Read more!

మూడు అడుగులతో ముడిపడిన పండుగ - ఓనం

 

మూడు అడుగులతో ముడిపడిన పండుగ - ఓనం

 

ఓనం కేరళ రాష్ట్రం వారి సాంప్రదాయ పండుగ. అంతేకాదు  వాళ్ళు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ కూడా. తెల్లని బట్టలు, వాటికి బంగారు రంగు అంచులు, పూల మాలలు, రకరకాల సాంప్రదాయ వంటకాలు. ఇవన్నీ ఓనం పండుగలో వెల్లివిరుస్తాయి. పదిరోజుల పసందైన పండుగ ఎంతో సందడిగా జరుగుతుంది. మన తెలుగు వారికి అన్ని తమవి చేసుకోవడం అలవాటు. పండుగలు వేరే దేశాలవి అయినా వేరే రాష్ట్రాలవి అయినా తమవే అన్నంత సంబరంగా జరుపుకుంటారు. వీటికి కారణం తెలుగు వాళ్ళు కేరళ ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా వెళ్లి అక్కడ పండుగకు అలవాటు పడటం, కేరళ ప్రాంత ప్రజలు మన తెలుగు రాష్ట్రాలలో స్థిరపడి  ఇక్కడ వారి సాంప్రదాయాన్ని విస్తృతం చేయడం. అయితే పండుగ ఏదైనా అందరూ సంతోషంగా పాలుపంచుకోవడానికి కాబట్టి పండుగ ఎవరిది అనేది పెద్ద విషయం కాదు. అయితే ఓనం కు హిందూ మతస్తులు పవిత్రంగా భావించే వామన జయంతికి సంబంధం ఉంది.  ఈ పండుగ వెనుక కథ ఏమిటీ అనే విషయం తెలిసిన వాళ్ళు చాలా తక్కువని చెప్పచ్చు.

ఈ పండుగ ఏమిటీ??

ఓనం కేరళ ప్రజల అతి ముఖ్యమైన పండుగ.  పదిరోజుల పాటి జరిగే ఈ పండుగను వారు "మహాబలి" ని ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగ. 

మహాబలి ఎవరు??

మహాబలి అనగానే తెలిసిన వాళ్ళు చాలా  తక్కువ ఉండచ్చు కానీ బలిచక్రవర్తి అనగానే గుర్తుపట్టేవాళ్ళు ఎక్కువ. ముఖ్యంగా పిల్లలకు ఈ బలిచక్రవర్తి కథ కూడా పరిచయమే. విష్ణుమూర్తికి మహా భక్తుడు అయిన ప్రహ్లాదుడు రాక్షస జాతికి చెందినవాడు అయినా విష్ణువు మీద భక్తితో ఆ గుణాలను వదిలి గొప్ప భక్తుడిగానూ, రాజు గానూ పేరు తెచ్చుకున్నాడు. ఈ ప్రహ్లాదుడి మనవడే మహాబలి. ప్రహ్లాదుడి ఒడిలో విద్యాబుద్ధులు నేర్చుకున్న మహాబలి కూడా గొప్ప విష్ణుభక్తుడిగా పెరిగాడు. అయితే ఇతనికున్న ధైర్యసాహసాల వల్ల ముల్లోకాలను జయించి ఆయా లోకాల్లో ఉన్న సంపదను సొంతం చేసుకున్నాడు. అందుకే మహాబలి అంటే దేవతలకు కోపం ఏర్పడిపోయింది. 

వామనుడి మూడు అడుగులు

దేవతలు అందరూ విష్ణువుకు తమ బాధ చెప్పుకున్నారు. అయితే విష్ణుమూర్తికి మహాబలి అంటే కోపం లేదు. అతను  ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తూ బాగా చూసుకుంటున్నాడు. మహాబలి కి ఇంకా గొప్ప స్థానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో విష్ణుమూర్తి వామనుడి అవతారం ఎత్తుతాడు. అంటే చిన్న బ్రాహ్మణ పిల్లడిలా. అతను నేరుగా బలిచక్రవర్తి దగ్గరకు వెళతాడు. బలిచక్రవర్తి వామనుడికి అతిథి మర్యాదలు చేసి, ఏమి కావాలని అడుగుతాడు. వామనుడు మూడు అడుగుల స్థలం కోరతాడు. అందులోని అంతార్థం తెలియక ఇస్తానంటాడు బలిచక్రవర్తి. వామనుడు భూమి మీద ఒక అడుగు, ఆకాశం మీద ఒక అడుగు పెట్టి మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అంటాడు. ఆ మూడవ అడుగు తన తల మీద పెట్టమంటాడు బలిచక్రవర్తి. అలా బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు వామనుడు. అప్పటి నుండి బలిచక్రవర్తి పాతాళాన్ని పాలిస్తూ ఉంటాడు. ఏడాదికి ఒకసారి తన ప్రాంత ప్రజలను కలుసుకునేందుకు వీలుగా మహాబలిని పాతాళం  నుండి ప్రజల దగ్గరకు పంపే అనుమతిని ఇచ్చాడని. ఆయన  వస్తాడనే కేరళ ప్రాంత ప్రజలు ఓనం పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెబుతారు. ఇది ఓనం పండుగ కథ, ఆ కథకు మూలమైన మహాబలి కథ. 

అయితే కేరళ వాళ్ళు ఓనం పండుగ జరుపుకుంటే హిందూమతంలో అందరూ వామన జయంతిని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. ఇది ఓనం కు, వామన జయంతికి ఉన్న సంబంధం.

◆ వెంకటేష్ పువ్వాడ