చిలుక పలుకుల వెనుక చిత్రమైన సంఘటన!!

బ్రహ్మ పుత్రుడు మరీచి. ఆ మరీచి కొడుకు కశ్యపుడు. ఈ కశ్యపుడు  దక్ష ప్రజాపతికి పుట్టిన ఎనిమిది మంది కూతుర్లను వివాహమాడాడు. ఆ ఎనిమిది మందిలో తామ్ర ఒకటి. కశ్యపుడికి, తామ్రకి అయిదు మంది కూతుర్లు పుట్టారు. ఆ అయిదు మంది కూతుర్లలో  శుకి అనే పేరు కలిగిన వారు ఒకరు. ఈ శుకి కి పుట్టిన సంతానమే చిలుకలు.

మొదట్లో చిలుకలు, జీవ జంతువులు అన్నీ మాట్లాడేవని దేవతల శాపం వల్ల వాటికి మాట పోయిందని కొన్ని పురాణ కథనాల్లో  తెలుస్తోంది. పక్షి జాతికి చెందిన చిలుక గురించి అందరూ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. చిలుక పలుకుల విచిత్రం  అందులో మాధుర్యం గురించి కూడా తెలుసు అందరికీ. ఆ చిలుక పలుకులు మూగబోయిన విషయం చాలా విచిత్రమైంది.

 తారకాసురుడు అనే రాక్షసుడిని  సంహారించడానికి శివుడికి పుట్టే సంతానం వల్లనే సాధ్యమని దేవతలకు తెలిసిన తరువాత   దేవతలు శివుని ప్రార్థించారు. అప్పుడు  శివపార్వతులు లోకంలో దేవతలు, ప్రజలకు బాధలు తొలగించాలని కామక్రీడలో పాల్గొన్నారు. సంవత్సరాలు గడిచాయి. (మనుషుల వంద సంవత్సరాలు దేవతలకు రెప్పపాటుతో సమానం) ఆ పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంతో కలిగిన మార్పుకు ప్రకృతి కూడా మారి, ప్రపంచం అంతా  దద్దరిల్లింది. ఆ పరిణామానికి ప్రపంచం నశిస్తుందేమోననే  దేవతలకు భయం పట్టుకుంది. పర్వతీపరమేశ్వరులను ఆపకపోతే పంచభూతాలు, ప్రకృతి గందరగోళం అయిపోతుందని భావించారు. 

అగ్ని దేవుడిని పిలిచి పార్వతీ పరమేశ్వరులను ఏకాంతం నుండి బయటకు తీసుకురమ్మని చెప్పారు. ఏకాంతంలో ఉన్న వాళ్ళను కదిలిస్తే వాళ్ళ కోపాన్ని భరించడం కష్టమని, వారి శాపానికి గురవ్వాల్సి వస్తుందని భయపడి అగ్నిదేవుడు పారిపోయి సముద్రం లోపల దాక్కున్నారు. అయితే సుద్రంలో ఉండే జంతులవులు, జీవులు అగ్నిదేవుడి వేడిని భరించలేక దేవతలతో అగ్నిదేవుడు సముద్రంలో దాక్కున్నట్టు చెప్పేసాయి. 

నా నాగురించి దేవతలకు చెబుతారా అని అగ్ని దేవుడు సముద్రంలో ఉన్న జంతువులకు, జీవులకు మాటలు పోయి మూగగా బతకమని శపించాడు. ఆ తరువాత అగ్ని దేవుడు సముద్రం నుండి పారిపోయి మందర పర్వతం మీద దాక్కున్నాడు. మందర పర్వతం చిలుకలకు నివాసం. అగ్ని దేవుడిని చూసి చిలుకలు దేవతలతో అగ్ని దేవుడు అక్కడున్నట్టు చెప్పాయి. అప్పుడు కూడా అగ్ని దేవుడు కోపం చేసుకుని  "చిలుకల్లారా నా పరిస్థితి తెలుసుకోకుండా దేవతలకు చెప్పి నన్ను సమస్యలొకి నెట్టుతారా మీ నాలుకలు మడత పడిపోయి మీరు మూగవాళ్ళు అయిపోతారు అని శపించాడు.

అప్పుడు చిలుకలు దేవతల దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా అగ్ని దేవుడు మీకు శాపం ఇచ్చినా మీరు చేసే శబ్దాలు ఎంతో మధురంగా ఉంటాయి. అంతేకాదు శాపాన్ని పొందిన విషయం మరచి ప్రయత్నం చేస్తే ఎంతో మధురంగా మాట్లాడగలరు కూడా. అని దేవతలు చిలుకలకు శాపాన్ని తొలగించారు.

ఇదీ చిలుకల పలుకుల వెనుక ఆసక్తికర విషయం. 

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories