Home » D Kameshwari » Kothaneeru    ఈ రోజుల్లో అయితే యీ కులాంతర, మతాంతర వివాహాలకి అంత ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కాని పాతికేళ్ళ క్రితం అవి ఒక వింత, విడ్డూరం, అనాగరికంగానే వుండేది.
    "మన తెలుగు వాళ్ళ కంటే వాళ్ళకి మడి, ఆచారాలు అన్నీ ఎక్కువేనమ్మా. మనలాగే ఆచారవ్యవహారాలన్నీ వుంటాయి....." తల్లి మనోభావాల్ని అర్ధంచేసుకున్నట్టు సర్ది చెప్ప నారంభించాడు.
    "రామం!.....మతి పోయిందేమిట్రా నీకు?.....మన తెలుగు దేశం గొడ్డుపోయినట్లు ఎక్కడో వెళ్ళి అరవ పిల్లని పెళ్ళాడడం ఏమిటి? మనకి వాళ్ళతో సంబంధం ఏమిట్రా...? ఎవరైనా వింటే నవ్విపోతారు. మీ నాన్న వింటే కోప్పడతారు కూడా. చాలుగాని. యింక యిలాంటి వెర్రి మొర్రి ఆలోచనలు మాను. ఆమాత్రం పిల్లలు మన దేశంలోనూ దొరుకుతారు. దానికోసం వెళ్ళి ఆ దేశం పిల్లని పెళ్ళాడాలా?" కొడుకుని మందలించింది పార్వతమ్మ. ఆ విషయాన్ని తేలిగ్గా జమకట్టి.
    కాని అది అంత తేలిగ్గా తేలిపోలేదు! ఎంత చెప్పినా రామం తనపట్టు విడవ లేదు. అంతకంటే అందమయిన వారు దొరుకుతారా దొరకరా అన్నది తన ప్రశ్న కాదని, తను ఆ అమ్మాయిని ప్రేమించానని, పెళ్ళి చేసుకుంటానని మాట యిచ్చానని, చేసుకుని తీరుతానని అన్నాడు.
    పార్వతమ్మ నయానా, భయానా కొడుకుని ఒప్పించలేకపోయింది. జగన్నాథం దగ్గిరికి వచ్చింది వ్యవహారం. విని, కొడుకుని పిలిచి, మంచీ, చెడ్డా వివరించి మందలించాడు ఆయన. తండ్రికి జవాబియ్యడానికి కూడా సందేహించలేదు రామం.
    తర్వాత ఎంత గొడవ జరగాలో అంతా జరిగింది. పార్వతమ్మ ఏడ్చింది. పరువు, ప్రతిష్టలు మంటగలపవద్దని బ్రతిమాలుకుంది. పస్తులు పడుకుంది. జగన్నాధంగారు కొడుకుతో మాట్లాడడం మానుకున్నారు. తెలిసిన పెద్దమనుష్యులందరి చేత చెప్పించారు కులాంతర, వర్ణాంతర వివాహాల వల్ల కలిగే అనర్ధాలను నోరు నొప్పి పెట్టేటట్టు చెప్పారు అందరూ.
    తల్లి రాసిన ఉత్తరం చూసుకుని దగ్గిరలోనే వుండే పెద్దకూతురు శకుంతల కూడా వచ్చి అన్నగారికి ఎంతో చెప్పిచూసింది. రామం తర్వాత ఐదేళ్ళకి పుట్టిన శకుంతలకి అన్నగారి దగ్గిర చనువు. రామానికి చెల్లెలంటే అభిమానం.
    "ఇదేమిటిరా అన్నయ్యా, మేమందరం ఏదో నీ పెళ్ళిలో దండిగా ఆడబడుచు లాంఛణాలు, అవి గుంజుకుందామనుకుంటూంటే నువ్వేమిటి ఏదో ప్రేమ పెళ్ళి అని ఆరంభించావుట." అన్నగారితో హాస్యంగా క్రింది సంభాషణ ఆరంభించింది శకుంతల.
    "అప్పుడే నీకూ చేరేశారా యీ కబురు! ఈ అయిన వాళ్ళందరూ చాలలేదానా, నువ్వు వచ్చావు నీతులు బోధించడానికి" అని సీరియస్ గా అన్నాడు రామం.
    "అయితే, ఆ 'మీనలోచని' అంత అందకత్తె కాబోలు! ఆలోచనలతో నిన్ను యింతగా వశపరుచుకుంది. ఏదీ, ఏదైనా ఫోటో వుంటే చూపించు.....ఏపాటి అందకత్తో చూస్తాను!....."
    రామం కసురుకున్నాడు. "ఇదంతా నీకు తమాషాగా వున్నట్లుంది. ఆమీనాక్షి భూలోకసుందరి అని నే నెవరితోనూ చెప్పలేదు! నాకు నచ్చింది. నేను చేసుకుంటాను!......అంతే!" పెడసరంగా అన్నాడు రామం.
    "అయితే యీపాటి అందకత్తెలు మనలో దొరకరనే?"
