Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam    అట్టివాని అర్ధములు నాకు తెలియును. శ్రీశుకునకు తెలియును. సంజయునకు తెలియునో తెలియదో! అన్నాడు. అంతటితో మహాభారత రచనా కార్యక్రమము ముగిసినది. అయినను వ్యాస మహర్షికి సంతృప్తి కలుగలేదు. రచన పూర్తి అయినది. దానిని మానవాళికి అందించవలసి ఉన్నది. అందుకు ప్రచారము అవసరమయి ఉన్నది. అప్పుడు మహర్షి ప్రచార కార్యక్రమమునకు నలుగురిని నియమించినాడు. దేవలోకమున నారద మహర్షిని, పితృలోకమున ఆ సితదేవలుని, గంధర్వ లోకమున శుకదేవుని నియమించినారు. మానవ లోకమున వైశంపాయనుడు నియుక్తుడయినాడు. జనమేజయుడు సర్పయాగము చేసినాడు. ఆ సందర్బమున వైశంపాయనుడు మహాభారత కధను వినిపించినాడు. అప్పుడు ఉగ్రశ్రవుడు అక్కడ ఉన్నాడు. ఆ కధ సాంతము అతడు విన్నాడు. ఆ కధను నైమిశారణ్యమున మునులకు వినిపించినాడు.
    రోమహర్షణుని కుమారుడు ఉగ్రశ్రవుడు. అతడు మునులకు వినిపించిన కధయే మన మహాభారత సంహిత.
    సర్వేషాం కవిమఖ్యానాముపేజీవ్యో భవిష్యతి
    పర్జన్య ఇవ భూతానా మక్షయ్యో భారత ద్రుమః
    సర్వప్రాణులకు పర్జన్యుడు జీవన ప్రదాత. అట్టిదే ఈ మహాభారత వృక్షము. సర్వ కవిముఖ్యుల రచనలకు ఆధారభూతమగును పర్జన్యునివలే.
    పురాణ పూర్ణచంద్రేణ శ్రుతిజ్యోత్స్నాః ప్రకాశితాః
    
    నృబుద్దికైరావాణాంచ కృతమేతత్ ప్రకాశనమ్.
    ఈ పురాణము పూర్ణచంద్రుని వంటిది. వేదముల వెన్నెలలు విరజిమ్ముచున్నది. మానవునిలో మనోరూపమయిన వెన్నెలలు విరబూయిస్తున్నది.
    అట్టి సంస్కృత భారతమును తెలుగువారికి అందించ ఉద్యమించినవారు నన్నయ బట్టారకులు. వారు భారతమును గురించి ఇట్లు ప[వవచించినారు :-

        ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని
              యధ్యాత్మవిదులు వేదాంతమనియు
        నీతి విచాక్షణుల్ నీతి శాస్త్రంబని
             కవి వృషంభులు మహా కావ్యమనియు
        లాక్షణికులు సర్వలక్షణ సంగ్ర
             హమని యైతిహసికు లితాహసమనియు
        బరమ పౌరాణికుల్ బహుపురాణ
        సముచ్చయంబని మహిగొనియాడుచుండ
        వివిధ వేదతత్త్వవేది వేద వ్యాసు
        డాదిముని పరాశరాత్మజుండు
        విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై
        పరగుచుండ జేసే భారతంబు.
    నన్నయ భట్టారకుడు విడిచిపోయిన భారత భాగమును తిక్కన సోమయాజి పూర్తిచేసినాడు. నన్నయ వదిలిపోయిన అరణ్య పర్వశేషమును ఎర్రా ప్రగడ పూరించినాడు. ఈ విధముగా కవిత్రయము వలన తెలుగువారికి భారతము లభించినది. భారతము పంచమ వేదము, తెలుగు వారికి అతి ప్రియమైన గ్రంధము. 'వినిన భారతము వినవలె , తినిన గారెలు తినవలె ' అనునది సామెత.
    
    నతాం స్వర్గగతిం ప్రాప్య తుష్టిం ప్రాప్నోతి మానవః
    యాం శృత్త్యేవ మహాపుణ్యమితిహస మాశ్నుతే
    ఇది మహాపుణ్య ప్రదమయిన ఇతిహాసము. దీనిని విన్నవారికి స్వర్గప్రాప్తి కలుగు సంతోషమునకన్న మిన్న అయిన ఆనందము కలుగును.
    య ఇదం భారతం రాజన్! వాచకాయ ప్రయచ్చతి
    తేన సర్వా మహీదత్తాభవేత్ సాగర మేఖలా
    రాజా! భారత గ్రంధమును చదువుకొనుటకు దానము చేసినవాడు సాగరమేఖల అయిన సకల భూమండలమును దానము చేసిన వాడగును.

                                  ఆలోచనామృతము
    
    సకల మానవ శ్రేయస్సాదనకు తమ జీవితములను, మేధసు కప్పురమువలె వెలిగించి వెలుగులు వెదజల్లిన మహాత్ములు ఎందరో ఉన్నారు. వారిలో వ్యాస మహర్షి అగ్రగణ్యుడు. అతడు రచించిన భారత సంహిత మానవాళికి మార్గదర్శక.
    మానవునకు మేధ ఉన్నది. అతడు సహజముగా స్వార్ధపరుడు. తన మేలు మాత్రము చూచుకొనుట అతని స్వభావము. అందుకు అతడు ఇతరులను భాదింతును. వ్యధపరచును. పరస్పర ప్రయోజనములకు సంఘర్షణ కలుగును. జీవితము సమాజము, ఘర్షణకు లోనుకాక తప్పదు.
    ఘర్షణ మానవుడు పుట్టినది అదిగా జరుగుచున్నది. దొరికిన రాతితో ఎదుటివాడిని కొట్టి వాని దగ్గరిది గుంజుకొనుట రాతియుగపు పద్దతి. ఆయుధము వచ్చిన తరువాత బలవంతులు ఆయుధములతో దండెత్తి బలహీనులను పరిమార్చుట జరిగినది. నాగరికత మరింత బలిసిన ఈనాడు శక్తిమంతములయిన మారణాయుధాలతో మందిని మట్టు పెట్టు మహా ప్రయత్నములు కొనసాగుతున్నవి. ఉపకరణములు మారినవి కాని, మానవుని బుద్ది మారలేదు.
    మానవుడు స్వార్ధజీవి నిజము. కాని అతనిలో స్వార్ధము మాత్రమే లేదు. అతనికి ఒక హృదయమున్నది. ఒక మనసున్నది. మంచితనము కూడ ఉన్నది. అయితే స్వార్ధము అను అంధకారము మిణుకు - మిణుకు మను మంచిని మింగివేయుచున్నది. మహాత్ములు మహర్షులు మిణుకు మిణుకు మను దీపాల వెలుగును పెంచి స్వర్దామను చీకటిని పారద్రోలుటకు ప్రయత్నించినారు. మానవుని సంస్కారవంతుని చేయుటకు నిరంతర యత్నము కొనసాగుతున్నది. ఆ ప్రయత్నమున వ్యాస మహర్షి చేసిన కృషి అనన్య సాధ్యము.
    మానవుని మంచి మార్గమున నడిపించుటకు రెండు శాఖలుగా నిరంతర యత్నము సాగుతున్నది. ఒకటి రాజకీయశక్తి, రెండవది సాహిత్య శక్తి. రాజకీయము నిర్దుష్యము, శక్తిమంతముగా లేనపుడు సాహిత్య శక్తియే ఈ కృషిని కొనసాగించినది.
    మానవుని జంతుదశ నుంచి ఉద్భవించినది వేదము. అతనికి స్వప్రయత్నము నేర్పినది వేదము. ప్రభు సమ్మితము. అనగా అది ప్రభువు వలె శాసించును. "సత్యంవద" నిజము పలుకును. అది ఒక శాసనము, అట్లు చేయవలసినదే. వేదము మానవుని శాసించినది. వేదము అపౌరుషేయము అన్నారు. అనిన ఏదో బలవత్తమమయిన భగవద్బక్తి దాని వెనుక ఉన్నది అని చెప్పినారు వేదకర్తలు. ఆశక్తికి వెరచి మానవుడు సన్మార్గగామి అగునని వారి సంకల్పము.
    వేదము శృతి. అది వినవలసినది. దానికి అక్షరాకృతి లేదు. ఒక నిర్దిష్టత లేదు. కాబట్టి స్వార్ధ పరులు బలిసి తాము చెప్పినదే వేదము అన్నారు. అట్లు వేదమును నిర్దిష్టరూపము లేక అదిస్వార్ధ పరుల చేతి కీలుబొమ్మ అయినది. విస్సన్న చెప్పినదే వేదము అనే దశకు వచ్చినది. ఏది వేదము, ఏది కాదు మానవులు తెలుసుకోనలేక పోయినారు. అట్టి అయోమయదశలో వేదవ్యాస మహర్షి అవతరించినారు. సర్వవ్యాప్తము, అవ్యాప్తము అయిన వేదమునంతయు సేకరించినాడు. దానిని పరిష్కరించినాడు. క్రోడీకరించినాడు. నాలుగు వేదములుగా విభజించి దానికి ఒక నిర్దిష్టతను ఏర్పరచినాడు. 
Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.