Home » Prasanna Kumar » Prasanna Kumar - Sarraju kathalu - 2    సరే...సీయమ్ గారూ, ఆయన ఫామిలీ వంతెన దాటగానే గాంధీనగర్ గవర్నరు ఆయన్ని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడే హడావుడిగా వచ్చి కార్లోంచి దిగిన ఆ రాష్ట్ర సీయమ్ దగ్గర కొచ్చి ఈయన్ని కౌగలించు కున్నాడు. ఏదో ఓపెనింగుకీ వెళ్ళాల్సొచ్చిందని, రావటం లేటయిందనీ తెగ ఫీలయిపోయాడు. గవర్నరుపేట సీయం చాలా ఆశ్చర్యపోయి ఆనందపడ్డాడు. తనుతెచ్చిన స్వీటు ప్యాకెట్లను ఇద్దరికీ యిచ్చాడు. అంతా కలిసి సత్యన్నారాయణపురంలోని శివాలయం వీధిలో వీఐపీ గెస్టు హౌస్ కెళ్ళారు.
    మర్నాడు గవర్నరుపేట సీయమ్ గవర్నమెంటు హాస్పిటల్లో చేరాడు. ఆ మర్నాడే ఆపరేషను.
    ఫోన్ తీసి ఒన్ టౌన్ సీయమ్ కీ డయల్ చేశాడు. ఈయన వచ్చిన విషయం తెలిసి ఒన్ టౌన్ సీయం చాలా ఆనందపడ్డాడు. ఇలా తన తల్లికీ, భార్య కీ ఓ నాలుగురోజుల తర్వాత ఒక్క రోజుకీ టూరిస్టు వీసా అడిగితే ఆయన "ఇదో పెద్ద పనా! ఇమ్మిగ్రేషన్ అధికారులతో చెప్పి, అవసరమైన ఏర్పాట్లన్నీ చేయిస్తా" అని వాగ్ధానం చేశాడు. ఆరు నెల్ల క్రితం తనకు మాచారం ఆంజనేయస్వామికీ మొక్కుందంటే, ఎంతో పర్సనల్ కేర్ తీసుకుని, మూడురోజులు అతిథి మర్యాదలు చేసిన విషయం తానింకా మర్చిపోలేదని అన్నాడు.
    గవర్నరుపేట సీయమ్ కొంచెం సందేహిస్తూనే ఇలా కాలువలో నీళ్ళు మరీ తక్కువున్నాయని చెప్పి, కొంచెం బ్యారేజి గేట్లు తెరిస్తే మీ మేలు మర్చిపోలేమని అన్నాడు.
    "అయ్యో! అసలు నదిలో నీళ్ళుంటే గదండీ! ఈ ఆల్ మట్టి వ్యవహారం ఎప్పటికీ తేలేను? మా ఏలూరు కాలువ కూడా ఎందుకు పోతోంది. ఇంకో పదిహేను రోజులకి వున్న నీళ్ళు కూడా యింకి పోయేట్టున్నాయి. అప్పుడు ఆ ఆల్ మట్టి కంటే మనకాలవల్లో ఆల్ బురదే బెటరవుతుందేమో! కనీసం అది ఒంటికి రాసుకుని, కేరళ వైద్యం అయినా చేయించుకోవచ్చు" అని జోక్ చేశాడు. ఈయనకి నవ్వొచ్చింది.
    ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా అయింది. ఆయన తల్లీ, భార్య, కృష్ణమ్మ ఘాట్ దగ్గర చెంబుడు నీళ్ళు పదిరూపాయలచొప్పున కొనుక్కుని, స్నానం అయిందనిపించి దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి, అమ్మవారిని దర్శించుకుని పూజారిణి తీర్ధ ప్రసాదాలు అడిగితే "తీర్ధం ఇవ్వట్లేదమ్మా! ప్రసాదాలు ఆఫీసులో కొనుక్కోండి" అని నెత్తిన శఠగోపం పెట్టి పంపించాడు.
    మల్లేశ్వరస్వామి ఆలయంలో విభూది తీసుకుని, తిరిగొచ్చేటప్పుడు సబ్ వే దాటారు. వంతెన దగ్గర సెక్యూరిటీ విభూదిని సీజ్ చేసి, ల్యాబ్ కి పంపి, అందులో ఆంత్రాక్స్ లాంటిదేమీ లేదని రిపోర్టు వచ్చేదాకా ఓ గంట వీళ్ళని ఆపి, గాంధీనగర్ లోకి వెళ్ళనిచ్చారు.
    పదిహేను రోజుల తర్వాత సీయమ్ తిరిగొచ్చేటైముకి మళ్ళీ ధర్నా ప్లాన్ చేశాడు ప్రతిపక్షనాయకుడు.
    ఎల్లుండి ధర్నా వుందనగా వాళ్ళమ్మాయి "సినిమాకి తీసుకెళ్ళు నాన్నా" అని గారాబంగా అడిగింది. ఆ రోజు అమ్మాయి పుట్టినరోజు కాబట్టి సరే అన్నాడు.
    సాయంత్రం ఆరయింది. ఇంట్లో అంతా తయారయ్యారు. ఈయన మాత్రం కుర్చీలో కూర్చున్నవాడు అలాగే కూర్చున్నాడు. ఎన్నిసార్లు భార్య, కూతురు రెడీ అవండి' అని తొందరపెట్టినా 'ఇదుగో అదుగో' 'నేనెంతసేపు రెడీ అవడానికి' అంటున్నాడు తప్పితే లేవడంలా. వాళ్ళ మారుతీ వ్యాను డ్రైవర్ కూడా "అమ్మగారూ! 6-45కి సినిమా. ఇప్పుడు బయలుదేరితేగానీ ట్రాఫిక్ లో టైముకి చేరుకోలేం" అని చెప్తూనే వున్నాడు.
    ఆ సమయానికి ట్యూషన్ కెళ్ళిన పెద్దకొడుకు వచ్చాడు. సంగతి తెలుసుకుని "మీరేం వర్రీ అవకండి. నాన్నగారిని మీతో సినిమాకి పంపే బాధ్యత నాది. మీరెళ్ళి వ్యానులో కూర్చోండి" అని పక్కగదిలో కెళ్ళీ రెండు వీధులవతలే వున్న పోలీసు స్టేషనుకి ఫోన్ చేసి, ఏదో చెప్పాడు.
    కరక్టుగా ఐదు నిముషాల్లో అరడజను మంది పోలీసులొచ్చి ఈయన్ని బరబరా యీడ్చుకెళ్ళీ, ఈయన "సీయమ్ డౌన్ డౌన్" అని అరుస్తూంటే ఎత్తి వ్యాన్ లో కుదేశాడు. అదే అదనుగా వ్యాన్ డ్రైవర్ వెంటనే ముందుకురికించాడు. తల్లి కొడుకు తెలివితేటలకి అబ్బురపడింది.
    
                                 * * *
    
    సీయమ్ ఒచ్చేరోజు ప్రతిపక్షనాయకుడు కార్యకర్తలందరికీ కబురంపి రైవస్ కాల్వ దగ్గర రెడీగా వున్నాడు.
    సీయం వచ్చే టైముకి ఓ ముఫ్ఫైమంది కార్యకర్తలు కూడా పోగవలా. ఏమిటి విషయమంటే, వాళ్ళ కుటుంబాలన్నీ వేరే వేరేగా విడిపోతున్నాయట. కలిసి కట్టుగా ఎవరూ ఉండటం లేదుట. ఓ కార్యకర్తయితే వాపోయాడు. వాళ్ళింట్లో వున్న నాలుగు గదులూ నాలుగు వంటగదులయిపోయాయట. తనకో గ్యాసు పొయ్యి, తన భార్యకో గ్యాసు పొయ్యి, కొడుక్కీ కోడలికీ చెరో పొయ్యి ఏర్పాటయిందట. ఉప్పూ పప్పూ ఎవరికీ చాలక ఒకళ్ళ నుంచీ ఒకళ్ళు అడుక్కుంటూ జీవిస్తున్నారట. ఇదివరకు ఒక్క వంటగదిలో అందరికీ వండితే, అక్కడే సమిష్టిగా భోజనాలు అయిపోయేవిట. ఇప్పుడిదేం 'పొయ్యే' కాలం అని ఆ కార్యకర్త బాధపడ్డాడు.
    ఇదంతా విన్న మిగతా కార్యకర్తలు "మీరు నయం కనీసం రూమ్ కో వంటగది వుంది. మా ఇంట్లో ఉన్న ఒక్క వంటగదీ మా ఆవిడ ఆక్రమించుకుని తనకి మాత్రం టిఫిన్ చేసుకుతినేసింది. మాకు పొద్దుట్నించీ టిఫిన్లులేవు. సీయమ్ గారు తొందరగా వస్తే నాలుగు నినాదాలిచ్చీ, అరుపులు అరిచీ తొందరగా అరెస్టయి జైలుకెడితే అక్కడ కడుపునిండా టిఫినైనా పెడతారు గదా అని ఆశతో వచ్చాం" అన్నారు.   
Related Novels


Prasanna Kumar - Sarraju kathalu - 2

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.