Read more!

శాశ్వత సంతోషానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మార్గం!!

 

శాశ్వత సంతోషానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మార్గం!!

 

భగవద్గీత అంటేనే భవబాధలను నిర్మూలించి మనిషికి ముక్తి మార్గాన్ని స్పష్టంగా చూపే గ్రంధం. అందులో శ్రీకృష్ణ భగవానుని వాక్కులు అన్ని అమృత తుల్యమైనవి. శాశ్వత సంతోషానికి మార్గాన్ని చూపిస్తూ నాలుగవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకాన్ని ఇలా ప్రస్తావించాడు భగవానుడు

【శ్లోకం:- కాంక్షస్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః

క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజాః॥

ఫలితమును కోరి కర్మలు చేసే మానవులు ఈ ప్రపంచములో ఎందరో దేవతలను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆ దేవతలను ఆరాధిస్తే వారికి తొందరగా ఫలితములు లభిస్తున్నాయి.】

ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫలితమును ఆశించి కర్మలు చేస్తుంటారు. ఎందరో దేవతలను, దేవతా మూర్తులను పూజిస్తుంటారు. ఆ ప్రకారం వివిధ దేవతా మూర్తులను పూజించడం వలన వారు చేసిన కర్మలకు ఫలితం త్వరగా కలుగుతుంది. కొంత మంది నిరాకారుడను, నిర్వికల్పుడను అయిన నన్ను ధ్యానిస్తుంటారు. వారిని కూడా వారి వారి కర్మలను అనుసరించి అనుగ్రహిస్తుంటాను. ఈ ప్రకారంగా మానవులు వివిధములైన పద్ధతులలో, రీతులలో, వివిధ దేవతామూర్తుల రూపములలో నన్ను పూజించి, ఆరాధించి, తగిన ఫలములను పొందుతూ ఉంటారు. ఎవరు ఏ రీతిగా ఏ రూపములో నన్ను ఆరాధించినా వారికి తగిన ఫలములను నేను ఇస్తూ ఉంటాను.

కాని మానవులు నన్ను ఏ విధంగా, ఏ రూపంతో పూజించినా, వారు కోరే కోరికలు సిద్ధిస్తే కలిగే సంతోషమును, లభించింది పోతుందేమో అనే భయమును, ఒకవేళ లభించకపోతే కలిగే కోపమును విడిచి పెట్టి, ధర్మబుద్ధితో, నిష్కల్మష హృదయంతో నన్ను పూజించాలి. మానవులు మొదట వివిధ రూపములతో ఆరాధించి, క్రమక్రమేణా ఇంద్రియములను, మనసును జయించి, కామములను పక్కన పెట్టి, నిష్కామ కర్మలు ఆచరిస్తూ, నిశ్చయాత్మక బుద్ధి కలిగి నన్ను ఆరాధిస్తేనే చివరకు వాళ్లు నన్ను చేరుకుంటారు. ఇది పరమాత్మను పూజించే విధానము,

సాధారణంగా మానవులు తమకు దుఃఖాలు, కష్టాలు పోవాలనీ, శుభాలు కలగాలనీ వివిధ దేవతా మూర్తులను పూజిస్తుంటారు. ఎన్నెన్నో కోరికలు కోరుతుంటారు. వారి కోరికలు ధర్మబద్ధం అయితే అవి వెనువెంటనే తీరుతుంటాయి. కాని ఈ బంధముల నుండి మోక్షం కోరుకునే వాళ్లు ముందు దేవతామూర్తులను నిష్కామంగా పూజించి క్రమక్రమేణా నిర్గుణుడు అయిన పరమాత్మయందు మనసు లగ్నం చేసి, ఈ బంధనముల నుండి విముక్తి పొంది, పరమాత్మతో సాయుజ్యం పొందుతారు.

ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. పరమాత్మ కానీ, మనం పూజించే దేవతలు కానీ మన కోరికలు తీరుస్తారు. నిజమే, అవి ఎంతకాలం ఉంటాయి. ఎంత సుఖాన్ని ఇస్తాయి. మన దుఃఖాలను పోగొడతాయా అని ప్రశ్నించుకుంటే సమాధానం ప్రతికూలంగా వస్తుంది. సుఖం ఎప్పుడూ దుఃఖంతో అంతం అవుతుంది అనేది సర్వసాధారణం. తమకు చావు లేకుండా వరాలు పొందిన అసురులు అందరూ, మొదట సంతోషించినా, ఆఖరుకు ఆ పరమాత్మ చేతిలోనే మరణించారు. కాబట్టి మనకు ఏది లభించినా దాని వలన కలిగేది తాత్కాలిక సుఖమే. ఎందుకంటే లభించింది జారిపోతే వెంటనే దుఃఖం వస్తుంది. ధనం వస్తుంది సంతోషం. దానిని దాచి పెట్టలేక అవస్థ, ఆ ధనం పోతే దుఃఖం. కొడుకు పుట్టాడు సంతోషం. వాడు వెధవ అయితే దుఃఖం. వాడు పోతే ఇంకా దుఃఖం. ఎన్నో పూజలు, వ్రతాల ఫలంగా తనకు పెళ్లి అయినందుకు సంతోషించాలి. ఇన్నేళ్లొచ్చినా అమ్మ కొంగువదలని మొగుడిని చూచి ఏడవాలా, అత్త ఆడపడుచులు పెట్టే ఆరళ్లకు దుఃఖించాలా తెలియని అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రకారంగా సంయోగ వియోగాలతో సుఖదుఃఖాలు నిరంతరం వస్తుంటాయి.

కాబట్టి పరమాత్మ చెప్పేది ఏమిటంటే, మీరు నన్ను వివిధరూపాలలో పూజించండి. నేను ఆయాదేవతా మూర్తుల రూపంలో మీ కోరికలు తీరుస్తాను. కాని అవి మీకు శాశ్వతానందాన్ని ఇవ్వవు. మీరు ధర్మబద్ధంగా అడిగారు కాబట్టి మీ కోరికలు నేను తప్పక తీరుస్తాను. కాని అవి బంధాలు పెంచుతాయి కాని తుంచవు. మీరు కోరుకోవాల్సింది శాశ్వత సుఖాలను కానీ తాత్కాలిక సుఖాలను కాదు అని ఒక విధంగా మనలను హెచ్చరిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు.

◆ వెంకటేష్ పువ్వాడ