Home » D Kameshwari » Madhupam
ఎవరో సైకాలజిస్టు రాశాడులే. ఈ పిచ్చి వేర్రిలన్నీ వాటి తాలుకూ ప్రభావమే. దానికి తగ్గట్టు మేధ లాంటి అమ్మాయిలు బాస్ ని ఇంప్రస్ చేసి స్వార్ధ ప్రయోజనాల కోసం బాస్ లకు దగ్గరయి లొంగిపోతుంటారు. ఈ 'దురద' లన్నీ నాల్గురోజుల ముచ్చటలే! ఏ మగాడూ భార్యా, పిల్లలు , ఇల్లు , సంసారం వదులుకోడు. ఇదో పార్ట్ టైం . రొటీన్ నించి అట విడుపు. సమాజంలో భార్య, స్థానం ఎప్పటికీ పోదు. దాని కున్న ప్రాముఖ్యం దానిదే. నా స్థానం పదిలం..... తేనెటీగ తేనెను వెతుక్కోవడం సహజ లక్షణం. అలాగే మగవాడూ..... ఆ ఆరాటం తీరేది కాదు. ఆ బుద్ది మారేదీ కాదు. దీని కోసం ప్రశాంతతని భగ్నం చేసుకోవడం అవివేకం గదా!
"పోవే . నీలాంటి ఆడవాళ్ళే ఇంతలా నిర్వీర్యమైపోయి సర్దుకు బతికేద్దామనుకోవడం నిజంగా ఆశ్చర్యంగా ...... కాదు షాకింగ్ గా అనిపిస్తుంది నాకు...."
"మహీ , ఇంటికెళ్ళి తీరిగ్గా ఆలోచించు. వాటేవర్ ఇటీజ్ . నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి. రొటీన్ లైఫ్ నుంచి సమస్యలు, ఆందోళనలు , అప్రశ్రుతులు సృష్టించుకోవడం వద్దు.... ఏమిటలా చూస్తున్నావు....' అఖిల ప్రశాంతంగా అంది.
"ఏం లేదు, ఓ భర్త మరొక స్త్రీతో తిరుగుతాడని తెలిసీ పట్టించుకునే కోరిక, తీరిక భార్యకు లేదు అనుకునేటంతగా మానవ సంవందాలు దిగజారి పోతున్నాయి. చదువు, ఉద్యోగం , సంపాదన తప్ప మనిషికి మరోటి అక్కరలేనంతగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాలు ,ఆప్యాయతలు, అనురాగాలు, భర్త దూరం అయితే పడే బాధ , అవమానం, అసహనం, నిస్తేజం మానవసంబంధాలలో వచ్చేశాయి అని ఆశ్చర్యంగా వుంది. :నిజమే , ఇదే ఇదివరకటి భార్య అయితే ఏడ్చి రాగాలు పెట్టి, అలిగి, తిండి మాని, పుట్టింటికి పోతానని బెదిరించి, సాధించి, నలుగురితో చెప్పుకుని నిస్సహాయంగా ఏడిచేది. అలా ఉండమంటావా నన్నూ ఇప్పుడు...." నవ్వింది అఖిల.
'అలా కాదు ... ఇంత ఈజీగా , పోనీలే .... ఏదో సరదా మోజు అనుకునే నిర్లుప్తత..."
"ఈజీగా వదలద్దంటావా . సర్లే అయితే .... ఓ పని చెయ్యి... మీ అడపడుచుతో చెప్పి కార్తీక్ కి ఓ రెండు ఎస్సెమ్మెస్ లు పంపమను." చిలిపిగా అంది. "మీ శ్రీమతి ఆఫీసులో వాళ్ళ బాస్ తో ..... ఆహా బాస్ వద్దు.... ముసలాడు. కొలీగ్ అందంగా ఎవరున్నారు కాస్త స్మార్ట్ గా , రొమాంటిక్ గా వుండేదేవరు..... ఆ, ఆదిత్య అగర్వాల్ అనే కొలీగ్ తో ప్రేమాయాణం సాగిస్తుంది కళ్ళు తెరవండి అని మెసేజ్ లు కొట్టించు. కార్తీక్ కి ఓ ఝలక్ ఇద్దాం.... ఏం...'
మహిమ ఆశ్చర్యంగా నోరు తెరచి చూస్తూ ఉండిపోయింది. "ఏయ్ మహీ.... ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు. నే చెప్పినట్లు చేయించు. మిగతాది నే చూసుకుంటా.... నవ్వుతూ అంది.
"మహీ, నీవన్నది నిజమే, మరి అంతలా పట్టనట్టు వదిలెయకూడదులే. అలా అని ఇంట్లో గొడవలూ ఉండొద్దు. భార్య అంటే మరీ అంత నిర్లక్ష్యమూ ఉండకూడదులే.."
మహిమ ఇంకా అలా తెల్లపోయి చూస్తుండగా , అఖిల లేచి చీరదులుపుకుని.... పద వెడదాం. టేకిట్ ఈజీ..... అంటూ 'నే చెప్పిన ఎస్సెమ్మెస్ లు మర్చిపోకు..." అంటూ మహిమ చెయ్యి పట్టుకు లేవదీసింది.
* * * *
ఐదు రోజులు గడిచాయి. గత మూడు రోజులుగా కార్తీక్ మొహంలో మారే హావభావాలు స్పష్టంగానే చూడగలుగుతోంది అఖిల. కోపం, అసహనం, సందిగ్ధత, అపనమ్మకం , కలవరం, అడగాలి అనుకున్నా అడగలేని అధైర్యం, అఖిల వైపు దొంగచూపులు..... మొహం గంటు పెట్టుకుని అన్యమనస్కంగా వుండటం..... ఆరోజు రాత్రి 'ఏం ఒంట్లో బాగులేదా అలా వున్నారేం....' మొఖానికి చేతులకి క్రీము పట్టించుకుంటూ అడిగింది అఖిల బెడ్ రూములో.
'ఒంట్లో ఏం రోగం' విసురుగా జవాబు. 'మరేమిటి ఆఫీసు ప్రాబ్లమా ?' నీవే నా ప్రాబ్లం అనాలనుకున్నా అనలేకపోయాడు. 'సర్లెండి, చెప్పాలని లేకపోతె ,మానేయండి. తలగడలు సర్దుకుని పడుకుంది. కార్తీక్ కటువుగా "చెప్పాల్సింది నీవు....' అన్నాడు . 'నేనా, ఏం చెప్పాలి?' అమాయకత నటించింది.
"దీనికి జవాబు....' సెల్ ఫోన్ తీసి మెసేజ్ ఓపెన్ చేసి అఖిల కళ్ళముందు ఆడించి.
"ఎవడో పనీ పాటా లేనివాళ్ళే ఇచ్చే మేసేజ్ ల గురించి నేనేం చెప్పాలి!" అంది.
"ఎంత పనిలేని వాడన్నా ఊరికే ఎవరూ ఇవ్వరు. కాస్తో కూస్తో నిజం లేనిదే." ఉక్రోషంగా జవాబివ్వమన్నట్టు సూటిగా చూశాడు. అంతే సూటిగా అఖిల చూసి "కాస్తో కూస్తో నిజాలుండవచ్చు.... ఏ కొలీగ్ తోనో లంచ్ కొ డిన్నరు కో వెళ్ళచ్చు కారులో ఎక్కడికన్నా వెళ్ళచ్చు. సరదాగా ఏ పార్కులో వెళ్ళి ఉండొచ్చు....." నిర్లక్ష్యంగా అంది.
"పరాయి మగాడితో సినిమాలకి , హోటళ్ళకి , షికార్ల కి వెళ్ళడం.... ఇవన్నీ కాస్తో కూస్తో నిజాలన్న మాట ...." వ్యంగ్యంగా అన్నాడు.
"అంతే మరి, అలాగే అనుకోండి. ఆడవాళ్ళం , ఉద్యోగాలు చేస్తున్నాం. మీలాగే మాకూ రొటీన్ నించి బోరు కొడితే ఎక్కడి కన్నా వెళ్లాలనిపించవచ్చు. కాస్త థ్రిల్ కోసం ఏ క్లబ్బుకో వెళ్ళచ్చు కొలీగ్ తో.... లైఫ్ బోరు కొట్టి కాస్త మార్పు కావాలనిపించడం తప్పా. ఏం మీ మగాళ్ళు అమ్మాయిలని వెంటేసుకు వెళ్ళరా ఎప్పుడూ, "సూటిగా అడిగింది.
'అంటే మాతో వంతు పోతున్నారన్నమాట. అంటే మగాళ్ళు చేస్తే మీరు చేస్తారా? రిలాక్స్ అవడానికో, థ్రిల్ కోసం ఇంకో మగాడితో తిరిగితే తప్పేం ఉంది అనే వరకు వచ్చిందా వ్యవహారం." కోపంతో మాటలు తడబడ్డాయి.
'అవును మరి. ఇన్నాళ్ళు పాపం ఆడవాళ్ళు ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటివన్నీ పాపం వాళ్ళకి అందుబాటులో లేక భర్త గారి తిరుగుళ్ళు తెలిసీ భరించేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు చదివి, మగాడితో సరిగా సంపాదిస్తున్నప్పుడు వాళ్ళకుండే అవకాశాలని వాళ్ళూ అందిపుచ్చుకోవాలనుకోవడంలో తప్పుందా?" నిలదీసింది. కార్తీక్ తెల్లబోయాడు. ఏం మీ మగవాళ్ళ కెనా 'సెవెన్ ఇయర్ ఇచ్ లు' నలభై ఏళ్ళ యవ్వనాలుండవచ్చు. పెళ్ళాం కాస్త పాతబడి , పిల్లలు పుట్టుకు రాగానే కొత్త రుచులు, థ్రిల్స్ కోసం ఆరాటపడి రొమాంటిక్ హీరోల్లా కొత్త మోజుల వెంట ఆరాటంగా తిరగొచ్చా. ఏం పాపం ఆడవాళ్ళూ మనుష్యులేగా. రొటీన్ లైఫ్ నించి మార్పుండాలని కోరుకోకూడదా! ఆడవాళ్ళకి 'ఇచ్' లుండకూడదా .... కార్తీక్ మొహం ఎర్రబడింది.
