Next Page 
ప్రార్థన పేజి 1

                                 


                                                                      ప్రార్థన

                                                                      _ యండమూరి వీరేంద్రనాథ్

 

                                                 ఒకటి

 

    నగరానికి నాలుగు కిలోమీటర్ల దక్షిణాన పాతిక ఎకరాల విస్తీర్ణంలో కట్టబడ్డ "మోహన్ లాల్ కపాడియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ రిసెర్చి" కాంపౌండ్ లోకి డాక్టర్ భార్గవ కారు ప్రవేశిస్తున్న తరుణాన...

 

    అదే సమయానికి ఊరికి ఉత్తరాన ఆరు కిలోమీటర్ల దూరానవున్న తోటలో పొడుగ్గా పాకుతూన్న చెట్ల నీడల్లో పిక్నిక్ కి వచ్చిన పిల్లలందరూ, కొందరు నిలబడీ కొందరు కూర్చోనీ హుషారుగా ముక్తకంఠంతో 'వన్ ట్వంటీ ఫోర్- వన్ ట్వంటీ ఫైవ్- వన్ ట్వంటీ సిక్స్' అని లెక్క పెడుతూంటే వాళ్ళ మధ్యలో పెదాల నడుమ అలసటను బిగబట్టి స్కిప్పింగ్ చేస్తూన్న పన్నెండేళ్ళ పాప లోపల్నుంచి తన్నుకు వస్తూన్న వేడికి ఇక తట్టుకోలేక మోకాళ్ళ మీదకు ముందుకు వంగి, అక్కడా నిలబడలేక క్రిందకు జారిపోయింది.

 

    అప్పుడు సమయం అయిదు గంటలు అవటానికి ఇంకా అయిదు నిముషాలుంది.

 


                                                                    *    *    *

 


    ఫంక్షన్ అయిదింటికి....

 

    ఈ రోజు నాటికి కాన్స్ - క్యూర్ కనిపెట్టబడి సరిగ్గా పది సంవత్సరాలయింది- అందుకే ఫంక్షను. నాలుగో అంతస్థు మేడమీద చిన్న స్టేజీ, ముందో రెండొందల కుర్చీలు అమర్చారు. టేప్ రికార్డర్ అటాచ్ చెయ్యబడ్డ మైకునుంచి రవిశంకర్ సితార్ వస్తూంది.

 

    అతడు వెళ్ళేసరికి అక్కడ చాలామంది వున్నారు. డాక్టర్ కరుణాకర్ అతడిని చూసి పలకరింపుగా నవ్వి, పక్క కుర్చీ చూపించాడు. భార్గవ కూర్చుని "ఇంకా ఎమ్.డి. రాలేదా?" అనడిగాడు.

 

    "ఇండియన్ పంక్చువాలిటీ" అంటూ నవ్వి కరుణాకర్ తన వాచీ చూసుకుంటూ "ఈ రోజు చంపాలాల్ కి గోల్డ్ మెడల్ ఇస్తారనుకుంటా" అన్నాడు.

 

    "ఎందుకు?"

 

    "కాన్స్-క్యూర్ కనిపెట్టి పది సంవత్సరాలు పూర్తయినందుకు"

 

    "కనుక్కున్నప్పుడు ఇచ్చారుగా. మళ్ళీ పది సమత్సరాలకీ- పాతిక సంవత్సరాలకీ- ఇలా యిచ్చుకుంటూ పోవటం దేనికి" అన్నాడు భార్గవ విసుగ్గా. అందులో ఈర్ష్యలేదు. భార్గవ ఇలాటి ఈర్ష్యాసూయలకు అతీతుడని అక్కడ చాలా మందికి తెలుసు. తన పనేదో తను చేసుకుంటూ పోతాడు. వాటికి మిగతా వాళ్ళలాగా పెద్దగా అడ్వర్టయిజ్ మెంట్ ఇవ్వడు.

 

    "చంపాలాల్ మీద మీకు నమ్మకం లేదనుకుంటా" అన్నాడు కరుణాకర్.

 

    "చంపాలాల్ మీద కాదు, అతడు కనుక్కున్న కాన్స్-క్యూర్ మీద. ఏ మాత్రం తార్కిక జ్ఞానం వున్నవాడయినా ఈ విషయం గ్రహిస్తాడు. భారతదేశంలో ఇంత ప్రాచుర్యం పొందిన ఈ మందు తాలూకు పేటెంట్స్ కోసం ఏ విదేశీ కంపెనీ కూడా ఎందుకు ముందుకు రాలేదు?"

 

    "ఎందుకంటే...."

 

    "ఎందుకంటే ఈ మందు చేసే పనిని- మెథోట్రెక్సేట్, మెర్ కాప్టోప్యూరిన్ లాటి మామూలు మందులు చేస్తాయి కాబట్టి" ఉక్రోషంగా అన్నాడు. అతడి ఉక్రోషం ఎద్దు ఈనింది అంటే దూడని కట్టెయ్యమనే మేధావుల మీద.

 

    ".... లుకేమియాకి మందు లేదు. పైన చెప్పిన మందులు కొంతవరకూ దీన్ని అరికడతాయి. కానీ ఎంత? నూటికి ఒక శాతం! 'కాన్స్ -క్యూర్' వాడటంవల్ల మాత్రం అంతకంటే ఎక్కువగా ఫలితం కనిపిస్తుందా? లేదే. భారతదేశంలో గత పది సంవత్సరాలుగా ఎవరైనా ఈ రోగుల లెక్కలు తీసి, మరణాల సంఖ్య పరిశీలిస్తే ఆ విషయం బయట పడుతుంది. కాన్స్-క్యూర్ వాడిన వాళ్ళు నూటికి ఒకరున్నా ఎక్కువ బ్రతికి బట్టకట్టలేదు. అది వాడకపోతే నూటికి నూరు చచ్చిపోయేవారే. నేను వప్పుకుంటాను. కానే మెధోట్రెక్సేట్ వాడినా ఆ ఒక్కశాతం బ్రతుకుతారు. యింత చిన్న విషయం ఎవరూ గమనించరేం?"

 

    "మీరీ విషయం మెడికల్ జర్నల్ లో వ్రాయొచ్చుగా".

 

    "ఇంకా నయం. ఈ ఇన్ స్టిట్యూటే మనకు తిండి పెట్టేది" అంటూ నవ్వాడు భార్గవ.

 

    వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వుంటే అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. అతడికి ముప్పై ఏళ్ళ దాకా వుంటాయి. కొద్దిగా జీన్ పాల్ బెల్యెండో పోలికలున్నాయి. కరుణాకర్ అతడిని పరిచయం చేస్తూ "మీట్ మిస్టర్ ఎస్సెన్ బత్తుల. అడ్మినిస్ట్రేటివ్ సెక్షను. మన దగ్గిర కొత్తగా చేరాడు ఛార్టెర్డ్ అకౌంటెంటు" అన్నాడు. "ఈయన పేరు భార్గవ. తన గదిలోంచి ఎప్పుడూ బయటకు రాడు కాబట్టి తెలిసే అవకాశం లేదు".

 

    "ఎస్సెన్ బత్తుల- పేరు గమ్మత్తుగా వుందే" అన్నాడు హాండిస్తూ భార్గవ. "అన్నాబత్తుల సోమశేఖరం గురూ గారూ. మార్వాడీ కంపెనీల్లో పేరు మార్చుకుంటే తొందరగా ప్రమోషన్ వస్తుందని ఎవరో అన్నారు. అందుకని చేరే ముందు జాగ్రత్తపడ్డాను" అన్నాడు. అతడిని చూస్తే భార్గవకి ముచ్చటేసింది.

 

    "ఏమిటి మాట్లాడుకుంటున్నారు- అఫ్ కోర్స్ ఇద్దరు సైంటిస్టులు కలుసుకుంటే మాట్లాడేది సైన్సే అనుకోండి. కానీ నాదంతా డెబిట్టు- క్రెడిట్టూ".

 

    "మేం మాట్లాడుకునేది మనదేశపు మేధావి వర్గంలో ప్రస్తుతం జరుగుతున్న 'నా వీపు నువ్వు గోకు- నీ వీపు నేను గోకుతాను' అన్న విధానం గురించి! నిజంగా ఏం జరిగేదీ మామూలు ప్రజలకి ఎలాగూ తెలీదు... నా గొప్పదనాన్ని నువ్వు గుర్తించు. నీ మేధావితనాన్ని నేను గుర్తించినట్టూ నటిస్తాను. ప్రభుత్వం ఇద్దర్నీ గుర్తిస్తుంది. ఎందుకంటే మన ఫీల్డు గురించి దానికేమీ తెలీదు కాబట్టి... ఇదీ మేము మాట్లాడుకునేది" అన్నాడు కరుణాకర్.

Next Page