గణేశుని మించిన గురువు ఎవ్వరు!

 

 

శరణు కోరి వచ్చినవారి అజ్ఞానాన్ని దూరం చేసేవాడు గురువు. తన మాటలతో, చేతలతో అణువణువునా ఏదో ఒక బోధను చేసేవాడు నిజమైన గురువు. చీకటి నుంచి వెలుగుకూ, సమస్య నుంచి ఉపాయానికీ మార్గం చూపించేవాడు గురువు. మరి అలాంటి నిజమైన గురువుకు ప్రతిరూపం ఎవరంటే గణేశుడు గుర్తుకురాక మానడు. ఎందుకంటే...

 

సిద్ధిబుద్ధి ప్రదాత

వినాయకుడు బ్రహ్మచారి అన్నది ఒక వాదన. ఆయనకు సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారన్నది మరో నమ్మకం. ఈ సిద్ధి, బుద్ధి ఆవిర్భావం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నా... వారు కేవలం గణేశుని అభయానికి ప్రతిరూపాలే అన్నది తత్వవేత్తల మాట. బుద్ధి లౌకిక జ్ఞానానికీ, సిద్ధి ఆధ్మాత్మిక జ్ఞానానికీ చిహ్నం. కొన్ని సందర్భాలలో వృద్ధి అనే మరో భార్యను కూడా వినాయకునికి జోడించడం గమనించవచ్చు. ఇక కొన్ని చోట్ల వినాయకునికి శుభము, లాభము అనే ఇద్దరు కుమారులు ఉన్నట్లు భావిస్తారు. సిద్ధి, బుద్ధి, వృద్ధి, శుభము, లాభము... ఇవన్నీ కూడా ఒక శిష్యుని జీవితాన్ని అన్ని విధాలా సుసంపన్నం చేసేవే కదా!

 

రూపంలో సూక్ష్మం

గణేశుడి రూపంలో ఉన్న సూక్ష్మమైన బోధ అందరికీ తెలిసిందే! ఏనుగు తల ఉన్నతమైన ఆలోచనలనీ, చిన్న కళ్లు విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలనీ, పెద్ద చెవులు ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలనీ, తొండము ఓంకారాన్నీ, పెద్ద బొజ్జ నిశ్చింతగా జీవించమనీ... సూచిస్తాయని పెద్దలు అంటున్నారు. ఇక మూషికం తమస్సుని సూచిస్తుందనీ, దాన్ని అదుపులో ఉంచుకోకపోతే మన జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తుందన్నదానికి సూచనగా గణేశుడు మూషికను తన వాహనంగా ఉంచుకున్నాడంటారు.

 

చదువుల తండ్రి

ఉత్తరాదిలో కొన్ని చోట్ల వినాయకుని భార్యగా సరస్వతీదేవిని పూజించడం కద్దు. చూడటానికి కాస్త వింతగా అనిపించినా, ఇందులోని సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు. సరస్వతీ దేవి జ్ఞానానికి స్త్రీరూపం అయితే అదే జ్ఞానానికి గణేశుడు పురుష స్వరూపం. అందుకనే వ్యాసభగవానుడు తన భారతాన్ని రచించాలని అనుకున్నప్పుడు, దానికి రాయసగానిగా గణేశుడు తప్ప మరెవ్వరూ ముందుకు రాలేకపోయారు. భారతాన్ని ఆపకుండా చెప్పాలని వినాయకుడు షరతుని విధిస్తే, అర్థం చేసుకుని కానీ దాన్ని రాయకూడదంటూ వ్యాసుడు నియమాన్ని సూచించాడు. వ్యాసుడు చెప్పే వేగంలోనే భారతాన్ని రచించేందుకు వినాయకుడు తన దంతాన్నే కలంగా ఉపయోగించాల్సి వచ్చింది. హిందువుల పవిత్ర గ్రంథమైన భారతాన్నే రాయగలిగినవాడు, చదువులకు ఆది గురువు కాక మరేమవుతాడు!

 

గణాలకు అధిపతి

వినాయకుడు, కుమారస్వామితో పోటీపడి తండ్రి గణాలకు ఆధిపతిగా మారిన కథ తెలిసిందే! తల్లిదండ్రులను గౌరవించినవాడికి పరాజయం ఉండదని ఆ కథతో తేలిపోతుంది. గణాధిపతిగా మనకు ఎదురయ్యే సకల విఘ్నాలనూ తొలగిస్తాడు కాబట్టి... ఏ కార్యాన్ని నిర్వహించినా, ఏ పూజను తలపెట్టినా వినాయకుని ప్రార్థనతోనే ఆరంభించడం మనకు ఆనవాయితీగా మారిపోయింది. చదువులు బాగా నేర్వాలన్నా, జీవితంలో ఆపదలు తొలగాలన్నా మనం వినాయకుడినే తల్చుకుంటాము. మరి అలాంటి వినాయకుని మించిన గురువెవరు ఉంటారు!

 

- నిర్జర.

 


More Vyasalu