Next Page 
అందరూ మేధావులే పేజి 1

                                 

                  అందరూ మేధావులే!?

- కండ్లకుంట శరత్ చంద్ర                                          


    దేవుడు, దెయ్యం, సినిమా, సీరియళ్ళు, న్యూస్, అమెరికా, దేశభక్తి, హింస, స్వార్ధం, మంచితనం, క్రికెట్, ఫలానా నటుడు, ఫలానా పార్టీ, ఫలానా సబ్జెక్టు, ప్రేమ, డబ్బు, అధికారం, కులం, మతం, కీర్తి, సన్మానాలు, పాటలు, టి.వి.లో కనపడడం, గుడ్డు శాఖాహారమా....మాంసాహారమా అని వాదించుకోవడం, ప్రాంతీయ దురభిమానం, సెక్స్, మాదకద్రవ్యాలు, లెఫ్ట్ హాండ్ క్లబ్బో...మీసాలు పెంచేవారి క్లబ్బో...గుండు గీకించుకునేవారి క్లబ్బో....జులై 13న జన్మించిన వారి క్లబ్బో...స్థాపించెయ్యడం, ఇంటర్నెట్, చాడీలు చెప్పడం, 'నేనే మొనగాణ్ణి' అనుకోవడం, ఎప్పుడూ నిజమే చెప్పాలని ప్రయత్నించడం, చచ్చినా నిజం చెప్పకపోవడం, రవీంద్రభారతిలోనో...త్యాగరాజ గానసభలోనో జరిగే ప్రతి చిన్నా, పెద్దా ప్రోగ్రామ్ లో...ఏదోరకంగా స్టేజీమీదికి ఎక్కడం, ఇతిహాసాలలో తప్పులు వెదకడం, మాయాబజార్ సినిమా నలభై రెండోసారి...మిస్సమ్మ అరవైనాలుగోసారి...గుండమ్మకథ ఎనభై ఆరోసారీ చూసానని చెప్పుకు తిరగడం, ప్రపంచంలో...డాక్టరూ, సాఫ్ట్ వేర్ ఇంజనీయరు తప్ప...మిగతా ఏ ఉద్యోగాలైనా దండగని భావించి తమ పిల్లలను ఇంజనీరింగులోకో, మెడిసిన్ లోకో గెంటడం...... ఇలా రకరకాల పిచ్చివాళ్ళు...రకరకాల పిచ్చి!! ఇలా...రకరకాల పిచ్చివాళ్ళు జనారణ్యంలో తిరుగుతుంటే...కేవలం కొందరుమాత్రం...వాళ్ళ ఖర్మకాలి...పిచ్చాసుపత్రుల్లో ఉండడం... మహాపాపం!! అసలు ఒక్కముక్కలో చెప్పాలంటే...ఈ ప్రపంచంలో...పిచ్చిలేనివాళ్ళను వెతకాలంటే...ఆకాశమంత భూతద్దం కావాలి!!
ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి...చీఫ్ డాక్టర్ జ్ఞానచంద్ర సెల్ ఫోన్ మోగింది.

    "హలో...!"

    ".................."

    "ఆఁ! అవునా?!!!" రోమ్ ఎయిర్ పోర్టులో పాస్ పోర్టు పోగొట్టుకుని...ఇటాలియన్ బాష రాక అవస్థపడే ఇండియన్ లా ఉంది... అవతలి వ్యక్తి చెప్పింది విన్నాక....జ్ఞానచంద్ర పరిస్థితి.
    ".................."
    "ఊఁ! వాడిపనేనా....ఇది. ఛ...ఇడియట్!! దాహం వేస్తోందని, హుసేన్ సాగర్ లో మంచినీళ్ళు ముంచుకుతాగుతా...అనే తింగరి ఎదవకు తమ్ముడిలాంటి వాడు...ఆ రాస్కెల్." తన కోపాన్ని వ్యక్తపరిచాడు.
    ".................."
    "హుఁ! ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చరిత్రలో...ఇలాంటి సంఘటన ఎప్పుడూ...జరిగుండదు. ఇదేం ఆషామాషీ విషయం కాదు. నా చావుకొచ్చి పండింది." తిట్టుకుంటూ...తిడుతూ...ఏడుస్తూ...భయపడుతూ...ఫోన్ కట్ చేసి...హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కు ఫోన్ చెయ్యసాగాడు.

        *    *    *
    "వరున్! నేను, నిన్నే పెల్లి చేసుకుంటాను. ఇదిగో...నా కల్లు చూడు."
    "ఊఁ! చూస్తున్నా"
    "మల్లీ మల్లీ చెప్పను. నా కల్లలో...నీల్లు తెప్పించకు."
    "ఊఁ!"
    "మృనాలిని ఆంటీ...దూసుకొచ్చే బానం లాంటిది. జాగ్రత్త."
    "సరే!"
    "నా ప్రానం పోయినా...నిన్నే చేసుకుంటా. మరనంలోనూ...నీ తోడుంటా!"
    "థాంక్స్!"
    "క...ట్! ప్యాకప్!!" అరిచాడు, అప్పటిదాకా...టి.వి. సీరియల్ లోని ఓ సన్నివేశాన్ని...అద్దెకు తీసుకున్న ఆ బంగళాలో షూట్ చేస్తున్న దర్శకుడు.
    అందరూ...ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు.
    హీరో గబగబా వెళ్ళిపోయాడు. కెమెరామెన్...కెమెరాను సర్దేపనిలో ఉన్నారు. హీరోయిన్ పాత్రధారి...లలిత.... మెట్లెక్కి పై అంతస్తులో ఉన్న బాత్రూంలోనికి వెళ్ళింది. బాత్రూ తలుపేసి...మొహం కడుక్కుంటూ...పాట పాడసాగింది.
    అకస్మాత్తుగా కరెంటు పోయింది.
    మొహం కడుక్కుని...వెనక్కి తిరిగింది.
    ఆ చిమ్మచీకట్లో...బాత్రూంలో...ఓ మనిషి ఆకారం.
    "అరిస్తే...కత్తి నీ గుండెలో దిగుతుంది. అరవకుండా...క్రింద కూర్చో!" ఒక మగాడి కంఠం.
    ఆమె మౌనంగా...క్రింద కూర్చుంది. వచ్చినవాడు...దొంగా?! హంతకుడా?! రేపిస్టా?!!
    తమ డైలీ సీరియల్ టీమ్ లోని సభ్యుడా?!!
    గొంతు...అపరిచితుడిలా ఉంది.
    "ఈ సీరియల్ లో హీరోపాత్ర పేరు ఏమిటి?"
    "వరున్!" అంది భయంభయంగా.
    "ఏదీ...మళ్ళీ చెప్పు."
    "వరున్." అంది ఏడుపుగొంతుకతో.
    "కళ్ళు...అను."
    "కల్లు...".
"క...ళ్ళు...ళ...ళ..."
    "క...ల్లు...ల...ల..."
    "మృణాళిని."
    "మృనాలిని."
    "హుఁ! బాణము..."
    "బానము."
    ఆమె చెంప ఛెళ్ళుమనిపించాడు.
    "అసలు ఎవరు మీరు?" అడిగింది.
    "అది నీకు అనవసరం. 'ళ'...ను, 'ణ'....ను...సరిగ్గా పలకడం చేతకాదు... నీకు నటన, డైలాగులు చెప్పడం అవసరమానే?" కంఠంలో కసి.
    ఆమె ఏడుస్తూ... "నాకు పలకడం రాదు. నాకే కాదు... టి.వి.లలో, సినిమాలలో నటించే...చాలా మందికి రాదు. నేను ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ లో... ల,న...మాత్రమే ఉంటాయి. ఎల్, ఎన్!" అంది.
    "ఆహాఁ! అలాగయితే...అమెరికాకో, ఆస్ట్రేలియాకో పోయి...ఇంగ్లీష్ టి.వి సీరియళ్ళలో నటించొచ్చుగా! తెలుగు సరిగ్గా పలకడం చేతకాని నీకు...తెలుగు సీరియల్ అవసరమా?" మళ్ళీ ఆమె చెంప ఛెళ్ళుమంది.
    "కొడతారేంటండీ...పదాలు సరిగ్గా పలకకపోతే...మీకేం నష్టం?" అంది ఏడుస్తూ. "వాంతి...వాంతొస్తుందే... మీరు పదాలు పలికే తీరుకు! పెళ్ళిని...పెల్లి, పెల్లి అని పలుకుతుంటే...నాకూ, నాలాంటి భాషాభిమానులకూ కడుపులో దేవుతోంది!"
    "............."     
    "walking ను వాల్కింగ్ అనీ, Talking ను టాస్కింగ్ అనీ, shouldను...షుల్డ్ అనీ, know కెనో అని, knowledge ను కెనాలెడ్జ్ అనీ పలికితే...ఎవారైనా ఊరుకుంటారా?" అని మళ్ళీ చెంపపగలగొట్టాడు.
    "ఊరుకోరు..." అంది.
    "మరి...తెలుగంటే...ఎందుకే మీకు అంత చులకన!"
    "..............."
    అతడు లలిత మొహం మీద గట్టిగా ఒక గుద్దు గుద్దాడు.
    ఆ దెబ్బకు ఆమెకు మైకం కమ్మింది.
    అతడు...తన చేతిసంచీలో నుండి...తనకు కావాల్సిన వస్తువులు బయటికి తీసాడు. సమయం...సాయంత్రం ఏడయ్యింది!
            *    *    *  
    కృష్ణకిరణ్ నెమ్మదిగా...జూబ్లీహిల్స్ రోడ్డులో నడుస్తున్నాడు. సమయం రాత్రి తొమ్మిది!!
    చిక్కని చీకటి...నగరాన్ని కప్పేసినా...వీధిదీపాల వల్ల...ఆ ప్రాంతంలో వెలుతురు బాగానే ఉంది.
    అయితే...రోడ్డుమీద జనాలు లేరు.
    అప్పుడో కారు...ఇప్పుడోకారు...వెళుతున్నాయి.
    కృష్ణకిరణ్ ఒక సందులోనికి తిరిగి...ఎవరూ లేరని నిర్ధారించుకుని...మూత్రవిసర్జన కోసం...ప్యాంటు బొందు విప్పసాగాడు. నిజానికి అది ప్యాంటు కాదు. సాగరసంగమంలో కమలహాసన్ ధరించిన పైజామాలాగా ఉంది.
    వెనక...దూరంగా ఏదో తిరిగి చూసాడు.
    తనకు...ఇరవై అడుగుల దూరంలో...ఒక వికృత ఆకారం!
    ఆ ఆకారానికి...జుట్టు చిందరవందరగా ఉంది. చేతులన్నీ సగం కాలిపోయి...కమిలిపోయినట్లున్నాయి. వేళ్ళ చివర...గోళ్ళు అరంగుళాల పొడవుతో, పదునుగా...వొంపులు తిరిగున్నాయి.
    మొహానికి...తెల్లనిరంగు! మొహం మీద...నాలుగయిదుగాట్లు పడివున్నాయి.
    ఆ ఆకారం...దగ్గరౌతుంటే...దాని కళ్ళు కనిపించాయి...నల్ల గుడ్లులేవు...కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి!
    ఒక్కసారిగా...ఆ ఆకారం నాలుక బయటికి వచ్చి...విన్యాసం చేసింది.
    "దె...దె...దెయ్యం!" ఒక్కపెట్టున అరిచి పరుగు లంఘించుకున్నాడు.
    ఆ దెయ్యం...అతణ్ణి తరుముతోంది!
    అతడు...వేగంగా పరుగెత్తుతున్నాడు.
    వెనక... ఆ దెయ్యం వస్తున్న శబ్దం!
    అతడి నవనాడులూ కృంగిపోతున్నాయి.
    అతడి వొళ్ళంతా...స్వేదంతో తడిసిపోతోంది.
    ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో...అతడికి వణుకుపుడుతోంది.
    కాస్త తలతిప్పి వెనక్కి చూసాడు...పరుగెత్తుతూనే!
    ఆ దెయ్యం...తనకు సరిగ్గా ఆరడుగుల దూరంలో కనిపించింది. చేతులు చాపుకుని, నాలుక ఆడిస్తూ... వికృతస్వరూపంతో పరుగెత్తుకొస్తోంది. కృష్ణకిరణ్ అకస్మాత్తుగా...ఓ బంగళాను చూసాడు.
    'ఎలాగైనా...ఆ ఇంట్లోనికి వెళితే సరి!' మనసులో అనుకున్నాడు. వేగంగా పరుగెత్తుకొచ్చి... ఆ బంగళా తాలూకు కాంపౌండ్ వాల్ ను...ఒక్క గెంతు గెంతి...అందుకున్నాడు.
    అతని వేగానికి...అతని గెడ్డం చివర, ఎద, కడుపు, నడుము ముందు భాగం, మోకాళ్ళు కాళ్ళ వేళ్ళ చివరలు... బలంగా గోడకు తగిలాయి.

    ఒక్కసారిగా అతనికి మైకం కమ్మినట్లయ్యింది. కానీ...వెంటనే తమాయించుకున్నాడు.
    ఆ దెయ్యం...వచ్చసింది!
    అతడు...పైకి పాకసాగాడు. గోడ అంత ఎత్తు లేకపోతే...ఈ పాటికి గోడ ఎక్కి దూకేసుండేవాడు.
    ఆ దెయ్యం...అతడి రెండుకాళ్ళూ పట్టుకుంది.
    అంతే... "బ్యా...వ్!!" గట్టిగా కేకవేసాడు.
    ఆ దెయ్యం, అతడి కాళ్ళు పట్టి...క్రిందికి లాగుతోంది.
    ప్రాణభయంతో ఒక్కసారిగా కాళ్ళు విదిలించి కొట్టాడు.
    ఆ దెయ్యం...అతణ్ణి వదలలేదు.
    అతడు బలంగా...గాలిపీల్చుకుని...దాన్ని ఒక్క తన్నుతన్ని...వేగంగా పైకిపాకి...గోడ ఎక్కి, కాంపౌండ్ లోనికి దూకాడు.
    ఆ దెయ్యం...గోడ ఎక్కుతుందేమోనని భయపడ్డాడు...కానీ అది రాలేదు.
"హే...హే...హే...హే...."  రిధమికల్ గా...సన్నగా ఊపిరితీసుకుంటున్న శబ్దం వినిపించింది.
    అతడు...కళ్ళు చిలికించుకుని చూసాడు.
    అతడికి అడుగుదూరంలో...ఆ ఇంటితాలూకు...ఆల్సేషన్ డాగ్!!
    'ఎక్కడికీ పోతావు...చిన్నవాడా...' అనే టైపులో చూస్తోందది. ఏదో శబ్దం వినిపించి...గోడమీదికి చూసాడు. గోడ మీద...దెయ్యం కూర్చుని ఉంది!! అతని పైజామాలో...బొట్లుబొట్లుగా...మూత్రం కారుతోంది!!
        *    *    * 

Next Page