Next Page 
నా కథవింటావా  పేజి 1

                                 

           

                                                        నా కథవింటావా ?
                                                                               -శారదా అశోక వర్ధన్                                           

                                            
   
                                                                       శారదాలోచనం!
    కొన్ని నిజాలు కల్పితాలకన్నా ఆశ్చర్యంగా  వుంటాయి. అని నమ్మడానికి  వీలుకానివిలా  వుంటాయి. అవి ఆనందాన్ని  కలుగజేసేవయితే  మనసు పరవళ్ళుతొక్కే  గోదావరిలా  పరవశించిపోతుంది. శృంగారాను భూతులకు  సంబంధించినదయితే, పండుగ  చేసుకుంటున్నట్టనిపిస్తుంది  ఆవేశపూరితమైనదయితే  మనసును  కలవరపరుస్తుంది. బాధాకరమైనదైతే గుండెను పిండేస్తుంది. భయభ్రాంతులు కలిగించేదయితే, వెన్నులో చలిపుట్టిస్తుంది! ఏది ఏమైనా  మనిషిని  ఆలోచింపజేసేదయివుండి, హృదయానికి  హత్తుకుపోయే సంఘటనలతో, సజీవంగా  పాత్రలు  మన కళ్ళ ముందు కదలాడుతున్నట్లుంటే, అదే పదికాలాలు నిలిచే  రచన! జీవితానికి దర్పణంలా, దిక్సూచిలా  తలపింప జేసేది మంచి రచన.
    ఒక చెట్టుకు పూసిన పూవులే  అయినా, కొన్ని వాడిపోతాయి, కొన్ని రాలిపోతాయి, కొన్ని గాలిలో ధూళిలో  కలిసిపోతాయి. కొన్నిమాత్రమే చెట్టుకే  కాలినంటి  బెట్టుకుని  నిలుస్తాయి. లేదా పరమాత్మ శిరస్సును  తాకుతాయి, మగువుల శిరోజాల నలంకరిస్తాయి. అలాగే రచయిత  చెట్టయితే, రచనలు పూలు! అవి ఎక్కడ  ఎలా నిలుస్తాయో తెలీదు. కొందరికి శృంగారం అందంగా అనిపిస్తుంది. కొందరికి కామం, క్రోధం, రౌద్రం సస్పెన్స్ ఇవన్నీ  థ్రిల్లింగ్ గా అనిపిస్తాయ్ మరికొందరికి, నీతి సూక్తీ రక్తి కట్టించి ఆసక్తిని కలిగిస్తాయి. 'లోకో భిన్నరుచి' అని అందరికి తెలుసు. అయితే రచన చేసేటప్పుడు  కానీ, చిత్రించేటప్పుడు  గానీ  ఏది ఎప్పుడు పేలుతుందో ,అది నిలుస్తుందో  పడిపోతుందో  చెప్పడం కష్టం!
    'నా కథ వింటావా?'__సీరియల్ ఆంధ్రభూమి డైలీలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఎందరో అభిమానుల ఆశీస్సులు  పొందింది. బుల్లితెరకు  సీరియల్ గా కూడా ఆమోదం పొందింది.
    సాధారణంగా ఏ రచయిత అయినా ఏదో ఒక సంఘటనకు స్పందిస్తేనే తప్ప కలం పట్టడు. అందులో నేను మరీను. అక్షరరూపం దాల్చేవరకు తోచనీయక నన్ను పీడించే, పీక్కుతినే స్థితికి వస్తే తప్ప తొందరగా రాయలేను నేను. అందుకే రాశిలో  నా రచనలు కుప్పలు కుప్పలుగా కనిపించవు!
    "నా కథ వింటావా" నవలలో ఇద్దరు స్త్రీలు కన్పిస్తారు  మనకి. కన్నెపిల్లగా  జీవితం గురించి ఎన్నెన్నో కలలు కని, న్యాయం, ధర్మం అంటూ పోరాడి, చివరికి అధర్మం చేతికో చిక్కుకుపోయి, అన్యాయం నిర్మించిన పంజరంలో బందీ అయి, చెయ్యని తప్పులకి, శిక్ష ననుభవించినా, జీవితం జీవించడానికే తప్ప చావడానికి కాదు" అని నిర్ణయించుకుని, సమాజానికి జంకక ఎదురీదినట్టు  ధైర్యంగా  సాగిపోయిన  యువతి  ఒకామె! ఆమె చేరదీసి ఊరడించిన  చిన్నారే పెద్దయ్యాక, ఆమెను  శంకించి నిలదీసి అడిగితే, ఆ పవిత్రమూర్తి తన కథను  వివరించిన ఉదంతమే  'నా కథ వింటావా?' నవల !
    ఆ కథేమిటో  మీరూ తెలుసుకోండి! పదండి పేజీలలోకి  పోదాం....
                                                                                                                           మీ
                                                                                                                    __శారదా అశోకవర్ధన్       

Next Page