెలివితప్పి కలలో సైతము "మద్యము! మద్య" మని కలువరింప జొచ్చెను.
    అతడు సెలవు పెట్టిన కాలములో పైయధికారులకతనిపై విరుద్దముగ గొన్ని యర్జీలు పంపబడియెను. వానియందతని యసాధారణ మాంద్యబుద్ధియు, నుద్యోగము చేయుటకు శక్తి లేమియు నుద్ఘాటింపబడి యుండెను. అతని దుర్వ్యసనాభిలాష యధికముగ వర్ణింపబడి యుండెను. అధికారులు వీనినన్నిటిని జాగ్రత్తతో పరిశీలించి తుదకునతని యశక్తత కన్నులకు గట్టినట్లు కన్పించుచుండుటచేత మన్మథునుద్యోగ బహిష్కృతు నొనర్చివైచిరి.
Related Novels


Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

China Yaanam

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.