    "ఇదిగో, యీ మాట యిప్పటికి వంద మంది అన్నారు.....అంతే. మీలాంటి వాళ్ళకి ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది? మీనాక్షి కంటే వంద రెట్లు అందంగా వున్న అమ్మాయిని తెచ్చినా నా కక్కరలేదు. నాకు మీనాక్షే కావాలి! అదే ప్రేమంటే! నువ్వైనా నన్నర్ధం చేసుకుని యిలా వదిలి వెయ్యి." చుర చుర చూస్తూ అన్నాడు రామం.
    "ఓ యబ్బో, గట్టి ప్రేమే అన్నమాట!" అని అన్నా శకుంతలకి అన్నగారి పంతం, పట్టుదల అర్ధం అయాయి. అ మనసు మారేది కాదని గ్రహించింది.
    "బాగానే వుంది. ప్రేమించాను, పెళ్ళాడుతా నంటావు.....కాని నాన్నగారి పరువు. మర్యాద అదీ ఏమన్నా ఆలోచించావా?"
    "ఏం, నేను అంత పరువు తక్కువ పని ఏం చేస్తున్నాను?" కఠినంగా అన్నాడు.
    "నీకు అనిపించక పోవచ్చు. కాని మన జాతికాని పిల్లని పెళ్ళాడితే లోకం ఏమనుకుంటుంది? ఫలానావారి అబ్బాయి అరవ అమ్మాయిని పెళ్ళాడాడంటే నాన్నకి ఎంత తలవంపు!"....
    "ఇదిగో, శకూ! నువ్వు యిలా మాట్లాడతావేమిటి? కాస్తో కూస్తో చదువుకున్నావుకూడా! ఏం తమిళులయితే? వాళ్ళూ మనలాంటి మనుషులే! పోనీ, కులాంతరం అయితే మనకూ వాళ్ళకి సరిపడదనుకోవచ్చు! వాళ్ళకి మనకంటే ఆచార వ్యవహారాలలో ఎక్కువ పట్టింపు. తెలుసా? మనింట్లోకంటే మడి తడులు, పూజాపునస్కారాలు అన్నీ ఓ పాలు ఎక్కువే! ఎటొచ్చీ భాష వేరన్న మాట తప్ప అన్నింట్లోనూ మనతో సమానమే తెలుసా?....శకూ, నువ్వింకా అమ్మకీ, నాన్నకీ నచ్చచెపుతా వనుకున్నాను."
    "నాదేముందిరా యిష్టం లేకపోవడానికి? నాకేం కష్టం? ఏదో అమ్మా వాళ్ళు బాధపడుతూంటే చెప్పానంతే!" నసిగింది శకుంతల.
    "శకూ!.....ఈ సాయం చేశావంటే నువ్వడిగిన ఆ లాంఛనాలేవో, కాస్తగట్టిగా సిఫార్సుచేసి, కాస్త ఎక్కువే నీ కిప్పిస్తాను. ఏం బెంగ పెట్టుకోకు. ఆ ఆచారాలన్నీ వాళ్ళకీ వున్నాయిలే....." శకుంతల నవ్వింది.
    తర్వాత తల్లితో అంది శకుంతల. "లాభం లేదమ్మా, వాడడిగినట్లు పెళ్ళిచేసేయండి. వాడెలాగా చేసుకోక మానడు. మీ రెందుకు మాట దక్కించుకోకూడదు! ఇంకా ఏ ఆంగ్లోయిండియన్నో పెళ్ళాడుతానని అననందుకు సంతోషించండి. బాష వేరన్న మాట తప్పించి. మనకు ఏ విషయంలోనూ తీసికట్టుకాదుట వాళ్ళు" ....
    "అంతే నంటావా? తప్పదంటావా?" నీరసంగా అంది పార్వతమ్మ. జగన్నాధమూ రాజీ పడక తప్పలేదు చివరికి.
    పెళ్ళిలో మీనాక్షిని చూశాక అసంతృప్తి చాలావరకు తగ్గింది పార్వతమ్మకి, జగన్నాథానికి. ఆ మిగిలింది కాస్తా వాళ్ళు ఘనంగా పెళ్ళిచేసి, అత్తగారికి, ఆడపడుచులకి లాంఛనాలు సంతృప్తిగా జరిపించి, కంచి పట్టు చీరలు ఖరీదయినవి పెట్టాక పార్వతమ్మ ముఖం వికసించింది. వంటలు బ్రహ్మాండంగా వున్నాయని, ఇడ్లీలు సాంబారు వగైరాలు చాలా బాగున్నాయని, అవియల్, అవీ అద్భుతంగా వున్నాయని పెళ్ళి వారందరూ మెచ్చుకున్నారు. పెళ్ళినాటి రాత్రి సుబ్బలక్ష్మి గానకచేరి పెట్టించారు. దాంతో సంగీత ప్రియుడైన జగన్నాథంగారి ముఖం వికసించింది.
Related Novels


Agni Pariksha

Chikati Podduna Velugu Rekha

D Kameswari Kathalu

Kadedi Kadhaku Anarham

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.