పద్యంతో జీవితసారం చెప్పిన తిక్కన!

తిక్కన కాలంలో శైవ, వైష్ణవుల మధ్య వైరం ఎక్కువగా ఉండేది. మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకునేవాళ్ళు. కానీ ఈ తారతమ్యాన్ని చేరిపేస్తూ తిక్కన హరిహర నాధుడు అనే దైవాన్ని ప్రతిష్టించాడు. ఆయన భాగవతాన్ని కూడా హరిహర నాధుడికే అంకితం ఇచ్చాడు. ఆయన హరిహారులను ఉద్దేశించి రాసిన పద్యమిది.

కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా

పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం? 

కిం కాలకూటః కిము వా యశోదా 

స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే!

భక్తుడు, భగవంతుడిని వినమ్రంగా అడుగుతున్న సందేహమిది. భారతీయ జీవనవిధానంలో వ్యక్తిత్వప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పద్యమిది. భారతరచనారంభంలో తిక్కన బుద్ధిపూర్వకంగా చేసిన చమత్కారం ఇది. ఇందులో ఉన్న అంతరార్థాన్ని విశ్లేషించుకుంటే!!

భగవంతుడికి ఎముకల దండ అంటే ఇష్టమా? కౌస్తుభమణి అంటే ఇష్టమా? కాలకూటవిషం రుచా? లేక యశోదా చనుబాలు తీపా? ఇదీ ప్రశ్న. ఇది అడగవలసిన ప్రశ్న అనిపిస్తుంది. ఈ ప్రశ్నలోనే సమాధానం దాగుంది. ఆ సమాధానంలోనే సమాజాత్మను ప్రతిబింబించే ధర్మం దాగుంది. భగవంతుడు ఒక్కడే కానీ పలువురికి పలురూపాల్లో కనిపిస్తాడు. నిజం ఒకటే. కానీ పలువురు దాన్ని పలు రకాలుగా దర్శిస్తారు.

ఎవరికి వారు తాము చూసిందే నిజం అన్న పట్టుదల, తాను గ్రహించిందే సంపూర్ణసత్యం అన్న అహంకారం చూపినపుడు దాంతో పాక్షికసత్యాలను సమన్వయం చేసి సంపూర్ణసత్యాన్ని ఆవిష్కరించే సమ్యకృష్టి, సమగ్రాలోచనలు మరుగునపడతాయి. ఈ సత్యాన్ని నిరూపిస్తుందీ పద్యం. 

ఇక్కడ భగవత్స్వరూపంలోని రెండు విభిన్నపార్శ్వాల ప్రస్తావన ఉంది. ఒకరు ఆడంబరప్రియులు. మరొకరు ఆడంబరమే తెలియనివారు. ఒకరు కౌస్తుభమణి ధరిస్తే, మరొకరు ఎముకల దండను ధరిస్తారు. ఒకరు యశోద చనుబాలను ప్రీతితో ఆరగిస్తే, మరొకరు గళాన కాలకూట విషం నిలిపి లోకకల్యాణానికి నడుం కడతారు. కౌస్తుభమణితో ఎంత ఆనందంగా ఉన్నారో, ఎముకల మాలతోనూ అంత సంతృప్తిగా ఉండగలరని నిరూపిస్తున్నారిద్దరూ. అంటే తరచి చూస్తే కౌస్తుభమణికీ, ఎముకల దండకూ తేడా లేదన్నమాట. ఆలోచించి చూస్తే కాలకూటవిషం, తల్లి చనుబాల రుచీ ఒకటేనన్న మాట.

ఇక్కడ తేడాలున్నది వస్తువులలో కాదు, వస్తువులను చూసే దృష్టిలో. ఒక వ్యక్తి తలచుకుంటే, మణిమరకతమాణిక్యాల వంటి ఐశ్వర్యం నడుమ ఎంత ఆనందంగా ఉండగలడో, స్మశానంలో, బూడిద పూసుకుని ఎముకల దండలు ధరించి కూడా అంత సంతృప్తిగా ఉండగలడు. ఎందుకంటే ఐశ్వర్యంతో తుల తూగుతున్నదీ దేవుడే. ఎముకల దండను ధరించిందీ భగవంతుడే. ఒకే భగవంతుడు ఈ తేడాలను మానవుని మనస్సుకు గ్రహింపులోకి తెచ్చేందుకు రెండు పరస్పర విభిన్నమైన రూపాల్లో దర్శన మిస్తున్నాడు.

ఇక్కడ కౌస్తుభమణి, ఎముకల దండ కేవలం ప్రతీకలే. జీవితం ఒడిదొడుకులమయం. ఏ జీవితమూ కూడా తుఫాను తాకిళ్ళకు గురి కాకుండా ఉండదు. వడగాడ్పుల బారిన పడకుండా ఉండదు. కరకు కత్తుల వంటి చలిగాడ్పుల నుండి తప్పించుకోలేదు. అంటే, ప్రతి వ్యక్తీ తన జీవితంలో పెను తుఫానులను, భూకంపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నమాట. అలాగని, జీవితమంతా ఒడిదొడుకులమయం కాదు. జీవనప్రయాణంలో అందమైన పూలతోటలు విరుస్తాయి. వసంతం జీవితాన్ని శోభాయమానం చేస్తుంది. తొలకరి జల్లులు జీవితాన్ని సుందరమయం చేస్తాయి. పండు వెన్నెల ప్రసరింపచేసే వెలుగులు జీవితాన్ని నందనవనం చేస్తాయి. అంటే జీవితం సుఖదుఃఖాల సంగమం అన్నమాట. అదే చెబుతుంది ఈ పద్యం. 

                                     ◆నిశ్శబ్ద.


More Subhashitaalu