వంట ఆగ్నేయంలోనే ఎందుకు చేయాలి?

(Kitchen Agneyam Side)

 

ఓ భార్యామణి, భర్తతో ''కాసేపట్లో వంటల ప్రోగ్రాం వస్తుంది... కొంచెం ఈ టీవీని ఆగ్నేయం మూలకు జరపరాదూ'' అందట. వాస్తుకు సంబంధించి ఇలాంటి చమత్కారాలు వినిపిస్తూనే ఉంటాయి. సరదా మాటల సంగతి అలా ఉంచితే వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయంలో ఉండాలి. వంట చేసేవారు తూర్పువైపుకు తిరిగి వంట చేయాలి. అలా చేయడం అన్ని విధాలా శ్రేష్టం. వాస్తు పండితులు ఆగ్నేయంలోనే వంటగది ఎందుకు ఉండాలని చెప్పారో ఇప్పుడు చూద్దాం.

 

ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు భోజ్యానికి సంకేతం. ఆనందం ఆయన పరమావధి. అందుకే ఆగ్నేయంలో వంట చేసినట్లయితే ఆ వంట మరింత రుచిగా, ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఆగ్నేయ దిక్కులో వండిన వంటలు రుచిగా ఉంటాయి. చక్కగా జీర్ణమౌతాయి.ఇతర దిక్కులూ చేసిన వంట రుచిగా ఉండకపోవడం, సరిగా పక్వం కాకపోవడం జరుగుతుంది. ఆ ఆహారం తినాలనిపించదు. లేదా జీర్ణం కాదు. కాదా తినలేని పరిస్థితి వస్తుంది. లేదా తినే సమయంలో ఏవో ఆటంకాలు రావడమో, నేలపాలు కావడమో జరుగుతుంది.

 

వాస్తు శాస్త్రం తెలీకపోయినా కొద్దిగా విచక్షణాజ్ఞానంతో ఆలోచిస్తే కూడా ఆగ్నేయం మూల వంట ఎందుకు చేసుకోవాలో బోధపడుతుంది. ఆగ్నేయంలో గాలి బాగా వీస్తుంది. పూర్వం రోజుల్లో కట్టెల పొయ్యిమీద వంట చేసేవారు. అందువల్ల ఆగ్నేయ దిశలో పొగ గొట్టంతో ఎక్కువ కష్టపడి ఊదకుండానే కట్టెలు మండుతాయి. అందువల్ల శ్రమ తగ్గుతుంది. ఇప్పుడు కట్టెలతో నిమిత్తం లేదు. అయినా గాలి ఉండటం వల్ల వంట చేసేటప్పుడు వచ్చే పొగలు, గట్రా బయటకు పోతాయి. ఇంట్లో పొగ వ్యాపించదు. అలసట లేకుండా ఆడుతూపాడుతూ వంట పూర్తిచేసుకోవచ్చు.

 

వంట చేయడం మాత్రమే కాదు, భోజనం చేయడం కూడా ఆగ్నేయంలో లేదా తూర్పు మధ్యలో అయితే మంచిది. భోజనం చేసేటప్పుడు తూర్పు లేదా పశ్చిమానికి ముఖం చేసి కూర్చోవాలి.

 

ఆగ్నేయంలో వంట చేసే అవకాశం లేనప్పుడు ఈశాన్య గదిలో తప్పించి మరే గదిలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. వంటకు కేటాయించిన గదిలో ఆగ్నేయం మూల వంట చేసుకోవాలి. కానీ ఇది ఉత్తమం ఎన్నటికీ కాదు. ఉన్నంతలో రాజీపడటం మాత్రమే.

 

తూర్పుకు ముఖం చేసి వంట చేయడం శ్రేష్టం. అలా వీలుకాని పక్షంలో పశ్చిమం లేదా దక్షిణ ముఖానికి తిరిగి వంట చేయాలి.

 

ఈశాన్యంలో వంట చేస్తే ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు దాపురిస్తాయి. నైరుతిలో వంట చేస్తే మానసిక వత్తిడి పెరుగుతుంది. ఉత్తర ముఖంగా పడుకోకూడదు అని చెప్పినట్లే ఉత్తర ముఖానికి తిరిగి అస్సలు వంట చేయకూడదు. అలా చేస్తే అనర్ధదాయకం.


More Vastu