పరమాత్మ స్వరూపా ప్రణమామ్యహం!!

 

రామాయణ మహాభారతాలు ఎంత గొప్పవో  భగవద్గీత అంతకంటే గొప్పది. ప్రతి మనిషి తన జీవితకాలంలో తప్పకుండా చదవవలసిన, తెలుగుకోవలసినది భగవద్గీత. అందులో పదవ అధ్యాయంలో విభూతి యోగం ఉంటుంది. విభూతి అంటే ఐశ్వర్యము. పరమాత్మ గురించి భావన చెయ్యడమే ఒక ఐశ్వర్యము. ఆ పరమాత్మయొక్క ఐశ్యర్యాన్ని అనేక విధములుగా తెలుసుకోవడమే ఈ అధ్యాయంలో చేయబోయేది. భగవంతుని ఐశ్వర్యములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలను ప్రస్తావిస్తూ ఈ విభూతి యోగంలో ఎనిమిదవ శ్లోకం ను చెబుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ విధంగా చెబుతాడు.

అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజన్డే మాం బుధా భావసమన్వితా:!!

ఓ అర్జునా! నేనే ఈ సకల జగత్తు ఉత్పత్తికి కారకుడను. ఈ సకల జగత్తు నావలననే నడుస్తూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న సాధకుడు నా యందు భక్తిభావంతో నన్నేపూజిస్తాడు.

అసలు మనం పరమాత్మను గురించి ఎందుకు తెలుసుకోవాలి ఆయనతో మనకేం పని అని కొంత మంది అనవచ్చు దానికి సమాధానంగా ఈ శ్లోకం చెప్పాడు. ఈ సమస్త జగత్తు పుట్టడానికి నేనే కారణము. నాలోనుండి జగత్తు ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తరువాత నేనే దానిని నడిపిస్తున్నాను. ఆఖరుకు నాలోనే లయం చేసుకుంటాను అని అన్నాడు. మనలో చాలా మంది దైవము మీద భక్తి కలిగి ఉంటారు. కాని భగవంతుని మీద ఏకాగ్రభక్తి, శ్రద్ధ, నిష్ట కలిగిన వారు కొద్దిమందే ఉంటారు. అటువంటి ఏకాగ్రభక్తి, నిష్ఠ ఎలా కలుగుతుంది అంటే పరమాత్మను గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాత కలుగుతుంది. లేకపోతే దేవుడు అంటే మనం కోరుకున్న కోరికలు తీర్చేవాడుగానే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ జగత్తు కంతటికీ మూలాధారము పరమాత్మ, ఆయనే ఈ జగత్తును సృష్టించి, పెంచి పోషించి, లయం చేస్తున్నాడు, మనం నిమిత్తమాత్రులం అని తెలుసుకోవాలి. అప్పుడే పరమాత్మ మీద అచంచలమైన, ఏకాగ్రమైన భక్తి శ్రద్ధ కలుగుతాయి. అందుకే భావసమన్వితా: అంటే భగవంతుని గురించిన భావముతో నిండి ఉండాలి. మరొక భావన, మరొక ఆలోచన ఉండకూడదు. అటువంటి వారికి భగవంతుడు సులభంగా ప్రాప్తిస్తాడు.

ఈ నాటి శాస్త్రజ్ఞులు కూడా ఇదే చెబుతున్నారు. దైవకణంలో నుండి బిగ్ బాంగ్ ద్వారా ఈ విశ్వం ఆవిర్భవించింది. విస్తరిస్తూ ఉంది. తుదకు అంతా ఆ దైవకణంలోకి చేరుతుంది. ఈ దైవకణాన్ని మనం దేవుడు పరమాత్మ అని అంటున్నాము. శాస్త్రజ్ఞులు ఈ దైవకణం ఏమిటా అని ఎడతెగని పరిశోధనలు జరుపుతున్నారు. కానీ అంతుచిక్కడం లేదు. అలాగే మనం కూడా పరమాత్మ గురించి తెలుసుకోవాలని, పరమాత్మ మీద భక్తి కలిగి ఉండాలనీ భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు. మరొక విషయం కూడా ఆలోచించండి. ఈ విశ్వం అంతా పరమాణువుల మయం. ఈ విశ్వంలో మనం అందరం ఉన్నాము. మనం మన శరీరాలు కూడా పరమాణువుల మయం. దీనికి మూలం దైవకణం అంటే ఒక పరమాణువు. అంటే పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఈ సమస్త జీవరాసులలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు అన్న మాట సబబే కదా. ఆలోచించండి.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories