Home » Purana Patralu - Mythological Stories » రమణ మహర్షి చెప్పిన జపం విశిష్టత!!


రమణ మహర్షి చెప్పిన జపం విశిష్టత!!

 

【ఉత్తమస్తవా దుచ్ఛ మందతః । 

చిత్త జం జపం ధ్యాన ముత్తమం ॥

భావం : భగవంతుని గుణ, మహిమల గురించి స్తోత్రము చేయుట మంచిదే.  బిగ్గరగా చేయు జపం (వాచిక జపం) ఉత్తమమైనది. దాని కన్న మందపం(ఉపాంశువు) ఉత్తమం. దీనికన్న శ్రేష్టమైనది మానసిక జపం. 】

వివరణ:- బాహ్యంలో కర్మలు జరుగుతున్నవి అంటే వాటికి కారణం అంతరంగం లోని వాసనలే. లోపల వాసనలున్నంత కాలం అవి ప్రేరణలు ఇస్తూనే ఉంటాయి. వాటి కారణంగా మనస్సులో సంకల్పాలు జరిగి కర్మలు చేయటం జరుగుతున్నది. కర్మలు జరిగితే నష్టం ఏమిటి? కర్మలు మనను కర్మ సుడిగుండంలో పడవేస్తాయి. జనన మరణ చక్రంలో త్రిప్పుతాయి. దుఃఖ సముద్రంలో ముంచివేస్తాయి. కనుక కర్మలు ఆగాలి. కర్మలు ఆగాలంటే వాసనలు క్షయం కావాలి. ఇప్పటి వరకు మనలో ఉన్న వాసనలన్నీ ప్రాపంచికమైన వాసనలే. కనుక వాటికి అనుగుణంగా ఈ ప్రాపంచిక కర్మలలో మునిగి పోతున్నాం. మరి వాసనల నెట్లా క్షయం చేసుకోవాలి? దానికొకటే మార్గం. భగవంతుని వైపుకు తిరగటమే. ప్రేమపూరితమైన ఈశ్వర చింతన చేయటమే. భగవంతునిపై అచంచలమైన, అనన్యమైన భక్తిని అభ్యాసం చేయటమే. మనలో అట్టి భక్తి కలగాలన్నా, కలిగిన భక్తి మనలో నిలవాలన్నా భక్తి సాధనలను చేస్తుండాలి. అవే శరీరంతో చేసే పూజ, వాక్కుతో చేసే జపం, మనస్సుతో చేసే చింతనం. ఇవి ఒకదానికన్నా ఒకటి క్రమంగా ఉత్తమమైనవని ఇందులో మొదటి భక్తి సాధన అయిన పూజ. 

 రెండవ భక్తి సాధనమైనం జపం. జపం 3 రకాలుగా చేయవచ్చు. 

(1) ఉచ్చజపం: దీనినే వాచక జపం అంటారు. అంటే ఒక మంత్రాన్ని పెద్దగా ఉచ్చరించటం. 'ఓం నమో నారాయణాయ', 'ఓం నమో భగవతే వాసుదేవాయ', 'ఓం నమశ్శివాయ' ఇలా ఏదో ఒక నామాన్ని ఏదో ఒక మంత్రాన్ని పెద్దగా ప్రక్కన ఉన్న వారికి కూడా వినిపించేటట్లుగా పదే పదే ఉచ్చరించటమే ఉచ్ఛజపం.

(2) మందజపం: దీనినే 'ఉపాంశు' అని కూడా అంటారు. పెదవులు కదిలీ కదలనట్లుగా కదులుతాయి. నాలుక కూడా కదులుతుంది. శబ్దం సన్నగా వస్తుంది. అయితే నీ ప్రక్కన ఉన్న వారికి కూడా వినిపించదు. నీకు మాత్రమే వినిపిస్తుంది. ఉచ్చజపంలో నీవు ఏ మంత్రాన్ని జపిస్తున్నది ఇతరులకు కూడా తెలుస్తుంది. కాని ఈ మందజపంలో నీవు జపం చేస్తున్నావని మాత్రమే తెలుస్తుంది తప్ప, నీవు చేసే మంత్రం మాత్రం ఇతరులకు తెలియదు.

(3) చిత్తజంజపం: దీనినే 'మానసిక జపం' అంటారు. ఇందులో శబ్దం అసలురాదు. పెదవులు కదలవు. నాలుక కదలదు. ఇతరులకూ వినిపించదు, నీకూ వినిపించదు. కేవలం మనసులో మాత్రం దొర్లి పోతుంది. కనుక నీవు జపం చేస్తున్న విషయం కూడా ఇతరులకు తెలియదు. ఇవీ 3 రకాలు.

ఈ శ్లోకంలో రమణమహర్షి వాక్కుతో చేస్తే ఉత్తమస్థవం(స్తోత్రం) గురించీ, జపం గురించి తెలియ జేశారు. ఇవి ఉత్తమ మైన భక్తి సాధనలే. అయితే ఇందులో తర తమ భేదాలున్నాయి. ఒక దానికన్న ఒకటి ఉత్తమ మైనది అని కూడా చెబుతున్నారు. ఉత్తమ స్థవం కన్న జపం శ్రేష్టమని, జంలో కూడా ఉచ్ఛజపం కన్న మందజపం, మందజపం కన్న చిత్తజపం శ్రేష్టమని కూడా చెప్పారు.

స్ధవం అంటే స్తోత్రం. భగవంతుని స్తోత్రం చేయడానికి అనేక పదాలతో, వాక్యాలతో స్తోత్ర పాఠాలున్నాయి. విష్ణు సహస్ర నామ స్తోత్రం, లలితా సహస్ర నామ స్తోత్రం, శివ సహస్ర నామ స్తోత్రం.... ఇలా ఎన్నో స్తోత్రాలు, అష్టోత్తరాలు, వేద పారాయణలు, గీతా పారాయణలు... ఇలా అనేక విధాలైన భక్తి సాధనా మార్గాలున్నాయి. భగవంతుని మహిమలను స్తుతించటం, లేదా గానం చేయటం, భజన చేయటం ఇందులోనివే. ఈ స్తోత్రాలను వల్లించటం శారీరకంగా చేసే పూజ కన్నా శ్రేష్టమైనదే. ప్రారంభంలోని సాధకులకు ఎంతో ఉపయోగకరమైనదే. ఈ స్తోత్ర పాఠాలలో లేదా జపసాధనలో శరీరం యొక్క సహకారం అవసరం లేదు. కాకపోతే మనసు ప్రపంచం లోనికి పరుగిడకుండా కట్టడి చేయడానికి జపమాలను ఉపయోగించాల్సి ఉంటుంది. జపంలో ఒక్కటే మంత్రం ఉంటుంది. స్తోత్ర పాఠాలలో అలా కాదు 108 లేదా 1008 నామాలుంటాయి. లేదా అనేక మంత్రాలుంటాయి. లేదా అనేక శ్లోకాలుంటాయి. కనుక మనస్సుకు ఏకాగ్రత కలగడం కష్టం. అయితే జపంలో ఒక్కటే నామం లేదా మంత్రం. దానినే పదే పదే జపించాలి. కనుక మనస్సు ఆ ఒక్క మంత్రం మీద నిలిపితేచాలు. 'ఓం నమః శివాయ' 'ఓం నమో నారాయణాయ' నమః అంటే నాదేం లేదు అని. నాదేం లేదంటూ ఈమనస్సును తీసుకెళ్ళి అనంతచైతన్యంలో  ఆ పరమాత్మలో కలిపెయ్యటానికి చేసే ప్రయత్నమే ఈ జపం. ఈ జపసాధన సక్రమంగా చేస్తే మనలోని ప్రాపంచిక వాసనలు తొలిగిపోతాయి. వాటి స్థానంలో పరమాత్మ వాసనలు కూడుకుంటాయి. ఇవి మనను నిరంతరం పరమాత్మ భావనలో, భక్తి భావనలో నిలపటానికి చక్కగా తోడ్పడతాయి. 

◆ వెంకటేష్ పువ్వాడ
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.