కర్మలలో బంధించబడనివాడు ఎవడు??

【యదృచ్ఛాలాభసన్తుష్ణో ద్వన్ద్వాతీతో విమత్సరః 
    సమః సిద్ధావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే ॥

యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా, లభించినదానితో తృప్తిపడేవారు. సుఖము, దుఃఖము మొదలగు ద్వంద్వములకు అతీతంగా ఉండేవాడు. ఇతరుల పట్ల ఎటువంటి మాత్సర్యము లేని వాడు, అందరి పట్ల, తాను చేసే అన్ని కర్మ ఫలముల పట్ల, సమభావము కలిగినవాడు. అటువంటి సాధకుడు ఏ కర్మచేసినా ఆ కర్మఫలము అతనిని బంధించదు.】

శ్లోకంలో పరమాత్మ ఎటువంటి వారు, తాము చేసిన కర్మలచేత బంధింపబడరో వివరిస్తున్నాడు.

మొదటి లక్షణం లభించిన దానితో తృప్తి చెందడం, మనం సాధారణంగా ఏదో ఒక దాని కొరకు, ఏదో ఒక ఫలితాన్ని ఆశించి, కర్మలు చేస్తుంటాము. ఆ ఫలితం వస్తుంది. కానీ తృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలని కూడా ఆరాటం. దాని కొరకు మరొక కర్మ. ఆ కర్మఫలంతో "తృప్తి పడము. ఈ ప్రకారంగా దొరికిన దానితో సంతుష్ట చెందక, దొరకని దాని కొరకు ఆరాటపడటం మానవ లక్షణం. కాని ఆత్మజ్ఞానము సంపాదించే సాధకుడు మాత్రం అప్రయత్నంగా తనకు లభించిన దానితో తృప్తి పడతాడు. దేని కొరకూ ఆశపడడు. దేని కొరకూ ప్రయత్నం చేయడు, ఏ పూటకు ఏది దొరికితే దానితో తృప్తి పడతాడు. ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే దొరికిన దానితో దానితో సంతృప్తి పడేవాడు. 

రెండవ లక్షణం ద్వంద్వములకు అతీతంగా ఉండటం, ద్వంద్వాలు అంటే సుఖము లాభము నష్టము, వేడి, చలి, జయము అపజయము, మొదలైనవి. ఈ ద్వంద్వాలు దుఃఖము, లాభము ప్రతి మానవుడికి ఉంటాయి. సంసారికి సన్యాసికి కూడా తప్పవు. ప్రతి వాడి జీవితంలో వస్తుంటాయి పోతుంటాయి. ఎందుకంటే అవన్నీ అవన్నీ ప్రకృతి లక్షణాలు. సాధకుడు వీటికి అతీతంగా ఉండాలి. వేటి ప్రభావానికి లోనుకాకూడదు. సుఖం వచ్చినా దుఃఖం పట్టనట్టే ఉండాలి కానీ ఉద్వేగాలకు లోను కాకూడదు. సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతులేయడం నా అంతవాడు లేడని అంతా నా వల్లే జరిగిందని రొమ్ము విరుచుకోవడం, దుఃఖం వచ్చినపుడు నా అంత దురదృష్ట వంతుడు లేడని కుంగి పోవడం, దానికి కారణం అయిన వారిని, దేవుడిని నిందించడం, తాను చేసిన తప్పులను ఇతరులు మీదికి నెట్టివేయడం ఇవన్నీ సాధారణంగా మానవ లక్షణాలు. గృహస్థు కానీ సన్యాసి గానీ వీటికి అతీతంగా ఉండాలి. అప్పుడే ప్రతివాడూ మనశ్శాంతిగా ఉండగలుగుతాడు.

మూడవలక్షణం ఎదుటి వారి మీద మాత్సర్యము లేకుండా ఉండటం.  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు మానవునికి ఉన్న ఆరు శత్రువులు.. అంటే మాత్సర్యము మానవునికి శత్రువు లాంటిది, దానికి విరుగుడు క్రీడాస్ఫూర్తి. ఆటలో ఈ రోజు ఒకడు గెలుస్తాడు. రేపు మరొకడు గెలుస్తాడు. గెలిచిన వాడిని ఓడిన వాడు మనస్ఫూర్తిగా అభినందించడం క్రీడాస్ఫూర్తి. అదే మత్సరాన్ని దూరం చేస్తుంది. కాబట్టి సాటి మానవుడి మీద మాత్సర్యము పనికిరాదు అని పరమాత్మ బోధిస్తున్నారు.

నాలుగవ లక్షణం అన్నిటినీ సమంగా దర్శించడం. తాను చేసిన పనికి ఎటువంటి ఫలితం వచ్చినా, అసలు ఫలితం వచ్చినా, రాకపోయినా, సమభావంతో ఉండటం, జయము, అపజయము, సుఖము దుఃఖము వీటిని సమంగా స్వీకరించేవాడు సాధకుడు అనిపించుకుంటాడు. ఇవన్నీ ప్రశాంతంగా జీవించాలి అని అనుకునే గృహస్థుకు, జ్ఞానులకు, జీవన్ముక్తులకు ఉండవలసిన లక్షణములు. ఇటువంటి వారు ఏకర్మచేసినా, చేయనట్టే లెక్క తాము చేసే కర్మలు అన్నీ లీలగా చేస్తుంటారు కానీ ఆసక్తితో చేయరు ఏదో ఫలితం వస్తుందని చేయరు. ఒక వేళ ఫలితం వచ్చినా ఆ ఫలితాన్ని పరమాత్ముడికి అర్పిస్తారు కానీ తాము ఉంచుకోరు. 

కాబట్టి కర్మ, జ్ఞానము ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. అందుకే మొదట కర్మయోగం, ఆ తరువాత జ్ఞానయోగం బోధించాడు పరమాత్మ.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories