భగవన్నామ స్మరనే మనిషికి మోక్షం

 

నిత్యం భగవంతుని నామమే స్మరించుకుంటూ తన లీలామాయ లో లీనమై నిలబడేవారి చెంతకు ఎలాంటి బాధలు దరి చేరవు. ప్రతి క్షణం దేవుని నామ స్మరణతో తడిసిన మనసులు ఆత్మ శోధనలో తనని తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, సత్యాన్వేషణ సాగిస్తూ శివైక్యం అయిపోతారు.  దీని గురించి శ్రీ కాళహస్తీశ్వర శతకంలో చాలా గొప్పగా చెప్తారు.

"పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!"

శ్రీకాళహస్తీశ్వరా! నిరంతరం నిన్ను తలుచుకుంటూ మీ అంతరార్ధాన్ని భావన చేయుచు పలకడం చేత దాని మహిమ వలన లోకంలో ఏ కష్టాలు బాధలు రావు. ఒకవేళ సాధారణ కష్టాలు బాధలు ఎదురైనా గానీ మంచి కలిగించేవే గానీ కీడు కలిగించేవి కాదు. నిన్ను నిత్యం ధ్యానించేవాళ్లు పిడుగుల్ని కూడా పుష్పించగలరు.వారి దరి చేరి అగ్ని జ్వాలలు మంచుగా అగును, మహాసముద్రాలు జలరహితమై నేలగా మారి నడువుటకు అనుకూలం అవును, ఎంతటి శత్రువైనా మిత్రుడు అగును. విషము కూడా దివ్య ఆహారం అయి అమృతమగును. ఇవి అన్నీ ఆ దేవదేవుడు నామ స్మరణతోనే సాధ్యం. ఈ భావాన్ని ఇంకా లోతుగా అర్ధం చేసుకోవాలి అంటే పోతన భాగవతంలో ప్రహ్లాదుడి స్థితి ని వర్ణిస్తూ ఇలా చెప్తాడు.

"పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లానిద్రాదులు చేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణపాదపద్మయుగళీచింతామృతాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే తద్విశ్వమున్ భూవరా!"
       
రాజా! ప్రహ్లాదుడు అన్నము తింటూ నీళ్ళు త్రాగుతూ మాట్లాడుతూ నవ్వుతూ వినోదిస్తూ నిద్రపోతూ కాని ఎపుడైనా సరే ఏమరుపాటు లేకుండా శ్రీ హరి ధ్యానంలోనే నిమగ్నమైన చిత్తము కలిగి, ఈ ప్రపంచమును మరచిపోయి ఉంటాడు.

సర్వకాల సమయాలలో ఆ తేజోమూర్తి నడిపించే జీవ క్రియలే కదా! తనువు ప్రతియొక్క స్పందనలో ఆ హరి నిండి ఉన్నాడు. విశ్వమే ఆయనై ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంతో పనిలేదు. అందుకే ప్రహ్లాదుడు ప్రపంచం మరిచిపోయి నిత్యం హరి ధ్యానంలో ఉన్నాడు. మనం మాత్రం హరి ని మర్చిపోయి ప్రపంచం మాయలో పడి కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాము. అందుకే కంచర్ల గోపన్న తన దాశరధి శతకంలో ఇలా అంటారు..

"హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ."

నీ నామ మీశ్వరునకు, విభీషణునకు, పార్వతికిని శ్రేష్ఠమగు మంత్రమైనది. అట్టి పరమ పవిత్రమైన నీ నామము నా నాల్కయం దెప్పుడు నాడునట్లు చేయుము. స్వామీ నీ నామమే అఖిల బ్రహ్మాండనికి శ్రేష్టమైనది పరమ పవిత్రమైనది. ఎల్లవేళలా నీ నామము నా నాలుకపై కదిలాడేట్లు చేయుము దాశరధి కరుణాపయోనిధీ అంటారు.

◆ వెంకటేష్ పువ్వాడ
     


More Purana Patralu - Mythological Stories