Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 1

                                 

 

                       నరుడా......ఏమి నీ కోరిక!?


                                                               ముచ్చర్ల రజనీ శకుంతల

 

                                      

 

 

    కామ్ గా, బుద్దిగా వున్న హైదరాబాద్ రోడ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.


    సందులు, గొందులు కలవర పడ్డాయి. రామ్ గోపాలవర్మ సినిమా షూటింగ్ చేస్తున్నాడా?అన్ని డౌట్ వచ్చింది జనాలకి. ఎందుకంటే అప్పటివరకూ కామ్ గా ఉన్న ఆ ప్రదేశంలో హడావిడి మొదలైంది.


    ఇంకా అయిదు కూడా అవ్వలేదు. సికింద్రారాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో పిచ్చ హడావుడి మొదలైంది. మార్నింగ్ వాక్ కు వచ్చిన అమ్మాయిలు, అమ్మాయిల అందాలు చూడ్డానికి వచ్చిన అబ్బాయిలు, అమ్మలు, బామ్మలు తాతయ్యలు , బిత్తరపోయి చూస్తుండగా చేజింగ్ మొదలైంది. "ఇదేమిటి చెప్మా....." అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు.

 

            
                                                              * * *


    "ఆగుము.....మానవా ఆగుము. ఆగి చచ్చుము....." యమధర్మరాజు కంచుకంఠంతో శ్రీ చంద్రని హెచ్చరిస్తున్నాడు పరుగెడుతూనే. ఆరడుగుల నిండు తిరుగుళ్ళు తిరిగి పిచ్చి పిచ్చి కలవరింతలతో మమ్మల్ని హడలిగొడతావా? మేము నిద్రపోవాలా? నీ చుట్టూ దేభ్యపు మొహాలేసుకుని చూస్తూ చావాలా? ఆ అరుపులేమిట్రా? దడుచుకు చచ్చాను కదరా పిండాకోర్ వెధవ ఆ కలవరింతలేమిట్రా.....పింజారి వెధవ... బిక్కచచ్చిపోయను కదరా. అర్ధరాత్రి రెండింటి నుంచి మొదలు నీ అరుపు, కేకలు విని చుట్టుప్రక్కల వాళ్ళు అమ్మనా బూతులు తిట్టిపోయార్రా" నాన్ స్టాఫ్ గా తిడుతూనే ఉన్నాడు గరుడాచలం ఆయసపడిపోతూ కూడా!


    అతని అరుపులు, తిట్లు విని ఆరుబయట మంచాలేసుకుని పడుకున్న జనం లేచి పిట్టగోడ దగ్గరికి వచ్చి ఆసక్తిగా చూడసాగారు.


    శ్రీచంద్ర బిక్కచచ్చిపోయాడు.


    "అబ్బబ్బ.....ఏమిట్రా వాడు అరిచాడని నువ్వు వాడిని కరిచేలా ఉన్నావు వెళ్ళు.....వెళ్ళి నిద్రపో" బామ్మ కొడుక్కి సర్దిచెప్పింది.


    తల్లి వంక కోపంగా చూసి-


    "నిద్రపోవాలా? అర్ధరాత్రి రెండింటికి వీడి కలవరింతలు విని నిద్ర లేచా, అప్పట్నుంచి 'నన్ను చంపొద్దు, నీకు దొరకను, ఆశ.....వడ, పూరి , పొంగల్ అంటూ కలవరించడం, కేకలేయడం, ఇప్పుడు టైమెంతయింది. ఆరు......ఇంకేం నిద్రపోతా' అని లోపలికి వచ్చి భార్య అరుంధతి వైపు చూసి-


    "ఇంకా ఏం చూస్తావ్? వెళ్ళు, వెళ్ళి కప్పు కాఫీ నామోహన కొట్టు' అన్నాడు.


    అరుంధతి మూతి ముప్పయి ఆరు వంకర్లు తిప్పి విసవిసా లోపలికి నడిచింది. నిజంగానే కాఫీ అతని మొహాన కొట్టడానికి.


    
                                                                * * *


    "ఓసి బామ్మా.....ఇదేంటే నా మీద అందరూ కారాలు, మిరియాలు నూరుతున్నారు. నేనేం చేశానే?"


