ఆదిశంకరుల ఆణిముత్యం!!

జగద్గురు ఆదిశంకరాచార్యుల పేరు వినని వాళ్ళు ఉండరు. ఆదిశంకరుల లాగే బోలెడు మంది ఈ మానవాళికి ఎన్నో అమూల్యమైన విషయాలను అందించారు. కానీ ఈ మనుషులకు కేవలం ఆ మహానుభావుల పేర్లు తప్ప ఇంకేమీ తెలియదు. ఇప్పటి పెద్దవాళ్ళు కూడా బడిలో పాఠాలు, మార్కులు, ర్యాంకులు వీటిద్వారా ఉద్యోగాలు, సంపాదన. హమ్మయ్య ఇవి ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ మనిషి మానసిక పరిపక్వత గురించి ఎవరూ ఆలోచించడం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పటికాలంలో మనుషుల మధ్య బంధాలన్ని ఎంతో సున్నితంగా, చిన్న చిన్న విషయాలకు విరిగిపోతూ, తెగిపోయి ఎవరికి ఏమి కాకుండా దూరమయ్యే స్థాయికి దిగజారాయి.

ఇకపోతే మనిషి తన జీవితంలో చూపించే అత్యాశ గురించి చెబుతూ ఆదిశంకరులు భజగోవింద స్తోత్రాల్లో ఇలా పేర్కొన్నారు.

【మూఢ జహీహి ధనాగమతృష్ణాం

కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం |

యల్లభసే నిజకర్మోపాత్తం

విత్తం తేన వినోదయ చిత్తం ||

ఓ మూర్ఖుడా డబ్బు సంపాదించాలనే ఆశను వదిలిపెట్టు. నువ్వు చేసే పని వల్ల, నీ కష్టం వల్ల నీకు వచ్చే దాంతో తృప్తి పడు.】


దీనికి సంబంధించిన చిన్న కోతి పల్లీల కథ కూడా ఉంది.

కోతులను పట్టుకునేవాడు ఒకరోజు చెట్టు మీద చాలా కోతులను చూసాడు. వీటిలో కనీసం ఒకటైన పట్టుకోవాలి ఈరోజు అనుకున్నాడు అతను.  అతనికి కోతులకు వేరుశనగ పప్పులంటే చాలా ఇష్టమని తెలుసు. వెంటనే కొన్ని వేరుశనగ పప్పులను తెచ్చి, కోతులు చూస్తుండగా వాటిని ఒక కూజాలో పోసి, ఆ కూజాని చెట్టు కింద పెట్టి వెళ్ళిపోయి దూరంగా నిలబడుకుని గమనించసాగాడు. అతను వెళ్ళిపోగానే ఒక కోతి కూజా దగ్గరకు వచ్చి దానిలోకి చెయ్యి పెట్టి చేతి నిండా పట్టినన్ని పప్పుల్ని పిడికిట్లోకి తీసుకుంది. కూజా మూతి ఇరుకుగా ఉన్నందువల్ల చేతి నిండా ఉన్న పప్పులతో దాని చేయి కూజా మూతిలో నుండి పైకి తియ్యలేక పోయింది. ఎంత ప్రయత్నించినా చెయ్యి రాలేదు. పప్పులను వదిలేసి చెయ్యి తీస్తే తేలికగా బయటకు వచ్చేది. కాని కోతి వేరుశనగపప్పు మీది వ్యామోహంతో, మమకారంతో పప్పులను వదలలేక పోయింది. ఈ లోపల కూజా పెట్టిన మనిషి వచ్చి కూజాతో పాటు కోతిని పట్టుకుని తీసుకు వెళ్ళిపోయాడు. దాని జీవితం కష్టాల పాలయింది. కోతి అతని చేతిలో బందీగా మారిపోయింది. 

ఆదిశంకరులు మానవుల జీవితాల గురించి ఇదే విషయాన్ని  చెప్పారు. ఒక అవగాహన, ఎరుక కలిగి ఉండాలి. ప్రతి మనిషికి ధనము అవసరమే. ధన సంపాదన నిజాయితీగా, సక్రమ మార్గంలో సంపాదించాలి. మనకు లభించిన దానితో తృప్తి చెందాలి. మన జీవితంలో భ్రమలను, మమకారమును వదిలించుకోవాలి. డబ్బు మీద వ్యామోహం వదులుకోవాలి. మానవుడు మమకారం పెంచుకొని వైరాగ్య భావం తెచ్చుకోకపోతే ఆ కోతి మాదిరిగా వలలో పడిపోతాడు. అప్పుడు దాన్నుండి బయటపడటం చాలా కష్టంతో కూడుకున్నది. అసలు తను వలలో చిక్కుకున్న విషయాన్ని తనకు తాను గమనించుకునే సందర్భం  బహుశా రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఆదిశంకరులు చెప్పిన ఆణిముత్యంలాంటి విషయమిది

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories