Home » Others » అట్లతద్ది వ్రతము


 

అట్లతద్ది వ్రతముఅట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు.కన్నెపిల్లలు ఎంతగానో ఎదురుచూసే పండుగ ఇది. కాబోయే భర్త గురించి వారి ఊహలు, ఆశలు నెరవేరాలని కోరుకుంటూ నోచుకునే నోము ఈ పండగలో ప్రత్యేకం. తెలుగింటి ఆడపిల్లలంతా ఉత్సాహంగా జరుపుకునే పర్వం ఇది. చల్లని రాత్రి దుప్పటి ముసుగు తీయకముందే నిదుర లేచి, పండిన గోరింటాకును చూసుకుని మురిసిపోవడం, తక్కువగా పండితే ముసలి మొగుడొస్తాడని వేళాకోళాలాడుకోవడం, పొద్దు పొడిచే లోపలే చద్ది తినడం, ఆడపిల్లలంతా ఒక్కచోటచేరి ఆటలాడటం, ఉయ్యాలలూగడం అన్నీ సరదాలే. దీన్ని ఎక్కువగా కృష్ణా, గోదావరి ప్రజలు జరుపుకుంటారు.

 

త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగా పెడితే కుజదోష పరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా వుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటి సమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావము రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.అట్లతద్ది పండుగను ఉత్తభారత దేశంలో 'కర్వా ఛౌత్' అనే పేరుతో జరుపుకుంటారు.

ఉద్యాపన


 

ఈ వ్రతం అశ్వయుజమాసం, బహుళ తదియనాడు ఉపవాసం చేసి, చంద్రోదయం అయ్యేవరకు ఏమీ తినకూడదు. గౌరీదేవికి పది అట్లు నివేదన చేయాలి. అలా తొమ్మిది సంవత్సరములు చేసి, 10వ సంవత్సరమున, 10మంది ముత్తైదువులను పిలిచి, వారికి తలంటు స్నానము చేయించి, 10 అట్లు, పసుపు, కుంకుమ, రవికల బట్ట, దక్షిణ తాంబూలము సమర్పించి, సంతృప్తిగా భోజనము పెట్టాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈ పండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు. ఈ పండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము.ఈ పండగ వైభవము పట్టణాలకంటే పల్లెలో ఎక్కువగా కనిపిస్తుంది. అందరూ ఉత్సాహముగా జరుపుకుంటారు. తొలి కోడి కూసినప్పుడే లేచి ఉట్టికింద కూర్చొని గోంగూరపచ్చడి, కందిపులుసు మొదలైన వాటితో చద్ది అన్నము తిని తాంబూలం వేసుకుంటారు. ఇక అప్పటి నుండి నిద్ర పోరు. ఆట పాటలతో గడుపుతారు. అట్లతద్దోయ్ ఆరట్లో, ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అని పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఉయ్యాలలు ఇంట్లోకాక తోటలలో పెద్ద పెద్ద చెట్లకి వేస్తారు.  ఈ పండుగని అందరూ జరుపుకుంటారు. అందుకే అస్టాదశ వర్ణాలవారికి అట్లతద్దె అనే పేరు వచ్చింది.

ఉయ్యాల పండుగ


 

ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు. ఊరిలో వుంటే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు. ఈ సందట్లో మగవారికి ప్రవేశం లేదు. ఆడవారిదే రాజ్యం. తదియ రోజున ఊయల ఊగకపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతారు.  అట్లతద్ది రోజున నోములు నోచుకునే వారుంటారు. ఈ నోముల వెనుక ఒక పురాణ కథ కూడా వుంది.

అట్లతద్ది కథ


 

ఒకప్పుడు రాజుగారి కుమార్తె, మంత్రి గారి కుమార్తె కలిసి నోము నోచుకోసాగారట. రాజుగారి కుమార్తె ఎంతో సుకుమారి. సాయంత్రం గడిచేలోపలే నీరసంతో స్పృహతప్పి పడిపోయింది. అది చూసి భయపడిన ఆమె అన్నగారు చెట్టుకు ఒక పెద్ద అద్దం కట్టించి కింద నిప్పును పెట్టాడు. అద్దంలో దాని ప్రతిబింబం సూర్యా స్తమయం అవుతున్న భ్రమను కలిగించడంతో రాజుగారి కుమార్తె తన దీక్షను విరమించి భోజనం పూర్తి చేసింది. తరువాత ఆమెకు ముసలివాడు, వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి భర్తగా వచ్చాడు. ఎన్నో కష్టాలకోర్చిన ఆమె భగవంతుని ప్రార్థించగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు స్వప్నంలో కనిపించారు. వ్రతభంగమైన కారణంగానే ఇలా జరిగింది కనుక ఆశ్వీయుజ బహుళ తదియ నాడు తిరిగి ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పారు. ఆమె వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించి పూర్ణాయుష్కుడైన భర్తను, సుఖ,సంతోషాలను పొందిందని ఒక కథ.

నోము విధానం

నోము చేసుకునే స్త్రీలు ఉదయం ఉపవాసం చేసి సాయంత్రం పది పోగులతో దారాన్ని చేతికి కట్టుకుని, పదిమంది ముతైదులకు తలంటు స్నానం చేయించి, వాయినం ఇవ్వాలి. పసుపు, కుంకుమలు, రవికలగుడ్డ, తాంబూలంతోపాటుగా పదకొండు అట్లను వాయనంలో ఇస్తారు. పది సంవత్సరాలు ఈ నోమును నోచుకుంటారు. సంవత్సరానికి ఒక ముతైదుకు వాయినం ఇచ్చేవారు కొందరైతే, పదిమందికీ ఒకేసారి ఇచ్చేవారు కొందరు. వాయినం పుచ్చుకున్న అట్లను వారుతప్ప వేరొకరు తినకూడదనే నియమం వుంటుంది.

నోము విధానంలో కొందరిది వేరొక పద్ధతి. ఈ నోము నోచుకునే అమ్మాయిలు ఐదుగురు ముత్తైదువులకి పదకొండు అట్లు, తాంబూలంతో కలిపి ఇస్తారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను వెలిగించి ఆ అట్ల మీద పెట్టి ఇవ్వడం మరో సంప్రదాయం. అంతేకాక పోతురాజుకు పదకొండు అట్లను నైవేద్యంగా ఇస్తారు. అమ్మవారితోపాటు అయ్యవారి అంశగా ఇక్కడ పోతురాజును కొలుస్తారు. ప్రతిగ్రామంలోనూ అట్లతద్దికి ఆడవారంతా గ్రామదేవత గుడిదగ్గర ఈ వాయినాలను ఇచ్చి పుచ్చుకోవడం చేస్తారు.

శాస్త్రీయ దృక్పథం


 

ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.

స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది. సాంప్రదాయ వాదమైనా, శాస్త్రీయ దృక్కోణమైనా, పెద్దలు చెప్పే ఆచారమైనా మానవుల జీవన గతిలో కించిత్‌ మార్పును చొప్పించి, సంతోషాలను అందించేందుకు ఉద్దేశింపబడిందే. హైటెక్‌ యుగంలో పండుగలను కూడా సినిమాలతోనో, షికార్లతోనో గడిపేస్తున్నాం. అసలు పండుగల్లో దాగున్న ఆంతర్యమేమిటో అర్థం చేసుకుంటే సామాజిక ప్రగతికి అవి ఎంత దోహదకారులో తెలుస్తుంది.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.