హనుమంతుడు సుగ్రీవుడిని ఏమని హెచ్చరించాడు??


వాలిని సంహరించిన తరువాత రాముడు సుగ్రీవుడికి కిష్కింధ రాజుగా పట్టాభిషేకం చేసాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడితో "ఈ వర్షాకాలంలో రావణుడిని వెతుకుతూ వెళ్ళడం కష్టం. సుగ్రీవా! పట్టాభిషేకం చేసుకొని 4 నెలలు హాయిగా సుఖాలు అనుభవించు. కొండల మీద తిరిగి ఎన్నాళ్ళ నుండి కష్టపడ్డావో. 4 నెలల తరువాత కార్తీక మాసం వచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతవరకు నేను ఊరి బయట ప్రస్రవణ పర్వత గుహలో ఉంటాను" అని చెప్పి సుగ్రీవుడిని పంపించాడు. 

వర్షాకాలం పూర్తయిపోయింది, కార్తీక మాసం మొదలయ్యింది. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి "సుగ్రీవా! నువ్వు రాముడి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. నాలుగు విషయాలలో రాజు ఎప్పుడూ కూడ అప్రమత్తుడై ఉండాలి. తన కోశాగారం ఎప్పుడూ నిండుగా ఉండాలి, తగినంత సైన్యం ఉండాలి, మిత్రుల విషయంలో పరాకుగా ఉండకూడదు. ప్రభుత్వాన్ని నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి. ఈ నాలుగు విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

రాముడు నిన్ను స్నేహితుడిగా చూసాడు కాబట్టే నాలుగు నెలలు హాయిగా సుఖాలు అనుభవించు అని చెప్పాడు. తన భార్యను దూరం చేసుకుని బాధపడుతూ కూడా నీ కోణంలో ఆలోచించాడు. ఇప్పుడు  వర్షాకాలం గడిచిపోయింది, అది తెలుసుకుని నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలి, కాని నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చెయ్యకపోవడం రాముని యొక్క ఔదార్యం. పోనిలే అని రాముడు ఓర్మి వహించి ఉన్నాడు. ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామ దర్శనం చెయ్యడం మంచిది.

నువ్వు వానరాలని దశదిశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు. ఈ మాట నువ్వు ముందు చెపితే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యము ఎందుకు చెయ్యలేదు అని అడిగితే, ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాముడు నీకు రెండు ఉపకారములు చేశాడు. నీకు బలమైన శత్రువైన వాలిని సంహరించాడు. అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో 'నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతని అన్వేషించి పెట్టు' అన్నాడు. ఆయన నీకు చేసినంత ఉపకారం యదార్ధమునకు నీ నుండి ఆయన ఆశించలేదు. అన్ని దిక్కులకి వెళ్ళగలిగిన బలవంతులైన వానరములు నీ దగ్గర ఉన్నారు. వారు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు. కాని నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు. నువ్వు భార్యలతో సంతోషాలు అనుభవిస్తూ అన్నీ మరచిపోయి ఉన్నావు. కనుక మన వానరులకు నీ ఆజ్ఞ లేదు. రాముడే దుఃఖపడి కోదండాన్ని పట్టుకుంటే, ఇక ఆయనని నిగ్రహించగలిగేవారు ఎవ్వరూ లేరు. అప్పుడు నీకే కాదు లోకానికి కూడ ప్రమాదమే" అన్నాడు.

                               ◆ వెంకటేష్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories