రమణ మహర్షి చెప్పిన చింతనలో రకాలు!!

 

【ఆజ్యధారయా ప్రోతసా సమం।

సరళ చింతనం విరళత: పరం॥

భావం : నేతిధారలాగా, నదిలో జలం ప్రవహించినట్లుగా ఏ ఆటంకములు లేకుండా అఖండంగా జరిగే సరళ చింతనం - మధ్యమధ్య ఆటంకాలతో కొనసాగే విరళ చింతనం కన్న శ్రేష్టమైనది】

భగవంతుని మీద భక్తిని కలిగించి పెంపొందించే సాధనలలో మనస్సుతో చేసే చింతనం ప్రముఖ్ఆఏమైనది

చింతనం అంటే మన ఆలోచనలన్నింటిని ఒకే ఒక సద్వస్తువు పైకి ప్రవహింప జేయడమే. వస్తువు యొక్క రూపంపై గాని, గుణంపైగాని, స్వభావంపై గాని చింతన చేయవచ్చు. ఈ చింతననే ధ్యానం అని కూడా అంటారు. నిధిధ్యాసన అన్నా ఇదే. ఆథ్యాత్మిక సాధనలలో అత్యంత విలువైనది చింతనం లేదా ధ్యానం. జ్ఞాన సాధనలో ఇది మూడవ మెట్టు. మొదటిది శ్రవణం, రెండవది మననం, మూడవది చింతనం. పరమాత్మతత్వం పై చింతన చేయాలంటే ముందుగా సద్గురువు వద్ద కూర్చొని భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో శ్రవణం చేయాలి. ఏం శ్రవణం చేయాలి అంటే వేదాంత శ్రవణం చేయాలి. ఉపనిషత్తులలో నిక్షిప్తం చేసిన జ్ఞానాన్ని శ్రవణం చేయాలి.

ఎందుకంటే ధ్యానానికి ముందు జ్ఞానం తప్పనిసరి. జ్ఞానం స్థిరమై, సంపూర్ణంగా ఉన్నప్పుడే అది ధ్యానానికి సహాయకారి అవుతుంది. ఇలా స్థిరము, సంపూర్ణము కావాలంటే శిష్యుడు సాధన చతుష్టయ సంపన్నుడై శ్రవణం చేయాలి. గురువు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్టుడై ఉండాలి. ఇలా శ్రవణం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందిన తరువాత, అది స్థిరం కావాలంటే శిష్యుడు విన్న జ్ఞానాన్ని మరలా మరలా తనలో మననం చేసుకుంటూ వుండాలి. అదే మననం. 

ఇలా శ్రవణ మననములైన తరువాత ధ్యానం చేయాలి - చింతన చేయాలి. ఇలా చేస్తేనే విన్న విషయం అనుభవంలోకి వస్తుంది. శ్రవణ, మననాలలో జీవుడుగా వ్యవహరిస్తున్న తాను నిజంగా పరమాత్మనేనని, ఈ మనోబుద్ధులలో కూర్చొని అకర్తను, అభోక్తను, ఆనంద స్వరూపుడను, అసంగుడను అని మరచి, ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యంచెంది, వాటి వృత్తులను తనపై ఆరోపించుకొని కర్తగా, భోక్తగా వ్యవహరిస్తున్నానని, వీటి తాదాత్మ్యం విడిచి తాను తానుగా ఉండాలని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న విషయాన్ని చింతనలో, ధ్యానంలో 'సోహం' అని 'ఆ పరమాత్మను నేనే' అని అనుభవపూర్వకంగా స్థిరీకరించుకుంటాడు. ఇదీ ధ్యానలక్ష్యం.

 దేహభావనలో నీవు ఉన్నంత వరకు భగవంతుని కూడా దేహధారి అనే భావనలోనే సగుణధ్యానం చేస్తావు. అలాగాక నేను దేహం కాదు, దీనికి వెనుక ఆధారంగా ఉన్న ఆత్మచైతన్యాన్ని నిరాకార, నిర్గుణ, చైతన్యాన్ని అనే జ్ఞానంలో నీవు ఉన్నప్పుడు భగవంతుని నిరాకార, నిర్గుణ, సర్వవ్యాపక పరమాత్మగా భావించి నిర్గుణ ధ్యానం చేస్తావు. సగుణ ధ్యానంతో ప్రారంభించినా నిర్గుణ ధ్యానంలో తప్పక ప్రవేశిస్తావు. కనుకనే ఆయన నిర్గుణ - సగుణ భావాలను పట్టించుకోలేదు. ఇక్కడ చింతన లేదా ధ్యానాన్ని రెండు విధాలుగా విభజించారు. ఒకటి సరళ చింతనం. రెండవది విరళ చింతనం.

సామాన్యంగా ధ్యానానికి (చింతనకు) కూర్చోగానే మనం సద్వసుమును గురించి చింతన ప్రారంభిస్తాం. అయితే ఇప్పటి వరకు మనమనస్సు అనేక విషయాలలో, భోగాలలో మునిగి ఉన్నది కాబట్టి అనేక వస్తువులు దేహపోషణకు, కుటుంబ పోషణకు, జీవనానికి అవసరము కాబట్టి  వాటికి సంబంధించిన ఏదో ఆలోచన మనస్సులోకొస్తుంది. దానితో మనస్సు వాటియొక్క ఆలోచనలను కొనసాగిస్తుంది. కొంత సమయం గడిచిపోయిన తర్వాత గాని, మనం ఏ వస్తువును గురించి ధ్యానించటానికి (చింతన చేయటానికి కూర్చున్నామో  అది మరచి ఏవేవో అనవసరమైన లౌకిక విషయాలను గురించి చింతన చేస్తున్నామని గ్రహింపుకు రాదు. అలా గ్రహించటంతోనే మరల పరమాత్మ చింతనం ప్రారంభిస్తాం. ఇలా మనస్సు పరమాత్మ చింతన చేస్తూ, మధ్య మధ్య అన్యవిషయాలమీదకు పోతుంటే తిరిగి ప్రయత్నంతో పరమాత్మ పైకి తీసుకొని వచ్చి చింతన సాగిస్తూ ఉండటాన్నే 'విరళ చింతనం' అన్నారు.

అలా కాకుండా దీక్షతో, పట్టుదలతో అభ్యాసం చేసి, మధ్యమధ్యలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా, మనస్సు ఎటువైపుకు పోకుండా,

కరిగించిన నెయ్యి పైనుండి క్రిందికి ఏకధారగా ఎలా పడుతుందో, ఏ విధమైన ప్రయత్నమూ లేకుండానే జీవనదులలో నీరు ఎలా ప్రవహిస్తూ ఉంటుందో, అలాగ చింతన పరమాత్మ మీదనే అప్రయత్నంగా, అఖండంగా, సాఫీగా సాగిపోతూ ఉంటే దీనిని 'సరళ చింతనం' అని మహర్షి పేరు పెట్టారు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories