Next Page 
వెన్నెల్లో గోదారి  పేజి 1

                                 


                                   వెన్నెల్లో గోదారి
    
                                                  ----యండమూరి వీరేంద్రనాథ్

 

                          
    
    
    తరళా ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టరు ఇంటి పడగ్గదిలో రాత్రి రెండున్నరకి ఒక ఫోన్ మ్రోగింది. యమ్. డి. ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ లో అవతలివారు చెప్పింది అతడికి మొదట అర్ధంకాలేదు. ఫోన్ పెట్టేసిన తరువాత కూడా అతడికి విషయం పూర్తిగా అర్ధం కాలేదని ముఖ భంగిమే చెపుతుంది. గబగబా లేచి తయారై, 'ఎక్కడికండి' అని అడుగుతున్న భార్యకి కూడా పూర్తిగా సమాధానం చెప్పకుండా కారు తీసుకుని పోలీస్ స్టేషన్ వైపు బయల్దేరాడు. అతడి నిద్ర ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది.        
    

    ఫోన్ లో వచ్చిన వార్తే అతడి మనసులో రీలులా తిరుగుతోంది.
    
    "నేను సార్, వెంకటపతిని మాట్లాడుతున్నాను".
    
    "ఎవరూ?"
    
    "టుటౌను పోలీసు స్టేషన్నించండి, వెంకటపతి- యెస్సైని..."
    
    "ఓ నువ్వా? ఏమిటి?"
    
    "రాత్రి ఇన్ స్పెక్టర్ గారు వ్యభిచారుల ఇళ్ళ మీద రైడింగ్ చేశారు కదండీ".
    
    "ఎవరూ సత్యనారాయణేనా?... అవును అటువంటి ప్రోగ్రాం ఏదో వుందని సాయంత్రం చెప్పాడు. ఇంతకీ ఇంత అర్దరాత్రి నా కెందుకు ఫోను చెయ్యడం?"
    
    "అందులో దొరికిన ఒక అమ్మాయి, మీరు తన తండ్రి అంటూందండీ".
    
    అతడి చెయ్యి రిసీవర్ మీద బిగుసుకుంది. 'వ్వాట్' అని అరిచాడు నమ్మలేనట్టు. "నీకేమైనా పిచ్చెక్కిందా?"
    
    ".....నిజం సార్. నిజం".

    

    తరళ కథనం    
    
    నమస్తే నా పేరు తరళ బియ్యే పాసయ్యాను.
    
    పెళ్ళయ్యే వరకూ నన్నందరూ పెంకి, అల్లరి అనేవారు. పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టాక ఆ పేర్లు బాగోవని అహంభావి, కోపిష్టి అన్న బిరుదులు తగిలించారు. అప్పటివరకూ పెళ్ళితో ఇంటి పేర్లొక్కటే మారతాయని అనుకునేదాన్ని బిరుదులు కూడా మారుతాయని తరువాత తెలిసింది.
    
    అయినా మీరే చెప్పండి-ఈ ప్రపంచంలో ఏ బిరుదూ లేకుండా ఎవరైనా వున్నారా?
    
    మీ ఇంటి పక్కావిడ ఎవరితో కలవకుండా తన పనేదో తను చేసుకుంటూ పోతే మీరంతా కలసి ఆవిడని 'నెమ్మదస్తురాలు, పనిమంతురాలు' అని అనుకొంటారా? లేక 'రిజర్వుడు - ఎవరితో కలవదు' అని బిరుదిస్తారా? నేనేమో రెండోదే అనుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా మీరుంటే మీకు నా నమస్కారాలు.
    
    మనిషి చేసే ఏ పనినైనా, ఈ విధంగా రెండు రకాలుగా అర్ధం చేసుకోవచ్చు. తన శత్రువు పైకి రావటానికి ఒకరు చెయ్యి అందించాడనుకోండి. శత్రువుని మంచి చేసుకోవటానికి చెయ్యి అదించాడ్రా అనైనా అనుకోవచ్చు. శత్రువుని క్షమించేటంత మంచి గుణం వున్న వాడ్రా అనైనా అనుకోవచ్చు. కానీ జనం తప్పకుండా చీకటివైపు వేలెత్తి చూపటానికే ప్రయత్నిస్తారు. అందుకే వాళ్ళని నేనెప్పుడూ పట్టించుకోను.
    
    నేనెప్పుడూ మూర్ఖంగా వాదిస్తాననీ, పట్టిన దానికి మూడే కాళ్ళు అంటాననీ మీరనుకుంటే అది మీ తప్పు. నేను పట్టుకున్నది కుందేటినా? లేక ముక్కాలి పీటనా? అన్నది కూడా చూడకుండా మీరా నిర్ణయానికి వస్తే అది మీ తప్పే కదా?
    
    అందుకే నాకు మీ తెలివితేటలు మీదగానీ, విచక్షణాజ్ఞానంమీద గానీ, మీమీదగానీ, ఏ మాత్రం గౌరవంలేదు. 'మీరు' అంటే మా పల్లెలో వాళ్ళు, మానాన్న, మా పనివాళ్ళు, నా క్లాస్ మేట్స్ వగైరా వగైరా లందరూ. మీకు నేను ఎప్పుడైతే గౌరవం ఇవ్వటం మానేశానో, (మానేశా కరక్టా? మానేసా కరెక్టా?) అప్పుడు మీరంతా ఏకమై నాకిచ్చే బిరుదు 'మొండి'.....ముందే చెప్పానుగా, ఈ జనం అంతా ఎప్పటికప్పుడు తమ చేష్టలని సమర్ధించుకోవటానికి కొన్ని పదాల్ని ముందే సంచిలో పెట్టుకుని వుంటారని.
    
    ఆనందరావుని ప్రేమించిన కొత్తలో ఆ విషయం నాన్నకి చెప్తే నాన్న నవ్వేడు. 'చిన్నపిల్లవి నీ కసలు ప్రేమకర్ధం తెలుసా' అని అడిగాడు. ఎందుకు తెలియదు? రోమియో జూలియెట్ వుండేది మాకు ప్రేమంటే ఒకరికోసం మరొకరు చావటం అని మా లెక్చరరు చెప్పింది. ఆహ్ది గుర్తొచ్చింది.
    
    ఆ రాత్రే గోదార్లో దూకేశాను.
    
    అన్నట్లు గోదావరి గురించి మీకేమీ చెప్పలేదుకదూ నేను. మా పల్లె పక్కనుంచి అది ప్రవహిస్తూ వుంటుంది. వంగిన కొబ్బరిచెట్లు ఏ క్షణమైనా కూలిపోయేట్టూ వుంటాయి. ఇరువైపులా రెల్లు గడ్డి వత్తుగా పెరిగి వుంటుంది. వర్షం వస్తే పల్లెంతా తడిసి పోతుంది. అదే, నా ఉద్దేశ్యం-బురద బురద అవుతుంది అన్నమాట.
    
    ఇంతకీ ఏం చెపుతున్నాను? నా బోయ్ ఫ్రెండ్ విషయమై నేను గోదార్లో దూకిన సంగతి కదూ అబ్బో ఇరవై ఏళ్ల వెనుకటి సంగతి అది.
    
    ఆ రోజు చాలా గొడవైంది.
    
    నేను నాన్నతో వాదించాను. "ప్రేమంటే తెలుసా? అని అడిగింది నువ్వేకదా? అది చెప్పటం కోసమే అలా దూకాను. నేను చచ్చిపోయి వుంటే వూర్లో తరతరాలపాటు జూలియెట్ లు ణ అగురించి చెప్పుకునేవారు కదా!" అని.
    
    కొందరు నాముందే నవ్వుకున్నారు. కొందరు భయపడి దూరంగా వెళ్ళినవ్వుకున్నారు. అంతా నాకు తెలుస్తూనే వుంది.
    
    పాపం నాన్నని చూస్తే మాత్రం జాలేసింది. ఆ పల్లెలో నాన్నమాటకు తిరుగులేదు. అంత పెద్దాయనా నా బోయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి చేతులు పట్టుకుని అడిగాడు(ట) నాకు తరువాత తెలిసింది. అలా నా పెళ్ళి అయిపోయింది.
    
    "మొత్తంమీద గోదార్లో దూకి మరీ సాధించింది" అని అందరూ అనుకున్నారు. "నువ్వు సుఖంగా వుండటమేనమ్మా కావల్సింది. ఇంకెప్పుడూ ఇలాంటి పన్లు చేయకు" అని నాన్న గుడ్ల నీరు కక్కుకుంటూ చేతిలో చెయ్యి వేయించుకున్నాడు. "నీ గురించి గోదార్లోనైనా దూకగలిగే భార్య లభించింది అదృష్టవంతుడివోయ్" అని మా ఆయన్ని స్నేహితులు అభినందించారు.

Next Page