"అంటే, ఈ ఎస్సేమ్మేస్ లు నిజమేనన్నమాట.
"నిజం అనుకుంటే నిజం. ఇలాంటి మెసేజ్ లు నాకూ వచ్చాయి. నేను పట్టించుకోలేదు. కావాలంటే చూడండి. సెల్ ఓపెన్ చేసి అతని ముందు పడేసింది. కార్తీక్ మొహం మాడిపోయింది. ఈ 'మేధ' ఎవరు అనైనా అడిగానా - భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. మిమ్మల్ని అడిగి, నిలేసి, గొడవ చేసి ఏడ్చి రాగాలెట్టి సంసారం వీధిన పడేసుకోవడానికి నేను పాతకాలం ఆడదాన్ని కాదు. నాకు ఇంట్లో శాంతి కావాలి. టెన్షన్స్ భరించే ఓపిక లేదు. ఎదిగిన పిల్లల ముందు గొడవలు పడి వాళ్ళ మనసులు బాధపడి చదువులు డిస్ట్రబ్ అయి వాళ్ళ భవిష్యత్తు లో ఆటలాడే హక్కు మనకు లేదు."
"ఈ మెసేజ్ లు నమ్మావా? నిజమనుకున్నావా?" సంజాయిషీ ఇస్తున్నట్లు అన్నాడు.
"నిజమో అబద్దమో ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. నిజమో అబద్దమో తేల్చుకోడానికి నిమిషం పట్టదు నాకు. నిజమైతే భార్యగా నా హక్కుల్ని వినియోగించుకుని ముక్కు పిండి లక్షలు వసూలు చేసి డైవోర్స్ తీసుకుని నా బతుకు నే బతకగలిగే ధైర్యం వుంది. ఒకరిపట్ల ఒకరు విశ్వాసంతో ఉండాలన్న పెళ్ళి ప్రమాణాలు గుర్తుంటే చాలు" నిబ్బరంగా అంది. అఖిల నించి చూపులు తప్పించి, కాసేపు సందిగ్ధంలో కొట్టుమిట్టాడి 'అయితే ఈ మెసేజ్ ల్లో నిజం లేదన్నమాట' చిన్న సందేహం, చిన్న ఆశ! అఖిల అతని వంక చూసి జవాబిచ్చింది. 'చెప్పాల్సింది మీరు, నేను కాదు' అంది. కార్తీక్ మొహంలో కలవరపాటు! కాసేపు ఏదో అలోచించి 'సరే, లెటజ్ ఫర్ గెట్ యిట్ నీవన్నట్టు ఈ పిచ్చి మేసేజ్ లు చూసి మనసు పాడుచేసుకోవద్దు. 'డిలిట్' చేసేద్దాం." అఖిల భుజం మీద చెయ్యేసి రాజీకి వచ్చినట్లున్నారు.
'సెల్ ఫోను నించి 'డిలిట్' చేసేయచ్చు ఈజీగా. జీవితాల నుంచి 'డిలిట్' చేయడం అంత సులభం కాదేమో!" భుజం మీద నించి అతని చెయ్యి తీసి మృదువుగా కిందపెట్టి "ఈరోజు నించి నన్ను తాకే అర్హత మీరు పోగొట్టుకున్నారు. లోకానికి మాత్రం మనం భార్యాభర్తలం. పిల్లలకి తల్లిదండ్రులం. ఆ పాత్రని చక్కగా పోషిద్దాం. ఇంత కూడా నేను మాట్లాడదలచలేదు. కాని తప్పు చేసిన భర్తకు భార్యని అనుమానించి నిలేసే అధికారం ఉంటే భర్త ప్రవర్తనకి శిక్ష వేసే అధికారం భార్యకి ఉంటుందిగా..." చాలా నిదానంగా అని పాలిపోయిన కార్తీక్ మొహం ఓసారి చూసి తలగడలు సర్దుకుపడుకుంది.
* * * *
పదిరోజుల తర్వాత మహిమ నించి ఫోను. "మేదని బ్రాంచి ఆఫీసుకు ట్రాన్సఫర్ చేశారుట. నీకు తెలుసా!" అంది. "ఇప్పుడు తెలిసిందిగా" నవ్వింది అఖిల.
***