Home » yerramsetti sai » Cine Bethalam


 

    "ప్లాప్ సినిమా తీయాలంటే నెంబర్ వన్ రూల్ - అ సినీవా లో భారీ తారాగణం ఉండాల్సార్! నెంబర్ టూ - విదేశాల్లో షూటింగ్, నెంబర్ త్రీ - చెత్త డిస్ట్రిబ్యూటర్లూ" అన్నాడు నింపాదిగా.
    'అదేంది ? పెద్ద యాక్టర్లను పెడితే సినిమా ప్లాప్ ఎట్టా అవుతుంది" ఆశ్చర్యంగా అడిగాడు నిర్మాత.
    "అదంతేనండీ ఈ ఫీల్డులో!"
    "అయితే పద!" అన్నాడు నిర్మాత గొనె సంచీ తీసుకుని నిలబడి.
    "ఎక్కడికండీ?"
    "భారీ తారాగణం కొనుక్కొద్దాం!"
    ఇద్దరూ కార్లో భారీ తారాగణం ఇంటికి చేరారు.
    "ఇదిగో - ఇదేనండీ భారీ హీరో గారిల్లు! మీ దగ్గర చిరతలు రడీగా ఉన్నాయా?" అడిగాడు డైరక్టరు.
    "సిరాతలా? అయ్యేందుకు?"
    "భారీ హీరో గారు మన సిన్మాలో నటించేందుకు అంగీకరించాలంటే కాసేపు మనిద్దరం అయన చుట్టూ తిరిగి భజన చేయాలండీ! ఆ భజనలో అయన నటన గురించీ, గొప్పతనం గురించి తెగ పొగడాలండీ! అప్పుడు గానీ అయన ఒప్పుకోరూ!"
    'అదేంటీ ? డబ్బిత్తండంగా? ఇంకా భజనేందుకు?"
    "అహహ -రెండూ ఉండాల్సిందేనండీ..... సరే ఈ చిరతల్తోనే చెరో కాసేపూ చేద్దాం లెండి"
    ఇద్దరూ కాసేపు భజన చేస్తూ భారీ హీరో చుట్టూ తిరిగాక అయన ఎగ్రిమెంట్ మీద సంతకం చేశాడు. సాయింత్రానికల్లా మిగతా భారీ తారాగణం అంతా కూడా బుక్కయి పోయారు. వెంటనే ప్లేన్ లో విదేశం చేరుకున్నారు. సినీవా షూటింగూ ఝుమ్మని ప్రారంభమయిపోయింది. రెండు నెలల్లో పూర్తి కూడా అయిపొయింది. సెన్సార్ ఫిలింబాక్స్ ని ఇంటికి తీసుకెళ్ళి భూతద్దాలేసుకుని వెతకసాగింది.
    "కొంపదీసి 'ఏ' సట్టిఫికేట్ తో రిలీజ్ కి ఒప్పుకోరు కదా!" భయంగా అన్నాడు నిర్మాత.
    "మీకా భయమేం లేదండీ! ఈ సినిమా  ప్రదర్శనకు గిన్నా సెన్సార్ అనుమతిస్తే నేను గుండు చేయించుకుంటానండీ! వాళ్ళకు 'ఉరి ' కూడా పడుతుందండీ! చూస్తూ చూస్తూ ఎవరూ ఉరిశిక్ష కోరుకోరు కదండీ!"
    సెన్సార్ ఆ సినిమాని భూతద్దాల్లోంచి చూసి బెదిరిపోయింది. ఆ తరువాత మామూలు అద్దాల్లోంచి చూసినా బెదురు తగ్గటం లేదు. "చస్తే ఒప్పుకోను! ఈ సినిమా బాన్" అంటూ అరచింది పిచ్చెక్కినట్లు.
    నిర్మాత ఆనందంతో పొంగిపోయాడు.
    'అమ్మయ్య! మొత్తానికి సాధించావోయ్ డైరక్టరు! ఇంక మనం ఇంటికెళ్ళిపోదామా?" అన్నాడు.
    "అయ్యో! మీ తెలివితక్కువతనం మండిపోనూ! అలా అరవకండి వాళ్ళు వింటారు. విని ఇందులో ఏదో నాటకముందని ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకి ఫోన్జేశారు. మనమేమో ఈ సినిమా మీదే ఇంకా బోలెడు ఖర్చు ' పెట్టాల్సి ఉందాయిరి. వాళ్ళని బ్రతిమాలి వాళ్ళ కభ్యంతరకరమయిన సన్నివేశాలేవో రీషూట్ చేద్దాం. అలా రీ షూట్ చేసుకుంటూ నల్ల డబ్బు ఖర్చు చేసుకుంటూ జీవితం హాయిగా గడిపేయవచ్చు. తెలిసిందాండీ?"
    "తెలిసిందహ! కానీ ఆడు మొత్తం సినిమా బాన్ అంటుండాడుగందా"
    "వాళ్ళట్లాగే అంటారండీ! అలవాటు కదండీ! అయినా మనం పట్టించుకోకూడదండీ! వాళ్ళ వెంబడి పడి నానా గొడవా చేయాలి. అంచేత మీరెళ్ళి ఆ బాక్స్ ని ఎలాగోలా మూడు సూత్రాల్లో ఏదొకటి ఉపయోగించి తీసుకురండి!"
    "ఏమిటా మూడు సూత్రాలు!"
    "బెగ్, బారో, ఆర్ స్టీల్ - అంటే బ్రతిమాలడం , లేదా ఇప్పుడే తెచ్చిస్తానని తీసుకురావడం లేదా దొంగిలించేసుకు రావడం"
    నిర్మాత ఆలోచనలో పడ్డాడు. "నీ యవ్వ! మనకెప్పుడూ మొదటి రెండూ పనులూ అలవాటు లేవే!" అన్నాడు బుర్ర గోక్కుంటూ.
    "అంటే - దొంగతనం అలవాటుందా?" అడిరిపడుతూ అన్నాడు డైరక్టరు.
    "అవునహ! అది లేపోతే మనిషి గొప్పోడెట్టాఅవుతాడు నాకు తెలవకడుగుతాను? నాకింత నల్లడబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?"
    "జోహర్లూ సార్! ఇన్ని సినిమాలు తీశాను గానీ ఈ నగ్న సత్యం ఇప్పుడే తెలుసుకుంటూన్నాను."
    "సరే ఈ రాత్రి కెళ్ళి మన బాక్స్ తీసుకొచ్చాత్తాలే -నువ్ ఫో" అన్నాడు నిర్మాత. డైరక్టర్ పోయాడు.

                                    *    *    *    *

    అర్ధరాత్రి సెన్సార్ ఆఫీసంతా గీజురుమంటోంది. ఎక్కడో కుక్కలు ఏడుస్తున్నాయ్. లోపల్నుంఛీ ఫిలిమ్ ని ఊచ కోత కోసే శబ్దాలు వాటి మధ్యలో నిర్మాతల ఆక్రందనలు, సెన్సార్ వాళ్ళ వికటాట్టహాసాలు....
    నిర్మాత ధైర్యం తెచ్చుకుని కిటికీ సువ్వలు వంచి లోపలకు నడిచాడు. లోపల సెన్సార్ కట్ అయిన ఫిలిం గుట్టలు గుట్టలు పడి ఉంది . వాటి మధ్య నుంచి నడిచి టార్చ్ లైట్ సహాయంతో తన ఫిలిమ్ బాక్స్ వెతుక్కుని అది ఎత్తి భుజాన్న వేసుకుని బయట కొచ్చి తనింటి వేపు వడివడిగా నడువసాగాడు. అప్పుడు బాక్స్ లో దాగి వున్న సెన్సార్ ఇలా అంది.
    "రాజా ! ఎప్పుడూ సారా వ్యాపారం చేసి కదలకుండా లక్షలు ఆర్జించే నీవు ఈ పాడు సినిమా కోసం ఇన్ని అవస్తలు పడడం చూస్తె జాలి వేస్తోంది. నీకు ఈ శ్రమా, బరువూ తెలీకుండా ఉండేందుకూ కధ చెప్తాను. ఒరు నిముషం ఉకారోంగో"
    "ఒరు నిముషం ఉకారోంగో" అంటే అర్ధమేమిటో నిర్మాత తెలీలేదు . తెల్ల మొఖం వేశాడు.
    "అదేమిటి నీకు తమిళం తెలీదా? నీ టామిళ్ తెరీమిల్లి యా, డోంట్ యూనో టామీళ్ , తమిళ్ మాలూమ్ నహీక్యా?" ఆశ్చర్యంగా అడిగింది సెన్సార్.
    నిర్మాత తల అడ్డంగా వూపాడు'.
    "తమిళం తెలీకుండా సినిమా ఎలా తీశావ్?" సెన్సార్ చిత్రంగా చూసిందతని వంక.
    "నువ్ మరీ ఇన్నోసెంట్ లాగున్నావ్ రాజా! అరవ్వాళ్ళు తెలుగు సినిమాలు తీసి మనని చంపడం, తెలుగువాళ్ళు హిందీ సినిమాలు తీసి వారిని చిత్రహింసలు పెట్టడం, మహ్మద్ రఫీ తెలుగులో పాడి తెలుగుని కైమా చేయడం - ఇలాంటివన్నీ చూసి తప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తున్నారా లేదా జనం? మరో భాష అసలు తేలికపోవడం వల్లనే , కదా ఈ గొడవంతా! సరే! ముందీ కధ విను" అంటూ కధ చెప్పడం ప్రారంభించింది సెన్సార్.

                                          ***
                                  
Related Novels


Cine Bethalam

Kanthi Kiranalu

Nirbhay Nagar Colony

Rambharosa Apartments

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.