మూర్ఖత్వానికి విరుగుడు!!

 

కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్|| అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున॥

అర్జునా! ఒక పక్క సాధారణ సైనికులు కూడా యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తుంటే, నువ్వు తీరిగ్గా కూర్చుని, ధనుర్బాణాలు పక్కన బెట్టి ఏడవడానికి ఇదా సమయం! నీకు ఈ శోకము, మోహము, దుఃఖము, మనోదౌర్బల్యము, ఎలా దాపురించాయి? నీ లాంటి వీరులు, పరాక్రమవంతులు, సర్వశ్రేష్టధనుర్ధరులు ఇలా చేస్తారా! అదీ ఈ సమయంలో! నువ్వు తప్ప ఎవరూ ఈ పని చేయరు తెలుసా! యుద్ధం చేయకపోతే నీకు స్వర్గం వస్తుందా! రాజ్యం వస్తుందా! కీర్తి ప్రతిష్టలు వస్తాయా! ఏదీ రాదు. ఘోరమైన అవమానం తప్ప. ఆ విషయం తెలుసుకో! అని సున్నితంగా మందలించాడు కృష్ణుడు.

ఏపని చేయడానికైనా సమయం సందర్భం ఉంటాయి. ఉత్తిపుణ్యానికి ఏడుస్తూ కూర్చుంటే

ఎవరికైనా చిరాకు పుడుతుంది. అటువంటి చిరాకే కృష్ణుడికి పుట్టింది. ఇంకా యుద్ధం మొదలు కాలేదు. ఎవ్వరూ చావలేదు, ఎవ్వరూ ఓడలేదు గెలవ లేదు, కానీ ఏవేవో ఊహించుకొని అర్జునుడు ఏడుస్తున్నాడు. 

పై విషయం గమనిస్తే ఎంతటి వీరుడు అయినా భయం వల్ల లేని పోనివి ఉహించుకోవడం వల్ల ధైర్యం కోల్పోయి తనలో ఉన్న నైపుణ్యాన్ని, మరచి తానొక పిరికివాడుగా మారిపోతాడు. అర్జునుడంతటివాడే ఇక్కడ ఓ గొప్ప ఉదాహరణగా కనిపిస్తున్నాడు.

పరీక్ష రాసిన విద్యార్థి, తాను పరీక్షలో పాసవుతానో, లేదో! ఒకవేళ ఫెయిల్ అయితే ఆ దుఃఖం తట్టుకుంటానో లేదో! అని ముందే ఆత్మహత్య చేసుకున్నాడట. ఆఖరుకు వాడు పాసయ్యాడు. అంటే జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. సమస్యను ఎదుర్కోవడం మానేసి, పిరికి వాడిలా జీవితం నుండి పారిపోయాడు. ఇలా ఉంది అర్జునుడి వ్యవహారం. సమయం సందర్భం లేకుండా ఏవేవో ఊహించుకొని, ఉత్తిపుణ్యానికి ఏడుస్తున్నాడు అర్జునుడు. "నేను యుద్ధం చేయను” అనే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ యుద్ధం చేయడం క్షత్రియుడి ధర్మం అయినపుడు, చేయాల్సిన సమయం వచ్చినప్ఫడు, నేను చేయను అని పిల్లాడిలా భయపడి యుద్ధ సామగ్రి పక్కనపెట్టి ఏడవడం మూర్ఖత్వం. ఎంతటి వాళ్ళను అయినా ఈ మూర్ఖత్వం అవరిస్తూ ఉంటుంది ఏదో ఒకసమయంలో. అలాంటి మూర్ఖత్వం చాలా ముఖ్యమైన సమయంలో చుట్టుముడితే ఎలా ఉంటుంది అంటే ఇందులో అర్జునుడు ఉన్న పరిస్థితిలానే ఉంటుంది.

దుర్యోధనుడికి సమజోడీ భీముడు. కర్ణుడికి సమజోడీ అర్జునుడు. భీమార్జునులను నమ్ముకొని మిత్రరాజులందరూ యుద్ధానికి సన్నద్ధం అయ్యారు. ఇప్పుడు అర్జునుడు ఏవేవో ఊహించుకొని, మోహావేశంలో యుద్ధం చేయను అంటే వాళ్ల గతేం కావాలి. అదీ కృష్ణుడి సందేహం. పోనీ ఇటువంటి పని ఇదివరలో ఎవరైనా చేసారా అంటే అటువంటి సంఘటనలు లేవు. అందరు వీరులూ శక్తికొద్ది పోరాడి మరణించి వీరస్వర్గం పొందారే కానీ, ఎవరూ యుద్ధం నుండి పారి పోలేదు. కానీ అర్జునుడు కొత్త ఒరవడి పెట్టినట్టున్నాడు. 

పోనీ దీనివల్ల అర్జునుడికి పేరు ప్రతిష్టలు వస్తాయా అంటే అదీ లేదు. క్షత్రియ ధర్మం అయిన యుద్ధం నుండి పారిపోయినాడన్న అవమానం మిగులుతుంది. పోనీ స్వర్గం వస్తుందా అంటే. యుద్ధంలో మరణించిన వారికే కానీ యుద్ధం నుండి పారిపోయిన వారికి వీరస్వర్గం ప్రాప్తించదు. మరి ఎందుకు అర్జునుడు తన స్వధర్మము, క్షత్రియ ధర్మము అయిన యుద్ధమునుండి విముఖుడు అవుతున్నాడు. ఇదే ప్రశ్న కృష్ణుడు అర్జునుడిని సూటిగా అడిగాడు. 

ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ముఖ్యమైన బాధ్యతల నుండి తప్పించుకోవడానికి అర్జునుడు చెప్పినట్టే ఏవేవో సాకులు చెబుతూ ఉంటారు. కానీ ఒక్కసారి తమని తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories