Next Page 
మరో కర్ణుడి కథ  పేజి 1

                                 


                                                 మరో కర్ణుడి కథ


                                                                                          -వాసిరెడ్డి సీతాదేవి

 

                            


    డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని అన్నం తింటున్న శరత్ అన్యమనస్కంగా కన్పించాడు, ఎదురుగా కూర్చున్న సుశీలమ్మకు.


    "ఏమిటా పరధ్యానం? ఎంతసేపు తింటావ్ రా!" తల్లి కొడుకు ముఖంలోకి లోతుగా చూస్తూ అన్నది.  


    శరత్ సమాధానం ఇవ్వలేదు.


    "మీ నాన్నగారికి నీ మీద చాలా కోపంగా వుంది...." అంటూ ఆగి మళ్ళీ కొడుకు ముఖంలోకి చూసింది.     


    "నాకు తెలుసమ్మా!"


    "అయినా నీకీ ఉద్యోగం ఎందుకు చెప్పరా! మన వ్యాపారం చూసుకుంటే సరిపోదూ?"


    "అవసరం అయినప్పుడు అలాగే చూస్తానమ్మా. నాన్నగారు చూసుకుంటున్నారుగా! ఊరికే ఎందుకుండాలని ఉద్యోగంలో చేరాను" అన్నాడు శరత్.


    భోజనం ముగించి చెయ్యి కడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయాడు.


    శరత్ ఎం.ఏ. ఫస్టు క్లాసులో యూనివర్సిటీకి ఫస్టున పాసయ్యాడు. యూనివర్సిటీ వాళ్ళు పిల్చి ఉద్యోగం ఇచ్చారు. రెండు నెలలుగా ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు ఉద్యోగం చెయ్యడం రామనాధం గారికి ఇష్టం లేదు.


    శరత్ టేబుల్ ముందు కూర్చుని పుస్తకం తెరిచాడు. కళ్ళు అక్షరాలను చూస్తున్నాయి. కాని బుర్రకు అందడం లేదు.


    అమ్మకు ఎలా చెప్పడం? విని తట్టుకోగలదా? ఇప్పటికే నాన్నమీద తనమీద కోపంగా వుంది. ఇక ఆ విషయం వింటే తనను ఇంట్లో వుండనిస్తాడా? అందుకే తను ఉద్యోగంలో చేరాడు. ఆ మాట కొస్తే తనకి వ్యాపారం చూసుకోవడమే ఇష్టం!     


    నాన్న ఎటూ అంగీకరించడు!


    అమ్మ .... అమ్మ కూడా అంగీకరించకపోతే!? అమ్మ మనసు తనకు తెలుసు! అమ్మ డబ్బుకంటే మానవత్వాన్నే ఎక్కువ గౌరవిస్తుంది ఒకవేళ అమ్మ కూడా ఒప్పుకోకపోతే? అమ్మను బాధపెట్టక తప్పదా? నాన్న దగ్గిర తనకు ఎప్పుడూ చనువు లేదు. చిన్నప్పటి నుంచీ తనకు నాన్న అంటే భయమే. నాన్న తనను ఏనాడూ ఆప్యాయంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్లు జ్ఞాపకంలేదు. నాన్న స్వభావం అంతే అనుకోవడానికి కూడా వీల్లేదు. తమ్ముడికి నాన్నదగ్గిర చాలా చనువు. తమ్ముడు అమ్మ దగ్గిర కంటే నాన్న దగ్గిర ఎక్కువ మారాం చేస్తాడు.  


    నాన్నకు తనంటే ఇష్టం లేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు, కాని తనకూ ఏ లోటూ లేకుండానే చూసుకుంటాడు. తనకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేవాడు.


    సాధారణంగా తల్లికి చిన్నకొడుకూ, తండ్రికి పెద్దకొడుకూ అంటే ఎక్కువ ప్రేమ వుంటుందంటారు. కాని అమ్మ తమ్ముడికంటే, తనంటేనే ఎక్కువ ప్రేమగా వున్నట్టు కన్పిస్తుంది. ఒక్కోసారి తమ్ముడికి తనమీద అసూయ కలగడం కూడా కద్దు.  


    "నీకు పెద్దకొడుకంటే పక్షపాతం!" తమ్ముడు ఎన్నోసార్లు అనడం తను విన్నాడు.


    ఆ మాట విని అమ్మ నిండుగా. తొణక్కుండా నవ్వుతుంది.


    ఆమె నవ్వడం చూసి వాడు మరీ రెచ్చిపోతాడు.


    "పిచ్చివాడా! నాకిద్దరూ ఒకటేరా. మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళు. మిమ్మల్ని ఎవరైనా నీకు ఏ కన్ను అంటే ఇష్టం? అంటే ఏం చెబుతారురా?" అంటుంది అమ్మ గంభీరంగా.


    "బాబూ!"


    ఆలోచనల నుంచి తృళ్ళిపడి చివ్వున తలెత్తి చూశాడు శరత్.

 

    ఆమె ముఖం చూడగానే తల్లి మాట్లాడబోయే విషయం ఏమిటో అర్థం అయింది శరత్ కు.


    "ఏమిటమ్మా?" అన్నాడు.


    "మామయ్య ఉత్తరం రాశాడురా!" పక్క కుర్చీలో కూర్చుంటూ అన్నది సుశీలమ్మ.


    "ఏం రాశారు? అందరూ కులాసాగా వున్నారా?" ఏదో అడగాలి కనుక అడిగాడు శరత్.


    "ఏ విషయం వెంటనే తెలియపర్చమన్నాడు." శరత్ మాట్లాడలేదు.


    "ఆడపిల్లను ఎంతకాలం ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు? పోయిన సంవత్సరం ఆ విషయం నా దగ్గిర తెచ్చాడు. చదువు పూర్తికానివ్వమన్నాను. ఇప్పుడు నీ చదువు పూర్తయింది. భారతిని చేసుకోవడం నీకిష్టమేగా?" సుశీలమ్మ అడిగింది.


    శరత్ తలవంచుకుని ఆలోచనలో పడ్డాడు.


    "ఏరా మాట్లాడవ్? భారతి కేం తక్కువ చెప్పు? మామయ్యకు నువ్వంటే ప్రాణం. ఇక భారతికి...."


    "అమ్మా!" కొడుకు పిలుపుకు మధ్యలోనే ఆగిపోయింది సుశీలమ్మ.


    "ఏం బాబూ!"


    "నేను భారతిని చేసుకోలేనమ్మా!"


    "శరత్!"


    "అవునమ్మా!"

Next Page