    బామ్మా మనవడి వైపు తిరిగి "నువ్వేమి చేయలేదా? అర్ధరాత్రి రెండుగంటల నుంచి నీలో నువ్వే మాట్లాడుకుంటూ నీలో నువ్వే అరుచుకుంటూ మమ్మల్ని హడలగొట్టావు" అంది.


    "అవునే బామ్మా మరి యమధర్మరాజు ఎక్కడికెళ్ళాడే?" అడిగాడు శ్రీచంద్ర.


    "యమధర్మరాజు ఏంట్రా? నిద్రలో కల వచ్చిందా?" అడిగింది బామ్మ.


    అప్పుడు అర్ధమైంది తన కొచ్చింది అంతా కల! బాప్ రే! నిజమే అనుకుని ఎంత హడలి చచ్చాను అనుకున్నాడు. కలన్నమాట థాంక్ గాడ్! అయితే తన మొహం చక్కగానే ఉందన్నమాట.


    "అది కాదే బామ్మా, నిద్రలో కలొచ్చింది యమధర్మరాజు కనిపించి నా వెంటపడి 'చచ్చుకో......చచ్చుకో' అంటూ తరుముతున్నాడు.


    "అందుకే అడ్డమైన తిరుగుళ్ళు తిరగొద్దని చెబుతుంటా. వెంటనే తలస్నానం చేసి దేవుడికి దణ్ణం పెట్టి టిఫిన్ తినెయ్. మీ నాన్న బయటకు వచ్చి పంచాగం విప్పక ముందే వెళ్ళిపో" అంది బామ్మ.


    ఆ ఇంట్లో శ్రీ చంద్రని ఎప్పుడూ వెనకేసుకొచ్చేది బామ్మే.


    గరుడాచలం, అరుంధతి దంపతులు ;మేడ్ ఫర్ ఈచ్ ఆదరే"


    కోపంగా 'ఏమేవ్! ఎక్కడ తగలబడ్డావు" అని భర్త అడిగితే.


    "వంటింట్లోనే తగలబడ్డా. మీ కోసం ఏదైనా చేసి తగలేడదామని" అని సమాధానం ఇచ్చే టైప్ అరుంధతిది.


    కాఫీ ఎక్కడ పెట్టాలి? అని భార్య అడిగితే కోపంతో నా నెత్తి మీద పెట్టమంటే..... అక్షరాలా కాఫీ కప్పు తీసుకొచ్చి మొగుడి నెత్తిమీద పెడుతుంది.


    ఆ ఇంట్లో ఆ ఇద్దరికీ క్షణం పడదు. ఒక్క ఆ విషయంలో తప్ప మీరిద్దరూ జీవితంలో ఒక్కమాట మీద నిలబడి వుండరు. అయినా లేకపోతే నేనెలా పుడతాను అంటూ వళ్ళు మండినప్పుడు విరక్తిగా ఓ డైలాగ్ విసురుతాడు శ్రీచంద్ర.


    ఆ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కు అతనొక్కడే సంతానం!

 

                                                                       * * *


    శ్రీ చంద్ర డిగ్రీ అయిపోయి రెండేళ్ళు అయింది.


    ఉద్యోగం కోసం షరా మాములుగానే తిరిగాడు. ఎన్నో ఇంటర్ వ్యూలకి అటెండ్ అయ్యాడు.


    ఓసారి ఓ ఇంటర్ వ్యుకు వెళ్ళినప్పుడు ఆ ఇంటర్ వ్యూ చేసే ఆఫీసర్ కు మూడొంతులు పొగరు, మరో వంతు తను మంత్రిగారికి కావలసిన కాండిడేటని గర్వం.


    "హిమాలయాల ఎత్తు ఎంత?" అని అడిగాడు అప్పటికే బోల్డు అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేశాడు.


    శ్రీచంద్రకు మండుకొచ్చింది.


    "హిమాలయాల నుంచి తొంగిచూస్తే మీ బట్టతల కనిపిస్తుంది అంత ఎత్తు" అన్జేప్పాడు కామ్ గా.

Next Page