Read more!

మానవ జీవితంలో కర్మయోగ ప్రాధాన్యత!!

 

మానవ జీవితంలో కర్మయోగ ప్రాధాన్యత!!

నేహాభిక్రమనాశో స్త్రీ ప్రత్యవాయో న విద్యతే! స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్||

ఏ కర్మనైనా నిష్కామంగా, ఒక యోగంగా చేస్తే, దానికి ఎప్పటికీ అపజయము ఉండదు. విపరీత ఫలితములు ఉండవు. అన్నీ మంచి ఫలితములే కలుగుతాయి. పైగా ఈ నిష్కామ కర్మ యోగమును పూర్తిగా ఆచరించక పోయినా పర్వాలేదు. ఎంత చేస్తే అంతవరకే ఫలితం ఇస్తుంది. ఏ కొంచెం సాధన చేసినా అది మనలను మృత్యు భయం నుండి కాపాడుతుంది.

ఒక విషయం చెప్పే ముందు దాని గురించి గొప్పగా చెప్పాలి. అప్పుడే చెప్పబోయే విషయం చక్కగా అర్థం అవుతుంది. దానినే భగవానుడు ఇక్కడ చేస్తున్నాడు. కర్మయోగము అంటే మానవ జీవన విధానము. బయట మనం ఎంతో ఉన్నతిని ప్రగతిని సాధిస్తాము. కాని లోపల అంతా కల్మషంగా ఉంటుంది. కాని లోపల కూడా అంటే అంతరంగం కూడా శుభ్రంగా ఉంచుకోమని చెప్పేదే ఈ జ్ఞాన, కర్మయోగముల సారాంశము. చాలా మందికి ఎంతో ఐశ్వర్యం, సంపదలు, చుట్టు జనం, ఉంటారు. ఎంతటి అంగబలం, అర్ధబలం ఉన్నా, ఒంటరి తనం ఫీల్ అవుతుంటారు. ఏదో తెలియని వెలితి. ఏదో కావాలని తపన. మనశ్శాంతి కొరకు పరితపిస్తుంటారు. మనశ్శాంతి కావాలంటే, ఇదిగో ఈ జ్ఞాన కర్మయోగములు ఆచరిస్తే దొరుకుతుంది అని భగవానుడు చెబుతున్నాడు.

మనశ్శాంతి మనయొక్క మానసిక ప్రవర్తన వల్ల కలుగుతుందేకానీ, మనకు ఉన్న సిరి సంపదల వల్ల కాదు అని కర్మయోగం బోధిస్తుంది. సుఖం ఎక్కడో లేదు. మనకు ఉన్న ధనము, ఆస్తి, పదవి, సంపాదన వీటిలో లేదు. ఇవి ఎన్ని ఉన్నా నిరంతరం దుఃఖంతో బాధపడేవాళ్లు ఉన్నారు. సుఖం మనలో ఉంది. మన ఫీలింగ్ లో ఉంది. మన మనసులో ఉంది. కాని మనం దానిని నమ్మము, మనకు అంగబలం, అర్ధ బలం, ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అనే అపోహలో ఉంటాము. ధనం కానీ, బంగారం కానీ, ఆస్తి కానీ ఒక మేరకు ఉంటే పర్వాలేదు. అమితంగా ఉంటే అదే అన్ని దుఃఖములకు కారణం అవుతుంది. కాబట్టి ధనము, ఆస్తి, బంగారము, అంగ బలము శారీరక సుఖాన్ని ఇస్తాయోమో కానీ, మానసిక సుఖాన్ని మానసిక ఆనందాన్ని ఇవ్వవు.

ఈ కర్మయోగం అనుష్ఠానం చేస్తే ఎవరికీ అపజయమే ఉండదు. చేసిన కర్మలకు విపరీత ఫలితములు కూడా రావు. సక్రమమైన ఫలితములే వస్తాయి. ఎలాగంటే మనం కర్మలను మెటీరియలిస్టిక్ గా చేస్తాము కర్మను కర్మగానే చేస్తాము. కాని కర్మను ఒక యోగంగా చేస్తే అంటే పరిశుద్ధమైన చిత్తముతో చేస్తే దాని వలన అపజయం కాని, విపరీత పరిణామాలు కానీ ఉండవు. ఏవేవో కోరికలు కోరుకుంటూ కర్మలు చేస్తే, ఆ కోరికలు తీరకపోతే విపరీత పరిణామాలు సంభవిస్తాయి కానీ నా ధర్మం నేను చేస్తున్నాను, ఏం ఫలితం వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను, పరమాత్మ ప్రసాదం అనుకుంటాను అని కర్మను ఒక యోగంగా చేస్తే, విపరీత పరిణామలు అంటూ ఏమీ ఉండదు. పైగా ప్రతి అపజయం నుండి తిరిగి జయం పొందడానికి కావలసిన పాఠాలు నేర్చుకుంటాడు.

ఈ కర్మయోగము పూర్తిగా ఆచరించవలసిన అవసరం లేదు. కొంచెం ఆచరించినా చాలు ఆ జనన మరణ భయం నుండి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే, ప్రాపంచికమైన కర్మలు పూర్తిగా చేస్తేనే కానీ నీకు ఫలితం దక్కదు. కానీ ఈ కర్మయోగము చిత్త శుద్ధితో నిష్కామంగా చేస్తే, కొద్దిగా ఆచరించినా పూర్తి ఫలితం ఇస్తుంది. ఒక కోటీశ్వరుడు ఏదో పుణ్యం వస్తుందని కోటి రూపాయలు దానం చేస్తే వచ్చే ఫలం, ఒక సామాన్యుడు ఆకలితో ఉన్న వాడికి కడుపు నిండా అన్నం పెడితే వచ్చే ఫలితం కన్నా తక్కువే. క్లుప్తంగా చెప్పాలంటే కర్మను కోరికతో చేస్తే బంధనములు కలిగిస్తుంది. అశాంతిని కలిగిస్తుంది. కర్మను కోరికలేకుండా. ఈ కర్మకు నేను కర్తను, అనే భావన లేకుండా, ఒక యోగంగా చేస్తే శాంతిని కలిగిస్తుంది. కర్మ బంధనముల నుండి మోక్షమును కలిగిస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