తిలకధారణ గొప్పతనం !!

 

ప్రతి మహిళకు నుదుటన బొట్టు ఎంతో ప్రత్యేకతను చేకూర్చుతుంది. ముత్తైదువు అనే మాటకు పెద్ద నిర్వచనం, ప్రస్ఫుటం చేసే విషయం ఏదైనా ఉందంటే అది ముఖాన బొట్టే. ఇప్పుడంటే మగవాళ్ళు నుదుటన కుంకుమ పెట్టడం తగ్గింది కానీ, ఒకప్పుడు మగవాళ్ళు కూడా విధిగా నుదుటన బొట్టు పెట్టుకునేవారు. బొట్టు కేవలం సాంప్రదాయం కాదు అదొక ఆరోగ్య మగ్రామ్ కూడా!!

మన దేహంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. అలాగే నుదుటన బ్రహ్మదేవుడు అధిదేవత. నుదురు బ్రహ్మస్థానం. బ్రహ్మ రంగు ఎరుపు. కనుక బ్రహ్మస్థానమైన నుదుటున ఎరుపు రంగు తిలకం తప్పనిసరిగా ధరించాలి.

నుదుటున సూర్యకిరణాలు సోకరాదు. మనలోని జీవి, జ్యోతి స్వరూపడిగా భూమిమధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయ స్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. కనుక తిలకాన్ని ఉంగరపు వ్రేలితో పెట్టుకుంటే శాంతిచేకూరుతుంది. నడివ్రేలుతో ధరిస్తే ఆయుష్షు పెరుగుతుంది. బొటనవ్రేలితో ధరిస్తే శక్తివస్తుంది. చూపుడు వ్రేలితో ధరిస్తే భక్తీ, ముక్తి కలుగుతుంది.

ప్లాస్టిక్ బొట్టు బిళ్ళలకన్నా సాధారణ కుంకుమ ధరిస్తే జ్ఞానచక్రాన్ని పూజించినట్టు అవుతుంది.

కుడిముక్కురంధ్రం పేరు పింగళ. ఎడమ ముక్కు రంధ్రం పేరు ఇడ. ఈ రెంటినీ పైకి ఏటవాలుగా పంపిస్తే ఆ రెండూ కలిసేచోట అంటే భ్రూమధ్యంలో ఉండేది సుషుమ్న నాడీస్థానం. ఆ సుషుమ్న శిరస్సు మధ్యలో ఉన్న బ్రహ్మ రంధ్రం నుండి వెన్నెముక చివరి వరకు నిటారుగా ఉంటుంది. ఈ మూడు కలిసేచోట బొట్టు పెట్టాలి. శైవులైతే అడ్డంగా గీసే మూడు గీతలలో పైన క్రింది గీతలని రెండు వేళ్లతో ఎడమ నుండి కుడికి గీసి, మధ్యగీతని కుడి నుండి ఎడమకి గీయాలి. అదే వైష్ణవులైతే అటు ఇటు గీతలని ఇడ పింగళనాడులకి గుర్తుగా నిటారుగా గీసి, మధ్యలో సుషుమ్నం ఉందని మరోగీతని గీయాలి. ఎవరైనా కనుబొమ్మల మధ్యనే బొట్టు పెట్టాలి.

అనుష్ఠానంచేసినా, అర్చనచేసినా వైదిక కర్మకాండలుచేసినా, సంస్కార విధులు నిర్వర్తిస్తున్నా  నుదిటిపై, శరీరంపై తిలకధారణ చేయడం ఆచారం. తిలకం పెట్టుకోకుండా చేసే ఏ కార్యమూ సఫలీకృతం కాదు.

కుంకుమ, సింధూరం, హోమభస్మం, చందనం, రావి, తులసి చెట్ల మొదలులో ఉన్నమట్టి మొదలైన తిలకాలను ఉపయోగిస్తారు. దేవీదేవతలకు బొట్టు పెట్టేటప్పుడు అనామిక వ్రేలుతో, స్వయంగా బొట్టు పెట్టుకొనేటప్పుడు మధ్యవ్రేలితో, పితృగణాలకి చూపుడు వ్రేలుతో, బ్రాహ్మణులు, శ్రేష్ఠవ్యక్తులకు పెట్టేటప్పుడు ఉంగరం వ్రేలుతో పెట్టాలి.

కనుబొమ్మల మధ్య తిలకధారణ చేస్తే అక్కడ ఉండే ఆజ్ఞాచక్రం మేల్కొంటుంది. మానవుని యొక్క శక్తి ఊర్ధ్వగామి అవుతుంది. తిలకధారణ వల్ల శరీరంలో చల్లదనం వచ్చినట్లనిపిస్తుంది. ఉదాసీనత పోతుంది. ఓజస్సు, తేజస్సు పెరుగుతుంది. నుదిటిపై తిలకం వశీకరణ మంత్రం లాంటిది. ఇది చూపరులకు ఆకర్షితులను చేస్తుంది. దుష్టశక్తుల నుంచి రక్షిస్తుంది. మనోవాంఛలు తీరుస్తుంది. ఆబాలగోపాలం తిలకధారణ చేసి మన సంప్రదాయాన్ని కాపాడుకోవడం మన ధర్మం కూడా. 

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories