దుర్గాసురుడు అంటే ఎవరు? అతని వృత్తాంతమేదో తెలుసా?

పురాణాలలో మహిషాసురుడు, నరకాసురుడు అనే రాక్షసుల పేర్లు విని ఉంటారు కానీ దుర్గాసురుడు అనే పేరు విని ఉండటం చాలా తక్కువ. పెద్దవారికి తప్ప దుర్గసుర వృత్తాంతం నేటివారికి తెలిసి ఉండదు. దుర్గాసురుడి గురించి తెలుసుకుంటే….

కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యాక్షుడు అతడి వంశంలో 'రురుడు' అనే దానవుడు పుట్టాడు. అతని కుమారుడు 'దుర్గముడు'. దుర్గముడు చాలా క్రూర స్వభావం కలవాడు. చాలా కఠినాత్ముడు. ఒకసారి దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచించాడు, "దేవ దానవ యుద్ధం చాలాసార్లు జరిగింది. నిజం చెప్పాలంటే దేవతలకన్నా దానవులే బలవంతులు, యుద్ధ నైపుణ్యం గలవారు. అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?" అని ఆలోచించగా ఆలోచించగా అతడికి కారణం కనిపించింది.

 "దీనికంతటికి కారణం వేదాలు. వేదోక్తంగా భూలోకంలోని బ్రాహ్మణులు. హోమాలు, యజ్ఞాలు చేస్తున్నారు. వాటిలో హవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు. అందువల్ల దేవతలకు బలం పెరుగుతోంది. ఒకవేళ హవిర్భాగము గనుక దేవతలకు అందకపోతే, వారి బలం పెరుగదు. అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు. యజ్ఞయాగాదులను జరపాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలనే లేకుండా చేస్తే దేవతలకు బలం కాదు కదా?" ఈ రకంగా ఆలోచించి వేదాలను తన ఆధీనం చేసుకోఅలి అనుకున్నాడు. 

హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గూర్చి వేయి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి, పట్టుదలకు, దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. "ప్రభూ! నీ వద్ద ఉన్న వేదాలను నా వశం కావించు" అన్నాడు దుర్గముడు. 

"తధాస్తు" అన్నాడు బ్రహ్మ. ఆ క్షణం నుంచి బ్రాహ్మణులు వేద ప్రవచనం చెయ్యలేకపోయారు. వేదోక్త విధులు జరగటం లేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయినాయి. దానివల్ల వర్షాలు కురవటం మానివేశాయి. చెరువులు, బావులు ఎండిపోయాయి. పంట పొలాలకు నీరు లేదు. పంటలు పండడం లేదు. దేశంలో బ్రహ్మాండమైన కరువు వచ్చింది. హవిర్భాగాలు లేక దేవతలు తేజోహీనులైనారు. ఇదే అదనుగా తీసుకుని రాక్షసులు స్వర్గసీమ మీద దాడి చేశారు. దేవతలు యుద్ధం చేసే శక్తి లేక అరణ్యాలకు పారిపోయారు.

ఆ సమయంలో ప్రజలంతా ఆ పరమేశ్వరిని "అమ్మా! తిండి తిని ఎన్నో రోజులయ్యింది. ఆకలితో మలమలమాడి చచ్చినవారు చావగా, మిగిలినవారము వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాము. దుర్గముడి వల్ల నాకీ దుర్గతి పట్టింది. మమ్మల్ని రక్షించవలసినది" అని ప్రార్ధించారు. అప్పుడు ఆమె వళ్ళంతా కళ్ళు చేసుకుని వారందరినీ చల్లగా చూసింది. అందుచేతనే 'శతాక్షి' అని పిలువబడింది. ఆ పరమేశ్వరి ప్రజలు తినటానికి పండ్లు, కూరలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అందుచేత ఆమె శాకంభరి" అనబడింది.

ఇంద్రాది దేవతలు అరణ్యాలలోను, కొండ గుహలలోను దాక్కున్నారనే విషయం తెలిసిన దుర్గముడు వారి మీద యుద్ధానికి వచ్చాడు. రాక్షసుల ధాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరిని శరణు వేడారు. పరమేశ్వరికి, రాక్షసులకు మధ్య భీకరమైన పోరు జరిగింది. దేవి ఒంటరిగా ఉన్నదని ఊహించి రాక్షసవీరులు అనేకులు ఆమెను చుట్టుముట్టారు. అప్పుడు ఆమె శరీరము నుంచి కాళి, తారిణి, బాల, భైరవి, బగళ, మాతంగి వంటి శక్తులు అనేకానేకములు ఉద్భవించి అసురులను సంహరించాయి.

పదకొండవ రోజున దుర్గముడుకీ, పరమేశ్వరికీ యుద్ధం జరిగింది. పరమేశ్వరి ఆ రాక్షసుడిపై పదిహేను బాణాలు ప్రయోగించింది. నాలుగు బాణాల వల్ల గుర్రాలు, ఒక బాణంతో సారధి మరణించారు. రెండు బాణాలతో దుర్గముడి కనులు పోయినాయి. రెండు బాణాలతో అతడి భుజాలు తెగిపోయినాయి. ఒక బాణంతో రధము విరిగిపోయింది. ఐదు బాణాలతో రాక్షసుడు నెత్తురు కక్కుతూ మరణించాడు. ఈ రకంగా దుర్గముడిని సంహరించింది కాబట్టే ఆమె 'దుర్గాదేవి' అని పిలువబడింది.

ఇదీ దుర్గముడి వృత్తాంతం. ఇప్పుడు అందరికీ దసరా పండుగ గురించి పూర్తి సందేహాలు కూడా తొలగిపోయి ఉంటాయి.

                                 ◆ నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories