Read more!

నిశాకర మహర్షి సంపాతికి ఏమని చెప్పాడు?

 

నిశాకర మహర్షి సంపాతికి ఏమని చెప్పాడు?

సంపాతి వానరాలతో మాట్లాడుతూ వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. 6 రోజుల తరువాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు, నాకేమో రెక్కలు కాలిపోయాయి, అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాము అనుకున్నాను. కాని ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకి నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదాము అనుకొని మెల్లగా దేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడా మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్టు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి.

ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి. తరువాత ఆయన బయటకి వచ్చి నన్ను చూసి నిన్ను చాలాకాలం నుండి చూస్తున్నాను, నువ్వు, నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా. నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి అని అడిగారు. అప్పుడు నేను జరిగిన కథంతా చెప్పాను. అప్పుడాయన అన్నారు "సంపాతి! బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వలన ఒక మహత్కార్యం జరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు. ఈ సీతమ్మని అన్వేషిస్తూ వానరులు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను. అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళి వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది, కాని అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు. 

నీకు ఇంకొక విషయం చెబుతాను, సీతమ్మని అపహరించిన తరువాత ఆమెని వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు, దివ్యమైన భోజనము పెడతాడు. కాని ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక్క మెతుకు ముట్టదు. ఆ తల్లికోసం దేవేంద్రుడు ప్రతి రోజు దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు, కాని సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె, పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలని విడిచిపెట్టి ఉంటే, ఉర్ధలోకములలో ఉన్నవాళ్ళకి ఈ పాయసం చెందుగాక, అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు" అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుండి ఇలా బతికి ఉన్నాను అని చెప్పాడు సంపాతి.

సంపాతి ఈ మాటలని వానరాలకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళీ పుట్టాయి. అప్పుడాయన తన ఎర్రటి రెక్కలని అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

◆వెంకటేష్ పువ్వాడ.