Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 1

                                 

                           వెన్నెల  వాకిళ్ళు
                                                                             శారదా అశోకవర్ధన్

                          

    "కొక్కొరో....కో ..."

    గంప కింద కోడిపుంజు పెద్దగా కూసింది.

    జయంతి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కోడి పుంజు మళ్ళి కూసింది. జయంతి కళ్ళు నులుముకుని పక్కకి చూసింది.

    అందరూ గాడనిద్రలో ఉన్నారు. మెల్లగా మంచం దిగి పంచలోకి వచ్చి కోళ్ళ గంపను ఎత్తింది.

    "కొ....క్కొ...కొక్కో..." అని రెక్కలు కొట్టుకుంటూ కోడి పుంజుతో పాటు నాలుగు కోడిపెట్టలు పంచలోంచి ఆరుబయటకు పరుగు తీసాయి.

    జయంతి గిన్నెనిండా జొన్నలు పట్టుకొచ్చి కోళ్ళ ముందు జల్లింది. అవన్నీ పోటిపడి ఆ గింజల చుట్టూ చేరి అరుచుకుంటూ తినసాగాయి. జయంతి లోపలికి వెళ్ళి లాంతరు వత్తిని పైకెత్తి పంచలోకి తెచ్చి చిన్న పీట మీద పెట్టింది. చెల్లెలు దగ్గరకు వెళ్ళి...."తులసి....తులసి....లేవవే....అందరికంటే ఈరోజు మనమే ముందు ముగ్గులు వేసి భోగిమంట వేద్దాం" అంటూ భుజాలు పట్టుకుని అటు ఇటూ కుదిపింది.

    "అబ్బా ....అక్కా....ఉండవే.....కాసేపు పడుకోనివ్వవే...." అంది తులసి బద్దకంగా.
    "లేవ్వే....మొద్దూ. ఇంకా మన వీధిలో ఎవరూ లేవలేదు. మనమే ఫస్ట్....కళ్ళాపి జల్లి ముగ్గువేద్దాం నా బంగారు చెల్లి కదూ....ప్లీజ్ తులసి" అంది తన పక్కనే కూర్చుని బ్రతిమాలుతూ. అలా కాసేపు అక్కచేత బ్రతిమాలించుకుని.

    "అబ్బా, ఏంటే! ఇంకా తెల్లారటానికి చాలా టైం వుందికదే అంది గారంగా.

    "చాలా ఏం లేదు. నాలుగయింది.....లేమ్మా మనమే ఫస్ట్ వేయాలి ముగ్గులు. నేను ఈలోపు పెడా పిసుకుతాను. నువ్వు ముగ్గు డబ్బా తీసుకురా....."అంటూ గొడ్లచావిడిలోకి వెళ్ళింది జయంతి.

    తులసి నవ్వుకుంటూ అలానే దుప్పటి మీద కప్పుకుని గూట్లో ఉన్న ముగ్గుడబ్బా తీసుకుని గొడ్ల చావిడిలోకి వచ్చింది.

    జయంతి బక్కేటు నిండా నీళ్ళు తెచ్చి అందులో పెడా కలిపి చేత్తో పిసుగుతూ...."తులసి ఈరోజు ఏం ముగ్గేద్దాం?" అని అడిగింది.

    "నీ ఇష్టం అక్కా  ...నువ్వు ఏ ముగ్గేసినా అందంగానే వుంటుంది నీలాగానే" అంది నవ్వుతూ.

    జయంతి కళ్ళాపి జల్లసాగింది.

    తులసి లాంతరు వత్తి పైకెత్తి వీధి అరుగు మీద పెట్టి లాంతరు పక్కన కూర్చుంది. ఆ వీధిలో మొత్తం నాలుగు ఇళ్ళు ఉన్నాయి. అన్నిటిలోకి సర్వోత్తమరావుగారి ఇల్లే పెద్దది. దాదాపు ఇరవై సెంట్ల ఆవరణలో పది గదుల పెద్ద డాబా. జయంతి కళ్ళాపి నీళ్ళు జల్లటం పూర్తి చేసింది.

    "తులసి, ఆ డబ్బా ఇటివ్వు" అంటూ ముగ్గుడబ్బా తీసుకుని చుక్కలు పెట్టటం ప్రారంభించింది. ఓ అరగంట తరవాత వంద చుక్కల పెద్ద ముగ్గు పూర్తి చేసింది.

    "అక్కా నేను మందారపూలు కోసుకొస్తాను. ఈలోపు నువ్వు గొబ్బిళ్ళు పెట్టు" అంటూ తులసి లోపలికి వెళ్ళింది.

    జయంతి గొబ్బిళ్ళను ముగ్గు మధ్యలో పెట్టింది.

    తులసి పంచలోకి వెళ్ళి ఎత్తుపీట తెచ్చుకుని మందారచెట్టు దగ్గర పెట్టి దానిపైకి ఎక్కి మందార పూలు కోసి ఒళ్ళో వేసుకుంది. వాటిని తీసుకుని వీధిలోకి వచ్చి 'అక్కా ఇవిగో పూలు వీటిపైన గుచ్చేదా' అంది గొబ్బిమ్మలను చూపిస్తూ.

    "అమర్చినదానిపైన అమ్మగారి చెయ్యా?" అంది గిరిజ.

    జయంతితోపాటు తులసికూడా ఉలిక్కిపడి గుమ్మం వేపు చూశారు. గిరిజ, జయంతి వాళ్ళ పెద్దనాన్నగారి పెద్దమ్మాయి.

    "ఏయ్ అక్కా, నువ్వెప్పుడోచ్చావ్?" అంది జయంతి.

    "ఇప్పుడే"

    "అమ్మా జయంతి...." అంటూ పెద్దనాన్నగారి కేక వినిపించటంతో ముగ్గురూ ఉలిక్కిపడ్డారు.

    "అక్కా.....వెళ్ళు, పెద్దనాన్నగారు ......లేచినట్లున్నారు. లేవటంతోనే నీ ముఖం చూడందే అయన కళ్ళు తెరవరుగా...వెళ్ళు వెళ్ళు త్వరగా" అంది తులసి.

    జయంతి నవ్వుకుంటూ చేతులు పైట కొంగుకు తుడుచుకుని కుచ్చిళ్ళు సరిచేసుకుని లోపలికి వెళ్ళింది.

    "జయంతంటే నాన్నగారికి ఎంత ప్రేమో...అది దాని అదృష్టం, ఇంట్లో అందరికి అదంటే ఇష్టమే" అంది గిరిజ తులసిని చూసి నవ్వుతూ.

    "అవునక్కా.....జయంతక్కంటే ప్రేమే కాదు అందరికి భయం కూడా. దాని ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరిగినా ప్రళయమే కదా?" అంది తులసి నవ్వుతూ.

    "అది అలా సాగించుకుంటుంది మరి. పద పద....భోగిమంట వేద్దాం. చలి బాగా పెడుతుంది." అంది గిరిజ లోపలికి దారితీస్తు తులసి కూడా వీధి తలుపు మూసి లోపలికి నడిచింది. క్రితంరోజు బాగా ఎత్తుగా పేర్చినా పాతసామాను , కట్టెలు...చెత్తచెదారంతో భోగిని సిద్దం చేసుకున్నారు. ఆ ఇంట్లో పిల్లలందరూ కలిసి, దాని దగ్గరకు వచ్చి అంది గిరిజ.

    "తులసి....మన గ్యాగ్ నందరిని లేపు భోగిమంట వేద్దాం. లేకపోతే తెల్లారి లేచి గొడవ చేస్తారు. మమ్మల్ని లేపలేదే అని" అంది చెల్లెల్ని చూసి నవ్వుతూ.

Next Page